Bengal Nights & It Does Not Die: ఒక ప్రేమ కథ – రెండు పుస్తకాలు – 2

(మొదటి భాగం ఇక్కడ)

యిలియాడె పుస్తకంలో ఆఖరు పంక్తులు:

I sense she committed that act of madness for me. If I had read the letters that Khokha brought me! Perhaps she had a plan… My soul is troubled, very troubled… And yet I want to write everything, everything.
And what if it had all been nothing but some huge farce? A fine trick played on me by my passion? Do I have to accept it all, believe it all, without reservation? What do I know of the truth?

I would like to be able to look Maitreyi in the eyes…

అమృత మీర్చాని కలుసుకున్నప్పుడు మాత్రం ఆమెను చూడడానికి మీర్చా వెనుకాడుతాడు. అదేమంటే, “How can I see you? Did Dante ever think he would see his Beatrice with eyes of flesh?” అంటాడు.

మైత్రేయి దేవి పుస్తకంలో ఆఖరు పేజీ నుంచి:

Mircea raised his face. His eyes were glazed. Oh, no. my worst fears are true – his eyes have turned into stone. he will never see me again. What shall I do? I shall not be able to put light into those eyes …

ఆఖరు పంక్తులు:
That great bird, built with the illusion of hope, whispered to me, as we moved towards an unknown continent, crossing Lake Michigan, “Do not be disheartened Amrita, you will put light in his eyes.”
“When?” I asked eagerly.
“When you meet him in the Milky Way – that day is not very far now,” it replied.

మీర్చా యిలియాడె మైత్రేయి-అలేన్‌ల గురించి వ్రాసినదానికీ, మైత్రేయి దేవి అమృత-మీర్చాల గురించి వ్రాసినదానికీ మూలం ఒక్కటే – 1930లో మీర్చా అనే ఇరవైమూడేళ్ళ రొమేనియన్ విద్యార్థి తన గురువుగారి ఇంట్లో ఉంటూ గురువుగారి కుమార్తె ఐన మైత్రేయి అనే పదహారేళ్ళ బెంగాలీ అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ విషయం తెలిసిన గురువుగారు అతన్ని ఇంట్లోనుంచి పంపించివేయటం, ఆ తర్వాత అతను ఆమెను మళ్లీ కలవకుండానే భారతదేశం వదిలి వెళ్ళిపోవటం.

విషయం ఒక్కటే కానీ యిలియాడె చెప్పిన కథ ఒకటి. మైత్రేయి దేవి చెప్పిన కథ ఇంకోటి. వీటిలోనుంచి పుట్టిన హం దిల్ దే చుకే సనం కథ మరొకటి. సినిమా సంగతి పక్కన పెట్టేద్దాం. ఈ రెండు కథలూ నిజం అవటానికి వీల్లేదు కదా. ఎవరు నిజం చెప్తున్నారు? ఇద్దరూ పూర్తిగా నిజం చెప్పట్లేదా? ఇది ఒక సంఘటనని రెండు దృక్పథాలతో చెప్పటం కాదు. అసలు చాలా సంఘటనలే వేరుగా ఉన్నాయి. పాఠకుడిగా మనం కొంత పత్తేదారీ చేయాల్సిందే.

తేడాలు చెప్పిన కథల్లోనే కాదు. కథలు చెప్పిన విధానంలోనూ ఉంది. రెండూ ఉత్తమపురుషలో స్వగతాలుగా చెప్పిన కథలే. రెండూ పాత జ్ఞాపకాలను కలబోసినవే. యిలియాడె కథ మొత్తం గతంలో సాగుతుంది. తాను రోజువారీ రాసుకున్న జర్నల్ నుంచి ఈ కథను, సంఘటనలను గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా కథ చెబుతాడు. మైత్రేయి దేవి కథ వర్తమానాన్ని, గతాన్ని కలబోస్తూ వర్తమానం తనని గతంలోకి ఎలా తీసుకువెళ్ళిందో, గతం వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతూ సాగుతుంది.

యిలియాడె పుస్తకంలో భావావేశం చాలా తీవ్రంగా, గాఢంగా కనిపిస్తుంది. ఇరవైమూడేళ్ళ వయసులో జరిగిన సంఘటనలను ఇరవైఆరేళ్ళ వయసులో గ్రంధస్తం చేశాడు. అతని నాయికా నాయకులది పిచ్చి ప్రేమ. ఆ ప్రేమని వ్యక్తీకరించటానికీ, ఫలింపచేయటానికి నాయిక ఎంతకైనా తెగిస్తుంది. ప్రియుడితో కలవటంకోసం ఆ నాయిక ఏం చేయడానికైనా సిద్ధమే. కుటుంబం దృష్టిలో, ప్రపంచం దృష్టిలో తానేమైనా, తన్ని ఎవరేమనుకున్నా ఆమెకు లక్ష్యం లేదు. ఎంతటి త్యాగానికైనా ఆమె సిద్ధం. కథానాయకుడికి విపరీతమైన ప్రేమతోపాటు, అనుమానమూ, అసూయ కూడా జాస్తిగానే ఉంటాయి. తనకు మేలు చేసిన ఇంజనీరుగారి పట్ల ఉన్న కృతజ్ఞత, గౌరవం నాయకుణ్ణి కట్టిపడేశాయి. మాటకి బద్ధుడైన అతను తీవ్రమైన మనోవ్యధకు మానసిక మాంద్యానికి లోనయ్యాడు. దానినుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. Bengal Nights పూర్తి అయేసరికి ఒక ఉధృతమైన భావోద్వేగం మనల్ని కమ్మేస్తుంది. విడిపోయిన ఆ ప్రేమికులని తలచుకుంటే మనసునిండా విచారం ఆవరిస్తుంది.

మైత్రేయి దేవి పుస్తకం చదువుతుంటే కలిగే ఉద్వేగం వేరుగా ఉంటుంది. ఆమె కథలో నాయికానాయకులు అతిలోక వ్యక్తులు కాదు. గాఢంగానే ప్రేమించుకున్నారు. కాని ఆమె తండ్రి నిర్ణయం వల్ల వారు విడిపోయారు. భగ్నప్రేమతో కొన్నాళ్ళు బాధపడినా, కాలక్రమేణా పరిస్థితులతో రాజీ పడింది. సహృదయుడైన ఒక వ్యక్తికి భార్య అయ్యింది. తనకంటూ ఏర్పరచుకున్న జీవితపథంలో ప్రయాణించింది. ఆమె మీర్చాని మరచిపోలేదు. అలాగని జీవితాన్ని అతని జ్ఞాపకాలలో గడిపేయనూ లేదు. ఆమెకు మీర్చా మీద ప్రేమతో పాటు, అర్థంతరంగా మాయమైనందుకు కొంత కోపం కూడా ఉంది. మీర్చా తన గురించి అబద్దాలతో ఒక పుస్తకం రాయటం మాత్రం ఆమెకు చాలా కోపం తెప్పించింది. తన మీద, తన కుటుంబం మీద ప్రతీకారం తీసుకోవడం కోసమే అతను అలా రాశాడని ఆమె భావించింది. అతన్ని కలిసి ఎందుకలా చేశాడో కనుక్కునేవరకు ఆమెకు శాంతి లేదు. అమృత మీర్చాల కలయిక సన్నివేశం, వారి మధ్య సంభాషణ, అమృత మనోభావాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఈ అమృతకూ ప్రేమ మీద చాలా నమ్మకం ఉంది. ప్రేమ ఒకరి దగ్గరనుంచి తీసుకుని ఇంకొకరికి ఇచ్చేది కాదని, ప్రేమించే శక్తి ఉన్నవాళ్ళు తమ ప్రేమను ఎంతమందితోనైనా పెంచుకోగలరని ఆమె నమ్ముతుంది. ప్రేమకు మరణం లేదు (న హన్యతే) అని ఆమె విశ్వాసం. “The question of loss and gain do not arise; there are certain events which have no purpose in the world of everyday life; but those unreal, purposeless and superflouous things build the human world, so different from that of animals… My prison is broken. I am emanicipated from shame, fear, and all social ties. Only love, unconquered by time, burns like a polestar on the corner of that limitless expanse.” ఈ మానసిక సంకెలలనుంచి విముక్తం అయ్యింది కాబట్టే, సంఘంలో తనకు, తన బంధువులకు వచ్చే ఇబ్బందులను పట్టించుకోకుండా ధైర్యంగా ఈ పుస్తకాన్ని వ్రాయగలిగింది.

యిలియాడె నవలలో మైత్రేయి తండ్రి మంచి మనిషి కానీ లోతున్న మనిషి కాదు. కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు కూడా పెద్దమనిషిలాగా ప్రవర్తించటానికే ప్రయత్నిస్తాడు. నిజానికి మైత్రేయి, ఆమె తల్లి తప్ప ఆ పుస్తకంలో అలేన్‌కి నచ్చిన మనుషులు బాగా తక్కువ. నరేష్ నున్నా తేరా నాం ఏక్ సహారా కొన్ని చోట్ల గుర్తొచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే.

మైత్రేయి దేవి పుస్తకంలో తండ్రి గొప్ప మేధావి, ప్రతిభావంతుడు. కాని అహంకారి, అసూయాగ్రస్తుడు. లోకమంతా తన చుట్టూ నడవాలని, నడుస్తుందని అనుకునే మనిషి. భార్య, పిల్లల ఆనందాలకన్నా తన అభిప్రాయాలు చలామణి అవడం ముఖ్యం. పుస్తకం గడుస్తున్న కొద్దీ అతని పట్ల పాఠకులకు విముఖత కలుగుతుంది. తల్లి పాత్ర ఉదాత్తంగా మొదలైనా, చివరికి బలహీనంగా మిగిలిపోతుంది. భైరప్ప వంశవృక్షంలో ప్రొఫెసర్‌గారి భార్య గుర్తొచ్చింది. అమృత భర్త చాలా మెచ్చుకోదగ్గ వ్యక్తిగా కనిపిస్తాడు. భార్య పట్ల అతనికి ఉన్న సడలని ప్రేమ, నమ్మకం, గౌరవం విశిష్టమైనవి.

మైత్రేయి దేవి పుస్తకంలో రవీంద్రనాథ్ టాగొర్ ముఖ్యపాత్ర. ఆయన్ని రబి ఠాకుర్ అని పిలవడం కొత్తగా అనిపించినా, ఆమెకు ఆయన పట్ల ఉన్న గౌరవం, ఆత్మీయత, ప్రేమ, ఆమె పట్ల ఆయన చూపించిన ఆప్యాయత, మమకారం ఆర్ద్రంగా అనిపిస్తాయి.

యిలియాడె పుస్తకం కన్నా, మైత్రేయి దేవి పుస్తకంలో బెంగాల్ సాంఘిక పరిస్థితుల చిత్రణ విశదంగా ఉంది. కలకత్తా నగరంలోనూ, టీ ఎస్టేట్లలోనూ జీవిత చిత్రణ విపులంగా ఉంది. ఇద్దరి పుస్తకాలలోనూ అప్పటి బెంగాలీ సాంస్కృతిక సమాజంలోని ముఖ్యవ్యక్తుల ప్రస్తావన వస్తుంది. ఆమె పుట్టినరోజున వచ్చిన అతిథుల గురించి చెప్తూ ఇద్దరూ కూడా ఉదయశంకర్ గురించి మాట్లాడుతూ అతను గొప్ప అందగాడు, అత్యంత ప్రతిభావంతుడైన నర్తకుడే కాని, మాటకారి కాదు అంటారు.

రెండూ చదివి మరచిపోయే పుస్తకాలు కాదు. Bengal Nights ఉద్వేగాలు, ఆవేశమూ ప్రధానంగా ఉండి ఊపిరి బిగపట్టించే పుస్తకం. It Does Not Die ఆలోచన, తాత్వికత ప్రధానంగా ఉండి మనసును కలచివేసే పుస్తకం.

మైత్రేయి దేవి పుస్తకం ఎక్కడా వాస్తవదూరంగా అనిపించదు. అప్పటి పరిస్థితులపై కొంత అవగాహన ఉన్నవారికి యిలియాడె పుస్తకంలో కొన్ని సన్నివేశాలు అసంగతంగా అనిపిస్తాయి.

నాతో పనిచేసే రొమేనియన్ సైకియాట్రిస్టుతో ఈలియాడే పుస్తకం గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థమైందేమిటంటే – ఆ దేశపు సాహిత్యంలో యిలియాడెకు చాలా ఉన్నత స్థానం ఉంది. అతని పుసకాలన్నిట్లోకీ మైత్రేయి బాగా ప్రసిద్ధి పొందిన పుస్తకం. తెలుగులో చదువుకున్నవారికీ, చలమూ, మైదానమూ, రాజేశ్వరి ఎలాగో, రొమేనియాలో యిలియాడె, మైత్రేయి అలా అన్న మాట. తరువాత ఆ పుస్తకం ఫ్రెంచ్‌లోనూ, ఇతర యూరోపియన్ భాషల్లోనూ బాగానే ప్రసిద్ధమయ్యింది. (మైత్రేయికి ఎదురైన యూరోపియన్లు, ముఖ్యంగా రొమేనియన్లకు, ఆవిడ పేరు వినగానే మీర్చా పుస్తకం గుర్తు రావటంలో ఆశ్చర్యమేమీ లేదన్న మాట). ఐతే తన ప్రేయసి అసలు పేరునే యిలియాడె ఎందుకు వాడాడు, పుస్తకానికి ఆ పేరే ఎందుకు పెట్టాడు? ఒకరితో సంబంధం పెట్టుకున్నాక ఆ సంబంధం గురించి బయట మాట్లాడ్డం (kissing and telling) సంస్కృతికి విరుద్ధమైనా యిలియాడె అలా ఎందుకు చేశాడు? మైత్రేయి దేవి జరగలేదు అని చెప్పే విషయాలు యిలియాడె ఎందుకు వ్రాశాడు అన్న ప్రశ్న రాక తప్పదు. నాకు అనిపించిందేమిటంటే కొంత నిజమూ, కొంత నిజమైతే బాగుండును అని తాను అనుకున్న విషయాలు ఆపాదించి ఒక నూతన ఊహాప్రేయసినీ, ప్రణయాన్నీ యిలియాడె సృష్టించాడు. గాయపడ్డ తన హృదయాన్ని మాన్పుకునే ప్రక్రియలో ఈ పుస్తకం వ్రాయటం ఒక భాగమై ఉండవచ్చు. తాను రొమేనియన్ భాషలో వ్రాసే ఈ పుస్తకం ఇండియాలో ఎవరికీ అందదని అతను భావించి ఉంటాడు. ఆ పుస్తకానికి ఇంత అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని అతను ఊహించి ఉండడు. అందుచేత ఆ పుస్తకంలో నాయికకూ, ఆ పుస్తకానికీ మైత్రేయి అని పేరు పెట్టటం వల్ల సమస్యలు కలగవచ్చన్న ఆలోచన అతనికి వచ్చి ఉండదు. పైగా తన భాషలో తన ప్రేయసికి, తన ప్రేమకి ఒక శాశ్వతత్వాన్ని కలుగచేస్తున్ననన్న భావుకత్వపు భ్రమ కూడా ఉండి ఉండవచ్చు. ఆ పుస్తకం ఇతర యూరోపియన్ భాషల్లో ప్రచురితమైనా, ఇంగ్లీషు అనువాదానికి అతను చనిపోయేవరకూ అనుమతించకపోవడానికి, అది భారతీయులకు, మైత్రేయికి అందకుండా ఉంటుందన్న ఆలోచన కూడా కారణం కావచ్చు.

మైత్రేయి దేవి పుస్తకం నా హన్యతే కూడా చాలా ప్రసిద్ధమైంది. బెంగాల్‌లో విపరీతంగా అమ్ముడుపోయింది. చాలా సంచలనాన్ని సృష్టించింది. ఆమె ఈ పుస్తకంలో భాగాలు చదివే కార్యక్రమాలకు ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యే వారట.

మైత్రేయి దేవి మీర్చా యిలియాడెని చికాగోలో పలుసార్లు కలిసిందట (పుస్తకంలో ఒకటే కలయికగా చూపిస్తుంది). తన పుస్తకంలో నిజాలూ, ఊహలూ కలిపి ఉన్నాయని, ఆమె బతికి ఉన్నంత కాలం ఆ పుస్తకం ఇంగ్లీషులో రాకుండా చూస్తానని యిలియాడె ఆమెకు మాట ఇచ్చాడట (ఆమె చనిపోయాకే ఈ పుస్తకం ఇంగ్లీషులోకి వచ్చింది). రాబోయే ఎడిషన్లన్నిటిలో ఈ పుస్తకంలో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కలగలసి ఉన్నాయి అని స్పష్టీకరిస్తానని కూడా మాట ఇచ్చాఢట. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. యిలియాడె చనిపోయాక, మైత్రేయి దేవి బతికి ఉండగానే, అతని భార్య ఆ పుస్తకాన్ని సినిమా తీయడానికి అనుమతి ఇచ్చింది – ఆమె కావాలనే ఆ పని చేసిందా అన్న సందేహాలు ఉన్నాయి.

ఈ రెండు పుస్తకాలు కలిపి ప్రచురించటం మంచి ఆలోచన. రెండు పుస్తకాలను అందంగా ప్రచురించారు. పుస్తకాల ముఖచిత్రాలు చక్కగా ఉన్నాయి. మైత్రేయి దేవి పుస్తకాన్ని పూర్వపు ప్రచురణలో ఉన్నది ఉన్నట్టుగా దిద్దుబాట్లు లేకుండా పునర్ముద్రించారట. కొన్ని తప్పులు ఉన్నాయి. యిలియాడె పుస్తకంలో పేర్లు కొన్ని తప్పుగా ఉన్నాయి. అనేక భాషల అనువాదాల వల్ల అలా జరిగిందేమో అనుకున్నాను. పుస్తకాలలో రచయితల వివరాలు ఇచ్చేటప్పుడు మైత్రేయి దేవిని సమదృష్టితో చూడలేదని, పాశ్చాత్య విమర్శకులు యిలియాడెకు ఇచ్చిన విలువ మైత్రేయికి ఇవ్వలేదని కొంత విమర్శ ఉంది.

పైన ఉన్న ఫొటొలలో మొదటిదాంట్లో 1933లో మీర్చా మైత్రేయిలను చూడవచ్చు. క్రింద ఫొటో 1973లో వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో కలసినప్పటిది.

ఈ రెండు పుస్తకాలు నేను చదివి రెండు వారాలు దాటింది. ఐనా ఈ పుస్తకాలు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూనే ఉన్నాయి. తప్పకుండా చదివి, చర్చించుకోవలసిన పుస్తకాలు.

Bengal Nights – A Novel
Mircea Eliade
176 pages

It Does Not Die – A Romance
Maitreyi Devi
264 pages

University of Chicago Press
1994

You Might Also Like

4 Comments

  1. varaprasaad.k

    సాధారణ మనిషి పరిస్థితుల ఒత్తిడిలో ఎలా రాస్తాడు అనే దానికి మంచి ఉదాహరణ మైత్రేయి. పరిణతి చెందిన రచయిత్రిగా మైత్రేయి రాసిన బెంగాలీ నైట్స్.మొత్తం మీద జరిగిన సంఘటనలు ఎవరికీ వీలుగా వారు రాసుకున్నారు.మొత్తం మీద చౌదరి గారు తన శైలితో తెలుగు పాఠకులను కూడా మంచి నవల చదివేలా చేశారు.

  2. Saamaanya

    రెండు నవలల రచనా కాలానికి మధ్య వున్న కాల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోవాలేమో ఇక్కడ. పోతే హం…సనమ్ చూసినపుడు నాకు గుర్తొచ్చిన కథ శరత్ “స్వామి “

  3. బి.అజయ్ ప్రసాద్

    యిలియాడే అలా ఎందుకు రాసాడో మీరు ఊహించిన వివరణ/అంచనా చాలా బాగుంది. ముఖ్యంగా “కొంత నిజమైతే బాగుండును అని తాను అనుకున్న విషయాలు ఆపాదించి ఒక ఊహా ప్రేయసిని, ప్రణయాన్ని సృష్టించడం లేక గాయపడ్డ తన హృదయాన్ని మ్రాంపుకునే ప్రక్రియలో అలా రాయడం”. అది చదివేదాక అతనిది హిపోక్రసీగానే కనిపించింది. ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లో కొంత వాస్తవం, కొంత కల్పన మానవసంబంధాలైతే కొంత హిపోక్రసీ కూడా ఉంటుందేమో. స్త్రీపురుష సంబంధాలైతే (ఉన్నది లేనట్లుగా చెప్పడం – లేనిది ఉన్నట్లుగా చెప్పడం) ఇంకాస్త ఎంబరాసింగ్ గా కూడా ఉంటుంది. మీరు రాసిన విశ్లేషణను బట్టి చూస్తే – కేవలం వాస్తవంలోంచి రాసినా నాకు మైత్రేయిదేవి రాసిన It Does Not Die నవల బాగా అనిపించింది.

Leave a Reply to Saamaanya Cancel