కాఫ్కా రచనలూ – మన కలలూ

(ఫ్రాంజ్ కాఫ్కా ప్రసిద్ధ నవల “ద ట్రయల్” కు తెలుగు అనువాదం “న్యాయ విచారణ”. అనువాదకుడు నశీర్ ఈ పుస్తకానికి రాసిన రచయిత పరిచయంలోనిది ఈ చిన్న భాగం. ఈ పుస్తకం కినిగె ద్వారా లభ్యం.)

***
కాఫ్కా రచనలన్నీ అతని జీవితానుభవాల నుంచి ఎదిగినవే అయినా, వాటిలో ఆ జాడల్ని పసిగట్టడం చాలా కష్టం. సీతాకోకలో దాని గొంగళి అంశను ఎంతమాత్రం చూడగలమో, ఆయన రచనల్లో ఆయన జీవితాన్నీ అంతే చూడగలం. అది పూర్తిగా మెటమార్ఫసిస్ (రూపాంతరం) పొందాకనే రచనల్లోకి వచ్చింది. అయితే కాఫ్కా ముందున్న రచయితలూ అదే కదా చేసింది? ఎవరైనా జీవిత పరిధి నుంచే కదా రచనల్ని సృష్టించేది? మరి కాఫ్కా వాళ్ళ కన్నా ఏ విధంగా భిన్నం?

వాళ్ళందరి విషయంలో ఈ రూపాంతరక్రియకు పూర్వ రూపమైన జీవితానికీ, పర రూపమైన రచనకూ కొంతైనా పోలిక చూపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు జీవితం ఎలాంటి రియాలిటీలో మసలుకుంటుందో దాన్నే రచనకు కూడా భూమికగా స్వీకరించారు. కాఫ్కా అలా చేయలేదు. తన జీవితానుభవాల్ని రచనగా మార్చేటప్పుడు రియాలిటీని భూమికగా స్వీకరించలేదు, వాటిని రియాలిటీతో ఏ మాత్రం సంబంధం లేని రూపంలోకి మార్చాడు; కలల్లోకి రూపాంతరం చెందించాడు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పీడకల్లోకి.

కాఫ్కా రచనాప్రక్రియ మన కలల నిర్మాణాన్ని ఫాలో అవుతుంది. మన కలల్లో ఒక ధోరణి ఉంటుంది. వాటిలో కనపడే వివరాలకూ, అవి కలగజేసే భావాలకూ పొంతన ఉండదు. కనపడే వివరాలతో ఏ మాత్రం సంబంధంలేని భావాలేవో కలుగుతాయి. ఉదాహరణకు, ఒక కలలో మనం చందమామని చూసి కూడా భయపడవచ్చు. మరి వాస్తవజీవితంలో ఆహ్లాదకారకమైన చందమామ కలలో భయకారకమెలా అయింది? అంటే, నిజానికి కాలేదు. కలలో మనకు భయం కలిగేది చందమామ ‘వల్ల’ కాదు, మనలో ఆల్రెడీ ఉన్న భయమే చందమామ మీదకూ ప్రసరించి దాన్ని కూడా భయావహం చేస్తుంది, అదే స్థానంలో మరే ఇతర అప్రమాదకర (benign) దృశ్యవివరాలున్నా కూడా — సూర్యాస్తమయం, చెట్టు మీద కాకులు, దగ్గరగా ఎగిరే విమానం — అలాంటి భయమే కలగవచ్చు. అంటే కల ఒక భావంతో మొదలవుతుంది, ఇక తర్వాత కలలో ఏ వివరాలు వచ్చి పడినా, అవి సదరు భావానికి ఎంత సంబంధం లేనివైనా, అవన్నీ ఆ భావాన్నే ప్రకటిస్తాయి. కాబట్టి, ఆ కలకు సంబంధించినంత వరకూ, వివరాల వల్ల భయం కాదు, భయం వల్ల వివరాలు. ఇక్కడ భయం ప్రేరేపిత భావం కాదు, ప్రేరేపక భావం.

ఇది ఒక్క భయం అనే భావానికే కాదు; ఆహ్లాదం, కామం, ఉద్వేగం, జుగుప్స ఇలా ఏ భావానికైనా వర్తిస్తుంది. కానీ కాఫ్కా జీవితాన్ని ప్రధానంగా నిర్దేశించిన ఏకైక భావం భయం: తండ్రి పట్ల భయం, ఆరోగ్యం పట్ల భయం, సెక్సువల్ ఇంటిమసీ పట్ల భయం, పెళ్ళి పట్ల భయం, చివరకు సాహిత్యం పట్ల కూడా భయమే. ఒకచోటైతే “the very impossibility of living” గురించి కూడా రాస్తాడు. కాఫ్కా ఉత్తరాల్లో ఎక్కువసార్లు కన్పించే పదం భయం (angst). కాఫ్కా కూడా తత్పూర్వ రచయితల్లా జీవితానుభవాల్నించే సృష్టించాడు నిజమే. కానీ జీవితానుభవాల్లో ఏ దృగ్గోచర అంశాన్నీ వాడుకోలేదు. అవి తనలో కలిగించిన భావాల్ని మాత్రం తీసుకున్నాడు, ఆ భావంతో మమేకమై, ఆ భావాన్ని తనలో నింపుకుని, రాయటం మొదలుపెట్టాడు. ఫలితంగా, అతను రాసింది ఏదైనా, అందులో తెచ్చిపెట్టిన వివరాలేమైనా, అవి మూలభావానికి ఎంత సంబంధం లేనివిగా పైకి కనిపించినా, ఆ భావం మాత్రం ఒక పారదర్శకపు పొరలా ఆ సృష్టి అంతటా పరుచుకుని ఉంటుంది. పాఠకుని మనసు ఆ భావాన్ని అనుభూతి చెందుతుంది, కానీ అతని బుద్ధికి మాత్రం ఆ భావానికీ, రచనలోని వివరాలకూ తార్కికమైన సంబంధమేమిటో అందదు. అచ్చంగా కలల్లోలాగానే. కానీ ఎంతైనా పుస్తకం అనేది ఒక కాంక్రీటు వాస్తవం. అందులోని అక్షరాలూ, వాక్యాలూ, వ్యాకరణం, వర్ణనలూ, సన్నివేశాలూ ఒక తార్కికమైన క్రమాన్నీ, భౌతికమైన ఉనికినీ కలిగి ఉంటాయి. పైగా కాఫ్కా మామూలు రియలిస్టు రచయితల కన్నా అత్యంత స్పష్టంగా తన కాల్పనిక ప్రపంచాల్ని తీర్చిదిద్దుతాడు. దాంతో అవి చూట్టానికి వాస్తవంలా అత్యంత స్పష్టంగానే ఉన్నా, వాటి అర్థం మాత్రం కలల్లోలా అలికేసినట్టు అస్పష్టంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ పాఠకుల్ని చిత్రమైన ఆకర్షణతో కట్టిపడేస్తుంది. వారికి పఠనానుభవం మెలకువలో కలగంటున్నట్టు తోస్తుంది. అందుకే ఈ రచనల్ని స్పష్టమైన కలలు (lucid dreams) అనవచ్చు. ఈ కారణం చేతనే, కాఫ్కా రచనల్ని ఆత్మకథాత్మకాలుగా పరిగణించి వాటి విలువని లెక్కగట్టలేం. కాఫ్కా జీవితాన్ని పూర్తిగా లెక్కలోంచి మినహాయించినా కూడా, అతని రచనలు వింత సౌందర్యంతో, సొంత సత్యంతో, సంపూర్ణ స్వతంత్రంతో మన్నుతాయి.

దీనికి “మెటమార్ఫసిస్” నవలికను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. “గ్రెగర్ జమ్‌జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్ర లేచి, తన మంచంపై తాను ఒక భారీ కీటకంగా మారిపోయి ఉండటాన్ని చూసుకున్నాడు” అనే వాక్యంతో మొదలవుతుందీ కథ. ఇక అక్కణ్ణించి ఈ కొత్త రూపంలో గ్రెగర్ జమ్‌జా తన రోజువారీ జీవితం గడిపేందుకు ఉద్యుక్తుడవటాన్నీ, అందులోని ప్రాక్టికల్ ఇబ్బందుల్నీ, కుటుంబ సభ్యుల్నించి ఎదురయ్యే చీదరనూ, తండ్రి చూపించే అసహ్యాన్నీ, చివరకు తండ్రి ఒక ఆపిల్‌తో కొట్టిన దెబ్బ తన (కీటకపు) పొట్టభాగంలో తగిలి అది అక్కడే కుళ్ళి పుండు లేవటాన్నీ, దాంతో రోజుల తరబడి క్షీణించటాన్నీ, చివరకు, కుటుంబ సభ్యులు ఊరటతో ఊపిరిపీల్చుకునేలా, అతను మరణించటాన్నీ… దీనంతట్నీ భీతి గొలిపే స్పష్టతతో చూపిస్తుంది. కాఫ్కా జీవించి ఉండగా ప్రచురితమైన రచనలన్నింటిలోకీ ఇదే ఎక్కువ ప్రసిద్ధి పొందింది. ఈ రచనతో సాహిత్యంలో మోడర్నిటీ ఆరంభమైందటారు. ఈ రచన మొదటి వాక్యంలో వ్యక్తమయ్యే సృజనాత్మక ధైర్యం ఎందరో రచయితల్ని ప్రేరేపించింది. దీన్ని ఫేస్‌వాల్యూతోనే స్వీకరించిన చాలా మంది రచయితలు, అప్పటిదాకా తమ కాళ్ళను కట్టి పడేసిన వాస్తవికతా శృంఖలాల్ని తొలగించుకుని, తమ అంతర్లోకాల్ని స్వాప్నిక పక్షాలపై సృజనాకాశంలోకి స్వేచ్ఛగా ఎగరవేశారు. కాగితం మీద ఏదైనా చేసే వీలుందనే ఎరుక వల్ల కలిగిన స్వేచ్ఛా భావమది.

కాఫ్కా ఈ రకంగా తనను ఎలా ప్రభావితం చేశాడో ప్రముఖ స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ ఇలా చెప్తాడు: “నా పదిహేడేళ్ళపుడు ‘మెటమార్ఫసిస్’ చదివాకా అనిపించింది, నేను రచయితను కాగలనని. ఆ రచనలో గ్రెగర్ జమ్‌జా ఒక ఉదయం నిద్ర లేచి భారీ కీటకంగా పరిణమించాడన్నది చదివాకా, నేను నాలో అనుకున్నాను, ‘ఇలా చేయవచ్చని నాకు తెలీదే, చేయగలిగినట్టయితే, నేను ఖచ్చితంగా కలం పట్టాల్సిందే.’ ” మార్కెజ్ ప్రసిద్ధ రచన “ఒన్ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సొలిట్యూడ్”లో వాస్తవికత నుంచి విముక్తి పొందిన ఇలాంటి స్వేచ్ఛే కనిపిస్తుంది. దీన్నే మాజిక్ రియలిజం అన్నారు. ఇంకా ఎన్నో సబ్ జాన్రాస్‌ని కూడా ఇలాంటి కథలతో ప్రభావితం చేశాడు కాఫ్కా. అన్నే రైస్ అనే రచయిత్రి తన వాంపైర్ల కథలకు కూడా కాఫ్కా “మెటమార్ఫసిస్‌”నే ప్రేరణగా పేర్కొంటుంది.

You Might Also Like

3 Comments

  1. varaprasad

    narration bavundi,purnima madum cheppina vishayam kooda tappanisariga patinchali

  2. chavakiran

    Thanks Purnima.
    The preview is limited to 10 to 15 pages by design. As first ~50 pages are about KAFKA, we thought it is better to give couple of pages from actual trial so that people will get to see both.
    This is translated from English. But translator followed three English translations to get the essence of original. We are writing another blog post explaining these details. Sorry for the delay.

  3. Purnima

    First things first, it’s heartening to see Kafka’s works in translation. I’ve no clue about the quality of this translation. Nevertheless, it’s an attempt worth appreciation.

    Niceties done, now onto other things.

    కినిగె.కాంలో ప్రివ్యూ డౌన్లోడ్ చేశాను. పది పేజీల పి.డి.ఎఫ్ అది! మూడో పేజిలో “శిలువ మోసిన రచయిత” అన్న ఒక వ్యాసం మొదలయ్యింది. అది ఐదో పేజిలో ముగుస్తుంది.. పూర్తి అయ్యా, అవ్వకుండానా? అన్నది తెలీదు. ఈ వ్యాసకర్త ఎవరూ అన్నది కూడా తెలీదు. ఆ వెంటనే వచ్చే పేజిలో చాప్టర్ 1 మొదలవుతుంది. కానీ ఆ పేజీ నెం. 52 అని కనిపిస్తుంది (పేజి చివర – పిడిఎఫ్ రీడర్ చూపించే నెం. వేరు!). అంటే, పేజి ఐదు నుండి యాభై ఒకటి వరకూ ఏముందో తెలీదు. 53, 54 పేజీలతో ప్రివ్యూ ముగుస్తుంది.

    మొదట ప్రివ్యూ చదివినప్పుడు “శిలువ మోసిన రచయిత” వ్యాసం ఐదు పేజీలతో అయిపోయిందనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రచురించిన భాగం ప్ర్తివ్యూలో చదివిన గుర్తు లేక, మళ్ళీ ప్రివ్యూ చూస్తే assume చేసుకోవాల్సి వచ్చిన విషయం, బహుశా ఆ పరిచయం వ్యాసమే యాభై పేజీల వరకూ ఉందని! లేదా రచయితను పరిచయం చేస్తూ ఒక వ్యాసం, రచనను పరిచయం చేస్తూ ఒక వ్యాసం, ఇంకేమన్నా ముందు మాటలూ, వెనుక మాటలూ ఉన్నాయేమో అని ఊహించుకోవాలా? Previewలో కనీసం Contents ఉండాలి కదా! ముఖ్యంగా రచనతో పాట్ఉ వేరే వ్యాసాలు ఉన్నప్పుడు!

    రచన మొత్తం ఎన్ని పేజీలు? అన్నది కూడా ప్రివ్యూలో కనిపించలేదు. లింక్ లో ఉంది, 370 pages అని.

    అనువాదం చేసినప్పుడు, అది ఏ భాష నుండి చేశారో కూడా తెలియాలి కదా. జర్మన్ నుండే తెలుగులోకి చేశారా? లేదా జర్మన్ నుండి ఇంగ్లీషులోకి అనువదించబడ్డదానికి తెలుగు తర్జుమా చేసినట్టైతే, ఆ ఆంగ్ల అనువాదం వివరాలు ఏంటి? అన్నది పాఠకుడికి తెలియనవసరం లేదా?

    No matter how humble a translator’s profile may be, a brief intro about him won’t hurt..right?

    నేనో రెండొందల రూపాయలు పెట్టి పుస్తకం కొనాలి, అంతకు మించి బోలెడు టైం దాని మీద వెచ్చించాలంటే నేనూ ఎంతో కొంత ఆలోచించుకుంటాను కదా! Still, I’m not complaining why all such basic info isn’t easily available to the reader. All I want to know the publishers is why they didn’t (and/or can’t) provide it, in first place.

Leave a Reply to Purnima Cancel