ఖదీర్ బాబు ఫుప్పుజాన్ కతలు

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్
******
బెంగుళూరు వచ్చిన కొత్తలో స్నేహితుల ద్వారా మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండకతలు, న్యూ బాంబే టైలర్స్, ఇంకా నూరేళ్ళ తెలుగు కథ పుస్తకాలు పరిచయమయ్యాయి. మొదటి పుస్తకం చదివేప్పుడు ఉన్నంత ఆసక్తి, కథలో చదువరిని కట్టివేసే గుణం అదే వరుసలో తగ్గుతూ వచ్చింది. దర్గామిట్ట కతలు చదుతున్నపుడు ఖదీర్ బాబు మీదున్న అభిమానం కాస్తా నూరేళ్ళ తెలుగు కథకు వచ్చేసరికీ ఒకింత అసహనం, నిరాసక్తిగా మారిపోయాయి. ఇక అక్కడితో మళ్ళీ ఖదీర్ బాబు పుస్తకాలు ముట్టుకోవాలనిపించలేదు. ఈ మధ్య వచ్చిన ఖదీర్ బాబు వ్యాసం ఎందుకో చదివాకా ఆగలేక, ఇంకొన్ని పుస్తకాలు ఈ మనిషివి చదువుదామని పుస్తకాల షాపుకెళ్ళి అడిగితే ఫుప్పుజాన్ కతలు అనే పుస్తకం కానవచ్చింది. వెంటనే తీసుకొని చదివాను, ఓ రెండు కథలు. చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి కళ్ళముందు మెదిలాయి. చిన్నపుడు ఉర్దూ నేర్చుకుంటున్న కొత్తలో సియాసత్ అనే పత్రిక వారి ఉర్దూదానీ, జబాన్ దానీ పరీక్షలు రాయటం జరిగింది. ఆ పరీక్షలు దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధార్మిక పరీక్షల మాదిరి ఉంటాయి. చిన్ని పుస్తకాలు కథలూ, పాటలతో ఉన్నవి ఇస్తారు, వాటిపై పరీక్ష రాయాలి. మా ఇంట్లో కథలు చెప్పేవారికి తెలీని ఎన్నో కథలు ఈ చిన్ని పుస్తకాల నుండీ చదివాను.

అయితే ఖదీర్ బాబు పుస్తకం తెరిచి చదివిన రెండు కథల్లో ఒకటి చిన్నపుడు చదివిన కథే! ఇక ఒక రకమయిన నోస్టాల్జియాకి గురయి, అమ్మ కోసం తీసుకుందామనుకున్న ఇతర పుస్తకాల సంగతి మరిచి, ఈ పుస్తకంతో ఇంటికి తిరిగివచ్చాను. ప్రతీ కథ పూర్తిగా చదివించే విధంగా రాసాడు రచయిత. మొహమ్మదీయుల ఇళ్ళల్లో ఉండే కట్టుబాట్లు, సామాజిక, ఆర్ధిక స్థితులు, ఆచరణా ధారతో పరిపూర్ణమయి ఉన్న కథలు ఏకబిగిన ఒక రాత్రిలో పూర్తి చేసినా, మళ్ళీ మళ్ళీ చదివే ఆసక్తిని తెచ్చాయి. మళ్ళీ ఖదీర్ బాబు ఫ్యానునైపోయాననమాట.

కథల్లో వాడిన భాష కూడా అన్ని కథలూ నెల్లూరు యాస అనిపించుకోకుండా కొన్ని మామూలు తెలుగులో ఉన్నాయి. కథల విషయానికొస్తే, జానపద నేపధ్యంలో, నాటి చందమామ కథలను మరిపిస్తాయి. ఇళ్ళలో ఉర్దూలో చెప్పబడే కథలు ఒకటీ రెండు తప్ప ఎక్కడా రాసి ఉండవు. మౌఖికంగా ఒక తరం నుండీ మరో తరానికి వస్తున్నవి అమ్మలక్కలు పిల్లలూ కలిసి మాట్లాడటానికి కుదిరినప్పుడల్లా ఈ కథలు చెప్పుకోటం జరుగుతుంది. నేటి చిన్ని కుటుంబాల నేపథ్యంలో పిల్లలకు మంచి సాహిత్యాన్ని అందించటం అటుంచి, అసలు కథలు చెప్పేవారే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఖదీర్ బాబు చేసిన ఈ పని చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం. కథలు ఉర్దూలోనే చెబుతారు కాబట్టీ సాధారణంగా ఎన్నో పదాలు తెలుగులో ఉండవు, కొన్ని పదాలను తెలుగు విడమరచటం చాలా కష్టం కూడా. అవేమీ అవాంతరాలు కావన్నట్టు, తనదయిన శైలిలో ఈ కథలను తెలుగీకరించి-మళ్ళీ నెల్లూరు వైపు యాసలో రంగరించి పాఠకులకు అందించిన ఖదీర్ బాబు చాలా పెద్ద పనిని చాలా సాధారణంగా చేసి చూపెట్టాడు.

మొదటి కథ “బఠాణీ రాజుది భలే తమాషా” ఇంచుముంచు అందరికీ సుపరిచితమయిన కథే (బిల్ గేట్స్-వర్ల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు-నిరుద్యోగి కొడుకు-అతని తండ్రి నేపథ్యంలో సాగే కథ), కాకపోతే పాత్రలూ కథనం మారిపోతుంటాయి. ఈ కథను మొదటి సారి చదివినపుడు కథలో ఉన్నట్టుగా ముస్లిం రాజులు కూడా తెలుగే మాట్లాడితే, ఆ మాట విసురూ అవీ, ఊహించుకుంటేనే అదో అద్భుతం.

“జింకమ్మా జింకమ్మా”, “నక్క సాయెబు-నక్క బీబీ”, “ఫలాతున్ పిచుక కథ”, “భర్రున ఎగిరిపోయిందోచ్”, “మనుషుల కథ పిల్లినే అడగాలి”, “మచిలీ బందర్ బాషా” వంటి జంతువులతో సంబంధమున్న కథలు పిల్లల్ని-పెద్దల్నీ చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గోప్యంగా ఇస్లాం బోధనలను తెలిపే కథలూ చాలా చక్కగా తీర్చిదిద్దాడు ఖదీర్ బాబు. వెయ్యినొక్క రాత్రుల కథలు చదివే వారికి దాదాపుగా చాలా కథలు దగ్గరగా అనిపించినా, ఒక కొత్తదనం, భారతీయతనం లోలోపలే ఉండి, ఈ కథలను విశిష్టమైనవిగా చేసాయి. బొమ్మలు ముఖ్యంగా చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉన్నాయి. ఈ పుస్తకం పుణ్యమా అని రాబోయే తరాలకు మొహమ్మదీయ ఇళ్ళల్లో పిల్లలకి కథలకు కరువు లేదు, కొరత ఉండదు.
నాకు ప్రతీ కథ చాలా బాగా నచ్చింది. ఏ ఒక్క కథ మిగితా వాటికన్నా ఎక్కువో తక్కువో కాదు.

పుస్తకం వివరాలు:
పేరు : ఫుప్పుజాన్ కతలు -పిల్లల జానపద సంపద
రచయిత/సంకలన కర్త : మహమ్మద్ ఖదీర్‍బాబు
ప్రచురణ సంస్థ : అస్మిత
తొలి ప్రచురణ : సెప్టెంబర్ 2004
వెల : 100 రూ.
దొరికే చోటు : హైదరాబాద్ – అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, బెంగుళూరు – ఆటా గలాట, పూణే – టెండర్ లీవ్స్
బొమ్మలు : మోహన్

You Might Also Like

4 Comments

  1. P Balasundaram

    అయ్యా మీ ఐ పుస్తకం కొనాలి అనుకుంటున్నాను ఎక్కడ దొరక గలదు

  2. Sarath

    సరళత విషయంలో నాకు “పోలేరమ్మ….” బాగా నచ్చింది. ఈ పుస్తకం చదవలేదు కానీ మీ పరిచయం చదివిన తరువాత ఒకసారి చూడాలని అనిపిస్తూంది.

  3. N N Muralidhar

    పరిచయం బాగుంది. తప్పకుండా చదువుతాం

  4. రాజ్ కుమార్

    మంచి బుక్ పరిచయం చేయటమే కాక, నా చేతి లో పెట్టావు రహ్మాన్.. నాకు బాగా నచ్చిమ్ది.
    ధన్యవాదాలు

Leave a Reply