సాక్షాత్కారము

చిగురుఁ గొమ్మల నుండి జిలుక పల్కినది
వచ్చునేమిటే నా తపస్సుల పంట
విపిన వీథులఁ బరభృతము గూసినది
రామచంద్రుఁడు నేఁడు రానేరఁడంట
కులుకువోయిన గాలి పొలపు జెప్పినది
నిక్కచ్చిగా వచ్చు నీలమేఘుండు
పక్కలో తంద్రనిర్ఘరిణి మూల్గినది
అతని యెడంద సీతమ్మకేనంట
వత్తువో రావొ! చెప్పర చిదానంద!
కాచీ కాచీ కండ్లు కాయలు కాచె.

*****************************************************

వేణు కన్యక గొంతు విచ్చిపాడినది
పూవుపూవున తావి పొంగిపోయినది
నెమ్మికలాపమ్ము నెమ్మి విచ్చినది
మధుకరాంగన షడ్జమంబు బట్టినది
తలిరుఁగొమ్మలకు పాటలిమ హెచ్చినది
నాలోని రక్తిమ మేలమాడినది
తరులెల్ల మంత్రముగ్ధముగ బల్కినవి
నాలోని దలఁపులే నదియించెనేమొ
వత్తువో రావొ చెప్పర ముగ్ధమూర్తి!
కాచీ కాచీ కండ్లు కాయలు కాచె.

*****************************************************

అదె వచ్చినాఁడు కాదమ్మ దాసాని
గంపించినది గాలి కదలించిపోవ
అదె పల్కినాడు కాదమ్మ కోకిలము
పలికిన దుత్సాహభరితమానసము
అదె నవ్వినాడు కాదమ్మ! సంధ్యాంబు
దమ్ము వంపులతోడఁ దరలిపోయినది
అదె యాడినాడు కాదమ్మ! తమాల
తరువులలో గాలి పొరలు వేచినవి
వచ్చిన రానట్లు వచ్చునో యేమొ
రాకున్న వచ్చినట్లౌను నా మనసు.

*****************************************************

వైశాఖమాసం. గంపలో రసాల మామిడి పళ్ళ రుచి తెలియాలంటే ఒక్క మామిడి పండు రుచిని కాసింత చూస్తే చాలు.  ఈ రచన స్వారస్యం తెలియాలంటే పై పంక్తులే చాలు.

భక్తి సాంప్రదాయంలో భక్తి వైరభక్తి, దాస్య భక్తి, మిత్రవాత్సల్య, మధుర, సఖ్యభక్తి.. ఇలా పలువిధాలంటారు.  భక్తిలో తాదాత్మ్యం చెందిన భక్తుడిది సఖ్యభక్తి. ఈ సఖ్యభక్తిలో భక్తుడు భగవంతుణ్ణి ప్రియుడిగానూ, తనను ప్రియురాలుగానో, సఖుడిగానో భావిస్తాడు. విశ్వకవి రవీంద్రుడు గీతాంజలి లో – “ప్రభూ! తాదాత్మ్యతతో ఒడలెరుగక నిన్ను సఖుడా అని పిలుస్తాను. నన్ను మన్నించు!” అంటాడొకచోట.

సఖ్యభక్తి ముఖ్యమైన భక్తి అన్నాం. ఒక భక్తురాలు భగవంతుణ్ణి ప్రియురాలిగా భావించడాన్ని వర్ణించడం కవికి కాస్తో కూస్తో సులువు. అయితే పురుషుడయిన భక్తుని సఖ్యభక్తిని వర్ణించడం కత్తిమీద సాము. ఔచిత్యం చెడకూడదు, రసభంగమూ అవకూడదు. సిద్దహస్తుడైన కవి కలం ఇటువంటి సందర్భాలలో మరింత పదును తేలుతుంది. పైన గేయాలు తులసీదాసు సఖ్యభక్తిని వర్ణిస్తూ చెప్పిన సందర్భం లోవి. ఆ ఖండకావ్యం పేరు ’సాక్షాత్కారము’. వ్రాసిన కవి పేరు పుట్టపర్తి నారాయణాచార్యులు.

ఒక విభిన్నమైన, విశిష్టమైన ఖండకావ్యం ఇది. విభిన్నం ఎందుకంటే – ఈ కావ్యంలో పద్యాలు, గేయాలు, కీర్తనలు, వ్యావహారికమైన వచనం, తులసీదాసు రామాచరితమానస్ లోని హిందీ దోహా ఉటంకింపులు కలిసి ఉన్నాయి. ఇలా వ్రాయడం సబబా? అంటే హిందీలో మైథిలీశరణ్ గుప్త గారి సాకేత్, యశోధరలను చూడమంటారు కవి తమ తొలిపలుకులో. నిజానికి ఆ అవసరం లేదు. ఈ వినూత్న సంవిధానం సహృదయుడైన పాఠకునికి మనోల్లాసం చేకూరుస్తుందని  చదువుకునేప్పుడు సులభంగానే తెలిసిపోతుంది. పైగా ఈ సంవిధానంలో ఒక సౌలభ్యం ఉంది. ఈ పుస్తకాన్ని కేవలం పద్యాలు చదివి అర్థం చేసుకోగలిగిన పాఠకులే కాక, శబ్దార్థాలు తెలిసిన సాధారణ పాఠకులూ సులభంగా చదువుకోవచ్చు. వ్యావహారిక వచనంలో కథాంశం ఉంది కాబట్టి అది అర్థమయి, ఆ కథాంశానికి సంబంధించిన పద్యాల తాత్పర్యం సులభంగానే అందుతుంది. కావ్యశైలి కూడా సులభంగానే ఉంటుంది. తులసీదాసు జీవితచరిత్ర ఈ ఖండకావ్యానికి ప్రేరణ. తులసీదాసు అంటే ఆచార్యులవారికి మహాభక్తి, ఇష్టమూ. అందుకు నిదర్శనగా తన జీవితంలో ఒక దృష్టాంతం కూడా ఉంది.

నారాయణాచార్యులు ఒకసారి ఉత్తరభారతదేశంలో ట్రయిన్ లో వెళుతున్నారట. చేతిలో చిల్లిగవ్వ లేదు. వాకిలి దగ్గర కూర్చుని రామచరిత మానస్ చెప్పుకుంటున్నారు. ట్రయిన్ లో లోపల కూర్చున్న కొందరు తులసీదాసు భక్తులకు అది వినబడింది. ఆయనను పిలిచారు. ఆయనతో దోహాలు పాడించుకుని మురిసిపోయారు. ఆయనకు పళ్ళు, ఫలహారం పెట్టి ఆదరించారు. ఆ సంఘటన ఆయన మనసులో నిలిచి పోయింది. తులసీదాసును అధ్యయనం చేశారు. రామచరితమానసం ఆయనకు ఆరాధ్యగ్రంథమయింది.

తులసీదాసు కథ ఈ ఖండకావ్యానికి ప్రేరణ అని చెప్పుకున్నాము. ఈ కావ్యం ’తులసి’ జీవిత చరిత్ర కాదు. అలాగని పూర్తిగా కాకుండానూ పోలేదు. అది ఈ కావ్యం యొక్క ఒకానొక విశిష్టత. ఆ కథ క్లుప్తంగా ఇది.

కథ.

’తులసి’ భార్య మమతాదేవి. అపురూపసౌందర్యవతి. ఎంత సౌందర్యవతియో అంత గంభీరహృదయ. మన్మథుని ఆరవబాణం వంటి ఆమె తులసికి ఆరవ ప్రాణం. ఒకానొక చిక్కటి చీకటి రాత్రి. వర్షం కురుస్తూంటుంది. పుట్టింటనున్న మమతను విడిచి ఉండలేక మోహంతో తులసీదాసు పక్క వూరిలో ఉన్న అత్తారింటికి వెళ్ళి తలుపు కొడతాడు.   తలుపు తీస్తుంది మమతాదేవి. ఎట్టఎదుట భర్తను చూడగానే ఆమెకు సంతోషం బదులు విరక్తీ, జుగుప్సా కలుగుతాయి. వేదశిఖాపరినిష్ఠితుల్మహోదారులు మీరలొక్క వనితామణికింతగఁ దాల్మి వీడుటే! – వేదవేదాంగాలు, ఉపనిషత్తుల సారం ఎరిగిన మీరు స్త్రీ సాంగత్యం లేక ఉండలేరా అని తీవ్రంగా భర్తను అధిక్షేపిస్తుంది. ఆ తరుణంలో తులసికి కన్నులు తెరుచుకుంటాయి. వైరాగ్యబీజం మొలకెత్తుతుంది. ఆమెకు ప్రదక్షిణం చేసి ఇల్లు వీడతాడు. చిత్రకూటపర్వతానికి వెళతాడు. చిత్రకూటంలో వసంతశోభ. అక్కడ తులసి మనసు డోలాయమానంగా ఉన్నది. అడుగడుగున మమత గుర్తొస్తున్నది.

పువుపువునందు నీ వలపు బూచునుపో! ప్రతివేపమానప
ల్లవమున త్వత్సుధాధరవిలాసము, కోయిల చిట్టి గొంతులో
కువకువకూత నీ పలుకు – కోమలి! నీవిట రూపుగట్టుచున్
గవిసితివేమొ! యీ ప్రకృతిగా నడుగడ్గున నూరడింపగన్.

అనుకుంటూ విరహం భరిస్తున్నాడు. అంతలో ఆమె సందేశం గుర్తుకు తెచ్చుకుని రామునిపై చిత్తాన్ని నిలుపుకుంటున్నాడు. ఆపై చిత్రకూటాన్ని ప్రార్థించినాడు. ఏకాంతవాసాన్ని ఆశ్రయించినాడు. మెలమెల్లగా చిత్తం కుదరసాగినది. భక్తిభావాలు అంకురించదొడగినాయి.  స్థిరచిత్తం కలుగసాగింది. భక్తి సాధన చేస్తాడు తులసి.  త్రయోదశాక్షరి జపిస్తున్నాడు. ఒక అపరాహ్ణం వేళ కునుకు పట్టింది. కాసేపటికి దైవప్రేరణతో కనులు తెరచినాడు. ఎదుట గుర్రముపై ఇద్దరు పాదుషాలు వెళుతున్నారు. వారిద్దరినీ రామలక్ష్మణులుగా కనుగొన్నాడు తులసి. ఆతని హృదయవేదన తీవ్రమయింది. రామచరిత్రాన్ని వ్రాయడం మొదలుపెట్టి పూర్తి చేస్తాడు. ఆపై అక్బర్ మహారాజు అతణ్ణి పిలిపిస్తాడు. తులసి – రాచగౌరవాన్ని లెక్కచేయడు. అతని చిత్తానికి ఉద్వేగం తగ్గింది.  సాక్షాత్కారం కలుగుతుంది. కావ్యం జనుల మధ్య చేరి మన్ననలందుకుంటుంది. ప్రజల నాలుకలపై నర్తిస్తుంది.

తులసీదాసు తన కావ్యాన్ని రామునికి సమర్పిస్తాడు.  అమరుడవుతాడు. తులసీదాసు కావ్యాన్ని శ్రీరామచంద్రుడు దక్షిణహస్తస్పర్శతో అనుగ్రహిస్తాడు.

రసమో! వ్యంగ్యమొ! భావమో! మరియనల్పాలంకృతి న్యాసమో!
యిసుమంతైన నెఱుంగనోయి ప్రభువా! ఈ కొండలన్జింత వె
క్కసమైనప్పుడు నేడ్చికొంటినదియే కావ్యాత్మగా మాఱె నీ
యసమానప్రతిభా ప్రభావము నమోహచ్చేదకౌక్షేయమై.

నారాయణాచార్యులు కూడా తన సాక్షాత్కారము అన్న కృతిని ఇదే పద్యంతో వినయసుందరంగా సమర్పిస్తాడు. పుస్తకం మొదట,, ఆపై కావ్యం చివరా సమర్పణము కనిపిస్తుంది.

***************************************

పై కథను ఘట్టాలుగా చెప్పారు కవి. ఆ ఘట్టాల పేళ్ళు మమత, వెన్నెలరాత్రి, సాధన, రామచరిత మానస్, దేవవాణి, నిరాకరణము, సాక్షాత్కారము, హితబోధ, దొంగలు, సమర్పణము – ఇవీ. ప్రతి ఘట్టం ఆరంభంలో తులసిదాసు దోహా, ఆ క్రింద వ్యావహారికంలో ఆ దోహాకు సంబంధించిన కథాంశం, ఆపై ఆ కథాంశానికి సంబంధించిన పద్యాలు.

ఈ ఖండకావ్యంలో ఎక్కువభాగం ఛందోబద్ధపద్యాలు. గేయాలు ’సాధన’ అన్న ఘట్టంలోనూ, మరికొన్ని చోట్లా వస్తాయి. ఆ ఘట్టంలో తులసిదాసు భక్తిని సాధన చేస్తుంటాడు. మొదట దాస్యభక్తితో మొదలై, అనేక భక్తిభావాలు ఒకటొకటిగా అతణ్ణి ఆవేశిస్తాయి. భక్తి తీవ్రతరమైన కొలదీ చిత్తం ఆర్ద్రమై, భావం తేటనవుతుంది. అందుకు ప్రతీకగా మొదట వృత్తాలతో మొదలై,   దేశీ ఛందస్సు,  గేయాలు, అటుపై కీర్తనలూ, చివరన వచనం – ఇలా రచిస్తాడు కవి. ఇదొక అద్భుతమైన కావ్యశిల్పం. ఈ  ఘట్టం పుట్టపర్తి వారి ప్రతిభకు, భక్తితత్పరతకూ, రసదృష్టికీ గొప్ప తార్కాణం. ఈ ఘట్టంలో భగవంతునికై భక్తుడు పడే తపన పోతన భాగవతాన్ని ఛాయామాత్రంగా గుర్తుకు తెప్పిస్తుంది. భగవంతుడు సామగానలోలుడు. గీతాలతో భక్తిని ఉద్యోతించడం నిసర్గమధురం. భక్తిని గొప్పగా చిత్రించిన ఆధునిక కవులలో పుట్టపర్తి వారు అగ్రగణ్యులు. ఈ కావ్యాన్ని తులసీదాసు కథ గానే కాకుండా అన్య కావ్యంగానూ చదువుకోవచ్చును. భక్తి, వైరాగ్యాది భావాలు జీవసహజమైనవి.

ఈ కావ్యంలో భక్తి మాత్రమే కాదు, అక్కడక్కడా కొన్ని లౌకిక వ్యవహారాలకు చెందిన కొన్ని అపురూపమైన భావాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కవిత్వం గురించి తులసీదాసు నోట పలికించిన మాట –

హృదయము బల్కదేని యదియేటి కవిత్వ, మెడంద వట్టి ప్ర
ల్లదములఁ బల్కునే రసభరంబున మున్గక, మెప్పుఁ గోరియు
న్మదులగు మానవాధముల మన్నన సేయుట నీరసంబుగా
కదిరసమౌనె? శుష్క పరిహాసంబుగా కదియున్ కవిత్వమే!

అంటాడాయన. ప్రఖ్యాత విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి పుట్టపర్తి అభిమాని. రారా దృష్టిలో సాహిత్యం హృదయవ్యాపారమే తప్ప మేధోవ్యాపారం కాదు. ఈ భావనకు పుట్టపర్తి వారి ఆలోచన యెంతదగ్గరగా ఉందో పైన పద్యంలో చూడవచ్చు. భక్తికి కావలసినది ’దేవుడు’ కాదు, ఆత్మార్పణపరాయణత్వమైన భక్తుని హృదయం. నారాయణాచార్యులు విశిష్టాద్వైతి. కానీ మార్క్స్ ను మహర్షి అనగలరాయన.

మతం గురించి కూడా చక్కని వివేచన చేస్తాడు కవి. పుట్టపర్తి నారాయణాచార్యులు ఎంత సాంప్రదాయవాదియో అంత హృదయశీలి. ఆచారవ్యవహారాలకంటే తన తోటి మానవుడు తనకు ముఖ్యమన్నది ఆయన మతం. తన నిజజీవితంలోనూ ఆ విషయం ఆచరించి చూపినాడాయన. కవి జీవితమే కవిత్వంలో ప్రతిఫలిస్తుంది. పైన హృదయము పల్కుట – అంటే అదేనేమో!

నారాయణాచార్యుల వారి శైలి స్వతంత్రమైనప్పటికీ, ప్రాచీన కవుల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ‘సిపాయి పితూరి ‘ అన్న ఖండ కావ్యంలో తిక్కనను కళ్ళ ఎదుట నిలబెడితే శ్రీనివాస ప్రబంధంలో ఆముక్తమాల్యదకారుడు నిలువెత్తున దర్శనమిస్తాడు. శ్రీనివాస ప్రబంధంలో ఆరంభంలో పంచాయుధస్తుతి శంఖవర్ణన లోని సీసపద్యం – ఆముక్తమాల్యదలో గరుత్మంతుని వర్ణనను పోలి ప్రౌఢ సమాసభరితంగా ఉంటుంది. ప్రస్తుతకావ్యంలోనూ ఆరంభంలో అలసాని పెద్దన గారు కాస్త తొంగిచూస్తారు.

ఉ ||
చందురకావిపావడ నెసంగు రుచుల్సరిగంచు చీరపై
నందము జిల్కగా – గిలుకుటందెల ఝంకృతి యుల్లసిల్ల నిం
దిందిర నీలవేణిక గదించిన పూవులు నవ్వ – కాంక్షలే
క్రందుగ రూపుగట్టె ననగా – మమతాసతి నిల్చె చెంగటన్.

నిరాకరణము అన్న ఘట్టంలో ధూర్జటి, ఇతర ఘట్టాలలో అక్కడక్కడా పోతన కనిపిస్తారు.

కం ||

యోగమ్ములు భోగమ్ములు
త్యాగమ్ములు నెవని గరుణఁ దనరుచునుండున్
యోగాయోగు ననంతుని
యోగీశ్వరుడైన కర్మయోగిఁ దలంతున్.

కారణుఁ డెవ్వఁడు నిర్గత
కారణుఁ డెవ్వండు, నిఖిల గణనీయుఁ డెవం
డారాధితుఁ డెవ్వఁడు, సం
సారార్ణ వదూరుఁడట్టి చతురునుతింతున్.

ప్రాచీన కవులే కాదు, ఆధునిక కవుల భావాల పోలిక కూడా యాదృచ్ఛికంగా ఒకచోట..

గీ ||
పిందెలకు నాకలికి బాలు పిండినావు
దొడిమెలకు వింత రవికలు దొడగినావు
జిగురులకు నగిషీపని జేసినాడ
వెంత ఉపకారపరుఁడ వసంతరూప !

ఇంద్రగోప బుర్వుకుఁ పట్టులెందుకయ్య ?
తమ్మికెందుకు లేజలతారు పూఁత?
నెమ్మిపురులకు బహువర్ణ నియతియేల?
జనుఁడెఱుగునె నీ రహస్యములు దండ్రి !

ఎంత హృదయంగమమైన భావన! మనసులో ఏదో మూల ఛాయామాత్రంగా ’తేనెరాగాల పూబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వానినేది కోరేది?’ అన్న సినీకవి భావం స్ఫురించదూ?.

ఈ కావ్యం గురించి చెబుతూ పోతే దాదాపు మొత్తాన్ని తిరిగి వ్రాయవలసి ఉంటుంది. చదువుతున్నంతవరకూ తొందరగా అయిపోతున్నదనిపిస్తూ, చదవడం పూర్తి చేసిన తర్వాత మనసు నిండి ’ఎంతగానో’ చదివినట్లు సహృదయుని అలరించే  ఉట్టిని వేలాడుతున్న వెన్నకుండ ఈ చిరుపొత్తం. తులసీదాసు మీద భక్తి, తులసీదాసు ప్రభావమూ నారాయణాచార్యుల వారికి ఈ కావ్యంతో పూర్తికాలేదు. ఆతనిపై అనన్యమైన భక్తితోనే నారాయణాచార్యుల వారు ఆయన పంథాను అనుసరిస్తూ, సులభంగా పాడుకొనగలిగే గేయాలతో జానపదబాణీలో జనప్రియరామాయణం (అసంపూర్ణం) రచించారు.

నారాయణాచార్యులు గారి రచనలు సంస్కృతసమాస భూయిష్టాలని, సాధారణ పాఠకులకుఅందవని, ప్రౌఢపరిశీలనలని జనసామాన్యంలో కొన్ని అపప్రథలు  పాదుకొని ఉన్నాయి. ఇది తప్పు అవగాహన. అగ్నివీణ అన్న ఖండకావ్యంలో ఆయన దాశరథిని, శ్రీశ్రీని, కృష్ణశాస్త్రి, తిలక్ ఇత్యాదులను మరిపించగల అందమైన భావకవితలు వ్రాశారు. ఆయన జనప్రియరామాయణం ముప్పాతిక మువ్వీసం అచ్చతెనుగు గేయకావ్యం. పాఠ్యే గేయే చ మధురం. తెలుగుభాషామతల్లికి తెలుగు పలుకుబళ్ళు, సామెతలూ, నుడికారాలూ అనే వివిధ రత్న రాశులను దోసిళ్ళెత్తిన కవనాభిషేకం పుట్టపర్తి జనప్రియ రామాయణం. శ్రీనివాసప్రబంధం – కొండలరాయని కొండల కథల తట్టుపునుగును స్వామి పాదాలకు పారాణిగా అలదిన మంజుల మధుర మనోహర భక్తికావ్యం. ప్రాచీన ప్రబంధాలను ఎకసెక్కం చేసే ప్రౌఢిమ. ప్రౌఢకావ్యమైనప్పటికీ ఇందులోనూ అచ్చతెనుగు నుడికారాలు చాలాచోట్ల మెరుపుల్లా మెరుస్తాయి.

ఈయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా  ఎంత వద్దనుకొన్నా చర్వితచర్వణంగా ఆయన అభిమానులకు మనసునుండి బయటపడే మాట ఒకటుంది. తెలుగు వారు ఈయనను, ఈయన రచనలను గుర్తించలేదు. చాలా నిర్లక్ష్యానికి గురయిన కవి, పండితుడు శ్రీ నారాయణాచార్యులు. ప్రస్తుత కావ్యం – సాక్షాత్కారము జాలంలోనూ, బయటా ఎక్కడా దొరకదు. ఆయన అనేకానేక ఇతర రచనలకూ ఇదే పరిస్థితి. విడుదలైన రచనలకు ఆదరణ లేదు. చాలామంది ఆంధ్రులకు, లబ్ధప్రతిష్టులైన వారికి కూడా ఈయన ఎవరో, ఈయన ప్రతిభాపాటవాలు ఏమిటో తెలియదు.

ఒక కవిని, కవే కాక మహా పండితుడిని, తెనుగుభాష సొబగులను, తెలుగు వాడి దమ్మును ఇటు కేరళం దగ్గరనుండి అటు హిందీవారికి వినబడే విధంగా పిక్కటిల్లే స్వరంతో చెప్పిన భాషాసేవకుని తగినంతగా గుర్తించకపోవటం వలన జాతికే నష్టం కలుగుతుంది తప్ప అతనికి పోయినది లేదు. అలాంటి మనస్వి తత్త్వాన్ని భర్తృహరి చెప్పినంత అందంగా ఇంకెవరు చెప్పగలరు?

కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః |
మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ||

– పూలగుత్తి లా మనస్వికి రెండే దారులు. లోకుల సిగలపై అలంకారంగా భాసిస్తాడు లేదా అడవిలో, ఎవరికీ కనబడని చోట శిథిలమవుతాడు.

You Might Also Like

3 Comments

  1. Srinivas Nagulapalli

    అందమైన పరిచయానికి, ఓపికతో ఎన్నో విషయాలను, చక్కని పద్యాలను అందించినందుకు కృతజ్ఞతలు.

    “నిక్కచ్చిగా వచ్చు నీలమేఘుండు”
    ..
    “వచ్చిన రానట్లు వచ్చునో యేమో
    రాకున్న వచ్చినట్లౌను నా మనసు”

    అంటే, వచ్చినా రానట్లే వచ్చు, రాకున్నా వచ్చినట్లే,రెంటిలో ఏదైనా వచ్చుట
    తప్పదు- కాదు, రప్పించారు పాఠకుల మనసుల్లోకి నిక్కచ్చిగా
    పుట్టపర్తివారు.

    “హృదయము పల్కదేని అది యేటి కవిత్వం” అన్న పద్యం సైతం
    హృదయాన్ని తాకుతుంది. కవిత్వమే కాదు, రమణీయమైన ఏ కళ ఆవిష్కరణకైనా అది వర్తిస్తుంది అనిపిస్తుంది.

    బంగారం కన్నా rold gold కే ఎక్కువ గిరాకి. బంగారంకన్నా ఎక్కువ మెరుస్తుంది తక్కువ ధరకు దొరుకుతుంది. అయితే, కొంత కాలం తరువాత వెలిసిపోతుంది. కాని, బంగారం ఎప్పటికీ బంగారమే. కవిపండితులు “సరస్వతీ పుత్ర” పుట్టపర్తివారి సువర్ణనలు సువర్ణమే. అక్షరాల సువాసనలు వెదజల్లే సువర్ణమే అనిపిస్తుంది.
    =========
    విధేయుడు
    _శ్రీనివాస్

  2. ఏల్చూరి మురళీధరరావు

    శ్రీ రవి గారు,

    చాలా అందంగా రాశారు. పుట్టపర్తి వారి కవితలోని మసృణత్వానికి ఛాయాసంవాదంగా ఉన్నది మీ సమీక్షణం!

    1. రవి

      ఏల్చూరి వారు,
      చిన్న వ్యాఖ్యలో కూడా ఒక నూత్నవిషయం చెప్పగల సహృదయులు మీరు. గంగిగోవు పాల వంటి మీ వ్యాఖ్యకు చాలా ఆనందిస్తున్నాను.

Leave a Reply