నరిసెట్టి ఇన్నయ్య ‘మిసిమి’ వ్యాసాలు

వ్యాసకర్త: ముత్తేవి రవీంద్రనాథ్
*****
తెలుగు పాత్రికేయ ప్రపంచంలో డా.నరిసెట్టి ఇన్నయ్య గారిది పరిచయం అవసరం లేని పేరు. లబ్ధప్రతిష్టులైన అతి కొద్దిమంది తెలుగు పాత్రికేయులలో వారు ఎన్నదగినవారు. విలక్షణమైన శాస్త్రీయ మార్గాన్ని ఎంచుకుని, తాను నమ్మిన మానవవాద, హేతువాద సిద్ధాంతాల వెలుగులో పుంఖానుపుంఖంగా సాహిత్య సృజన చేస్తూ, గత నలభై ఐదేళ్ల నుంచీ విరామమెరుగని ప్రయాణం చేయడమంటే ఆషామాషీ విషయమేం కాదు.అందుకే వారి మార్గం అనితర సాధ్యం. ఇక వారి శైలి సామాన్య చదువరులకు కూడా చక్కగా విడమరచి చెప్పేదిగా ఉంటుంది. ప్రతి విషయాన్నీ హేతు పరీక్షకు లోనుచేసి, ముందుగా దాని శాస్త్రీయత విషయమై తాను సమాధానపడనిదే ఆయన ఒక్కముక్క కూడా రాయరు.అందుకే వారి రచనలన్నీ వివరణాత్మకంగానూ, సామాన్య చదువరులు కూడా అవగాహన చేసుకోగలిగేవిధంగానూ ఉంటాయి. అలా తాను నమ్మిన సిద్ధాంతాలపట్ల చెరగని విశ్వాసం, విలక్షణమైన శైలి పాత్రికేయ లోకంలో వారి స్థానాన్ని సుప్రతిష్ఠితం చేశాయి. ఇన్నయ్య గారు కేవలం పాత్రికేయులే కాదు; యాభైకి పైగా గ్రంథాలను రచించిన పేరున్న గ్రంథకర్త కూడా. వారి గ్రంథాలు కూడా వారి వ్యాసాలలాగానే భిన్న విభిన్న అంశాలపై లోతైన పరామర్శతో కూడుకొని ఉంటాయి. వారు ఏ అంశాన్ని పరామర్శించినా మొత్తం చర్చ అంతా శాస్త్రీయత, హేతు దృష్టి, మానవీయ విలువలు ముప్పేటగా కలిసిన ఇరుసు చుట్టూనే పరిభ్రమిస్తుంది. ఇన్నయ్యగారు ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో పి.హెచ్.డి. చేశారు. అందుకేనేమో వారి రచనలలో సూక్ష్మ పరిశీలన, తార్కిక దృష్టి, తాత్త్విక విశ్లేషణ స్పష్టంగా ద్యోతకమౌతాయి. ఎనభయ్యో పడిలో కూడా తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల సడలని విశ్వాసంతో, అలుపెరగని యోధునిగా రచనలు చేస్తూ ఉండడం అత్యంత అరుదైన విశేషం.వారు కేవలం పాత్రికేయుడు, గ్రంథకర్త మాత్రమే కాదు; ఉద్యమకారుడు కూడా. అంధ విశ్వాసాలపై నూనూగు మీసాల నూత్న యౌవనంలో ఆయన ఎత్తిన కత్తి నేటికీ దించనేలేదు. బంగ్లాదేశ్ లో ముస్లిం మత చాందసులకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రముఖ ఉద్యమకారిణి, ‘లజ్జ’ గ్రంథ రచయిత్రి తస్లీమా నస్రీన్ ను ఒక గ్రంథావిష్కరణ కోసం భారతదేశంలో రోజురోజుకీ మత చాందసులకు అడ్డాగా (కార్యస్థానంగా) మారిపోతున్న హైదరాబాద్ కు ఆహ్వానించి, ఆ సభ నిర్వహించాలంటే ఎవరికైనా ఎంతటి దమ్మూ, ధైర్యం కావాలి?

మొక్కవోని ధైర్యంతో ఆ పని చేసిన ఇన్నయ్యగారు ముందుగా అనుకున్నట్లే ఒక పక్క మత చాందసవాదుల దాడులనూ, మరో పక్క వారిని సంతృప్తి పరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ కాండనూ — ఏకకాలంలో ఈ రెంటినీ చవి చూడాల్సి వచ్చింది. మానవీయ విలువల పరిరక్షణకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు ఆయన జరిపిన నిర్విరామ పోరాటాల అనుభవసారం ఆయన రచనలన్నింటిలో ద్యోతకమవుతుంది. ఆ అనుభవాలే ఆయన రచనలకు స్ఫూర్తి. ఆయన వ్యక్తిత్వాన్ని సంపద్వంతం చేసి ఈ తీరుగా ఆయన్ని మలిచింది కూడా ఆ ఉద్యమ అనుభవాలే. ఆయన కేవలం మానవతావాది మాత్రమే కాదు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి కూడా. వారి రచనలలో కీర్తిశేషులైన కొందరు ప్రసిద్ధ వ్యక్తులతో సహా పలువురు సమకాలీనులతో తనకున్న ఆత్మీయ సంబంధాలు, వారితో తాను గడిపిన మధుర క్షణాలే కాక వారితో తనకు ఎదురైన చేదు అనుభవాలను సైతం తన మదిలో భద్రంగా పదిలపరచుకుని ఆయన నెమరువేసుకునే తీరు ఇన్నయ్యగారి లోతైన మానవీయ విలువలకు అద్దం పడుతుంది. ముఖస్తుతి పక్కనబెట్టి ఎంతటివారి గురించైనా నిర్భీతిగా రాయగలగడం అందరివల్లా అయ్యేపని కాదు. వ్యక్తుల వ్యక్తిత్వాలను తులనాత్మకంగా అధ్యయనం చేసి, అంచనా కట్టి, వారి మంచి చెడుగులను గతి తార్కిక దృష్టితో చూడడం అలవరచుకున్న ఇన్నయ్య గారి వంటి విశ్లేషకులకే అది సాధ్యమనుకుంటా.

ప్రస్తుత గ్రంథం ఆలపాటి రవీంద్రనాథ్ గారు స్థాపించిన ‘మిసిమి’ పత్రిక కోసం ఇన్నయ్య గారు భిన్న విభిన్న అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం. తెనాలికి చెందిన కీ.శే.ఆలపాటి రవీంద్రనాథ్ గారు డా.ఇన్నయ్య గారికి సన్నిహిత మిత్రులు. మానవవాది. రవీంద్రనాథ్ గారు 1990 లో ఓ సదాశయంతో, కొన్ని విలువలకు కట్టుబడి విలక్షణ పక్ష పత్రికగా ప్రారంభించిన ‘మిసిమి’ ఆ తరువాత మాస పత్రికగా రూపొందింది. ‘మిసిమి’కి మొదటినుంచీ సలహాదారుగా వ్యవహరించిన ఇన్నయ్యగారు ఆ పత్రిక అనితరసాధ్యమైన తన విలక్షణతను నిలబెట్టుకొనడంలో ముఖ్య భూమికను పోషించారు.’మిసిమి’ పత్రిక మొదటి సంచికనుంచీ రవీంద్రనాథ్ గారి కోరిక మేరకు ఇన్నయ్య గారు రాసిన ఈ వ్యాసాలు 2012 జూలైలో రవీంద్రనాథ్ గారి కుమారులు బాపన్న గారు ఇలా గ్రంథరూపంలో ప్రచురించారు. ఈ వ్యాస సంపుటికి ముందుమాట ‘మిసిమి’ ప్రధాన సంపాదకులు ఆంజనేయ రెడ్డి గారు రాయగా, ‘మిసిమి’ సంపాదకులు అశ్వినీ కుమార్ గారు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈ గ్రంథంలోని వ్యాసాంశాలు మనం ముందే చెప్పుకున్నట్లు భిన్న విభిన్నమైనవి. వ్యాసాలన్నీ వేటికవే విశేష ప్రాముఖ్యం కలిగినవి. దాదాపు అన్ని వ్యాసాలూ లోతైన పరిశీలనతో కూడుకొని ఉన్నట్టివే. కొన్ని వ్యాసాల చివర్లో ఆకరాలు, ఆసక్తి గల చదువరులకు తదుపరి పరిశీలనార్థం ఉద్దేశించిన గ్రంథాల జాబితా ఇవ్వబడ్డాయి. ఈ వ్యాసాలలో కొన్ని నాకెంతగానో నచ్చాయి. అన్ని వ్యాసాలూ విషయ ప్రాముఖ్యం కలిగినవే అయినా నన్ను బాగా ఆకట్టుకున్న కొన్ని వ్యాసాలను మాత్రం ఈ సందర్భంగా స్థూలంగా పరామర్శిస్తాను.

ఇన్నయ్యగారు ‘హోల్ టైం ఎడిటర్’ అన్న వ్యాసంలో తన సన్నిహిత మిత్రులు కీ.శే.ఆలపాటి రవీంద్రనాథ్ తో తనకున్న అనుబంధాన్నేకాక, ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టతనూ వివరించారు. ఆలపాటి వారిని ఇన్నయ్య గారు ‘రాయని భాస్కరుడు’ అనడం బావుంది. తాను రాయకుండానే ఎందఱో రచయితలకు వారికవసరమైన గ్రంథాలు సమకూర్చి, వారిని ప్రోత్సహించి, వారిచే రచనలు చేయిస్తూ ఆయన తెనాలిలో నడిపిన ‘జ్యోతి’, ‘రేరాణి’, ‘కినిమా’ పత్రికల నిర్వహణ గురించి చక్కగా వివరించారు. తరచు మదరాసు వెళ్లి వస్తూ, అక్కడి నుంచి తెచ్చి చదివే విదేశీ సాహిత్యం ప్రభావం, పలువురు సాహితీవేత్తలతో ఏర్పడిన సన్నిహిత పరిచయాల ప్రభావం, యం.యన్.రాయ్ సిద్ధాంతాల ప్రభావం కారణంగా రవీంద్రనాథ్ లో క్రమంగా వచ్చిన బౌద్ధిక పరిణామాన్ని చక్కగా వివరించారు. త్రిపురనేని రామస్వామి, కావూరి గోపదేవ్, అబ్బూరి రామకృష్ణరావు, త్రిపురనేని గోపీచంద్, జి.వి.కృష్ణారావు మొదలైనవారి భావాలతో ప్రభావితుడై, ఆయనలో వెల్లివిరిసిన భావ పరిమళం పత్రికానిర్వహణలో ఆయనకు ఎలా మార్గదర్శనం చేసిందో వివరించారు. అప్పట్లో వారు నడిపిన ‘జ్యోతి’ పత్రికలో తమ రచనలు వస్తే చాలుననుకునేవారట రచయితలంతా. కొత్త కోణంలో నడుపబడ్డ ‘జ్యోతి’ పత్రికలో అప్పట్లో సుప్రసిద్ధ రచయితలు కొడవటిగంటి, చలంల రచనలు తరచు వచ్చేవట. గోవిందరాజుల సుబ్బారావు, డి.వి.నరసరాజు, సీనియర్ కృష్ణవేణి, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ ఆలపాటి ‘కినిమా’ పత్రిక నిర్వహించేవారనీ, ఆ పత్రిక సినిమాలను మానవీయ విలువలతో అంచనా కట్టేందుకు ఉద్దేశించే నడిపారని పేర్కొన్నారు. హెన్రీ హావ్ లాక్ ఎల్లిస్ (1859-1939) అనే ప్రముఖ బ్రిటీష్ వైద్యుడు, మనస్తత్త్వ శాస్త్రవేత్త 1933 లో రాసిన ‘సైకాలజీ ఆఫ్ సెక్స్’ అనే గ్రంథం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఏడు సంపుటాల ఆ గ్రంథాన్ని రవీంద్రనాథ్ లండన్ నుంచి తెప్పించారు. ఆ గ్రంథాన్నీ మరికొన్ని శాస్త్రీయ సెక్స్ రచనలను ప్రామాణికంగా తీసుకుని, వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో ఆలపాటివారు చదువరుల సెక్స్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు సూచించే ‘రేరాణి’ పత్రిక నడిపారు. ఆ పత్రిక ఎప్పుడెప్పుడు వస్తుందా– అని అందరూ ఎదురుతెన్నులు చూసేవారంటే ఆ పత్రిక ఎంత శాస్త్రీయంగా నడపబడిందో అర్థం చేసుకోవచ్చు. ఆలపాటి వారే ధనికొండ హనుమంతరావు గారితో ‘అభిసారిక’ పత్రికను కూడా నడిపించడం మరొక విశేషమని పేర్కొన్నారు ఇన్నయ్యగారు. రవీంద్రనాథ్ నిర్భయ స్వభావానికి మచ్చుతునకగా ఒక ఘటనను పేర్కొన్నారాయన. కీ.శే. నార్ల వెంకటేశ్వర రావు మదరాసు నుంచి ‘ఆంధ్ర ప్రభ’లో తన సంపాదకీయాలతో ఉర్రూతలూగిస్తున్న కాలంలో తనకు నచ్చని ఒకానొక సంపాదకీయాన్ని’జ్యోతి’లో కార్టూన్ వేసి మరీ తీవ్ర విమర్శ చేసి సంచలనం సృష్టించారట ఆయన. తెనాలి తాలూకా కూచిపూడిలో తరచు రవీంద్రనాథ్ నిర్వహించిన సాహితీప్రియుల రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒకపక్క తాను స్వయంగా టెన్నిస్, కారమ్స్ వంటి క్రీడలు ఆడుతూ, మరోపక్క క్రీడల్లో ప్రతిభ కలిగిన ఇతరులకు ఆయన ఇచ్చిన సహకార, ప్రోత్సాహాలు సోదాహరణంగా వివరించారు ఇన్నయ్య గారు. 1990 లో హైదరాబాద్ కి మకాం మార్చిన ఆలపాటివారికి హైకోర్టు జడ్జీలు, ప్రముఖ విద్యావేత్తలు, కవులు, రాజకీయవేత్తలతో ఏర్పడిన నిత్య సంబంధాలు వివరించి, ఏ కారణంగా నలభై ఏళ్ళ విరామం తర్వాత ఆయన పత్రికా నిర్వహణ తిరిగి చేపట్టారో, ‘మిసిమి’ విశిష్టత ఏమిటో, దానికాయన హోల్ టైం సంపాదకునిగా చేసిన కృషి ఏమిటో అందరినీ ఆకట్టుకునే విధంగా వివరించారు ఈ వ్యాసంలో ఇన్నయ్యగారు.

‘హిందూయిజం-ఒక పరిశీలన’ పేరుతో ఇన్నయ్య నాలుగు వ్యాసాలు రాశారు. వీటిలో ఆయన లోతైన పరిశీలనతో పాటు వారి చారిత్రక దృష్టి చదువరులు గ్రహించగలరు. భారతదేశంలోని ద్రావిడ నాగరికత మధ్యధరా ప్రాంతం నుంచి వ్యాప్తి చెందిన ప్రజల నాగరికతేననీ, ఆర్యులు ఋగ్వేద రచన తమ దండయాత్రకు ముందుగా కొంత చేసినా, అందులో చాలా భాగం దండయాత్ర అనంతరమే చేశారని పేర్కొన్నారు. ఇదికూడా చారిత్రకంగా సబబైన అభిప్రాయమే. కొందరు అసలు ఆర్యులు బయటినుంచి వచ్చినవారు కాదనీ, వారి స్వస్థలం భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలోని సప్త సింధు లోయ అనీ, ఆర్య సంస్కృతి అక్కడినుంచే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపించిందని నిరాధారంగా వాదిస్తారు. కాని, ఆధునిక శాస్త్ర పరిశోధనలు ఆస్ట్‌రియ, బవేరియాలలోని ఆల్ప్‌స్ పర్వత శ్రేణుల ప్రాంతాలనుంచి తమ పశువులకు పచ్చిక మైదానాల కోసం ఆర్యులు (నీలి కళ్ళ నార్డిక్ జాతీయులు) గుంపులు గుంపులుగా క్రమంగా తూర్పు దిశగా విస్తరిస్తూ, తమ సంస్కృతిని వ్యాపింపజేస్తూ, అక్కడక్కడా కొంతకాలం పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ, మెల్లమెల్లగా ముందుకు సాగి, మెసపొటేమియా,హిట్టైట్,సిరియా, పాలస్తీనా, పర్షియాల మీదుగా భారత దేశపు వాయవ్య ప్రాంతానికి వచ్చారని నిర్ధారించాయి. వారు మన వాయవ్య సరిహద్దులో వేసవిలో మంచు కరిగినప్పుడు(మిగిలిన కాలాల్లో దుర్గమమైన) ఖైబర్,బోలన్, టోచి, ఖుర్రం, గోమాల్, ఖోజక్, కారకోరం మొదలగు కనుమల గుండా ప్రవేశించి సప్త సింధు లోయలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారని శాస్త్రీయంగా నిర్ధారించబడింది. నార్డిక్ జాతి మూలాలు కలిగిన జర్మన్ నియంత హిట్లర్ అందుకే తామే ప్రపంచంలో అసలు సిసలైన ఆర్యులమని భావించి, నాజీ పార్టీ చిహ్నంగా తమ జెండాలపై స్వస్తిక్ గుర్తును వాడాడు. బైబిల్ పాత నిబంధనావళి ప్రకారం ఈ నార్డిక్ జాతీయులు జాకబ్ రెండవ కుమారుడు సిమియోన్ (రూబేన్ తమ్ముడు) సంతానమట. భాషా శాస్త్రవేత్తలు తేల్చినదేమంటే – నార్డిక్ జాతీయులు (ఆర్యులు) భారత దేశంలో అడుగిడేకంటే చాలాకాలం ముందే సంస్కృత భాషను రూపొందించుకుని, ఋగ్వేదంలో కొంత భాగం అప్పటికే రచించారనీ, సప్త సింధు లోయలో వారి భాష మరింతగా సంస్కరించబడడం, ఋగ్వేద రచన పూర్తిచేయబడడం జరిగాయనీనూ. వేద మంత్రాలలో, ప్రార్థనలలో ధాన్యం, పశువులు, కండపుష్టి, ధైర్యశాలి అయిన పుత్రుడు కలగాలని, రోగం రాకూడదని ఇలా పదార్థ అవసరాలే ప్రస్తావనకు వచ్చాయిగానీ, స్వర్గం, అలౌకికాల ప్రస్తావన లేదనీ, వాటి ప్రస్తావన ఉపనిషత్తులలో హెచ్చుగా ఉన్నదనీ పేర్కొన్నారు. వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమ ధర్మాలు ఆర్యులు ఆర్యేతర సంస్కృతి నుండి గ్రహించారనీ, వేద ప్రజలు వేదేతరుల్ని తమ ఆధిపత్యం కిందికి తీసుకురావడంలో మతాన్ని అడ్డం పెట్టుకున్నారనీ, వ్యవసాయం, చేతి వృత్తులు, అగ్రవర్ణాల సేవ శూద్రుడికి విదులుగా నిర్ణయించి, శ్రమ ఫలితాన్ని మాత్రం వారికి దక్కనివ్వకుండా వారిని కొల్లగొట్టారనీ ఇన్నయ్యగారు చేసిన నిర్ధారణలు అక్షర సత్యాలు. ఆర్ధిక సంబంధాలలో, శిక్షాస్మృతిలో శూద్రులు, ఇతర నిమ్న కులాల పట్ల వైదిక సమాజంలో ఎంతటి దుర్మార్గపు వివక్ష ఉండేదో చక్కగా వివరించారాయన.

‘మానవేంద్రనాథ్ రాయ్ ఆలోచనలు నేటికీ అక్కరకు వస్తాయా ?’ అన్న వ్యాసం చదివితే యమ్.యన్.రాయ్ అంటే ఎవరో తెలియనివారికి కూడా ఆయన భావాలేమిటో స్పష్టంగా అర్థమౌతాయి. మనం మానవవాదాన్ని పెంపొందించుకుంటూ, ఆధునిక వైజ్ఞానిక, శాస్త్రీయ ఫలితాలు అన్వయించుకుంటూ ముందుకుసాగాలనీ, సెక్యులర్, హేతువాద ఆలోచనల ఆవశ్యకత ఎంతైనా ఉందనీ, నిత్యనూతనంగా ముందుకు సాగాలేగానీ, దేనినీ మూఢంగా నమ్మి, ఆరాధిస్తూ ఆగిపోకూడదనీ రాయ్ సమాజానికి సందేశం ఇచ్చారన్నారు. దేనినైనా ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మే, అనుసరించే తత్త్వం వల్ల సామాజిక ప్రగతి కుంటుపడుతుందనీ, అలాంటి తత్త్వం తొలగిపోవాలంటే చిన్నతనం నుండి ప్రశ్నించే ధోరణి, స్వేచ్ఛగా ఆలోచన చేసే పద్ధతి ప్రోత్సహించాలని ఎమ్.యన్.రాయ్ పదే పదే చెప్పేవారని పేర్కొంటూ ఇన్నయ్యగారు ఆచరణలో కష్టసాధ్యమైనా అది నేటికీ అక్కరకు వచ్చే ఆలోచనేనంటారు. సమాజానికి కుటుంబ నియంత్రణ అవసరమన్న రాయ్ భావన ఆలపాటి రవీంద్రనాథ్ వంటి ఎందరిపైనో ప్రభావం నెరపిందన్నారు. మానవ విలువలు అమలుపరచాలని కోరుతూ, పలుమార్లు ఆ విషయం పై రాయ్ విస్తృత చర్చలు నిర్వహించినా, చాలా సందర్భాల్లో వివిధ మతాలు ఆయన ఆలోచనలకు అడ్డుపడుతూవచ్చాయన్నారు. అంతర్జాతీయంగా ఐక్య రాజ్య సమితి మానవ హక్కులు, విలువలు ఆమోదించినా, నేటికీ వివిధ మతాలు అవి అమలు జరగకుండా అడ్డుపడుతున్నాయన్నారు. కనుకనే రాయ్ తాత్త్విక ఆలోచనలు నేటికీ ఎంతో అవసరమనిపిస్తాయంటారు ఇన్నయ్యగారు. ‘రాయ్’ అనే హిందీ పదానికి రాజు అనే అర్థంతో పాటు ‘సమ్మతి తెలుపుతూ వేసే ఓటు’, ‘రాజీ పడడం’ అనే అర్థాలూ ఉన్నాయి. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీలేని పోరాటం జరిపిన మహోన్నత వ్యక్తి పేరు’ రాయ్’ కావడం యాదృచ్చిక విశేషం!

‘చరిత్ర హీనులు – శాంతిదేవి’ అన్న చక్కటి వ్యాసంలో ఎమ్.యన్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ ట్రెంట్ దయనీయమైన జీవిత గాథను ఇన్నయ్యగారు చాలా ఆకర్షణీయంగా రక్తి కట్టించారు. ఈ వ్యాసాన్ని ‘హేతువాది ఎమ్.ఎన్.రాయ్ ఇలా చేశాడా?’ అన్న వ్యాసంతో కలిపి చదువుకోవాలి. ఈ రెండు వ్యాసాల్లో చాలా మందికి తెలియని రాయ్ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. మొదటి ప్రపంచయుద్ధకాలంలో అమెరికా వెళ్ళిన రాయ్ కి అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని ఎవిలిన్ తో పరిచయం కావడం, వారి తొలి పరిచయం ప్రేమగా మారి, ఎవిలిన్ తన తల్లిదండ్రుల్ని ధిక్కరించి రాయ్ ని పెళ్ళాడడం, ఆ విశ్వవిద్యాలయానికి చెందిన భారతీయుడు ధనగోపాల్ అప్పటివరకు నరేంద్రనాథ భట్టాచార్యగా ఉన్న ఆయన పేరును మానవేంద్రనాథ రాయ్ గా మార్చుకొమ్మని సలహా ఇవ్వడం, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో, ప్రత్యేకించి బ్రిటిష్ ఇండియాలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో ఆ దంపతులు అనుభవించిన బాధలు, ఎవిలిన్’ శాంతిదేవి’అనే కలం పేరుతో భారతీయ పత్రికలలో వ్యాసాలు రాయడం, కారణం తెలియకుండా వారు ఇరువురు విడిపోవడం, రాయ్ 1938లో ఎలెన్ అనే జర్మన్ యువతిని రెండవ పెళ్ళిచేసుకున్న తరువాత అప్పటివరకూ రాయ్ నుంచి పిలుపు వస్తుందని ఆశగా అమెరికాలో ఎదురుతెన్నులు చూసిన ఎవిలిన్ తప్పని పరిస్థితులలో 1940 లో డెవిట్ అనే ఆయన్ని పెళ్లి చేసుకోవడం, 1949 లో డెవిట్ చనిపోవడం, 1955 లో రాయ్ చనిపోయినప్పుడు కలకత్తా నగరాన్నుంచి ప్రచురింపబడిన ‘రాడికల్ కమ్యూనిస్ట్’ అనే పత్రికలో ఎవిలిన్ రాయ్ మృతికి సంతాప సందేశాన్ని ప్రకటించడం — ఈ వ్యాసం అంతా ఒక చక్కటి నవలలా సాగిపోతూ, ఇన్నయ్యగారి రచనా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది.

‘మేధావిగా సంజీవదేవ్’ అనే వ్యాసంలో రచయిత ఒక చక్కటి నిర్ధారణ చేశారు. అది నాకు బాగా నచ్చింది. అదేమిటంటే — విజ్ఞాన శాస్త్రం తనకు అన్నీ తెలుసని అనడం లేదు. పరిపూర్ణత సాధించాననీ ఎన్నడూ చెప్పదు. తెలిసినంతవరకు నిర్ధారణగా పేర్కొని, తెలియనిదానిని పరిశోధిస్తున్నది. తెలియని రంగంలో కూడా శాస్త్రీయంగా రుజువుపరచగల ఆధారాలు లేకుండానే, నిర్ధారణగా సత్యమని బుకాయిస్తూ చెబుతున్నాయి– మతం, నమ్మకాలు, జ్యోతిషం వగైరాలు. ఈ రెంటి మధ్య గల తేడా గమనిస్తే చాలు- మనకి ఏది శాస్త్రీయ ఆలోచనా ధోరణి ఏది కాదు అనే విషయం అర్థమైపోతుంది.

‘నవ్యమానవుడు ఎరిక్ ఫ్రామ్’, ‘సాంస్కృతిక పునరుజ్జీవనం- రావిపూడి వెంకటాద్రి’, వ్యాసాలు ఆ ప్రముఖుల వ్యక్తిత్వ చిత్రణలు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు చెందిన పీటర్ సింగర్ అనే నైతిక తత్త్వవేత్త మీద రాసిన వ్యాసం చదువరులను బాగా ఆకట్టుకుంటుంది. ‘నేను ఎందుకు క్రిస్టియన్ ను కాదు?’ అనే వ్యాసం రాసిన ప్రముఖ బ్రిటిష్ తత్త్వవేత్త బెర్ట్రాండ్ రసెల్ పైన రాసిన వ్యాసం, ‘నేను ముస్లిం ను ఎందుకు కాదు?’ అన్న గ్రంథం రాసిన ఇబ్న్ వరాక్ గురించిన వ్యాసం, ఈ వ్యాస సంపుటికే అలంకారప్రాయాలనదగిన వ్యాసాలు. పునర్జన్మలు, ఇంద్రియాతీత శక్తులని చెప్పే బూటకపు కబుర్ల గుట్టు రట్టు చేసే వ్యాసాలూ బాగున్నాయి. ఆస్ట్రియాకు చెందిన తాత్త్వికుడు లుడ్విగ్ విట్గెన్ స్టీన్ పై రాసిన వ్యాసం, స్పినోజా, లెబ్నిజ్, డేకార్ట్ ల తాత్త్విక సిద్ధాంతాలను వివరించే వ్యాసాలు కూడా చదువరులను ఆలోచింపజేస్తాయి. ‘ఈనాటిదా రాజకీయాల్లో కాలుష్యం ?’ వ్యాసం స్వాతంత్ర్యోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీలోని కుళ్ళు సంస్కృతిని చక్కగా బహిర్గతం చేసింది. ‘పోస్ట్ మోడర్నిజం’ పై రాసిన వ్యాసం, ‘ప్రకృతి-సైన్సు’, ‘నేటి తాత్త్విక విమర్శలు-ధోరణులు’ వ్యాసాలూ కూడా బాగానే ఉన్నాయి.

మరో విషయం. కొందరికి సుభాస్ చంద్ర బోస్ ని గురించి, ఆయన అజ్ఞాత జీవితాన్ని గురించి, అభూత కల్పనలు, ఉన్నవీ లేనివీ రాసెయ్యడం హాబీగా మారింది . ఇటీవల పరిశోధనల పేరుతో అది మరీ ఎక్కువయింది. ఏదిపడితే అది రాయడానికి ఇష్టపడని ఇన్నయ్యగారు సైతం ‘సుభాస్ చంద్ర బోస్ గెలిస్తే దేశం ఏమయ్యేది ?’ శీర్షికతో 32 పేజీల పెద్ద వ్యాసం రాశారు. ఈ పుస్తకంలో మొదటి వ్యాసమే అది. ఆ వ్యాసంలో ఆయన ఇలా పేర్కొన్నారు– ‘అయితే ఇటీవల విదేశాలలో బోసు పాత్ర గురించి ఆధారాలతో కూడిన సమాచారాన్ని పరిశోధించి వెలువడిన కొన్ని సిద్ధాంత గ్రంథాలు మనకెంతో ఉపకరిస్తున్నాయి.’ కాని ఎక్కడా ఆధార గ్రంథాల ప్రస్తావనే లేదు. ఇదే గ్రంథంలోని కొన్ని వ్యాసాల చివరలో ఆధార గ్రంథాల జాబితా చక్కగా ఇచ్చిన రచయిత మరి ఏ కారణంగానో ఈ వ్యాసానికి చివర మాత్రం అలాంటి గ్రంథాల జాబితా ఏదీ ఇవ్వ లేదు. ఇచ్చి ఉంటే ఉపయుక్తంగా ఉండేది.

‘మూఢ నమ్మకాలు: ఆవు-ఆయుర్వేదం’ వ్యాసం మరీ సంక్షిప్తంగా (పేజీన్నర మాత్రమే) ఉంది. ఇది వ్యాసాలన్నిట్లో కీ చిన్నది. వ్యవసాయ, పశుపాలక సంస్కృతి ప్రధానంగాకల ప్రాచీన భారత దేశంలో యజ్ఞాల సందర్భంగా గోవుల్నికూడా అడపాదడపా బలి ఇచ్చినా, ప్రజలు దాన్ని పవిత్రంగా, పూజనీయంగా భావించడమే ఎక్కువ. అలనాటి భారతీయ సంస్కృతిలో ఆవు పాలే కాక, గోమయము (ఆవు పేడ), గోమూత్రము మొదలైన ఆవుకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఎంతో విలువనిచ్చేవారు. వాటికి కూడా వైద్యపరమైన ప్రయోజనాలున్నట్లు శాస్త్ర పరిశోధనలు నిగ్గుదేల్చాయి. కేవలం ఆవు మాంసమేకాదు. పలు ఇతర జంతువులు, పక్షుల మాంసాలకు కూడా ఆయుర్వేదంలో వైద్యపరమైన ప్రయో జనాలున్నాయి. అయితే వాటి పరిరక్షణకు వన్యప్రాణి పరిరక్షణ చట్టాలున్నాయి. ఆవును కూడా అంతరించిపోతున్న జీవజాతిగానూ, భారత జాతి వారసత్వ సంపదగానూ భావించి మనం పరిరక్షించుకోవలసిన దుస్థితి త్వరలోనే దాపురించబోతున్నది. కరవుకాటకాల్లో నశించి పోయేవి పోగా మిగిలినవి మేత దొరకని కారణంగా పేదరైతుకు తలకు మించిన భారమై క్రమంగా కసాయి కమేలా (కబేళా)ల పాలవుతున్నాయి. ‘అల్ కబీర్’ వంటి యాంత్రిక వధ్యశాలల ఆగమనంతో గోసంపద త్వరత్వరగా అంతరించి పోతున్నది. ఆవు మాంసానికి వైద్య పరంగా ప్రయోజనాలున్నాయని కాదు; ఆ మాంసం రుచి కారణంగానే గోవధ పెరిగిపోయింది. కోళ్ళ లాగా ఆవులను కూడా పెద్దఎత్తున కృత్రిమంగా పునరుత్పత్తి చేయగల అవకాశాలుంటే గోవులను కూడా అడ్డులేకుండా వధించినా తప్పులేదేమోగానీ, ప్రమాదపుటంచుకు చేరుకున్న జీవజాతుల (Endangered Species) లోకి అతి త్వరలో ప్రవేశించనున్న ఆవు జాతిని జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగానైనా పరిరక్షించుకొనాల్సిన అవసరం ఉంది కదా! ఈ అంశాలన్నీ కూడా ఆ వ్యాసంలో చర్చిస్తే బాగుండేదని భావిస్తాను.

ఇక చివరిగా ‘షష్టిపూర్తి చేసుకున్న కమ్యూనిజంలో లెనిన్ పాత్ర’ వ్యాసంలో ‘లెనిన్ కొందరికి ప్రజాస్వామ్యవాది కాగా, చరిత్రలో నిజాలు తెలిసినవారికి 20వ శతాబ్దపు నరహంతకులలో ఆద్యుడు’ అని పేర్కొన్నారు రచయిత. విప్లవాలు భౌతిక పరిస్థితులే తీసుకొస్తాయి కానీ, వ్యక్తులు తీసుకురారనేది మార్క్సిజం చెప్పే సిద్ధాంతమే. ఇన్నయ్యగారు పేర్కొన్నట్లు జరుగుతున్న సంఘటనల ఆధారంగా భౌతిక పరిస్థితులను చక్కగా సమయస్ఫూర్తితో అంచనా కట్టగలిగిన, సకాలంలో తగు చర్యలు తీసుకోగలిగిన సమర్థత కలిగిన నాయకుడు లెనిన్. ఇంకా అంతకన్నా కావలసినదేముంది? విప్లవ ప్రతీప శక్తులు ఏ విప్లవం లోనైనా బలికాక తప్పదు. అందరి బాగు కోరేవారు అందుకొరకు అవసరమైతే హింస చేసినా తప్పులేదనేది ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నదేకదా! స్వార్థ కాంక్షతో పొరుగు దేశాలపై యుద్ధాలు రుద్దిన, స్వదేశంలో ప్రజాభిప్రాయాన్ని తొక్కివేసిన హిట్లర్, ముసోలినీ, టోజో వంటి 20వ శతాబ్దపు నరహంతక నియంతల సరసన మహానేత లెనిన్ ను చేర్చడం ఎంతమాత్రం సబబు కాదు. ప్రజా సామాన్యాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసి, వారి జీవితాలను ఆనందమయం చేసే సోషలిస్టు వ్యవస్థను నిర్మించే క్రమంలో భాగంగా, ఆ విప్లవాగ్నికి ప్రతీఘాత శక్తులు సమిధల్లాగా మాడిపోక తప్పదు. అది పరిమితమైన, అనివార్యమైన హింస. దాన్ని నరహననం అనడమూ, లెనిన్ ని నరహంతకుడు అనడమూ తప్పు. ఇది నా అభిప్రాయం.

ఇలా రెండు మూడు వ్యాసాల్లో ఇన్నయ్యగారు వెలిబుచ్చిన అభిప్రాయాలపై నాకు కొద్దిగా భేదాభిప్రాయం ఉంటే ఉండవచ్చుగాక. అది పెద్దగా లెక్క చెయ్యాల్సింది కాదు. ఈ పుస్తకం ఆసాంతం చదివి నేను పొందిన ఆనందం ముందు అదెంతపాటి ? ఈ వ్యాసాలన్నీ జనబాహుళ్యం లోకి విస్తారంగా వెళ్ళాలి. వాటిలో ఇన్నయ్యగారు ప్రస్తావించిన పలు తాత్త్విక, సామాజిక, ఆర్థిక విషయాలపై జనసామాన్యంలో విస్తృతమైన చర్చ జరగాలి. అప్పుడే ప్రజలలో శాస్త్రీయ దృష్టి పెంపొంది, ప్రగతిశీలురంతా ఆశించే వ్యత్యస్తాలు లేని, హేతుబద్ధమైన, మతాతీతమైన, మానవీయ విలువలతో కూడిన సమాజం రూపుదిద్దుకుంటుంది.

ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు లేదా చదవవొచ్చు.

‘మిసిమి వ్యాసాలు’ పేజీలు 230, వెల: 125-00, ప్రతులకు – నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

వ్యాసకర్త పరిచయం:
ముత్తేవి రవీంద్రనాథ్ గారి ‘తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన’ అనే తొలి రచనకే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి “కావ్యనుశీలన కళా సమ్రాట్టు” అనే బిరుదుతోబాటు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు ‘శ్రమ వీరులు’ పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై ఓ పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ‘ మహాకవి శ్రీ శ్రీ – సిరి కథ’ అనే రచన చేశారు. ‘పాండురంగ మాహాత్మ్యము-పరిచయం’,’మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం’ వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన అంశాలపై పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్నది రవీంద్రనాథ్ గారికి.

***
(వ్యాసాన్ని అందజేసినందుకు సి.బి.రావు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

Leave a Reply