లిపి తడిసిన తరుణం

వ్యాసకర్త: జాన్ హైడ్ కనుమూరి
********
రఘు కావ్యాలు సౌందర్య శిఖర సానువులు, రసాత్మక భావాలు కపిల వర్ణ ధేనువులు. ఉబికే ఉపమవేణువులు. ఏ పాఠశాలలో శిక్షణ ఇచ్చాడో తెలియదు రఘు చేతిలో అక్షరాలు నక్షత్ర గుచ్ఛాలవుతాయి. అగ్నిజ్వాలలవుతాయి, ధృవతారలౌతాయి. పసిపాపలౌతాయి. గ్రీకు రాణుల్లా అయ్యారే అనిపిస్తాయి. సీతాకోకల్ని ఉంగరాలుగా తొడుక్కొని చీర రంగుల్ని అనువదించే ఇతడు “రాజ్యేనకిం” అన్నంత రాజసంతో బతికే యువకుడు అంటారు డా|| కలువగుంట రామమూర్తి.

కవిత్వానికి లిపి తడిసిన తరుణం అని పేరు పెట్టి-

ఏదో ఒప్పందం ఉన్నట్టు
లోకం నిద్రిస్తుంది చీకటి పొత్తిళ్ళలో
చైత్రానికి తలవంచిన చలిపొద్దుల్లా
కన్రెప్పలు నిద్రగుడ్లు పొదిగాయి
నా కళ్ళను భగ్న గనుల్నిచేసి
నువ్వూ నిద్రించావు నెలవంక పందిరికింద
* * *

తడి పొక్కిలి అధరం మీద తుళ్ళి పడిన
కుప్త పదం తుమ్మెదలు
ఇక వ్యాపకాల లోహ దహనాలతో ఊహలు
అవి పువ్వుల్లా తెంపి తెచ్చిన ఉపమలు
ప్రసూతి గది వంటి కంటి కొనల్ని దాటాక
ఊరించే అంగారక కాంతులు
ఈ పూల పక్తులు!
…….49 పేజి
….అంటాడు.

* * *
….. ఇలాంటి పద చిత్రాల్ని మన ముందు పరచి చిత్ర విచిత్రాల ఆవిష్కరణలను ఇంద్రజాలికుడు మంత్రాల పెట్టేదో తెరిచినట్టు తెరుస్తుంటాడు. ఇక అక్షరాల వెంట పసి పిల్లాడిలా పరుగెడుతూ అనుభవాలనుంచో, ఎందరో అద్దిన ఇంద్రధనస్సుల రంగుల కుంచెల్లోనుంచో జారి పడిన నెమలి ఈకలు అలా అలా ఏరుకుంటూ పోవడమే. పేజీలు ఎప్పుడు తిరిగిపోయాయో, ఏ ఏ దారులగుండా వచ్చామో వెనక్కు తిరిగితే గాని తెలియదు.

పద చిత్రాలను అలా అలా పరుస్తున్నప్పుడు చూస్తూ చూస్తూ ఆనందించడమే తప్ప ఏమిచేయగలం చెప్పండి. తను అనుభవించిన ఆ సృజన వాతావరంలోకి మనల్ని మెల్లగా తీసుకెళ్తాడు. అక్కడే సందేహమొస్తుంది. తీగలు అల్లుకున్నట్టు అల్లుకోవడం అన్ని పూలమొక్కలవల్ల కాదేమో! వెన్నెలకు రేకు విప్పి పరమళాన్ని వెదజల్లడం అన్ని పూలవల్ల కాదేమో!!

చీకటి గదిలో నువ్వొంటరిగా కూర్చున్నప్పుడు
ఓ హిమాంశు కిరణంలా ఆమె నీ గుండెల్లోకి ప్రవహిస్తుంది
—-
భూతకాలం పూసల దారంలా గుండెనుండి
రాలి పడ్తుంది.
…పేజి .58

ఇక నిశ్శబ్దాల ముఖ్మల్ కప్పుకుని
నీ నీలి కల్లో హిరణ్య ద్రవాన్నై ప్రవహిస్తాను
అప్పుడు నీ కళ్ళు ఖచ్చితంగా గగన తలం వేదికలు!!
……పేజి 57

ప్రేమను ఎంత కుంభనంగా వలకబోస్తాడో కదా అన్పించక మానదు. ఎవరి శైలినైనా గుర్తుచేస్తున్నాడా, అనుకరిస్తున్నాడా అనక మానదు.

“ఒక అలలా సంకేతాల అనివార్యతలోకి
దొర్లుతూ పోతుంది
ఆ నిర్మానుష్య నిమిషాల పాయసాలు చాలు
పంక్తుల్లో పాల కంకులొలిచేందుకు!
అవి అరచేతుల్లో దూరి
వచనాల్ని పద్యల్లా మార్చుతాయి
పిపాస పూసలై గొంతుల్ని
విందుకు రమ్మని పిలుస్తాయి”
…. 16 పేజి

కవిత్వంలోకి జారిపోయే సమయాలను అతి లాఘవంగా వదిసి పట్టుకుని మనముందుచాలనే ప్రయత్నమే. మరో పద చిత్రం తను చూసిన సన్నివేశం లేదా ప్రకృతి స్థితి పై

పుష్కరిణిలో హఠాత్తుగా కాలుజారి నిలిచినట్టు
అవి నా కంటి జతల చిత్తడి దొప్పల్ని చేరాక
వానధార వంటి గొంతును మబ్బు గుబురుకు
దత్తతిచ్చాను
యక్షుడి విరహం వంటి హృదయాన్ని
వానలో తడిసాక
ఉత్త మునగాకు ముగ్గులా మిగిలాను
..పేజి 48

మరో పద చిత్రం వర్షంపై –

వర్షం
సుడిగాలి పేమలేఖై
మట్టిదేహంపై కురిసినట్టు
నిన్నటిదాకా
రాత్రిళ్ళు నా బాధల దోసిళ్ళై
కాగితాల గుండెల్ని తడిమేవి.
… పేజి 61

ఇది రాస్తునో, చదువుతూనో తన్ను తను ఆవిష్కరించుకున్నాడు అని మొదట అనిపించింది, కాని రాసిన దాన్ని తిరిగి టైపు చేస్తున్నప్పుడు అనిపించింది ఈయన నన్ను కూడా అక్కడక్కడా ఆవిష్కరిస్తున్నాడని. బహుశ చిత్రంగా ఆయనలోకి నేనో, నాలోకి ఆయనో కలిసిపోయాము. ఇద్దరి మధ్యా తడిసిన అక్షరాలు చుట్టేసాయి. మీరూ తడవకుండా తప్పించుకోలేరు.

చిక్కనైన ప్రతిసారి
కాగితాన్ని ప్త్రహరితంతో కలిపే వాక్యం నేను! … నేనొక హరితం …. పేజి 13

ఇక కలల కొనమీద
పిల్లన గ్రోవిలాంటి వాక్యం నేను …19 పేజి

కలవరం లేని వాడే కలల్ని అనువదిస్తాడు
ఘనమో ద్రవమో తెలియని పక్తుల్ని
గొంతులోంచి తెస్తాడు … 26 పేజి

ఇక గడియారాలు దులిపే
చీమల్లాంటి నిమిషాల నుండి దూరంగా వస్తాను
పెదవుల ఉలినుండి మాటల్ని ఉల్కల్లా తెస్తాను ..30 పేజి

ఎక్కడ నిశ్చింత వృత్తంలా లోకాన్ని ఉండ చుడుతుందో
అక్కడ లక్కలా అతుకుతుంది నాలో కవితాత్మ
ఇక వ్యాపకాల ఆయుధాలు వదలి వస్తాను
ఉరికే నిమిషాల చిత్తర్వుల వలలోకి.. .. 34 పేజీ
-ఇక్కడ ఠాగూర్ గుర్తుకొచ్చాడు మీకూనా!!!

ఎన్ని రూపాలలోకి వెళ్తాడో, వెళ్తానంటాడో, భరోసా ఇస్తానంటాడో మీరే చూడండి-

చెత్తకుండీ పక్కన నడిచేవాడు
ఊపిరాడక చచ్చినట్టు
ముక్కు మూసుకొని వాడి పొడిమాటల గబ్బిలాన్ని తరుముతాను
కవ్వించే వాడి అహంకారం నాకు ఆహారం
బెరుకులేని పెదవుల్తో పొగరుగా కొరుకుతాను పేజీ 35

సిరాచుక్కల మీద సదా వసంతాన్ని చిలికినవాడ్ని కదా
వరూధిని పలువరుస వంటి వెన్నెల్లో
తడవాలని వస్తాను
విఫలమై ఉత్త మాటల రాతిమేడల్లో నక్కుతాను …38 పేజి

దవళ పత్రం వంటి నాలుక నుంచి
ధూపం పొసిగిన నాసికనుంచి
మాటను ధాతువుగా మంత్రించి తెస్తాను
అరిగిన బాధల్ని, ఆదిమ భైరాగిలా
అదిలించివస్తాను … పేజీ 39

ఒక దీపకళిక తొణికి చెదిరే
తన పునరావృత దూరాన్ని
తలవంచి ధ్యానించే జంగమ ధ్వని నేను! ….. పేజి 47
* * *

ఖాళీ పేజీలపై వాలినప్పుడు
దగ్ధమయింది అహంకార ధ్వజమే!
ఇక దుఃఖానికి ధూపం ఎందుకు? .. పేజి 50

నీ నాజూకు గుండె కింద
నా పాదాలు తొక్కి పెట్టావా?
అయితేం?
గాలి వీపులెక్కి విహరిస్తా ఒక వాక్యానై – పేజి 52

కళ్ళు ఖాళీచేసి నువ్వెళ్ళిపోయాక
నా దీర్ఘ ఆలోచనల పొదలనిండా
రెక్క విరిగిన మిణుగురు మెరుపులే! …
-మిణుగురులు మెరిసేది ప్రేమతో ఆకర్షించుకోడానికే. రెక్క విరిగిన స్థితిలో కూడా ప్రేమకోసం మెరుస్తుండటం రసానుభూతి కాక మరేమౌతుందంటారు.

ప్రపంచాన్ని విల్లులా వంచుతా
దానికి నా వాక్యం దారంగా కడతా
నేను ఒరలో అక్షరాలు నింపుకున్న వీరుడిని

మనిషి నుండి ఆకలిని కత్తిరించి
భూగోళం లోతుల్లో పాతిపెడతా
ఎడారి గుండెల మీద శబ్దాల వాన కురిపించే
ప్రవక్తనై పుడతా! … పేజి 56
……. అంటాడు, నాక్కొంచెం నమ్మకమివ్వు అన్న ఆలూరి భైరాగి గుర్తొస్తాడు.

లోకానికి కావల్సింది
కిలోలకొద్దీ కలలు కనే రికామీ తలలు కాదు
రెండు కష్టించే చేతులు
చెమట పుష్పించే ఋతువులు … పేజి 21

ఈ మధ్య అంతర్జాలంలో వినిపిస్తున్న “ఫెంటోలు” రూపంలో కొన్ని కన్పించాయి. మచ్చుకు కొన్ని –

నువ్వు రాత్రిని జయిస్తే
ఎంత విశ్రాంతి నా దిగులు గుండెకు! —-51 పేజి

నువ్వు రాత్రిని భర్తీ చెయ్యి
నా నిశ్శబ్దాల చెరువుగట్లు తెగుతాయి … ఫెంటో రూపం
* * *

వున్నవి కొన్ని పేజీలే అందులోనివి చాలా వరకూ నేనే రాసేసా. ఇక మీకేమైనా మిగిలాయా అని నా సందేహం. దేన్నీ తీసెయ్యడానికి అవకాశం ఇవ్వనంతగా నన్ను అక్షర లిపిలో తడిపాయి ఇక ఈ పుస్తకం పేరు “లిపి తడిసిన తరుణం” అని వుండటంలో అతిశయోక్తి కాదేమో! చదువుతున్నప్పుడు నాకున్న కల్లోల పరిస్థితుల నుండి నాకు ఊరటనిచ్చింది. అవి వివరిస్తే మరో కొన్ని పేజీలౌతాయేమో. మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. చదవండి. రఘు ను అభినందించండి 9603264732, 9849228911.

ప్రతులకు

పాలపిట్ట బుక్సు
16-11-20/6/1/1
403, విజయసాయి రెసిడెస్నీ
సలీం నగర్, మలక్‌పేట,
హైదరాబాదు-500036.
Mail : palapittabooks@gmail.com
Phone 040-27678430

You Might Also Like

One Comment

  1. varaprasad

    very nice

Leave a Reply