తెలంగాణా పోరాట పాటలు (రెండవ సంపుటి)

తెలంగాణా సాయుధ పోరాట కాలంలో ప్రజ నోళ్ళలో నానిన విప్లవ జానపద గేయాల్లో కొన్నింటితో కూర్చిన సంకలనం ఇది. వివిధ జ్ఞాత, అజ్ఞాత రచయితల మాటల్లో అప్పటి పరిస్థితుల గురించి, పోరాటంలోని వీరుల గురించి, క్రూరుల గురించి తెలిపే పాటలివి.

విషయానికొస్తే – పుస్తకంలో ఇరవై ఒక్క పాటలు, వెనుక అనుబంధంగా కొందరు కవుల, పోరాట వీరుల గురించి సంక్షిప్త పరిచయాలు ఉన్నాయి. పాటలని గురించి రాయాలంటే ఎలా పరిచయం చేయాలో నాకు తెలియదు. అందునా, ఈ పాటల్లో యాదగిరి రాసిన “నైజాము సరకరోడా” పాట తప్ప మరొక్కటేదీ పాడితే ఎలా ఉంటుందో నాకు తెలియనైనా తెలియదు. ఆర్.నారాయణమూర్తి పుణ్యమాని, కొందరి గురించిన పాటలు చదువుతూంటే, వాళ్ళ జీవితం కళ్ళముందు కదలాడింది (ముఖ్యంగా – గొట్టిముక్కల గోపాలరెడ్డి పాటలో!)..అలాగే, చరిత్ర పుస్తకాల్లో కనబడని వీరులు కొందరు ఉన్నారు. ఇలా, పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నవి, నాకు నచ్చినవి, నచ్చనివి మాత్రం చెప్పి పరిచయం చేస్తాను ఈ పుస్తకాన్ని.

* ఈ పుస్తకం ద్వారా ఏం నేర్చుకున్నాను? అన్నది ఒక్క ముక్కలో చెప్పడం చాలా కష్టమైన పని. అప్పటి పరిస్థితులు, దేశ నాయకులు, విప్లవ వీరులు – వీళ్ళ గురించి ప్రజల నోళ్ళలో నానిన మాటలు తెలుసుకున్నాను. నిజాంనే కాదు, నెహ్రూనూ నాజీతో పోల్చుకున్నారు అప్పటి తెలంగాణా ప్రజాకవులు – అని తెలుసుకున్నాను.

కాంగ్రెస్, నెహ్రూ, పటేల్, రామానంద తీర్థలపట్ల ప్రజల్లో ఆ కాలంలో పెల్లుబికిన వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదో ఈ ప్రజాకవుల మాటల్లో చదువుతూ ఉంటే అర్థమైంది. ముఖ్యంగా, నెహ్రూ భాగోతం, తల్లీ భారతి పాటల్లో ఇది ఎక్కువగా కనబడ్డది.

“దుష్ట దోపిడీదార్ల మిత్రుడా – బీద కష్టజీవుల కెల్ల శత్రుడా
తాతా బిర్లాకు – దగ్గర తమ్ముడ
పేద ప్రజలపట్ల – నేను బూటకుడ
ధరణి భారతదేశమందు – కాంగ్రెసు దాతనై జన్మించి తిందు
ప్రధానమంత్రి యని పేరు వడసితి – వినరా – ప్రీతుడైనట్టి పటేల్ మిత్రుడ
రారాజ వీరు డేతెంచెను – నెహ్రూ నాజీనైజాముల మించెను”
….
“ప్రస్తుతము నైజాము లోపల-ప్రజలందరు కలిసి
ధనిక వర్గము నిపుడున్-కూకటివేళ్ళతో పెరికి
కాలము గడిచినను మనకు-కల్గు ముప్పులురా
గట్టిగా చావు మనకు-వచ్చునురా
తొందరగ సైన్యాన్ని – తెలగాణ గడ్డకు పంపించి
ప్రజలను బాధించవలె – అపుడె ముప్పు తప్పురా
పండితుండరా – భారతదేశమునకు-అండ నిలిచితిరా”
-ఇలా సాగుతాయి వాక్యాలు “నెహ్రూ భాగోతం” అన్న వీథి భాగవతం పాటలో!

* గబ్బెట (గంగసాని) తిరుమలరెడ్డి, కామ్రేడ్ సూర్యనారాయణ, లగడపాటి గోపయ్య, తిరపన్న – వంటి అజ్ఞాతవీరులపై రాయబడ్డ పాటలని చదివాక, సహజంగానే వీళ్ళెవరు? అన్న కుతూహలం కలిగింది. సంక్షిప్త పరిచయాలు కొంతవరకూ ఆ కుతూహలాన్ని తీర్చాయి.

* గొట్టిముక్కల గోపాలరెడ్డి: “వీర తెలంగాణ” సినిమాలో, అతను మరణిస్తున్న దృశ్యం చూపిస్తారు. అందులో పేగులు బయటకొస్తే, నడుం చుట్టూ గుడ్డ కట్టుకుని మరీ అతగాడు తన రైఫిల్ తో పోరు కొనసాగించి, చివరికి నేలకొరిగినట్లు చూపిస్తారు. ఇదంతా డీ.పీ. (దర్శకత్వ ప్రతిభ) అనుకుని పట్టించుకోలేదు కానీ, తిరునగరి సీతారామాంజనేయులు రాసిన “తెలంగాణా దివ్యజ్యోతి” అన్న గొట్టిముక్కల గోపాలరెడ్డి పాటలోని వర్ణన యధాతథంగా వాడారు అని తెలిసింది.

* భాషతో కొంచెం అవస్థ పడ్డాను. అందునా, ఇవి పాటలు కావడంతో, మామూలుగా చదూకోడానికి కొన్ని పాటల్లో ఆట్టే విశేషం కనబడదు. దీని వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను సరిగా అర్థం కాక. అయితే, కొన్ని పదాలు అవీ చాలా బాగున్నాయి … తెలుసుకున్నాక నేను నిజజీవితంలో వాడే అవకాశాల్లేవని తెలిసినా కూడా, పదాలు చాలా నచ్చాయి.

* పుస్తకం చివ్వర్లో ఇచ్చిన కొన్ని పరిచయాలు ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే, ఈ పుస్తకంలో ప్రస్తావించిన పాటలు రాసిన ప్రజా కవులు అందరి గురించీ కూడా ఏదో ఒక సింగిల్ పేరా పరిచయాలన్నా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది (ఉదా: వట్టికోట రామకోటయ్య, సీ.హెచ్.అప్పన్న, తిరునగరి.. వగైరా..).

* కె.వి.ఆర్. రాసిన నేపథ్య వ్యాసం అక్కడక్కడా ఉపయోగకరంగా, చాలా మట్టుకు గందరగోళంగా అనిపించింది నాకు. అదేమిటో, ఈ సైద్ధాంతిక దృక్పథంతో రాసే వ్యాసాలన్నీ నాకు ఎప్పుడూ ఒక భాషలో ఆలోచించి ఇంకో భాషలో రాస్తున్న భ్రాంతి కలిగిస్తాయి. ఇదీ అలాగే అనిపించింది. పైగా, ఇందులో కొన్ని అయోమయానికి గురి చేసే విషయాలున్నాయి. రేనికుంట రామిరెడ్డి మరణం గురించి – అతను తన ప్రియురాలి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అయితే, అది నిజం కాదని, పోలీసుల కాల్పుల్లో అతను చనిపోయాడని, పుస్తకం చివర్లో ఇచ్చిన వివరణల్లో వీళ్ళే రాశారు. కానీ, ఈ వ్యాసంలో కె.వి.ఆర్ మాత్రం – రామిరెడ్డి తన ప్రియురాలి (ఈయన వుంపుడుకత్తె అనీ, వెనకిచ్చిన పరిచయంలో ప్రియురాలు అనీ రాశారు!!) వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కథనే నమ్ముతూ రామిరెడ్డిని విమర్శిస్తారు. బహుశా ఈ విషయమై రెండు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నవారు కలిసి కూర్చారులా ఉంది ఈ పుస్తకాన్ని. “కొన్ని ముఖ్యమైన ఘట్టాలు: తెలంగాణా పోరాట సాహిత్యం” అని పేరు పెట్టారే కానీ, వ్యాసమంతా నాకైతే ఏదో సైద్ధాంతిక విశ్లేషణలా తోచింది.

* కొన్ని పదాలకి కింద అర్థాలు ఇచ్చారు. దేనికి అర్థం ఇవ్వాలి? అన్న విషయానికి ప్రాతిపదిక ఏమిటో అర్థం కాలేదు. కొన్ని చోట్ల ఈ నోట్సు ఉపయోగపడ్డాయి. కానీ, కొన్ని చోట్ల తేలిగ్గా అర్థమయ్యే పదాలకి (సర్వస్వంబని ..అన్న పదానికి కింద సర్వ సంపదని అని అర్థం ఇచ్చారు) అర్థాలు అందించి, ఏవో ప్రత్యేకించి ఆ కాంటెక్స్ట్ లో, ఆ మాండలికంలో మాత్రమే అర్థమయ్యే పదాలకి ఏమీ వివరణలు ఇవ్వకుండా వదిలేశారు.

మొత్తానికి, అద్భుతం అనిపించకపోయినా, ఆకాలం నాటి ప్రజా ఉద్యమాల గురించి, ప్రజా గాయకుల గురించి ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం చదవడం ఉపయోగకరం అనే చెబుతాను. ఊరికే చదవాలంటే మాత్రం కాస్త ఓపిక కావాలి.

చివరగా, ఈ పోరాట కాలం నాటి పాటల గురించి ఇతరత్రా రచనలు ఏవన్నా ఉంటే ఇక్కడ వ్యాఖ్య వదలగలరు. ఈ పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో లేదో, మొదటి భాగం వివరాలేవిటో – నాకు తెలియవు. నాకు మా లైబ్రరీ లో దొరికింది. ఇది కాక, ఇలా అప్పటి ప్రజా గాయకుల గేయాలని సేకరించిన ఇతర పుస్తకాల గురించి కూడా ఈ పుస్తకం ముందుమాటలో రాశారు – మరి ఇవన్నీ ఎక్కడన్నా దొరుకుతున్నాయో లేదో తెలియదు (సుద్దాల హనుమంతు పాటల పుస్తకం మాత్రం మార్కెట్లో ఉంది.)

***
పుస్తకం వివరాలు:
తెలంగాణా పోరాట పాటలు
(1946-51 తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట పాటలు)
విరసం ప్రచురణ, జూన్ 1977
144 పే., నాలుగు రూపాయలు

(దయచేసిఈ పుస్తక విషయానికి, పరిచయ వ్యాసానికి సంబంధంలేని వ్యాఖ్యానాలు, వివాదాలకి దీన్ని వేదిక చేయకండి. ధన్యవాదాలు.)

You Might Also Like

Leave a Reply