కాఫ్కా ది ట్రయిల్ – అనువాదకుని మాట

వ్యాసకర్త: నశీర్
(ఇది కాఫ్కా రాసిన “ది ట్రయల్” కు తెలుగు అనువాదమైన “న్యాయ విచారణ” గురించి అనువాదకుడు నశీర్ మాట. ఈ పుస్తకం కినిగె.కాంలో లభ్యం)
*****
ఆధునిక వచన సాహిత్య పరంపరను ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అందులో విప్లవాత్మకమైన పరిణామాలన్నీ ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లోనే సంభవించాయి. ఈ పరిణామాలకు కేంద్ర బిందువులుగా నిలిచిన రచయితల్లో ముగ్గుర్ని ప్రముఖంగా చెప్పొచ్చు. ఐర్లండు నుంచి జేమ్స్ జాయ్స్, ఫ్రాన్సు నుంచి మార్సెల్ ప్రూస్ట్, జర్మనీ నుంచి ఫ్రాంజ్ కాఫ్కా. వీరు “పాఠకుల రచయితలు” కావడం కన్నా ముఖ్యంగా, “రచయితల రచయితలు” కావటం వల్లే ఈ పరిణామాల్ని పుట్టించగలిగారనిపిస్తుంది. వీరి తదనంతరం సాహిత్యాకాశంలో వెలిగిన మెగాస్టార్లందరూ అంతో ఇంతో వీరి నుంచి కాంతిని అరువు తెచ్చుకున్నవారే. అంతటి ప్రభావాన్ని కలిగించిన వీరి ప్రసిద్ధ రచనలేవీ ఇప్పటి దాకా తెలుగులోకి తర్జుమా కాలేదు. జాయిస్, ప్రూస్ట్‌ల విషయంలో ఇది అర్థం చేసుకోదగ్గదే. ఎందుకంటే, వారేమీ అంత అనువాద సులభులు కారు. జాయ్స్ రచనల్ని అర్థం చేసుకోవటానికి ఆంగ్ల భాష దాదాపు అవధుల దాకా తెలిసి ఉండటమన్నది ఒక అర్హతైతే, దాంతో పాటూ హోమర్ నుంచి షేక్‌స్పియర్ వరకూ ప్రాచీన సాహిత్యపరంపరతో కనీస పరిచయం ఉండటమన్నది అంతకు మించిన అర్హత. “యులిసెస్” లాంటి ఆయన రచనల విషయంలో పాశ్చాత్య పండితులకే అధ్యయనం చేసిన తర్వాతనే ఏ మాత్రమైనా ఆస్వాదించగల పరిస్థితి ఉన్నపుడు, దాన్ని తెలుగులోకి అనువదించటమూ, అదేమైనా పఠనయోగ్యం కావటమూ పగటి కలే. మార్సెల్ ప్రూస్ట్ విషయానికొస్తే, పొడవాటి వాక్యాలు ఆయన శైలికి ఆయువుపట్టు. రచయిత ప్రపంచాన్ని చూసే తీరే అతని శైలి అంటాడాయన. “ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ లాస్ట్ టైమ్” అనే ఆయన ఏకైక ప్రసిద్ధ రచనలో ఒక్కోసారి పేజీల తరబడి ఒకే వాక్యంగా సాగే ఆయన శైలిని తీసుకొచ్చి, పొట్టి వాక్యాల్ని మాత్రమే సులభంగా అనుమతించే తెలుగు వ్యాకరణానికి తలవొగ్గుతూ తర్జుమా చేసినా, అది రచయితగా ఆయన విశిష్టతను ఏ మాత్రం చూపించలేదు.

ఇక మిగిలిన కాఫ్కా జోలికి మాత్రం, కాస్త కష్టమైనా, వెళ్ళవచ్చు. అయినా ఎవరూ వెళ్ళకపోవటానికి కారణం, బహుశా ఇందాకే చెప్పినట్టు, ఆయన “పాఠకుల రచయిత” కన్నా ఎక్కువ “రచయితల రచయిత” కావటం వల్లనేమో. ఇలాంటి మొద్దు డిస్టింక్షన్లలో ఔచిత్యం తక్కువే కానీ, సగటు తెలుగు పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, కాఫ్కా రచనలు తెలుగులోకి తర్జుమా కాకపోవటానికి ఈ కారణం చాలనిపిస్తుంది. అయితే అసలు కాకుండా పోలేదు, అరవయ్యేళ్ళ క్రితమే అయింది. అనువాదకుడు కూడా ఆషామాషీ వాడు కాదు. 1947లో జ్యోతి మాస పత్రికలో “ఎ క్రాస్‌‍బ్రీడ్” అనే కాఫ్కా రచనను “వింతజంతువు” పేరిట శ్రీశ్రీ అనువదించాడు. కానీ అది కాఫ్కా ప్రసిద్ధ రచనల్లో ఒకటి కాదు కాబట్టి లెక్కలోంచి మినహాయించవచ్చు.

నేను ఈ రచనను మూల భాష అయిన జర్మన్ నుంచి అనువదించ లేదు. ఇంగ్లీషు అనువాదం నుంచి అనువదించాను. నాలుగు వేర్వేరు ఇంగ్లీషు అనువాదాలపై ఆధారపడ్డాను. అవేమిటో కాలానుక్రమమైన వరుసలో చెప్పాలంటే, మొదటిది: 1937లో తొలిసారి విడుదలైందీ, దాదాపు యాభై యేళ్ళ వరకూ చెలామణీలో ఉన్నదీ అయిన ఎడ్విన్ మూర్ – విల్లా మూర్ దంపతుల అనువాదం. రెండోది: 1998లో షోకెన్ బుక్స్ ప్రచురించిన బ్రయాన్ మిచెల్ అనువాదం. మూడోది: 2009లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన మైక్ మిచెల్ అనువాదం. నాలుగవది: ఎప్పుడు ప్రచురితమైందో తెలీదు గానీ, ఇంటర్నెట్‌లో ప్రస్తుతం విస్తృతంగా ఈ-బుక్ రూపంలో లభ్యమవుతున్న డేవిడ్ విల్లీ అనువాదం.

ఈ నాలుగింటిలో నేను ప్రధానంగా బ్రయాన్ మిచెల్ అనువాదం పై ఆధారపడ్డాను. ఈ అనువాదకుని పద్ధతిని బట్టీ, దానిపై నేను చదివిన సమీక్షల్ని బట్టీ, అన్నింటికన్నా ముఖ్యంగా చదువుతున్నపుడు నా ఇంట్యూషన్‌ని బట్టీ, ఇదే “ద ట్రయల్” అనువాదాల్లో ఉత్తమమైందిగా నేను భావించాను. ఎడ్విన్ – విల్లా దంపతుల మొదటి ఇంగ్లీషు అనువాదంపై దరిమిలా చాలా విమర్శలు వచ్చాయి. మొదటిది, వాళ్ళు కాఫ్కాను ఒక ఆధ్యాత్మిక రచయితగా భావించారు, అది వారి అనువాదం పైనా ప్రభావం చూపించింది; రెండోది, అర్థం సుస్పష్టంగా లేదని వారనుకున్న చోటల్లా సులభమైన పఠనానికి వీలుగా వారు స్పల్ప మార్పులు చేస్తూ వచ్చారు, దాంతో కట్టుదిట్టమైన కాఫ్కా వచనం కాస్తా వదులైంది. వారు మూలంలో జోక్యం చేసుకున్న తీరుకు ఒక ఉదాహరణ వారి అనువాదపు మొదటి వాక్యంలోనే కనిపిస్తుంది. “ఎవరో జోసెఫ్.కె గురించి అబద్ధాలు చెప్తున్నట్టుంది, ఎందుకంటే ఏ తప్పూ చేయకుండా ఒక శుభోదయాన అతను అరెస్టయ్యాడు.” (Someone must have been telling lies about Joseph K., for without having done anything wrong he was arrested one fine morning.”) అని వారు అనువదించిన ఈ వాక్యంలో “ఒక శుభోదయాన” (“one fine morning”) అన్న పదం జర్మన్ మూలంలో ఉన్నది కాదు, అనువాదకులు సొంతంగా తెచ్చి పెట్టింది. ఇలాంటి జోక్యాలే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ సంగతి తెలియక మొదటి ఐదు అధ్యాయాలు నేను ప్రధానంగా వారి అనువాదాన్నే అనుసరించాను. తెలిసిం తర్వాత అక్కడక్కడా సవరణలు చేసుకుంటూ వచ్చాను. తదుపరి ఐదు అధ్యాయాలూ మాత్రం బ్రయాన్ మిచెల్ అనువాదాన్నే అనుసరించాను. ఎందుకంటే అది విరామచిహ్నాలతో సహా కాఫ్కా మూలాన్ని చాలా దగ్గరగా పట్టుకుంది. మిగతా అనువాదాల్ని మాత్రం, పదాల సున్నితమైన ఛాయాబేధాల్లో పడి అర్థం సుబోధం కానప్పుడు, రిఫరెన్సుగా వాడుకున్నాను.

ఈ తెలుగు అనువాదంలో తెలుగు నుడికారం కోసం మరీ అంత తలకిందులవలేదు, ఎందుకంటే జర్మన్ మూలంలో జర్మన్ నుడికారం చాలా తక్కువ కాబట్టి. కాఫ్కా రాసింది జర్మన్‌ భాషలోనే అయినా అతను జర్మన్ నుడికారానికి దూరంగా పెరిగాడు. అతని జర్మన్ భాష ఎక్కువగా అతను చదివిన పుస్తకాల్లోంచి గ్రహించిందే గానీ, చుట్టూ ప్రజల వాడుక నుంచి స్వీకరించింది తక్కువ. కారణం, కాఫ్కా స్వస్థలమైన ప్రాగ్‌లో అత్యధిక ప్రజానీకం చెక్ భాష మాట్లాడేవారు. అంతేగాక, కాఫ్కా కావాలని తన వచనంలో ఎక్కువ శాతం సైన్సుకూ, న్యాయశాస్త్రానికీ సంబంధించిన పదాలు వాడాడు. మూలపు ఈ స్వభావాన్ని తెలుగు నుడికారం పట్టుకోలేదు.

తెలుగులో మకాం వేసిన ఇంగ్లీషు పదాల్ని యథాతథంగా వాడాను. కేసు, లాయరు, ప్రొసీడింగ్స్; మూడ్, సీరియస్, బిజీ; డెస్కు, హాలు, పోర్ట్రయిటు వంటి పదాల్లో కొన్నింటికి తెలుగు ఉన్నా, వాటికి ఇంగ్లీషు రూపాలే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి అవే వాడాను. అలాగే కాఫ్కా చాలా చోట్ల, వాక్యం పూర్తయినా, చెప్పదల్చుకున్న భావం ఇంకా ఉన్నదనుకున్నపుడు, వాక్యం చివర పుస్‌స్టాపులు వాడకుండా, కామాలు పెట్టుకుంటూ పోయాడు. వాటిని అలాగే అనుసరించాను. కాఫ్కా రచనల్లో పేరా గ్రాఫు విభజన చాలా తక్కువ; సంభాషణలను విడిగా కాక, పేరాగ్రాఫుల్లోనే కలిపేశాడు; ఈ పద్ధతి యథాతథంగా అనుసరించాను. చాలామంది పాశ్చాత్య రచయితల్లాగే కాఫ్కా సంభాషణ మొదలవగానే దాన్ని మధ్యలో తుంచి, అది ఎవరు మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో చెప్పి, తర్వాత మళ్ళీ సంభాషణని కొనసాగిస్తాడు. తెలుగులో ఈ పద్ధతి లేదు; కాబట్టి వీలైనన్ని చోట్ల దీన్ని నిర్మూలించటానికి ప్రయత్నించాను; ఉద్దేశింపబడిన ప్రభావం పోతుందనుకున్న చోట్ల మాత్రం అలాగే ఉంచేశాను. అలాగే ఇంగ్లీషులో “మీరు/ నువ్వు” లంటూ రెండు సంబోధనా వాచకాలు లేవు; ఉన్నదల్లా “నువ్వు” ఒక్కటే. “మీరు” అవసరమని నేననుకున్న చోట్ల దాన్ని వాడాను.

ఆఖరుగా, ఇది మూలనిబద్ధమైన అనువాదమూ కాదు, స్వేచ్ఛానువాదమూ కాదు. కాఫ్కాకు ఎందుకు రాసి ఉంటాడని నేననుకున్నానో, అందుకే అనువదించటానికి ప్రయత్నించాను.

~ నశీర్, ఏప్రిల్ 2013

You Might Also Like

4 Comments

  1. శ్రీనుపైండ్ల

    నశీర్ గారికి ,
    మీ పుస్తకం కోసం చాలా బుక్ షాపుల్లో వెదికా. ఇంగ్లీష్ ది ట్రయల్ ను చదివి వెర్రెత్తిపోయిన అనామకుల్లో నేను ఒకడ్ని. కాఫ్కా ..ఒక్కొక్కసారి పదాల అర్ధాల స్వరూపం మారిపోయేది. ఆయన వివరణ స్పష్టంగా ఉందనే కానీ అర్ధం ఒక్కోసారి అర్ధం ఢిపరెంట్ గా ఉండేది. ఆయన గురించి వందల వ్యాసాలు చదివాను కనక .. ట్రయల్ ఈజీగానే అర్ధం అయింది. మీరు చాలా మంచి పని చేశారు. ఆ నరకయాతన కాఫ్కాను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లకు ఉపయోగపడుతుంది. మీ పుస్తకం ఎక్కడదొరుకుందో చెప్తే .. బాగుంటుంది.
    …paindlapen@gmail.com.. నా మేయిల్ ఐడీ.
    దయతో పోస్ట్ చేయ్య పార్ధన
    శ్రీనుపైండ్ల
    జర్నలిస్ట్

  2. SIVARAMAPRASAD KAPPAGANTU

    “…కాఫ్కాకు ఎందుకు రాసి ఉంటాడని నేననుకున్నానో, అందుకే అనువదించటానికి ప్రయత్నించాను….”

    Well said.

    If anybody wants to read translated English version of “The Trial” (translated by David Wyllie) it is available in Gutenberg Project website. The following web address shall take to the exact location where the book is available in various formats.

    http://www.gutenberg.org/cache/epub/7849/pg7849.html

    1. SIVARAMAPRASAD KAPPAGANTU

      Following is the link for the book “The Trial” in various formats:

      http://www.gutenberg.org/ebooks/7849

      Previous link is for reading it online in html format.

  3. Dr.M.V.Ramanarao

    కాఫ్కా వంటి రచయితలని అనువదించడం కష్టమే.ఏ.వీ.రెడ్డిశాస్త్రిగారు ప్రయత్నించారు.మీరు అనువాదం చేపట్టినందుకు అభినందిస్తున్నాను.ప్రతీ పదం,వాక్యం అనువదించనవసరం లేదు.మూలంలో రచన అభిప్రాయాల్ని, spirit ని అనువాదంలో ప్రతిఫలించగలిగితే చాలును.

Leave a Reply