Bengal Nights & It Does Not Die: ఒక ప్రేమ కథ – రెండు పుస్తకాలు – 1

రెండు వారాల క్రితం ఇంటర్నెట్‌లో ఒకచోటినుండి ఇంకోచోటుకు వెళ్తుండగా సంజయ్ లీలా భన్సాలి తీసిన హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రానికి ఆధారం మైత్రేయి దేవి బెంగాలీ నవల న హన్యతే అని తెలిసింది. ఆ నవల సంగతి ఏమిటో తెలుసుకుందామని అటు పోతే, ఒక సినిమా కథకన్నా ఆసక్తికరమైన నిజ జీవితాల కథ ఒకటి తెలిసింది.

1930లో కలకత్తాలో సురేంద్రనాథ్ దాస్‌గుప్తా అని బాగా ప్రసిద్ధిగాంచిన తత్వశాస్త్రపు ఆచార్యులు ఉండేవారు. ఆయన దగ్గర చదువుకోవడానికి మీర్చా యిలియాడె అనే రుమేనియన్ విద్యార్థి వచ్చాడు. యిలియాడెపై అభిమానం పెంచుకున్న ప్రొఫెసర్‌గారు అతన్ని తన ఇంట్లో ఉంచుకొన్నారు. ప్రొఫెసర్‌గారి 16 ఏళ్ళ కుమార్తె మైత్రేయి, యిలియాడె ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ప్రొఫెసర్‌గారు యిలియాడెని ఇంట్లోనుంచి వెళ్ళగొట్టారు. మైత్రేయిని కలవడానికీ, ఆమెతో మాట్లాడానికీ, ఇతరత్రా సందేశాలు పంపటానికీ వీల్లేదని ఆంక్షలు పెట్టారు. కొన్నాళ్ళ తర్వాత యిలియాడే తన దేశం తిరిగి వెళ్ళిపోయాడు.

1933లో యిలియాడె రుమేనియన్ భాషలో మైత్రేయి అని ఒక పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకంలో ఉన్న విషాద ప్రేమ కథ ఆ దేశంలో చాలా ప్రఖ్యాతి పొందింది. ఎన్నో పునర్ముద్రణలు పొందింది. ఆ దేశంలో చదువుకున్న వారెవరికైనా మైత్రేయి అన్న పేరు చాలా పరిచితమైంది. పుస్తకం అనేక యూరోపియన్ భాషలలోకి అనువదించబడింది. యిలియాడె ఇంకొన్ని నవలలు, ఇండియా గురించి, మతచరిత్రల గురించి, తత్వశాస్త్రాల గురించి వ్రాసిన పుస్తకాలు అతనికి చాలా పేరు తెచ్చాయి. మతాన్ని మనుషులు తమ అనుభవంలోకి తెచ్చుకునే విధానాల గురించి ఆయన చేసిన సిద్ధాంతాలు ప్రపంచస్థాయిలో ప్రథమశ్రేణి తత్వవేత్త స్థానాన్ని కల్పించాయి.

మైత్రేయి దేవి కొంతకాలం తరువాత తల్లితండ్రులు కుదిర్చిన వివాహం చేసుకుంది. రచయిత్రిగా, సాంఘిక కార్యకర్తగా బెంగాల్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. యిలియాడె తన పేరుతో ఏదో పుస్తకం వ్రాశాడని, తన పేరు ఆ దేశంలో చాలామందికి పరిచయమని ఆమెకు తెలుసు గాని, ఆ పుస్తకంలో యిలియాడె ఏం వ్రాశాడో ఆమెకు చాలాకాలం వరకూ తెలీలేదు. 1972లో బెంగాల్ వచ్చిన యిలియాడె మిత్రుడి ద్వారా ఆమెకు ఆ పుస్తకంలో ఉన్న విషయాలు తెలిశాయి. తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి యిలియాడె అబద్ధాలు వ్రాశాడని తెలిసిన ఆమెకు చాలా కోపం, విచారం కలిగాయి. నలభై ఏళ్ళు మనసుపొరలలో దాగి ఉన్న జ్ఞాపకాలు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆమెను కల్లోల పరిచాయి. ఆ మానసిక సంఘర్షణ ఆమెను అస్తిత్వం, ప్రేమ తత్వాల గురించిన తాత్విక విచారణకు పురికొల్పింది. పనికట్టుకుని వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పని చేస్తున్న యిలియాడెని 33 ఏళ్ళ తరువాత కలుసుకుంది. ఆ తరువాత ఆమె బెంగాలీలో 1974లో న హన్యతే (నశించదు) అన్న పేరుతో తన జీవితం నేపథ్యంగా ఒక నవల వ్రాసింది. ఆ పుస్తకాన్ని తనే 1976లో It Does Not Die అన్న పేరుతో అనువదించింది. రెండు పుస్తకాలూ విపరీతంగా అమ్ముడుపోయాయి. మైత్రేయి దేవి పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరిగాయి.

1986లో యిలియాడె మరణించాడు. అతని మరణానంతరం Les Nuits Bengali అన్న పేరుతో మైత్రేయి పుస్తకాన్ని ఫ్రెంచ్ సినిమాగా తీశారు. ఆ చిత్రంలో కథానాయికకు మైత్రేయి అన్న పేరు వాడుకోనివ్వకుండా మైత్రేయి దేవి నిరోధించింది. ఆ చిత్రం భారతదేశంలో ఒకే ఒక్కసారి అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనలో ప్రదర్శించబడింది. The Bengali Night (సుప్రియా పథక్, షబానా అజ్మి, హ్యూ గ్రాంట్) పేర ఆ సినిమా ఇంగ్లీషు డబ్బింగ్ వర్షన్ అమెరికాలో దొరుకుతుందట.

మైత్రేయి దేవి 1990లో మరణించింది. 1993లో మొదటిసారిగా యిలియాడె మైత్రేయి పుస్తకానికి ఆంగ్లానువాదం Bengal Nights ప్రచురించబడింది. 1994లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో వారు Bengal Nights, It Does Not Die పుస్తకాలు రెండిటినీ ఒకేసారి ప్రచురించారు.

ఈ జంట పుస్తకాల గురించి, రచయితల నేపథ్యం గురించి చదివిన విషయాలు చాలా కుతూహలం కలిగించగా, ఇంటర్‌లైబ్రరీ లోన్ ద్వారా అర్జెంటుగా ఈ పుస్తకాలు తెప్పించుకుని చదివేశాను.

Bengal Nights

బ్రిటిష్ ఇంజనీరు అలేన్ (Alain) పనితనం చూసి అతని పై అధికారి నరేంద్రసేన్ ముచ్చట పడి అతని పదోన్నతికి సహాయం చేస్తాడు. అడవుల్లో ఒక ప్రాజెక్టుపై పనిచేస్తున్న అలేన్‌కు మలేరియా వస్తుంది. కోలుకొనేంతవరకు తన ఇంట్లోనే ఉండమని అలేన్‌ని నరేంద్రసేన్ తన ఇంటికి తీసుకు వస్తాడు. ఆధునికత వైపు అడుగుల వేస్తున్న నరేంద్రసేన్ కుటుంబంలో ఆడువారికి పరదా లేదు. కొద్దికాలంలోనే అలేన్ కుటుంబంలో అందరితోనూ చనువుగా ఉంటూ, ఇల్లంతా ఆంక్షలు లేకుండా తిరిగేంత చనువు పెంచుకుంటాడు. నరేంద్ర సేన్ కుమార్తె, పదహారేళ్ళ మైత్రేయి చాలా తెలివి కలది. ఇంగ్లీషు బాగా చదువుకుంది. స్వయంగా కవిత్వం వ్రాస్తుంది. ఆమె గురువు రబి ఠాక్కుర్ (రవీంద్రనాథ టాగోర్) అంటే ఆమెకు అమిత గౌరవం (ఆమెకు రబి ఠాక్కుర్‌ పట్ల ఉన్న భక్తి చూస్తే అలేన్‌కి అసూయ కలుగుతుంది). అలేన్‌తో ఆమె తొందరగా స్నేహం పెంచుకొంటుంది.

అలేన్ మైత్రేయికి ఫ్రెంచ్ నేర్పటానికీ, ఆమె అతనికి బెంగాలీ నేర్పటానికీ ఒప్పందం కుదుర్చుకుంటారు. నెమ్మదిగా ఇద్దరిమధ్య సన్నిహిత్వం పెరిగి ప్రేమగా మారుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు తనకు ఇస్తున్న స్థానాన్ని చూసి వాళ్ళు తనను ఇంటి అల్లుడుగా చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నారన్న అనుమానం కలుగుతుంది అలేన్‌కి. తమ పెద్దవాళ్ళు తమని అన్నాచెల్లెళ్ళుగా చూస్తున్నారని, తమ ఇద్దరి వివాహానికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని మైత్రేయి అతనికి చెబుతుంది.

అలేన్, మైత్రేయిల మధ్య ప్రేమ శారీరక స్పర్శల వైపు ప్రయాణం చేస్తుంది. పెద్దవాళ్ళు చూడకుండా ఒకర్నొకరు తాకడం నెమ్మదిగా ముద్దులు పెట్టుకోవడం, కౌగలించుకోవడంగా మారుతుంది. ఒకరోజు వారిద్దరూ షికారుకు వెళ్ళినప్పుడు ప్రకృతి సాక్షిగా తాను అలేన్‌కి ఎప్పటికీ అంకితమైనట్లుగా మైత్రేయి ప్రమాణం చేస్తుంది. ఆ రాత్రి ఆమె అలేన్ గదికి వస్తుంది. ప్రేమతో, ఇష్టంతో, తనని తాను అతనికి అర్పించుకొంటుంది. వారి రహస్యం బయటపడితే ప్రమాదమని తెలిసీ, ఆ రాత్రినుంచి అలేన్ గదిలో అనేకరాత్రులు వారిద్దరూ తమకంతో, మోహంతో, ఆర్తితో శారీరకంగా ఏకమై గడుపుతారు.

కొన్నాళ్ళు గడిచాక మైత్రేయి చెల్లెలు తమ తల్లితో మైత్రేయి అలేన్‌ల మధ్య తాను గమనించిన విషయాల గురించి అమాయకంగా చెప్పేస్తుంది. ఆ విషయాలు తెలుసుకున్న నరేంద్రసేన్ అప్పటికప్పుడే అలేన్‌ని ఇంటినుంచి పంపేస్తూ తనపై ఏ మాత్రం కృతజ్ఞత ఉన్నా మైత్రేయితో మాట్లాడ్డం కానీ చూడ్డం కానీ చేయవద్దని చెబ్తాడు.

గుండె పగిలిన అలేన్, మైత్రేయి తనకు ఫోన్ చేసినా పలుకడు. తమ ఇంట్లోనే ఉంటున్న అన్న వరసైన ఖోకాను అలేన్ దగ్గరకు పంపిస్తుంది మైత్రేయి. తన కవిత్వం పుస్తకాన్ని అతనికి ఇస్తూ, ఐ లవ్ యూ అని ఆ పుస్తకంపై వ్రాస్తుంది. ఆమె తండ్రి ఆమెను బాగా కొట్టి గదిలో పెట్టి తలుపులు వేసి బంధించాడని, ఆమె విపరీతంగా ఏడుస్తూ ఉందని ఖోకా చెప్తాడు. నరేంద్రసేన్‌కి ఇచ్చిన మాట వల్ల మైత్రేయిని కలుసుకునే ప్రయత్నం చేయకుండా అలేన్ కొన్నాళ్ళపాటు హిమాలయాలలో ఒక్కడే తిరుగుతాడు. కొన్నాళ్ళకు అతని బాధ కొద్దిగా తగ్గి తిరిగి ప్రపంచంలోకి వస్తాడు. ఇండియాలో ఉద్యోగం దొరక్క సింగపూర్ వెళ్తాడు. అక్కడ మైత్రేయి బంధువు ఒకతను కనిపించి, మైత్రేయి బాగా దిగజారిపోయిందనీ, బజారులో పళ్ళమ్మే మనిషితో శారీరక సంబంధం పెట్టుకొందనీ, ఆమె తల్లితండ్రులు తలెత్తుకుని తిరగలేక పోతున్నారని చెప్తాడు. కులమూ, శీలమూ చెడిపోతే తను అలేన్‌ని పెళ్ళి చేసుకోటానికి ఉన్న అభ్యంతరాలు తొలగిపోతాయన్న ఆలోచనతోనే ఆమె అలా చేసిందని అలేన్‌కి (ఆమె ఇంతకు ముందొకసారి అన్న మాటలబట్టి) అర్థం ఔతుంది. ఐనా, అప్పటికే చాలా ఆలస్యం అయింది.

It Does Not Die

అజో నిత్యః శాశ్వతోయమ్ పురాణో న హన్యతే హన్యమానే శరీరే
Unborn, eternal, everlasting, primeval, it does not die when the body dies
(భగవద్గీత, అధ్యాయం 2, శ్లోకం 20)

అమృతకు తెలిసిన స్నేహితుడొకరు ఆమె పుట్టినరోజు 1972 సెప్టెంబరు 1న, ఫోన్ చేసి, ఆమె తండ్రికి శిష్యుడైన మీర్చా యూక్లిడ్ స్నేహితుడు కలకత్తా వచ్చాడని, ఆమెను కలుసుకోవాలని కోరుతున్నాడని చెప్పాడు. (యిలియాడె తన పుస్తకంలో నాయకుడి పేరు అలేన్ అని మార్చి, నాయిక అసలు పేరు మైత్రేయి అనే ఉంచేసి, ఆమె ఇంటి పేరు మాత్రం సేన్ అని మార్చాడు. ఆ ఒరవడిలోనే మైత్రేయి దేవి నాయిక పేరుని అమృతగా మార్చి, నాయకుడి అసలు మొదటి పేరు మీర్చాగానే ఉంచేసి, ఇంటి పేరుని యూక్లిడ్‌గా మార్చింది). కొంత కుతూహలంతో, ఆమె ఆ స్నేహితుడు సెర్గుయ్ సెబాస్టియన్‌ను కలుసుకోవడానికి వెళ్ళింది. “అమృత కదూ” అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు సెర్గుయ్. తన వంక సెర్గుయ్ చూస్తున్న విధానాన్ని బట్టి అతను తనని చూడడం లేదనీ, నలభైరెండేళ్ళనాటి అమృతని చూస్తున్నాడని ఆమెకు అర్థమయ్యింది. “నన్ను మీరు ఎరుగుదురా?” అని ప్రశ్నించింది. “మా దేశంలో అందరికీ మీరు తెలుసు. ఒక అద్భుతగాధలో నాయిక మీరు” అన్నాడతను. “యూక్లిడ్ రాసిన పుస్తకం వల్లా? ఇంతకూ ఏం రాశాడేమిటి?” అని అడిగింది ఆవిడ. ఆ పుస్తకం గురించి చెప్పాడు సెర్గుయ్.

“ఆ పుస్తకంలో నేను సిగ్గుపడవలసిన విషయాలేమైనా ఉన్నాయా,” అని అడిగింది అమృత. “రాత్రి వేళ అతని గదికి వెళ్ళేదానివి అని వ్రాశాడు”, అంటూ నెమ్మదిగా సమాధానమిచ్చాడు సెర్గుయ్. “అబద్ధం” అంటూ గట్టిగా అరిచింది అమృత. “ఆ విషయం నాకూ అర్థమయ్యింది. కానీ అతను ఉన్న దుస్థితిలో అటువంటి అద్భుతపు కల్పనలు చేసి గాని వ్రాయలేకపోయాడు” అన్నాడు సెర్గుయ్. అమృత తనని గురించి యూక్లిడ్ చెప్పిన చేదునిజాలు ఏమైనా ఉంటే తెలుసుకోవటానికి సిద్ధపడే వెళ్ళింది, కానీ చేదు అబద్ధాలు వినవలసిరావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. “ఐనా, నా పేరు ఎందుకు వాడాలి అసలు” అని ప్రశ్నించింది అమృత. “నీ పేరులో ఉన్న మోహాన్నుంచి అతను విడిపించుకొవటానికి ఇదే మార్గమయ్యిందేమో. నిన్ను ఒక అమరనాయికగా చేశాడు. ఆ పుస్తకం చదివితే నువ్వు కన్నీళ్ళు ఆపుకోలేవు”. “నువ్వు మీర్చాకు చివరగా పంపించిన నీ కవితల పుస్తకం, ఆ పుస్తకం ఆఖరు పేజీలో నువ్వు రాసిన పంక్తులు నాకు మీర్చా చూపించాడు.” అని కూడా చెప్పాడు సెర్గుయ్.

ఒక్కసారిగా అమృతకు నలభైరెండేళ్ళ క్రితం జరిగిన సంగతులు, ఆమె ఎప్పుడో మరచిపోయిన విషయాలు, ఉన్నట్టుండి కవాటాలు తెరుచుకొని వెల్లువగా బయటకు రావడం మొదలుబెట్టాయి. అమృతకు చాలా ఆశ్చర్యం వేసింది. అకస్మాత్తుగా మనసంతా విషాదం కమ్ముకొంది. ఆలోచనలన్నీ అల్లకల్లోలమయ్యాయి.

అమృత ఇప్పుడు దాదాపు యాభయ్యేడేళ్ళ వయస్సున్న గృహిణి. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళతో ఆమె జీవితం కళకళలాడుతుంది. సంఘంలో చాలా గౌరవ ప్రఖ్యాతులున్నాయి. తన గురువునుంచి అపారమైన ప్రేమను అందుకుంది. సుఖమైన, లోటు లేని జీవితాన్ని గడుపుతుంది.

ఐనా, ఇట్లా పాత జ్ఞాపకాలు ఒక్కసారి దండెత్తటం ఆమెను అయోమయ స్థితిలో పడవేసింది. ఈ జ్ఞాపకాల తీవ్రతలో ఆమెకు ఒక్కోసారి ప్రస్తుతానికీ గతానికీ తేడా తెలియడం లేదు. ఆమె మనోస్థితి, చర్యలు భర్తను, ఇతర కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేశాయి.

అమృత తండ్రి ప్రొఫెసర్ నరేంద్రసేన్ విశ్వవిఖ్యాతి పొందిన ఫిలాసఫీ ప్రొఫెసర్. ఆయన విద్వత్తు, వాగ్వాద పటిమలముందు ఎవ్వరూ నిలబడగలిగేవారు కాదు. 1930లో, విదేశంనుంచి వచ్చి కలకత్తాలో తన దగ్గర చదువుకుటున్న విద్యార్థి మీర్చా యూక్లిడ్‌కు బస సుఖంగా లేదని విని, అతన్ని తన ఇంటికి తీసుకువచ్చి క్రింద ఒక గదిలో ఉండే ఏర్పాట్లు చేశాడు ప్రొఫెసర్ నరేంద్రసేన్. ఆధునిక పద్ధతులకు అలవాటు పడుతున్న ఆ ఇంట్లో ఆడవారికి ఘోషా లేదు. అమృత తల్లి యూక్లిడ్‌ని చనువుగా చేరదీసి, అతని అవసరాలు కనిపెట్టి చూస్తూ, జాగ్రత్తగా చూసుకునేది.

అప్పుడు అమృతకు పదిహేనేళ్లు. అమృతను గొప్ప విద్వాంసురాలుగా తీర్చిదిద్దాలని అమృత తండ్రి ప్రయత్నం. ఆంగ్లసాహిత్యం, తర్కం, తత్వశాస్త్రాలలో అప్పటికే ఆమెకు ప్రవేశం ఉంది. కవిత్వం కూడా వ్రాసేది. అమృత పదహారో పుట్టినరోజున ఆమె కవితల పుస్తకాన్ని ఆవిష్కరింపచేసి, తండ్రి ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చాడు. కలకత్తాలో కళారంగాల్లో హేమాహేమీలందరూ వచ్చి అమృత కవిత్వాన్ని, ప్రతిభను మెచ్చుకున్నారు. ఆమెకు గురుదేవుడు రవీంద్రనాథ్ టాగోర్ (రబి ఠాకుర్) అంటే భక్తి, గౌరవం. ఆయన దగ్గర మంచి చనువు కూడా ఉంది. ఆయన ఆమెను ఆదరంగా చూసుకొంటూ ఆమెకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. వయస్సుకుమించిన పెద్దరికం వద్దని, చిన్నతనాన్ని అనుభవించమని ఆమెకు చెప్పేవాడు. రబి ఠాకుర్‌కు ఆమె ఇచ్చే ప్రాధాన్యత మీర్చా‌కు నచ్చేది కాదు.

మీర్చా ఇంట్లో ఉండటం అమృతకు ముందు నచ్చకపోయినా, నెమ్మదిగా అతని ప్రవర్తన ఆమెను ఆకట్టుకుంది. అతనంటే ఆకర్షణ మొదలైంది. ఆమె తండ్రి వారిద్దరినీ ఒకరికి తెలిసిన భాషని రెండోవాళ్ళకి నేర్పించమని చెప్పాడు. అమృత, యూక్లిడ్ ఇంకా దగ్గరయ్యారు. ఏకాంతం దొరికిందనుకున్నప్పుడు మీర్చా అమృతను కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసేవాడు. పెద్దలకు అభ్యంతరాలు ఉంటాయి అని తెలిసినా, పెళ్లి చేసుకుందామనే అనుకొన్నారు. పెద్దవాళ్ళు దగ్గర లేకుండా కార్లో సాయంత్రాలు షికారులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరినొకరు రాసుకు పూసుకు తిరిగేవారు. ఇది గమనించిన అమృత చెల్లెలు శబి ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లి అమృతను నిలదీసి అడిగింది. అమృత నిజం ఒప్పుకొంది. తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాను అని హామీ ఇచ్చింది తల్లి. కానీ తండ్రి ఒప్పుకోలేదు. మీర్చాను ఇంటినుంచి వెంటనే పంపించివేశాడు. అమృతని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. బయటనుంచి మేడ వరండాలో ఉన్న అమృతని ఒక్కసారి చూసుకునే అవకాశం మాత్రం ఇచ్చాడు. అప్పుడు మీర్చా చూపులో ఉన్న బాధనీ, దైన్యాన్నీ అమృత మర్చిపోలేదు. ఆ తర్వాత అమృత మీర్చాని మళ్ళీ కలవలేదు. ఖోకా ద్వారా అతని జాడ కనుక్కొందామని అమృత ప్రయత్నించింది. అతను తనకేమైనా ఉత్తరాలు పంపిస్తాడేమోనని ఎదురు చూసింది. కానీ ఏ కబురూ లేదు. చదువు మానివేసి అతను హిమాలయాల్లో తిరుగుతున్నాడని వింది. ఆ తరువాత అతని జాడ తెలియలేదు.

మీర్చాని తలచుకొంటూ అమృత చాలా కాలం దుఃఖించింది. తండ్రి వెళ్ళిపొమ్మన్నంత మాత్రాన అతను అలా మాయమైపోయి ఉండాల్సింది కాదని, తనని పెళ్ళి చేసుకోవటానికి గట్టిగా ప్రయత్నించి ఉండవలసిందని ఆమె భావించేది. ఆ తరువాత తండ్రి ఛాలెంజ్ వల్ల మెట్రిక్ పరీక్షలు వ్రాసి ప్యాసయ్యింది. తండ్రి నిరంకుశత్వాన్ని, తల్లి బానిసప్రవర్తనను సహించలేకపోయేది. స్వాంతన ఇవ్వటానికి రబి ఠాకుర్ దేశంలో లేరు. తల్లితండ్రుల దగ్గరనుండి పారిపోవటానికి తహతహపడింది. తండ్రి మాటను వ్యతిరేకించి స్వాతంత్ర్యోద్యమ ఊరేగింపుల్లో పాల్గొనటం మొదలుపెట్టింది. చివరకు తల్లితండ్రులు చెప్పిన సంబంధం చేసుకుంది. ఆమె భర్త సౌమ్యుడు. ఆవేశ కావేషాలు లేని స్థితప్రజ్ఞుడు. మితభాషి. కాని భార్య అంటే చాలా ప్రేమ. అతను నగరానికీ, నాగరికతకూ చాలా దూరంగా టీ ఎస్టేట్ల మధ్య ఉండేవాడు. అంత దూరంలో ఉన్నా, వయసు మళ్ళిన రబి ఠాకుర్ ప్రయాణపు ఇబ్బందులు భరిస్తూ, ఆమె ఇంటికి చాలాసార్లు వచ్చి, ప్రతిసారీ కొన్నిరోజులు గడిపి వెళ్ళేవారు. ఆమె మాత్రం కవిత్వం వ్రాయడం మానేసింది.

అమృతకు మొదట్లో ఏమీ తోచేది కాదు. ఇంటి పనీ, వంట పనీ, తోట పనీ చేసినా సరిపోయేది కాదు. ఆ సమయంలో ఆమె ఎస్టేట్లలో పని చేసే గూర్ఖా గిరిజనుల అవస్థలు గమనించి, అక్కడి సాంఘిక కట్టుబాట్లను కూడా లెక్కచేయకుండా, వారి సంక్షేమానికి కృషి చేయటం ప్రారంభించింది. 22యేళ్ళ వనవాసం తరువాత కలకత్తా తిరిగివచ్చాక కూడా ఆమె చురుకుగా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేది. బంగ్లాదేశ్ కాందిశీకుల పునరావాసం విషయంలో కూడా ఆమె చాలా శ్రమపడి పనిచేసింది.

అమృత తండ్రి తన దగ్గర చదువుకోవటానికి వచ్చి ఇంట్లో ఉంటున్న ఒక విద్యార్థినితో సంబంధం పెట్టుకొన్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఆమెకోసం భార్యను, కుటుంబాన్ని విడచిపెట్టాడు. అమృత తల్లి వైపు గట్టిగా నిలబడి ఆమెకు ఆర్థికంగా అన్యాయం జరగకుండా కాపాడింది. ఆ తర్వాత తల్లి ఆమెకు మంచి స్నేహితురాలయ్యింది. తండ్రి మాత్రం సంఘంలో తనకున్న కీర్తి ప్రతిష్టలను కోల్పోయి దీనావస్థలో మరణించాడు.

మీర్చా ఏదో పుస్తకం వ్రాసి తనకు అంకితం ఇచ్చాడని ఆమెకు పెళ్ళికి ముందే తెలిసింది. అప్పట్లో ఆమె ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాతెప్పుడో ఆమె భర్తతో కలసి యూరప్ పర్యటనకు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మీర్చా దేశస్థులను కలసినప్పుడు వారు ఆమె పేరు వినగానే, ఆమెకు మీర్చా తెలుసా అని అడిగేవారు. ఆమెను ప్రత్యేకంగా చూసేవారు. ఆ దేశం వెళ్ళివచ్చిన బెంగాలీ మిత్రులు కూడా అమృత అనే పుస్తకం వల్ల ఆమె పేరు అక్కడ చాలా ప్రాచుర్యంలో ఉన్నది అని చెప్పేవారు. ఆ విషయాలు విన్న అమృత రెండుసార్లు మీర్చాకు ఉత్తరాలు వ్రాసింది కాని అతని దగ్గరనుండి సమాధానమేమీ రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడు సెర్గుయ్ వల్ల మీర్చా వివరాలు, ఆ పుస్తకంలో ఏముందో తెలిసింది.

కాలంలో కలసిపోయాయి అనుకున్న జ్ఞాపకాలు చాలా స్పష్టంగా చిన్న చిన్న విషయాలతో సహా గుర్తుకు రావడం, ఒకోసారి తన మస్తిష్కంలో వర్తమానమూ గతమూ కలగలుపవడం అమృతను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కాలం నిర్దుష్టం కాదని ఆమె భావించింది. గతం నశించదని ఆమె అర్థం చేసుకుంది. ఈ తాత్విక చింతన చాలారోజుల తర్వాత కవిత్వంగా బయటపడటం మొదలయ్యింది.

విడిపోయిన కొత్తలో, హిమాలయాల్లో తిరుగుతున్న రోజుల్లో మీర్చా తనకు కొన్ని ఉత్తరాలు వ్రాసి వాటిని తనకు అందజేయమని ఖోకాకు పంపాడని, వాటిని ఖోకా తనకు అందించలేదని ఆమెకు ఇప్పుడు తెలిసింది. అమృత మానసికాందోళన చూసిన కుటుంబసభ్యులు తల్లక్రిందులయ్యారు. నెమ్మదిగా భర్తకు విషయం తెలిసింది. ఇన్నాళ్ళ తరువాత దీన్ని గురించి ఆందోళన పడవలసిన పని లేదని ధైర్యం చెప్పాడు. ఒకసారి మీర్చాను చూసి అతనితో మాట్లాడితే ఆమె కోపం, ఆందోళన తగ్గి అన్నీ చక్కబడతాయని, ఆమెను మీర్చా దగ్గరకు పంపే ఏర్పాట్లు చేశాడు.

అమృతకు విదేశ పర్యటనకు వెళ్ళే అవకాశం వచ్చింది. ప్రొఫెసర్ యూక్లిడ్ ఆఫీసుకు అప్పాయింట్‌మెంట్ లేకుండానే వెళ్ళి అతన్ని ఆశ్చర్యపెట్టేట్లుగా కలవడానికి ఒంటరిగా వెళ్ళింది. అక్కడ యూనివర్సిటీలో చాలా పేరున్న ప్రొఫెసర్ అతను. ఆమె లోపలకు వెళ్ళగానే అతను లేచి నుంచుని ఆమె వంక చూడకుండా ఆమెకు వీపు చూపిస్తూ నిలబడ్డాడు. ‘నన్ను గుర్తు పట్టావా’ అని అడిగింది ఆవిడ. ‘ఖచ్చితంగా’ అని సమాధానం ఆమె వైపు తిరక్కుండానే. వారిద్దరి మధ్య సంభాషణ కొంత విచిత్రంగా సాగింది. తన ఎదురుగా ఉన్న మనిషితో కాక ఎవరో ఊహాలోకంలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నట్లుగా ప్రవర్తించాడు మీర్చా. అమృత చాలా బలవంత పెట్టగా ఆమెవైపు తిరిగాడు మీర్చా. అతికష్టం మీద, చాలా బలవంతం తర్వాత, ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆతని కళ్ళలో ఆమెకు జీవం కనిపించలేదు. అతని కళ్ళలోకి వెలుగు తెచ్చే శక్తి తనకు లేదనిపించింది. ఆమె వెనక్కు తిరిగి బయలుదేరింది. వెనుకనుంచి మీర్చా పిలిచాడు. త్వరలో ఆమెను కలుస్తానని, తన నిజస్వరూపంలోకి మళ్ళీ వస్తానని వాగ్దానం చేశాడు. ఆశలు మళ్ళీ కొద్దిగా చిగిరిస్తుండగా ఆమె అక్కడనుంచి కదిలింది.

(తర్వాత భాగం వచ్చే వారం)

Bengal Nights – A Novel
Mircea Eliade
176 pages

It Does Not Die – A Romance
Maitreyi Devi
264 pages

University of Chicago Press
1994

You Might Also Like

17 Comments

  1. మణి వడ్లమాని

    చాల ఉత్కంట కలిగించింది. ఆ పుస్తకాలని మీరు ఎంతగా ఆకళింపు చేసుకున్నారో ఈ సమీక్ష చెప్పింది. ఇక రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నాము. Thanks A lot

    1. Jampala Chowdary

      Thank you. The second part was published a week after the first part and should be available at http://pustakam.net/?p=14661. I also put a link today in the article to the second part.

  2. kameswari yaddanapudi

    మంచి పరిశోధన. చాలా ఆసక్తికరంగా ఉంది. తక్షణం చదవాలని అనిపిస్తోంది. ధన్యవాదాలు

  3. Nagini

    చాలా మంచి పరిచయం.. ధన్యవాదాలు.:-)

  4. NARESSH BAYYAVARAPU

    chala bagundhi

  5. BSR

    Very interesting and intriguing story of real life and two versions of autobiographies by the protagonists, wonderfully narrated by you. Can’t wait for the next part. Though I am fascinated by the story and would like to check out everything I can about the books (and the movie) right away, I would rather wait and read it from your fantastic writing first. Very nicely done JVSR. Kudos!

  6. sri

    i always thought it is Hum dil dechuke sanam is free make of Radha kalayam (by Bapu) which was remake of Atha 7 Nathakal a tamil film which was later remade in hindi as Woh 7 Din. But interesting to know this one… will definetly add to my future reading list…

    1. Jampala Chowdary

      హమ్ దిల్ దే చుకే సనమ్ రెండో సగం (రాదాకల్యాణం, మౌనరాగం లాటి)కథకు మూలం కూడా న హన్యతే లో ఉన్న ఒక ఉపకథలో ఉంది. అమృత భర్త చెప్పిన స్నేహితుడు భూపేష్ కథ. భూపేష్ పెళ్ళినాటి రాత్రి, భార్య తను ఇంకొకరిని ప్రేమించానని, అతనికి భార్యను కాలేనని ఏడుస్తుంది. రాత్రికి రాత్రే పెళ్ళిబట్టలతోనే బయలుదేరి భూపేష్ ఆమె ప్రియుణ్ణి వెతికి తెచ్చి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయించుతాడు.

  7. NARESSH BAYYAVARAPU

    CAN YOU SEN PDF COPY TO ME PLEASE

  8. cbrao

    కొత్త విషయాలు తెలిసాయి. రెండు పుస్తకాల సమీక్షలు ఆసక్తికరంగా ఉన్నాయి. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ.

  9. vyas

    guruvu garu THE BENGALI NIGHT
    http://www.youtube.com/watch?v=xSJo_gsKmME … ee link lo vundi u can watch it here

  10. డింగు

    కథ బానే వుంది గాని మధ్యలో ఆపడమే అస్సల్ బాలె.

  11. పద్మవల్లి

    Wow! Very interesting. Never heard of it. Would like to read them soon.
    Thank You for sharing.

    1. varaprasad

      chowdary gari bengali nights chaduvutunte,mee articles gurthocchay,pl edina rayandi medum,mee naration bavuntundi,choudari garki hatesoff,inta manchi maitrai gurichi rasinanduku.

    2. పద్మవల్లి

      Varaprasad garu, Thank you for your kind words. I have written a couple of them recently. Please visit my blog and you can find the links to them.
      http://padamatikoyila.blogspot.com/

      One of them is here on this site. http://pustakam.net/?p=14443

  12. Saamaanya

    మీరు చేసిన ఈ పరిచయం ,ఇక ఆ నవలల్నిచదవాల్సిన అవసరం లేదన్నంత సంతృప్తిని కలిగించింది. థాంక్స్ ఏ లాట్

Leave a Reply to డింగు Cancel