థ్రిల్లర్ మాయాజాలం James Hadley Chase – Miss Shumway Waves a Wand

ఈమధ్యే ఒకరోజున ఫేస్‌బుక్‌లో ఎవరో మిత్రుడు జేమ్స్ హాడ్లీ ఛేజ్ పేజీ లైక్ చేసినట్లు కనిపించింది. ఆ లింకు వెంటబడితే ఛేజ్ వికిపీడియా పేజీలో తేలాను. అమాంతంగా బోలెడు నోస్టాల్జియా కమ్ముకొచ్చింది. ఒకప్పుడు పిచ్చిగా చదివిన రచయిత, అమెరికా వచ్చాక దొరకనేలేదు.

పై సంఘటన జరిగిన వారంలోపే ఫ్లారిడాలో మిత్రుడు రఘుప్రసాద్ ఇంట్లో, రాత్రి అందరూ నిద్రపోయాక ఏమైనా చదువుకోటానికి దొరుకుతుందేమోనని అతని పుస్తకాల అలమర మీద దాడి చేస్తే, ఒకటి కాదు, రెండు ఛేజ్ పుస్తకాలు కనిపించాయి. హార్లెక్విన్ కంపెనీ వారు (అవును, రొమాన్సు పుస్తకాల ప్రచురణకర్తలే) 2009లో తమ అరవై వార్షికోత్సవ సందర్భంగా తాము మొదట్లో ప్రచురించిన మిస్టరీ నవలలు ఆరింటిని మళ్ళీ ప్రచురించారట. వాటిలో రెండు (I’ll Bury My Dead, You Never Know With Women) ఛేజ్ వ్రాసినవి. నాకుమల్లేనే ఛేజ్‌ని మిస్సైపోతున్న రఘు, పుస్తకాల షాపులో వాటిని చూడగానే కొనిపెట్టుకున్నాడు. ఆ పుస్తకాలు చూస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో జ్ఞాపకాల వరద.

నేను గుంటూరు మెడికల్ కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో (అంటే 1970లలో), గట్టిగా మాట్లాడితే అంతకు ముందు పదిహేనిరవయ్యేళ్ళ ముందునుంచీ, భారతదేశంలో బాగా ప్రాచుర్యం ఉన్న ఆంగ్ల రచయితల్లో జేమ్స్ హాడ్లీ ఛేజ్‌ది ప్రముఖ స్థానం అని చెప్పాలి. అగాథా క్రిస్టీ, ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్, ఆర్థర్ హెయిలీ, హెరాల్డ్ రాబిన్స్, ఇర్వింగ్ వాలెస్, ఆలిస్టైర్ మెక్లీన్, ఇయాన్ ఫ్లెమింగ్ వగైరాలకు కూడా మంచి ప్రాచుర్యం ఉండేది కాని ఛేజ్‌కే ఎక్కువ చదువరులు ఉండేవారని నా నమ్మకం. పుస్తకాల షాపుల్లో, రైల్వే బుక్‌స్టాల్స్‌లో ఛేజ్ పుస్తకాలు విరివిగా అమ్ముడుబోతూ ఉండేవి. చాలా ఛేజ్ పుస్తకాలు మా రోజుల్లో హిందీ సినిమాలుగా వచ్చి పెద్ద హిట్లు అయ్యాయి. విక్టోరియా 203 (అశోక్ కుమార్, ప్రాణ్, నవీన్ నిశ్చల్, సైరాబాను; తెలుగులో అందరూ దొంగలే పేర రిమేక్; There is a Hippie on the Highway), జోషీలా (దేవ్ ఆనంద్, హేమామాలిని; The Wary Transgressor), కష్మకష్ (ఫిరోజ్ ఖాన్, రేఖ Tiger by the Tail) నాకు గుర్తున్నాయి; ఇంకా సినిమాలు ఉన్నాయనే అనుకుంటాను.

నేను మొట్టమొదట చదివిన ఛేజ్ నవల The Way the Cookie Crumbles. పియూసి ఐపోయి మెడికల్ కాలేజ్‌లో చేరటానికి మధ్య రోజుల్లో బెజవాడలో మా చిన్నమామయ్య ఇంట్లో చదివాను (మా మేనమామలిద్దరూ ఇంగ్లీషు పుస్తకాలు తెగ చదివేవారు; నేను వాళ్ళ లైబ్రరీల్లోంచి చాలా పుస్తకాలు చదివాను). అప్పటివరకూ నేను చదివిన ఇంగ్లీషు నవలలన్నిటికన్నా భిన్నమైన పుస్తకం. అప్పటివరకు నేను చదివిన క్రైం నవలల్లో నేరం జరిగాక డిటెక్టివో, పోలీసు ఆఫీసరో, లాయరో ఆ నేరాన్ని పరిశోధించి నేరస్థులను పట్టుకొంటారు. ఈ పుస్తకంలో ముఖ్యాంశమేమిటంటే ఒక బ్యాంకు దోపిడీకోసం కొంతంమంది తెలివిగల దొంగలు ప్రణాళిక వేయటం. కథ మొదటినుంచీ చివరివరకూ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. నిజం చెప్పద్దూ, అప్పట్లో నా ఆంగ్ల పరిజ్ఞానం పరిమితంగానే ఉండేది. పల్లెటూళ్ళలో తెలుగు మీడియంలో చదువు. cookie అంటే ఏమిటోనే నాకు తెలీదు. ఇంకా the way the cookie crumbles గురించి ఇంకేం తెలుస్తుంది. పుస్తకం అయ్యాక, అదొక జాతీయం కాబోలు అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు సరిగా గుర్తులేదు కానీ, చాలా సంభాషణలు, వర్ణనలు పూరిగా అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఆ పుస్తకం ఛేజ్ మీద చాలా ఆసక్తి కలిగించింది.

గుంటూరు చేరాక ఛేజ్ పుస్తకాలు విరివిగా దొరికాయి. హాస్టల్లో చాలా ఛేజ్ పుస్తకాలు చలామణిలో ఉండేవి. అరండల్‌పేట మూడోలైన్లో అప్పట్లో కుమార్ బుక్ స్టాల్ అని ఒక ఇంగ్లీషు పుస్తకాలు అద్దెకు ఇచ్చే కొట్టు ఉండేది (దరిమిలా ఆ కుమార్ మెడికల్ పుస్తకాలు అమ్మటం మొదలుబెట్టాక, షాపు స్వరూపం మారిపోయింది). రోజుకు ఐదు పైసలు, వారానికి పావలా అద్దె అనుకొంటాను. అక్కడ కూడా ఛేజ్ పుస్తకాలు విరివిగా దొరికేవి. అప్పటికే ఛేజ్ దాదాపు ఎనభైదాకా పుస్తకాలు వ్రాసినట్లున్నాడు. ఇంకేమిటి చెప్పండి.

ఆ పుస్తకాల్లో కొన్ని మరీ విపరీతంగా అందరికీ నచ్చేవి. Why Pick on Me?, Just Another Sucker, No Orchids for Ms. Blandish, The Wary Transgressor, Come Easy Go Easy, Like a Hole in the Head వంటి పుస్తకాలు బాగా పాపులర్. అమెరికాలో నల్లవారి పౌరహక్కుల పోరాటం నేపథ్యంగా వ్రాసిన Cade, ఒక వేశ్యతో ప్రేమకథ Eve వంటి పుస్తకాలు మాత్రం అందరూ బోర్ అనేవారు.

ఛేజ్ పుస్తకాలు దాదాపు అన్నిటికీ కథాస్థలం అమెరికానే. అమెరికాలో పెద్ద నగరాల్లో నేరస్తుల ముఠాల్లో పని చేసేవారు ముఖ్యపాత్రలు. ఐతే అమెరికా వచ్చాక, కొత్త పాత పుస్తకాలషాపుల్లో, నాకు పరిచయమైన మిగతా అందరు ఆంగ్లరచయితల పుస్తకాలూ కనిపించేవి కానీ ఎక్కడా ఛేజ్ పుస్తకాలు కనిపించేవి కావు. నాకు అర్థం అయ్యేది కాదు. ఆ మొదటి రోజుల్లో పుస్తకాలషాపుల్లో బుక్స్ ఇన్ ప్రింట్ అని భారీ పుస్తకాలు ఉండేవి రిఫరెన్సు కోసమని. అందులో చూసిన ఒకావిడ ఆ పేరున్న రచయిత పుస్తకాలేమీ అమెరికాలో ప్రింట్‌లో లేవని తేల్చేసింది.

తర్వాతెప్పుడో తెలిసిందేమిటంటే, అసలు ఈ జేమ్స్ హాడ్లీ ఛేజ్ రచయిత అసలు పేరు కాదు. René Lodge Brabazon Raymond అనే ఆయన జేమ్స్ హాడ్లీ ఛేజ్ పేరుతో వ్రాసేవాడు (ఫొటోలో సిగరెట్టు తాగుతున్నాయన). బ్రిటిష్ రచయిత. అమెరికాని చూసి వ్రాసిన పుస్తకాలు కాదట ఇవి. ఆయన జీవితం మొత్తమ్మీద అమెరికా వచ్చింది రెండే సార్లట. స్నేహితులెవరో ఇచ్చిన అమెరికన్ శ్లాంగ్ డిక్షనరీని, కొన్ని వీథి మ్యాప్పులనీ ఎదురుగా పెట్టుకొని ఒక ఆరు వారాల్లో No Orchids for Miss Blandish అనే నవల రాస్తే అది బాగా అమ్ముడుబోయింది. అట్లా 1939లో మొదలుబెట్టి, ఇక ఆపకుండా 1984 వరకూ నవలలు వ్రాస్తూనే ఉన్నాడు. 1985లో మరణించాడు. ఇంగ్లండులోనే కాకుండా, చాలా దేశాల్లో ఆయనకు అభిమానులు ఉండేవారు, ముఖ్యంగా ఫ్రాన్సులో. ఐతే విచిత్రంగా ఆయన ఎప్పుడూ కూడా అమెరికాలో పాపులర్ కాదట. అందుచేత, ఆయన పుస్తకాలను అమెరికన్ పబ్లిషర్స్ ప్రచురించటం మానేశారు. దాంతో ఆయన పేరు అమెరికాలో దాదాపు అదృశ్యమయ్యింది.

ఏముంటుంది ఈ పుస్తకాల్లో, తెగచదువుతూంటావు అని అడిగిన స్నేహితుడు యార్లగడ్డ రమేష్‌బాబుకి ఛేజ్ పుస్తకాలలో ఉన్న నైతిక, మానసిక విశ్లేషణలగురించి క్లాసు పీకటం గుర్తొస్తే నవ్వొస్తుంది. చాలా ఛేజ్ పుస్తకాలలో హీరోలు బాగా ఆకర్షణీయంగా ఉన్న అమ్మాయిలతో ప్రేమలో పడి, వారికోసం తప్పుడుపనులు చేసి చిక్కుల్లో పడుతుంటారు. వాళ్ళు నిర్లక్ష్యం చేసిన సాదాగా ఉండే అమ్మాయిలు ఒకోసారి వాళ్ళను రక్షిస్తుంటారు. పక్కాగా ప్రణాళికలు వేసుకొని దోపిడీలు చేసిన నేరస్తులు వారి మానసిక వికలాల వల్ల చేతికి అందినది పోగొట్టుకొంటారు. కథల్లో పోలికలు ఉంటేనేం, కథనం మహా వేగవంతంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. శృంగారానికి పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదు.

ఫ్లారిడాలో రెండు ఛేజ్ పుస్తకాలు దొరికాయి అని చెప్పాను కదా. అవి అర్జెంటుగా చదివేసిన తర్వాత ఇంటర్నెట్‌లోకి వెళ్ళి ఛేజ్ పుస్తకాలకోసం వెదుకుతుంటే Miss Shumway Waves a Wand కనిపించింది. ఏదో రష్యన్ సైటులో ఉచిత డౌన్లోడ్ పిడీఎఫ్ ఫైలు కూడా దొరికేసింది. అసలు ఆ పుస్తకం పేరు చూడగానే పెదాల మీదకి ఒక చిరునవ్వు అప్రయత్నంగా వచ్చేసింది. ఛేజ్ వ్రాసిన పుస్తకాలలో Miss Shumway Waves a Wand విలక్షణమైన పుస్తకం. ఛేజ్ మిగతా పుస్తకాలకి, ఈ పుస్తకానికి పోలిక బాగా తక్కువ. అవటానికి కొంత సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఐనా, హాస్యం ప్రధానంగా వ్రాసిన పుస్తకం (రాబర్ట్ లడ్లం రోడ్ టూ… వరస పుస్తకాలలాగా అన్న మాట). కాలేజ్ రోజుల్లో ఎప్పుడైనా నవ్వుకోవాలనిపిస్తే ఈ నవల తెరిచి చదువుకునేవాణ్ణి. మెక్సికోలో ఇద్దరు బూట్‌పాలిష్ కుర్రాళ్ళు ఇద్దరు ముఖ్యపాత్రల్ని ఇబ్బంది పెట్టిన తీరు, క్లైమాక్సు బాగా నవ్వించేవి.

క్లుప్తంగా కథేమిటంటే హీరో రాస్ మిల్లన్ ఒక న్యూయార్క్ పత్రికకు మెక్సికోలో విలేఖరిగా పని చేస్తూ ఉంటాడు. మిస్ షమ్వే అనే యువతి మెక్సికోలో మాయమైపోయిందని తెలిసిన పత్రికాధిపతి, ఆమెను ఆచూకీ తీసే పనిని కథానాయకుడికి అప్పచెప్పుతాడు. ఆవిడని తిరిగి తీసుకొచ్చినవారికి పాతికవేల డాలర్లు బహుమానం అని ప్రకటిస్తాడు. ఆమెను ఎవరో కిడ్నాప్ చేసినట్లు, ఇంకెవరో రక్షించినట్లూ ఈ వార్తను సెన్సేషన్ చేసి కొన్నిరోజులు పేపర్లు బాగా అమ్ముకోవచ్చు అని ఆయన ప్రణాళిక. ఇక మన హీరో గారు రంగంలోకి దిగుతారు.

మిస్ షమ్వే (మైరా) అమాయకురాలేమీ కాదు. వీధినాటకాల్లో పనిచేసే తండ్రి దగ్గర మాజిక్ చేయడంలో మంచి ప్రావీణ్యం గడించింది. మనుషుల్ని బురిడీ కొట్టించటంలోనూ, వాళ్ళ జేబుల్ని కొట్టేయడంలోనూ ఆరితేరింది. మెక్సికోలో తిరుగుతూండగా ఆమెకు, పల్లె జనాలకు మాయ మందులమ్మి డబ్బులు చేసుకునే ఒక మాయడాక్టరు యాన్సెల్, అతని భీమ్ బాయ్ లాంటి అసిస్టెంటు శామ్ బోగుల్ తగిలారు. వారి జేబు కొట్టేసి ఉడాయించింది మైరా. వాళ్ళు ఆమె వెంటబడ్డారు. మైరాను పట్టుకుని ఒప్పగిస్తే బహుమతి ఉందని తెలుసుకున్న ఒక బందిపోటు దొంగల ముఠా కూడా ఆమె వెంటపడటం మొదలు పెట్టింది.

 

ఈ క్రమంలో రాస్, మైరా ప్రేమించుకుంటారు, డాక్టరు, భీమ్ బోయ్ లతో జట్టు కడతారు. ఒక స్థానిక ఆటవికుల గురువుద్వారా మైరాకు అనుకోకుండా కొన్ని మానవాతీత శక్తులు కలుగుతాయి. గాలిలోకి ఎగురగలుగుతుంది. ఎదుటివారి మాట కట్టేయిస్తుంది. ఒక విపత్కర పరిస్థితిలో, దొంగల ముఠా నాయకుడిని అనుకోకుండా ఒక మాంసపు ముద్దగా (సాసేజ్) మార్చేస్తుంది. ఆ మాంసపు ముక్కను తిన్న పెంపుడు కుక్క అమాంతంగా మనుషుల్లాగా మాట్లాడ్డం మొదలు బెడుతుంది. అందరూ కలసి న్యూయార్క్ చేరుకునేసరికి అక్కడ ఇంకెవరో అమ్మాయిని తీసుకొచ్చినవాళ్ళు వీరికన్నా ముందే బహుమతిని తీసేసుకున్నారు. ఒక నేరస్థుల ముఠా వీరి వెంటబడి వీళ్ళను చంపాలని చూస్తుంటే, పోలీసులేమో వీరిని ఒక హత్య కేసులో ముద్దాయిలుగా భావించి వేటాడటం మొదలుబెడతారు. మాట్లాడే కుక్క గురించి, గాల్లో ఎగిరే అమ్మాయి గురించి రాస్ ఎవరికి చెప్పినా, వాళ్ళు అతనికి మతి భ్రమించింది అనుకుంటారు. ఈలోపు మైరాను పోలిన ఇంకో అమ్మాయి చెడ్డ పనులు చేస్తూంటుంది. చాలా గందరగోళం, మాయాజాలం తర్వాత కథ సుఖాంతమౌతుంది.

ఇప్పుడుకూడా కొన్ని సంభాషణలు, సన్నివేశాలు నవ్వించాయి. పుస్తకం సరదాగా చదివేసుకోవచ్చు. కథనం వడిగానే ఉంది కాని, చిన్నప్పుడు ఉన్నంత సస్పెన్స్, థ్రిల్ ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో కనిపించని చాలా లొసుగులు కథనంలో ఇప్పుడు కనిపించటం కారణం కావచ్చు. ఇది ఛేజ్ తొలి పుస్తకాలలో ఒకటి. 1944లో మొదటి ప్రచురణ. అప్పటికి ఇంకా పది పుస్తకాలు కూడా వ్రాసినట్లు లేడు. మరి ఈ ధోరణిలో మరిన్ని హాస్య పుస్తకాలు ఎందుకు రాయలేదో?

ఛేజ్‌కి అంతర్జాతీయంగా ఎంత ప్రాచుర్యం ఉందో, ఈ పుస్తకం ఎన్ని ఎడిషన్లు వచ్చిందో, ఇక్కడ ఇచ్చిన ముఖచిత్రాలు చూస్తే తెలుస్తుంది. ఈ ముఖచిత్రాల మీద ఛేజ్ పేరు వ్రాసే విధానం ప్రతి కొన్ని సంవత్సరాలకూ మారుతూ ఉండేది.

నాకు దొరికిన పిడీఎఫ్ ఫైలు పుస్తకం స్కాన్ చేసి OCR చేసినట్లుంది. అక్కడక్కడా కొన్ని అచ్చుతప్పులు కనిపించాయి. కొన్ని ఛేజ్ పుస్తకాలు ఇంకా మార్కెట్లో దొరుకుతున్నా, ఈ పుస్తకం మార్కెట్లో ఉన్నట్లు లేదు.

ఎప్పుడన్నా వీలు చేసుకుని The Way the Cookie Crumbles వెతికి పట్టుకొని చదవాలి.

__

Miss Shumway Waves a Wand
James Hadley Chase
1944
204 pages

 

 

 

 

 

 

 

 

 

You Might Also Like

9 Comments

  1. Sri Harsha Chunduri

    http://gen.lib.rus.ec/foreignfiction/index.php?s=Chase,%20James%20Hadley&f_lang=0&f_columns=2&f_group=1.మీరు జేమ్స్ హాడ్లీ చేజ్ పుస్తకాలు పై లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచు

  2. manjari lakshmi

    “The Way The Cookie Crumbles” ante emitee?

    1. Jampala Chowdary

      Please see http://www.urbandictionary.com/define.php?defid=690293&term=that's+the+way+the+cookie+crumbles.
      You will find several definitions. In short, it means, I don’t have much control what happens. Things happen the way they do. ఎట్లా జరగాలని ఉంటే అట్లా జరుగుతుంది.
      You already may know this, but just to be complete, what we used to call biscuits back home, are called cookies in US. http://en.wikipedia.org/wiki/Cookie

  3. కనిష్ట

    I’ll Bury My Dead, Like a Hole in the Head పుస్తకాలు నేను చదివా, సమయం మర్చి పోయి తెల్లారిపోయింది రెండ్రోజులూ. ఈ రచయిత పుస్తకం చదివిన తర్వాత నాకో భావన కలుగుతుంది కొన్ని క్షణాల పాటు. మనం జీవిస్తున్నదేనా జీవితం అంటే, ఇలాంటి మనుషులూ ఉంటారా, అసలు జీవితం అంటే ఏంటి… ఇలా ఎన్నో. అదే సమయంలో మిత్రులు, బంధువులు జ్ఞాపకం వస్తారు. వీళ్లంతా మనతో నటిస్తున్నారా, నిజంగానే స్నేహంగా ఉన్నారా… ఇలా సవాలక్షా ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ పుస్తకం ప్రభావం మనిషిపై ఎంతా గాఢంగా ఉంటుందో చెప్పడానికి. మార్గాలు వేరవ్వొచ్చు, రాసే అంశమే వేరవ్వొచ్చు అయితే పుస్తకం మూయకుండా పూర్తి గా చదవాలనే కుతూహలాన్ని కలిగించే రచనలు చేసిన ఉద్ధండులూ మన రచయితల్లో ఉన్నారు. వారు విశ్వనాధ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, రాణి శివశంకర శర్మ…

  4. Ramana Murthy

    ఈ పుస్తకం పిడిఎఫ్ రూపంలో నా దగ్గర ఉంది. పంపిద్దామంటే మీ ఈమెయిల్ అడ్రస్సే దొరకలేదు.
    – రమణ మూర్తి
    mailavr@gmail.com

    1. Jampala Chowdary

      Ramanamurthy gaaru:

      Thank you.
      If you were referring to Miss Shumway…, I wrote the note in pustakam after reading a pdf copy on the net. Actually I gave a link to the pdf in that article.

      If you were referring to The Way The Cookie Crumbles, Sri Atluri was kind enough to send me a pdf copy. Even after all these years, it was still not put-downable.

  5. varaprasad

    20 years back chase books telugulo anuvadhamchesaru,appatlo 20to30 books chadivanu rent bookshoplo,malli innallaku chowdarygaru chase nu gurtu chesi aarojulu gurtuchesaaru.

    1. Madiraju Venkateswara Rao

      Chala bagundi. Ee blog chain chaduvutunte paatha rojulu gurthukuvachayi. Mid 70’s lo hyderabad ashoknagar loni city central library lo James Hadley chase novels telugulo hard bound editions dadapu 20-30 andubatlo vuncharu. Gunturu lo antaku munde available chase books English versions anny chadivina telugu lo chadavatam manchi thrill itchindi. Chala santoshamuga vundi. Pustakam.net publishers ki, ee blog lo post chesina mitrulandariki naa dhanyavadaalu.

  6. C V R Mohan

    నాది మెడిసిన్ ఎంట్రన్స్ మొదటి బాచ్.
    పి.యు లో మంచి మార్కులు రావడం వల్ల,
    యంబిబియస్ సీటు రాక పోతుందా అనే ధీమా తో ,
    ఉన్న నా లాంటి వాళ్ళ దిమ్మ తిరిగేటట్టు ఎంట్రన్స్,
    దానితో బాటుగా మొదటి సారిగా యాభై శాతం సీట్లు,
    పుట్టుక తో వెనక బడిన తరగతులకు ఇవ్వడం జరిగింది.
    పరిక్ష ఇచ్చిన తరువాత , ఇంట్లో హాయిగా ‘చేస్’ మీద రిసర్చ్
    చేసిన రోజులను గుర్తుకు తెచ్చింది మీ రివ్యూ .
    ధన్యవాదాలు.

Leave a Reply