తెల్లకాగితం

వ్యాసకర్త: కాశి వీర వెంకట సత్య గోవింద రాజు
*****

మహత్తర జీవిత కాంక్షను కలిగించేది సాహిత్యం ఒక్కటే. ఏ కవైనా సాధారణంగా సమాజం, ప్రేమ, మానవ సంబంధాలు, ఉద్యమాలు.. ఇంకా చాలా విషయాల గురించి రాస్తారు. ఇతనూ ఈ పుస్తకంలో అదే చేశాడు; కాకపోతే తను రాయకుండా ఉండలేనితనం నుంచి సులువుగా బయటపడడానికి ఒక మార్గం గా కవిత్వాన్ని ఎన్నుకుని, ఏ పాఠకుడ్నీ చదవకుండా ఉండనీయని కవిత్వం రాశాడు. అది తన మొదటి కవిత “తెల్లకాగితం” తోనే తెలుస్తుంది. “నేను నీసొంతమైనపుడు మన మధ్య అక్షరాల అనుభూతులు మాత్రమే మిగలాలి . కవిత్వం మన అంతరాళాల్లోకి ఇంకి లోకమంతా తెల్లకాగితం అవ్వాలి”.. అంటాడు.

ఈయన దగ్గర సహాయం చేసే గుణం చాలావరకూ ఉంది. “నేస్తమా “ అన్న కవితలో ఒకచోట వర్ణ వంధ్యత్వపు లోకానికి వర్ణ రహిత సువర్ణదీపాన్ని.. నడి సంద్రపు నౌకలాంటి నీకు సుదూరంగా కనిపించే ద్వీపాన్ని .. అని బతుకుకు నేనొక ఆశనని.. ప్రేమించే గుణాన్ని చెప్పకనే చెబుతాడీయన. అభిమానమనేది కవిత్వం మీదే కాదు , కవి మీద కూడా ఉంటుందనేది మనకందరికీ తెలిసిందే. . ఈయన కూడా ఒకానొక అభిమాన కవి బి.వి.వి. ప్రసాద్ గురించి చెబుతూ “కవిని చూశాక” అన్న కవితలో సముద్రమోకాదో.. జతకట్టిన సంతోషంలో తేలి, సాటినది తో కలిసి..పారి.. జీవితంలో సంగమిద్దామని అంటాడు అతని ఊరెడుతూ . ఎంత చక్కని అభిమానం!! దీన్నిబట్టి చూస్తే సాహిత్యం మనుషుల్ని ప్రేమించడంకూడా నేర్పుతుంది అన్పిస్తుంది కదా!!

ఇద్దరు ఒక్కటైనపుడు .. ఒక్కక్కరిలో ఒంటరితనం ఉండనే ఉంటుంది. కానీ ఒక్కొక్కరిలో ఒంటరితనాన్ని చెబుతున్నట్టుకాక, ఒక ఆతృత యొక్క పరిణితిని చెప్పడానికి కాబోలు “నీ ముని వేళ్ళను ముని మాపు వేళల్లో సందెపొద్దు సూరీడు ముద్దాడి వెళ్ళేలోగా నిన్ను చేరాలనివుంది..అంటాడు. ఎంతకీ చేరుకోలేని మనసు చేరువకోసం ఆరాటపడటం మనమిక్కడ చూస్తాం! అసలైన మతం అంటే మనుసుల్తో కలిసిఉండటం, ఒకే రకపు వేషాధారణో, సాంప్రదాయమో, కట్టు-బొట్టూ కాదు. మతసామరస్యపు పరిస్థితులు రాష్ట్ర రాజధానిలో రగులుతున్నపుడు.. కవిహృదయం స్పందిస్తే ఎలాఉంటుందో “ఛార్మినార్ చెంపన” అన్న కవిత చెబుతుంది మనకి. మహాభారతం లాంటి మధ్య తరగతి జీవితంలో యుధ్ధం చేస్తున్న యోధులందరికీ “అలాగే అలాగే” అన్న శీర్షిక అన్నీ సమకూరుస్తాలే అని చెప్తుంది … పేస్టు పొదుపుగావాడమని.. ప్రతిబింబం గుర్తు చేస్తుంది/సబ్బుకన్నా చెయ్యే ఎక్కువ అరుగుతుంది/తువ్వాలన్నా సరిగా ఆరేసుకుందాం.. ఎన్నని కొంటాం!/లోగుడ్డలు/మేజొళ్ళూ.. పోనీలే/ఎన్నున్నా మరుగున చిరుగులు కనిపించవు. ఆపీసుకెళ్ళే ఇబ్బంది నుండి లంచి బాక్సు ఇంటికి చేరకముందే తీరాల్సిన కోరికల చిట్టాలు కూడా ఈ కవితలో విప్పుతాడు. చివరగా మూడొందలు జీతం పెరిగితే ఎగిరిగంతేసినట్టు.. ఈ రోజు ఇంటికి రావడం లేటవుతుంది. మీరు భోంచేసేయండి అని చెప్పి” చివరాఖరికి.. నీకు మల్లెలు, వాడికి హనీకేకు…………….” అని అవతల ఏదో చెప్పబోతుంటే.. (త్వరగా ఇంటికొచ్చేయండి నేను ఎదురుచూస్తుంటా..) అర్ధమయ్యిందిలే అన్నట్టు చెప్పడం కోసమేమో!! అర్థంతరంగా కవితని ముగించేసి “అలాగే.. అలాగే .. అనేస్తాడు. ఇలా రాసే విధానం పాఠకుడ్ని ఇంకాస్త ముందుకు పరిగెట్టించి.. అందరిచేతా.. చివరికి ఇతనినుకున్న భావాన్ని ఆ కవితలో వలకబోసి, చదివిన వాళ్ళనీ పులకింపచేస్తుంది.

ప్రతీ కవీ సందేశాన్ని ఎంతో కొంత ఇస్తాడు అది బహుశా స్వీయ అనుభవ జ్ఞానం కావచ్చు. పరీక్షలకే పారిపోతామా?/పరిస్తితులకే మారిపోతామా?/ప్రవాహానికే జారిపోతామా!!/కాదు.. నిలబడడం నీ వంతు, నీకు నువ్వు తప్పుకుంటే నీ పునః సృష్టి జరుగుతుందా? అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఒక సామాధానం,సందేశం కూడా ఇస్తాడు నిలబడడమే నీ వంతని.

A Thing of beauty is joy for ever అన్న జాన్ కీట్స్ ను బాగా చదివినట్టున్నాడు. అందం గురించి కూడా ఒక కవిత రాసాడు. ఇంకోచోట మలాలా జీవన్మరణ పోరాటంలో పడి ఉండగా కవిసంగమం కవులు కిరణ్ గాలికి తోడుగా.. తన చేయి కలిపి రాసిన కవిత “గుల్ మకాయీ”.. ఆధునిక విద్య అవసరం అని నొక్కి చెప్పిన నీ అంతరంగం../వాడిన ముఖం వికసించాలని ఈ లోకం ఎదురుచూస్తుంది. అదే తెగువ బతకడానికి చూపించి బతుకులో బతుకుతూ పోరాడాలని కోరుకున్నాడు.. కోరుతున్నాడు. ఈ ప్రతిస్పందన కవితను కన్న కవిహృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

అనుభూతి కవిత్వాన్ని చెబుతున్నప్పుడు ఒక పక్క పరిశీలన కూడా అవసరం, అందరి అనుభూతీ ఒకేలా ఉండదు కనుక అనుభూతి కవిత్వం ఒక్కోసారి అందరికీ అర్ధం కాకపోవచ్చు. దాన్ని దాటవేయడానికి పరిశీలన అవసరం. అది ఈ కవి దగ్గరుంది.” గోప్యతకు పట్టంకడతారు పిల్లలు/గోడ చాటునో సందుచివరనో కళ్ళు కలుస్తాయ్, రాహుకాలం పొంచి చూస్తున్న సమయంలో మెత్తని మనసులు మనుషుల్ని కోల్పోతాయి” అని యువతని ఉద్దేశించి “నాణెం గాల్లోకి ఎగురుతుంది” అని కవిత రాసి యువతకి అంకిత మివ్వడం బాగుంది.

“హాయి చెయ్యి ” కరచాలనం గురించి .. నేను ఇప్పటికింకా ఇలాంటి కవిత చూడలేదు. బహుశా మీరూ చూసి ఉండరు. చేయి చేయి కలవడం చిన్న పనేంకాదు. పెదవులూ-పెదవులూ పలకరించుకోవాలి /కళ్ళు-కళ్ళూ కలుసుకోవాలి.. మనసు ముందుకు ఉరికిం తర్వాతే కరచాలనం చెయ్యగలమని, . కరచాలనం అంతరార్ధం “సామాజిక సమరసత” అని. కరచాలనం చేయడానికి ముందు నిజంగా ఇంత తంతు వుండడం, కరచాలనం చేయడం ఒక యోగం అనడం వెనుక స్వానుభవం ఉంది. ఆస్వాదన ఉంది.

చంద్రుడ్ని చూపుడువేలు చివర వేలాడదీసి అమ్మలందరికీ చతుర్ధచంద్రోదయాన్ని అంకితం చేసాడు ఇతను. ప్రతి స్త్రీ కోరుకునే రసరాజ్య యుధ్ధ్దాన్ని.. కృషపక్షపు అష్టమి నుంచి అమావాస్యలోపు ఉందని చెబుతూ దాని ఫలితంగా పాండ్యమి పాపడు సిధ్ధం అని రాసాడు. తనని తాను చిన్నప్పుడు చూసుకున్న సందర్భం కాబోలు ఈ కవిత చదివాక ఒక జల్లు వెన్నెల మనమీద కురుస్తుంది. గుండెల్లో వెలితిని నింపే స్నేహం కోసం గుండె చెరువయ్యే మాటలు రాస్తూ “నాతో ఆడవా” అన్న కవితలో పొరపొచ్చాలొచ్చి వేర్పాటువాదం ఉన్న జంటల్లో, వాళ్ళ ఇండ్లలో జరిగే సన్నివేశాల్ని చిత్రణ చేసి చూపించాడు. అభిప్రాయాలు కలవ లేక .. రాత్రి రహస్యాలు రసవత్తరంగా లేకో.. విడిపోదామని చూసేవాళ్ళు, వేరు పడి ఏం చేస్తున్నారో, ఏం చేయకూడదో చెప్పాడు.

బయోడైవర్సిటీ సదస్సులు జరిగిన రోజుల్లో రాసిందనుకుంటా ఒక ఉడుతని వ్యాజస్తుతి చేసాడీయన. అతనన్నట్టు ఉడుత గుండ్రటి కళ్ళు, కుచ్చుతోక, గీతల ఒళ్ళుతో ..మంచి సౌందర్యరాశి కదూ! ఈ పుస్తకంలో సరదా దండక మొకటుందండోయ్. అది చదివితే సీరియస్ గా నవ్వొచ్చేస్తుంది మనకి. కాలుష్య రహిత నిర్మాణానికి ఇతను చూపించే శ్రద్ద మనకిక్కడ తెలుస్తుంది. తన మనసు తనని తొలిచినపుడల్లా “ఈ క్షణం ఇలా ఆగిపోనీ ” అనుకుంటాడట. రేగిన గాయాన్ని మాపే కాలంతో జతకట్టలేను అంటాడు. రాత్రి కరిగిపోతుందనే భయంతో వెలుగు జాడలో నేను కరగలేను అంటాడు. కానీ అది అయ్యే పనా? కాలంతో జతకట్టాల్సిందే, ఆ వెలుగుజాడల్లో అతడు కరిగిపోతేనే కదా! అతని బతుకుబండి ముందుకు కదిలేది. మనకు ఇలాంటి తెల్లకాగితాలని సంపుటులుగా పంచేది.

మళ్ళీ ఇంకొకచోట “నాకేగనుక చేతనైతే ” పిప్పరమెంటు నౌతా/పుస్తకాన్నౌతా/కన్నెపిల్ల కోరికౌతా/కన్నవారి కానుకౌతా/ అంటాడు.చిన్నప్పటినుండీ ఇప్పటికీ ఇలానే అనుకుంటాడట. చూడండి మరి ఇన్ని చెప్పిన వాడు మాట వరసకైనా కవినౌతానని చెప్పలేదు. కల్పించి కూడా రాయనందుకు కసితో కవిగా ముద్రవేసి సాహిత్య ప్రపంచంలోకి వదిలేద్దాం మరి.

కవిసంగమం (9701075118)

తెల్లకాగితం(కవిత్వం)
కవి: సతీశ్ కుమార్ (yaSaSwi)
వెల:110/-
ముఖచిత్రం: పి.యస్.చారి మరియు రవి శంకర్
ప్రతులకు: వై. గిరిజావతి
శ్రీ నిలయం 1-21-5/A
కడకట్ల,తాడేపల్లి గూడెం -534101
ఫోన్:8008001942

You Might Also Like

4 Comments

  1. యశస్వి సతీష్

    సాహితీ మిత్రుడు, వర్థమాన కవి కాశిరాజుకు, కవితా ఆకాశం బివివి గారికి, శ్రీ చావా కిరణ్ కు ఆత్మీయ ధన్యవాదాలు.

    మంచి కవిత్వం చదివిన అనుభూతిని కలిగించడం కన్నా సార్ధకత ఏముంది ఓ రాతగాడికి. అక్షరాలతో అనుభూతులు పంచుకోవడం మొదలుపెట్టి దశాబ్దాలే గడిచినా, చిక్కబడ్డ జీవితానుభవాలు పుస్తక రూపంలో పంచుకున్న తొలిప్రయత్నమే ఈ తెల్లకాగితం. పుస్తకాలను చదవడమంటే జీవితాన్ని చదవడమే. అంతరాలెన్నిఉన్నా తరతరాల జీవన విధానం లో కష్టాలు చర్విత చర్వాణమే.. ఎదుర్కునే శక్తిని ప్రోది చేసుకుని నిలబడ్డ మనిషే మాటొకటి పంచుకుంటాడు. అందుకేనేమో అందరిలానే నా అనుభూతుల్ని అక్షరీకరించే ప్రయత్నం చేశాను..
    జీవితం ఇప్పుడున్న స్థితికంటే ఒక అడుగు ముందుకెయ్యాలంటే ఏం చెయ్యాలో సూచించి , ఆరకమైన ఆలోచన రేకెత్తిచేటాట్టూ చేసినవి నేను చదివిన పుస్తకాలే..
    అవి చదివేటట్టు చేసినది నా గురువే..
    నీనుంచి నేను తరలిపోయినప్పుడల్లా
    నిజం తలుపు తెరుచుకుంటూనేఉంది.
    అని నాకు నేను చెప్పుకున్నా.. (ఇది నిన్ననే రాసుకున్నా.. నా బ్లాగులో),
    అక్షరాలు అంతర్ధానమై..
    అంతర్యామిగా మారే అనుభూతిని కాగితాన ఇంకిన
    ఒక్క ఇంకుచుక్క ఇవ్వగలిగితే చాలు అని తెల్లకాగితాన్ని ముగించినా …

    వాటి వెనుక కొప్పరి గారి ఈ మాటలే నన్ను నడిపించాయి..
    “రాయాలి రాయాలి
    రాస్తే తడి ఆరని అక్షరాల్నే రాయాలి
    చదివిన కళ్ళు తడి ని పీల్చుకుని సజలాలవ్వాలి
    రాయాలి.. రాయాలి..
    ఎప్పుడో ఉద్భవించే ఒక్క శాశ్వత వాక్యం కోసం
    జీవిత మంతా రాయాలి.
    రాసీ రాసీ గుండెలరిగిపోవాలి
    రాయడమూ గంధం రాయడమూ ఒకటి కాదు..
    రాయడాన్నెవరూ కాలరాయలేరు” (విషాదమోహనం : ఒక కెథార్సిస్ కోసం)

    అస్వాదించే అవకాశాన్ని కలిగించిన అయ్యవారి మాటకు కట్టుబడి రాసుకున్న ఊసులే ఈ కవితలన్నీ.. ఏమివ్వగలను తిరిగి..
    ఎన్నిసార్లు చెప్పినా అదేమాట: మహత్తర జీవిత కాంక్షను కలిగించేది సాహిత్యం ఒక్కటే.

    1. kaasi raaju

      Thank you kiran jee………..

  2. BVV Prasad

    మిత్రులు సతీష్ కవిత్వసంపుటి ‘తెల్లకాగితం’ కవిత్వప్రేమికులకి ఆహ్లాదాన్ని కలిగిస్తూనే, ఆలోచనలని వికసింపచేస్తుంది. శుభ్రమైన భాష, ప్రవాహ సదృశమైన వాక్య నిర్మాణం, సునాయాసంగా మనని తాకే కవితాంశా మంచి కవిత్వం చదివిన అనుభూతిని కలిగిస్తాయి.
    ఈ సంపుటి కవి ప్రధమ ప్రయత్నమే అయినా, రానున్న కాలంలో తననుండి మరింత సాంద్రమైన కవిత్వం ఆశించవచ్చనే భరోసా కలిగిస్తుంది తెల్లకాగితం.
    మరో ‘కవిసంగమ’ మిత్రుడు కాశి రాసిన ఈ సమీక్ష రానున్న కాలానికి చెందిన ఒక మంచి కవినీ, మంచి సమీక్షకుడినీ కూడా పరిచయం చేస్తుంది. పుస్తకం.నెట్ చెట్టుమీద వీరు కనిపించటం రానున్న వసంతాలకి చెందిన లేత చిగుర్లని ముందుగా చూస్తున్నట్లుంది.

Leave a Reply