తెల్ల కాగితం

వ్యాసకర్త: రామలక్ష్మీబాయి
*******
భాష ఏది ఐనా అక్షరాలు కొన్నే
అక్షరాలు కొన్నే ఐనా భావాలు ఎన్నో

తెల్ల కాగితం మనిషి జీవితం
ఒకో అక్షరం ప్రతి నిమిషం
చెయ్యి మారితే రాత మారుతుంది
చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది

ఇది దీపారాధన చిత్రంలోని పాట 80 ల్లో రేడియోలో బాగా విన్న గుర్తు..తెల్లకాగితం కవిత్వం పుస్తకం చూశాక ఈ జీవిత సత్యాలనే ఈ కవి నమ్మాడనిపించింది.

56 కవితల్ని అనుభూతికవిత్వం అని లోపలిపేజీల్లో ఆపాదించినప్పుడు ఏ కవిత్వం అనుభూతి కాదనిపించినా కవితా వస్తువుల్ని ఎన్నుకున్న తీరులో ఎన్నిక కన్నా మన్నికైన భావాలకే పీట వేసుకున్నాడనిపించింది.

అక్షరాలను ఆవహించుకున్న “నన్ను” ను చదివించుకుని మనసును తెల్లకాగితం చేసుకోవాలి అంటూ తన ఆకాంక్షను మొదటిపేజీలో తెలియజేసాడు కవి యశస్వి. అసలైన ఉద్దేశం రెండో కవిత కవిత్వం నా కళ్ళజోడు ముగింపులో చెబుతారు. తెల్లకాగితం లాంటి లోకంలో తన సంతకం నిలిచి ఉండాలని.. ఆ కోరికే ఏ కవినైనా యశస్వి గా నిలిపేది.

కవితా వస్తువుల విషయానికి వస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం, పనిచేసే ప్రసారమాధ్యమం, అందం, స్నేహం, సమకాలీన కవి సాంగత్యం, ప్రేమ, విరహం, వార్తా స్పందనలు, మధ్యతరగతి మందహాసాలు, ఓదార్పు, ఎదురుచూపు, జీవితంతో రాజీ, భార్యతో, బాసుతో పేచీ, వైవాహిక కలహాల ఫలితాలు, biodiversity, విశ్వవీక్షణం, యువ స్పందనలు, ఉద్వేగాలు, ప్రయాణానుభూతి, పరకాయప్రవేశంలా అన్యాపదేశాలూ, మూర్తీకరణ ప్రయోగాలు… మానవీయకోణాలన్నీ గుచ్చుకోకుండా హత్తుకునేవే. పుస్తకంలో గజళ్ళలా ధ్వనించేవీ, రైలు పట్టాల ధ్వనిలో వినిపించేవీ, మనసుని తొలిచేవీ, పసిభావనల్లో మొలిచేవీ కొన్ని ఉన్నాయి.

మచ్చుకి నాకు నచ్చిన ఐదు కవితలు

1 పుస్తకం మొత్తం మీద పెద్ద కవిత అక్షరాన్ని..నేనక్షరాన్ని శబ్ద-భావాలంకార మిశ్రితం, ఖండకావ్యమే..ఇది. పటిష్టమైన అరుదైన సృజన ఎంతో సాధన చేసి రాశాడనిపిస్తోంది. తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చెప్పిన కవితలెన్నోఉన్నాయి మనకి, అన్నిటినీ ఒక గాటన కట్టినా ఈ అక్షరం క్షరం లేనిదే.. కంఠస్తం చెయ్యాలన్న ఆవేశాన్ని కలిగిస్తుందీ కవిత.. లయ కుదిరితే మీరూ ప్రయత్నించొచ్చు. ముందు తరాలనూ, నరాలనూ ఉర్రూతలూగించే శక్తి, మనం అందించే సంపదల్లో ఒకటి అనిపించింది నాకు. కవికి శాశ్వతత్వాన్ని ప్రసాదించే ఈ సుధా మధుర ధారను తెలుగు వెలుగు మాసపత్రిక ప్రారంభ సంచికలో ప్రచురించింది. ఈ కవిత ఈ పుస్తకానికి మకుటాయమానం.

2.చతుర్థ చంద్రోదయం కవిత ఎత్తుగడే హత్తుకుంది.” చిన్ననాడెప్పుడో చంద్రుడ్ని అతి చేరువగా చూసిన జ్ఞాపకం.. అమ్మ చూపుడివేలి చివర వేలాడుతూ అనుకుంటా.. శీర్షికలో, పదబంధాల్లో గ్రాంధిక వాసనలున్నా.. గౌరవించాల్సిన మాటే.. తిలక్ ని బాగా చదివినట్టూ పైరెండూ చెప్పకనే చెబుతాయి. ప్రాసను ఆక్షేపించే వారి మాటేమో గానీ వినసొంపైన పదబంధాలు అమరిపోయాయి అలా..

౩. “అలాగే.. అలాగే” శీర్షికన మధ్యతరగతి సర్దుబాటు జీవితం కళ్ళకు కటినట్టు మనతో జట్టుకట్టుతుంది.. నిద్రలేచాకా నేలను కాలు తాకితే పచ్చనోటు తొక్కినట్టే.. అద్దెడబ్బులు పెరిగాయికదా… ” ఈనెల DA పెరిగింది ఎంతో తెలుసా!.. మూడోందలు అన్న మాటల్లో ధ్వని ప్రతి నగరజీవికీ ఆమాటకొస్తే సగటుమనిషన్నావాడికి అవునుకదా అనిపించేదే..

4. భయ్యా! డైవర్సిటీ ఎక్కడ!! అని ప్రశ్నించే కవితలో వ్యంగ్యం-నిజం పతాకస్థాయిలో పలికాయి. జీవ వైవిధ్య సదస్సు ముగింపు సందర్భంగా ఆ కార్యక్రమం డొల్లతనాన్ని తేటతెల్లం చేసిన whitepaper ఇది.విమానాల రాకపోకల్ని అడ్డుకోకుండా డేగల్ని చంపకతప్పని పరిస్థితి మనది. డేగల్లేని దేశాల్లో విమానప్రయాణాలు సురక్షితం అంటూ ఔషధమొక్కలూ, విత్తన వ్యాపారాల అభివృధ్ధి కోసం తప్ప ఇది సమతుల్యతకోసం కాదని చురక అంటిస్తారు. వెరసి మంచి కవితనిపిస్తుంది చదివితే..

5. ఏదోకారణం రోజూ మనచుట్టూ ఎన్నో సంఘటనలు.. పేపర్ చూస్తే రైలు కాలిపోయిందనో, కారు పేలిందనో, భూకంపం, వరదలూ జీవితాల్ని తల్లకిందులు చేసాయనో చదువుతూనే ఉంటాం…” బాధ, హింస, అతివాదం, ప్రమాదం, పశుత్వం విధ్వంసం, పక్కవాడి నిర్లక్ష్యం కారణాలు బయటవైనప్పుడు కారణాలు చెల్లడం సహజన్యాయమా? అని ప్రశ్నిస్తారు.. కవిత్వాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ మానవీయతను ఆవిష్కరించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన పెద్దల సరసన నిలుస్తాడు యశస్వి.

ఇందులో 10 వరకూ ప్రేమకవితలున్నాయి కన్నీళ్ళు పెట్టించక పోయినా తడి ఎక్కడో తగులుతుంది కొన్నిట్లో.. నివేదన వాటిల్లోఒకటి. చక్కని ప్రయోగాల వేదిక గా భాషాపరమైన చమక్కులతో “కొన్ని Tellగుమాటలు” ప్రత్యేకంగా నిలుస్తాయి.

ఇలా చెప్పుకుపోతే పుస్తకం ఎలా చదివించగలను!! కాపీ కావాలంటే.. కవిసంగమం యడ్మిన్ యాకూబ్ గారిని అడగాల్సిందే.

ముగింపు:

కవి వివరాలు పుస్తకంలో కొప్పర్తి గారి స్పూర్తి ని నింపుకున్న శిష్యుడిగా, కవిసంగమం లోనూ Yasaswisateesh గా www.blaagu.com/sateesh బ్లాగరు గా, ఈనాడు జర్నలిజం స్కూలు, తెలుగువెలుగు అనుబంధం ఉన్నట్టు తెలియజేసారు. చూడడానికి పెళ్ళి పుస్తకం లా ప్రతిపేజీ ఒక కళ్యాణ పత్రంలా వినూత్నంగా, వైవిధ్యంగా కనిపించాలన్న తపనతో కాగితానికి ఒకవైపే ముద్రించారు. చిన్నపిల్లల డ్రాయింగ్ పుస్తకానికి తక్కువగానూ, కాలేజీ పిల్లల తీపిజ్ఞాపకాల ఆటోగ్రాఫ్ పుస్తకానికి ఎక్కువగానూ అనిపించేటట్టు రూపకల్పన చేసుకున్న విధానం కనిపించిన వెంటనే చేతుల్లోకి తీసుకోవాలనిపించే బొమ్మలా, పువ్వులా, పసిపిల్లలా ఈ పుస్తకం ఊరిస్తుంది. పుస్తకం అట్టమీద కవి రూపం తప్ప పేరు దొరకదు, లోపల ఇంటిపేరూ ఉండదు, యశస్వి అన్న కలంపేరు అసలుపేరుతో కలసి కనిపిస్తుంది. సిలికానంధ్రా వారి కొత్త యూనికోడ్ ఖతులుతో పత్రాలంకరణ ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పటివరకూ ఈ ఫాంట్లను ఉపయోగించి ఇలా ఎవరూ ముద్రించివుండరు, రైన్ బో ప్రింటింగ్ ప్రెస్ అమీర్ పేట్ వారినీ, the foundation of telugu literature వారిని మెచ్చుకోవాల్సిందే. కవిని అంటారా.. చదివిన వాళ్ళ అనుభూతిని బట్టి.. నాకైతే నచ్చింది. ఎవరికైనా బహూకరించడానికి ఇది ఒక artistic peace. ఈ కవితలను చదవాలంటే పుస్తకం కొనాల్సిన పనిలేదు బ్లాగులోనే చదువుకోవచ్చు. కానీ పుస్తకం పుస్తకమేగా. అందమైన అనుభూతికి తెల్లకాగితం ఆనవాలు. ముద్రణకు ముభావమైన స్థితి నుండి మిత్రులతో పంచుకొనే కాంక్ష ను తెలుగు వెలుగు కవిసంగమం అందించాయని తరువాత యశస్వి వ్యక్తిగతంగా తెలియజేశారు.

You Might Also Like

One Comment

  1. kaasi raaju

    chaalaa chakkani visleshana madam…………Dhanya vaadaalu! mariyu abhinandanalu!

Leave a Reply