దేవుడ్ని మర్చిపోదామిక.. పుస్తక పరిచయం

వ్యాసకర్త: యశస్వి సతీశ్
******

దేవుడ్ని మర్చిపోదామిక : ఈ పుస్తకం పూర్తిచెయ్యగానే.. ఆలోచనలనుంచి బయటపడడం కష్టమైంది.

ఎప్పుడో చదివిన విషయం గుర్తుకువచ్చింది. డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను ప్రమాదంలో కోల్పోయింది. రోడ్డు దాటుతుండగా 19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown. తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving). ప్రభుత్వం మీద, వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతుల మీద ఒకరకంగా యుద్ధం ప్రకటించింది. ఆమె కారణం గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఘనత సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం.. అదేకదా జీవన సాఫల్యత! మనిషిలో మనిషిని దర్శించడం అంటే అదే..

రేగళ్ళ సంతోష్ కుమార్ అనే ఆటల సంపాదకుడు (అదేనండీ ..ఈనాడు క్రీడా విభాగపు రౌతు) తన కింత కాలం చేతి నిండా పని కల్పించిన సచిన్ టెండుల్కర్ అనే పందెపు గుర్రాన్ని పాల కడలిలో అంజనం వేసి చూపించేశాడు.

మేమంతా మీ ’ఆవు’ అని ఆటపట్టించినా.. ఆట కోసమే కదా అని ఇన్నాళూ ఊరుకొని ఈరోజు నిజంగా సచిన్ కామధేనువే కాదు, కల్పవృక్షమూ ఐరావతమూ, ఉఛ్ఛైశ్వమూ అని చూపడానికి, ఉదాహరణలతో తెలుపడానికీ సాహసం కావాల్సిందే. అదేమాట అడిగి చూడండి సంతోష్ ని..పుట్ బాల్ లో పీలే, మారడోనా కలిస్తే .. క్రికెట్లో సచిన్ అని అలెన్ డోనాల్డ్ అనగాలేనిది నా మాట ఎంత!! అని తేటతెల్లం చేస్తాడు. ఆకతాయి సచిన్నోడి కసిని అన్నయ్య అజిత్ కృషిగా మరల్చడంలో ఓ రాయేశాడని సెలవిచ్చేస్తాడు.

నిజమే ప్రవాహానికి ఆనకట్ట కట్టడంలోనే మనిషి గొప్పదనముంది. అది Beckie Brown ఐనా, సచిన్ టెండుల్కర్ ఐనా..

ఒక యోధుడి వ్యక్తిత్వ ఆవిష్కరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. క్రికెట్ మైదానానికి అవతలవైపునే రచయిత ఫోకస్. ముందుమాటలో వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ చెప్పినట్టు.. ఒక మనిషిని దేవుడిలా అభిమానించే స్థాయికి దోహదం చేసిన అసక్తికర అంశాల సమాహారం ఈ.. ప్రయత్నం.

మైదానంలో వేల మంది తనను చూస్తున్నా, కోట్ల ఆశలను మోస్తూ ప్రపంచాన్ని తన తన్మయత్వంలో ముంచి ఆడిన ఆట మనం ఇకముందు చూడలేకపోవచ్చు..అతడ్నెలా గుర్తించుకోవాలి! అన్న మాటకు సమాధానమే ఈ పుస్తకం.

ఎవరు సలహాలిచ్చినా సచిన్ నాలాగే వింటుంటాడట బ్రదర్!.. ఓ ఉద్యోగి తన సహచరుడితో పరాచకాలు..

కోం ముహ్ ఖరాబ్ కర్ లే తేరే.. సచిన్ అక్తర్ తో అన్నట్టు ఓ బూతులాట గాడికి క్ర్రీడాస్ఫూర్తి ఉన్నవాడి సలహా..

ఏపనికైనా సచిన్ 20 నిముషాలు ముందుంటాడట.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడి ఉదాహరణ..

తన వాచ్ మెన్ కొడుకు, చిన్నప్పటి స్నేహమేనంట.. పర్సనల్ అసిస్టెంట్.. తెలుగు సినిమా పంచిన మంచిలోంచి సచిన్ ని కొలుస్తూ.. ఓ కాలేజీ కుర్రాడు..

ఇవన్నీ తెలిపేవి అతడో సెంచరీల వరద, రికార్డుల హోరు మాత్రమేకాదని, సచినంటే వినయం.. నిగ్రహం.. నిరంతర సాధన.. నిత్య విజ్ఞానార్జన, మంచితనం.. అందుకే పరుగుల దేవుణ్ని మర్చిపోయి సచిన్ ను గుర్తుంచుకుందాం అంటారు క్రీడా స్ఫూర్తి తో రచయిత.

అరే.. నీకీ విషయం తెలుసా!.. చిన్నప్పుడు సచిన్ అందర్నీ కొట్టేవాడట.. కోపిష్ఠి మెకన్రో ని ఆరాధించేవాడట..ఓ పిల్లవాడు తనలో సచిన్ ను చూసుకునే ప్రయత్నం.. తిరుగులేదు.. వీడు మనకొక ఆశాకిరణం. కావాల్సింది పట్టుదలే మనవాడికి.

“సచిన్ లా మెదటి మ్యాచ్ డకౌట్ కాదురా నేనూ..” సచిన్ ను దాటాలనే ఆశ.. వీడూ గొప్పోడవుతాడు.. చదువులోనైనా.. ఆటలోనైనా..ఉద్యోగంలోనైనా.. జీవితం లోనైనా.. ఇది నిజంగా ఛాంపియన్లను తయారుచేసే ప్రయత్నమే.. సంతోష్ ది.. ఎంత స్వార్థం.. చిన్ని పుస్తకం స్ఫూర్తి తో.. పేపర్ల నిండా విజయగాథలను చూడాలని కలగంటున్నాడు.. ఒక్క తరమైనా సచిన్ లా పరిగెడితే.. కాదు .. కనీసం ఆలోచిస్తే.. మన దేశం నిస్తేజ సాగరాన మునిగే బదులు.. ఉప్పొంగే జీవన తరంగాల వెల్లువై పులకించిపోదా!!

“నేనే కాదు..ఎవరూ పరిపూర్ణులు కారు.. కాలేరు నిరంతరం నేర్చుకోవాల్సిందే.” ఇవి సచిన్ మాటలు గా స్వీకరిస్తే.. అక్షరాలు సిక్సర్లుగా మదిలో కి దూసుకుపోతాయి.. తిరిగి మనల్ని కష్టమైన బంతుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం చేస్తాయి.

నూతనోత్తేజం కోరే ప్రతి మనిషి తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
ఇది లోకానికి ఓ సంతోషపు ప్రేమ కానుక లా నాకనిపించింది.

పుస్తకం: దేవుణ్ని మర్చిపోదామిక… సచిన్ ను గుర్తుంచుకుందాం (forget the God… remember Sachin)
రచన: రేగళ్ళ సంతోష్ కుమార్
పేజీలు: 80
ప్రచురుణ: సహృదయ సంతోషం ఫౌండేషన్
ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి, సికిందరాబాదు- 500009
sahrudayasanthosham@gmail.com
Kinige link here.

You Might Also Like

4 Comments

  1. డింగు

    నేను సచిన్ అభిమాని కావడానికి ఈనాడు వ్యాసాలు కూడ ఒక కారణం. అయితే ఆ కారణం వెనుక ఉన్నది ఈ రచయిత అన్నమాట! సచిన్ గురించి తెలుగులో అందునా ఈనాడు శైలిలో అంటే ఖచ్చితంగా చదవాల్సిందే.

    1. KV

      చాలామంది పాఠకులు ఈనాడు అభిమానులు కావడానికి కారణం – ఈనాడు ప్రతిభ కాదు. అక్కడ వివిధ శాఖల్లో ఉన్న రచయితల ప్రతిభే! వ్యక్తుల పేర్లు బయటికి రాకుండా చూసి ఆ వ్యక్తిగత ప్రతిభని సంస్థకి మలచుకోవడం మీడియాలో ఈనాడు నేర్చిన, నేర్పిన ఓ మంత్ర విద్య ! ఈనాడు ఏదీ రాయదు కదా? రచయిత ఎవరో తెలిసినా ఈనాడునే పొగుడుతున్నారే! ఇది అన్యాయం! నాటకం బాగున్నప్పుడు – ప్రతిభ చూపిన నటుల్ని మరిచిపోయి – పాలరాతి స్టేజి బాగుందనడం లాంటింది ఇది! దయచేసి ఈ ‘ బ్రాండ్ లేబర్ ‘ నించి మంచి రచయితల్ని విడిగా చూడండి.

  2. dastagir

    అవాక్కయారా…..
    దేవుణ్ని మరిచిపోదామిక…
    ఈ పేరు లోనే రచన తీరు ఉంది. శీర్షిక చూడగానే విస్మయానికి గురవుతాం. (నిజం చెప్పాలంటే గగుర్పాటుకు గురవుతాం.) చివరి పేజికి రాగానే అయ్యో.. అప్పుడే అయిపోయిందా… అని ఒక్కసారిగా చెక్ చేసుకుంటాం. ఎందుకంటే కేవలం 30 నిముషాల్లోనే పుస్తకాన్ని పూర్తి చెయ్యచ్చు… అదీ ఆర్తిగా. సచిన్ అనగానే మనకు ఓ ఆటగాడు కనిపిస్తాడు. కాని ఈ పుస్తకంలో ఎవరెస్టు అంత ఎత్తు, ఫసిపిక్ అంత లోతున్న
    ఓ విలక్షణ వక్తి కనిపిస్తాడు. అదీ పూర్తి కొత్తగా…
    పుస్తకం మొదట్లోనే మనల్ని టైసన్ ఒక్క పంచ్ కొడ్తాడు. సచిన్ పుస్తకంలోకి టైసన్ ఎందుకు వచ్చాడు… అదీ పంచులు విసురుతూ… అదే ఈ పుస్తకం ప్రత్యేకత. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సచిన్ చెప్పిన పాముకథ. రచయిత చెప్పిన ఆవు కథ…. మొత్తానికి ఇది చదివి పక్కన పెట్టాల్సిన పుస్తకం కాదు… ఎప్పుడూ పక్కనే ఉంచుకోవాల్సిన పుస్తకం. సచిన్ తో రచయిత రేగళ్ళ సంతోష్ కుమార్ ఇంటర్ వ్యూ
    ఈ పుస్తకానికి మరింత వన్నె , విలువ తెచ్చాయి.
    -మొహమ్మద్ దస్తగిర్

  3. aditya panigrahi

    వందల పేజీలు ఉండే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు.. గంటల తరబడి సాగే పర్సనాలిటీ డెవలప్ మెంట్ లెక్చర్లు చేయలేని పని ఈ చిన్న పుస్తకం చేయగలదన్న ఆశ కలుగుతుంది నాకు… చిన్న చిన్న పొరపాట్ల కారణంగా సక్సెస్ దారిలో చతికిలపడుతున్న పిల్లల్ని చూసి బాధపడుతున్న తల్లితండ్రులు కావొచ్చు.. ఉద్యోగుల పనితీరు ఆశించినంత లేదని భావించే కార్పొరేట్ సంస్థలు కావొచ్చు.. ఎవరైనా సరే… తమ పిల్లలకు లేదా ఉద్యోగులకు దీన్ని చదవమని చెప్పొచ్చు. మనిషిలో మార్పు కోసం స్వీయ అలోచన కలగనంత వరకు మార్పు రావడం అసాధ్యమన్నది నా అభిప్రాయం… అంతవరకు ఎన్ని పర్సనలిటి డెవలప్మెంట్ పుస్తకాలైనా.. క్లాస్ లైనా వ్యర్ధమే అని గట్టిగా నమ్మేవాళ్ళలో నేనొకడిని.. కానీ ఈ “దేవుణ్ణి మర్చిద్పోదామిక” చదివిన తరువాత మార్పు దిశగా తీసుకెళ్ళే ఆ స్వీయ ఆలోచన కలిగించే టూల్ గా ఈ పుస్తకం పనిచేస్తుందన్న నమ్మకం కలుగుతోంది.. ఈ శతాబ్దపు అతి గొప్ప రోల్ మోడల్ సచిన్ ని ఉదాహరణగా తీసుకుని, అతని జీవితం లోని సంఘటనలు, అనుభవాలను చూపిస్తూ సరళంగా సెలయేటి ప్రవాహం లా సాగిపోయే రచనా శైలితో స్రుష్టించిన ఈ పుస్తకం.. హస్తభూషణం అన్న మాటకు నిజమైన అర్థం. బిభూతి భూషణ్ రాసిన “వనవాసి” చదివినప్పుడు కలిగిన అనుభూతి… ఓస్ట్రోవ్స్కీ రాసిన “హౌ ద స్టీల్ వజ్ టెంపర్డ్” చదివినప్పుడు కలిగిన ప్రేరణ.. శైలి, విషయం పరంగా ఈ పుస్తకం మళ్ళీ కలిగించింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఈ ‘ పుస్తకం కొంచెం.. విషయం ఘనం “. ఇది మంచి పుస్తకమే కాదు.. గొప్ప పుస్తకం కూడా….
    ఎక్కడ దొరుకుతుంది… ఎలా తెప్పించుకోవాలి అన్న సందేహాలేమీ లేకుండా ఇంటర్నెట్ లో కినిగె.కాం వెబ్ సైట్ లోకి వెల్లి ఆన్లైన్ లో ఈ పుస్తకం హాఇగా ఓ గంటలో చదివేయొచ్చు.. దీని ప్రభావం మాత్రం గంటలో పోదు..

Leave a Reply