వేలూరి వేంకటేశ్వర రావుతో ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ చేసినది: సాయి బ్రహ్మానందం గొర్తి
(ఈవారం నవ్య వారపత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇది. జతచేసిన చిత్రం కూడా నవ్య పత్రికనుండే.)

******
మీరూ, మీ కుటుంబమూ:

మా స్వస్థలం ఏలూరు. పుట్టింది చింతలపూడి. 1938 అక్టోబరులో.

అక్షరాభ్యాసం చేసింది నైజాంలో ఒక మున్షీ గారు! అయితే ఉర్దూ ఒక్క ముక్కకూడా రాలేదు.

ఏలూరులో చదువు, బి. యస్. సీ. వరకూ. ఆంధ్రా యూనివర్సిటీలో యం. యస్. సీ. అమెరికాలో పి. ఎచ్. డీ

ప్రస్తుతం ఒక భార్య; ఇద్దరు పిల్లలూనూ!

మీ సాహిత్యాభిలాషకి నాందీ, పునాదీ?

చిన్నపటినుండీ సాహిత్యాభిలాష ఉండేది అనడం నా విషయంలో చాలా ఘాటైన విషయం. మనపేరు పత్రికల్లో అచ్చులో చూసుకోవాలని ఎవరికుండదు చెప్పండి? నా పన్నెండో ఏటో పదమూడో ఏటో అనుకుంటాను, టర్జినెవ్ కథ ఒకటి చదివేసి, దానిని అనువాదం అని కూడా చెప్పకండా తెలుగులోకి దింపి, ఆంధ్రపత్రికకి పంపించాను. అది నెలతిరక్కండా తిరిగి వచ్చింది. ఆ తరువాత దాన్నే కాస్త మార్చి, చిలవలు పలవలు చేర్చి ఈ సారి టర్జినేవ్ కథకి అనువాదం అనో అనుసరణ అనో రాశాను. గుర్తులేదు ఏమని రాశానో! దానిని ఆంధ్రప్రభకి పంపాను. డిట్టో. అదీ తిరిగివచ్చేసింది. చాలా బాధ అనిపించిందంటే నమ్మండి.

హైస్కూలు రోజుల్లో అనుకుంటాను; కొన్ని కథలు రాశాను. ఒకటో రెండో అచ్చయ్యాయి కానీ నాకు గుర్తున్నది ఒకటే! అది నాకు బాగా నచ్చిన కథ; బాగా గుర్తున్న కథ కూడాను! అబ్రహాం లింకన్ గురించిన కథ. ఒక చిన్న పిల్ల, లింకన్ కి రాసిన ఉత్తరం ఆ కథకి మూలం. ” నువ్వు గడ్డం పెంచితే మా నాన్న నీకే ఓటు వేసేట్టు ఒప్పించేస్తాను, ” అని రాసింది. లింకన్ ఆ ఉత్తరం చదివిన తరువాతే గడ్డం పెంచటం మొదలెట్టాడని ఏదో ఇంగ్లీషు పత్రికలో చదివాను. ఇప్పుడు ఏ పత్రికో గుర్తులేదు. ఈ సారి బుద్ధిగా, పెద్దమనిషి తరహాగా, ఈ కథకి మూలం ఫలానా పత్రికలో ఉంది అని నిజం చెప్పేశాను. అమ్మయ్య! నాపేరు అచ్చులో చూసుకొని అప్పట్లో ఎంత మురిసిపోయానో !

ఈ విషయం ఎందుకు చెప్పుతున్నానంటే, అచ్చులో పేరు చూసుకోవాలనే మోజు బహుశా ఆ వయసులో అందరికీ ఉంటుదని చెప్పటానికే! ఆ వ్యామోహం, సాహిత్యాభిలాష, ” పువ్వు పుట్టగనే పరిమళించును” అని బయాగ్రఫీలో చెప్పుకోవటం ఈగో ట్రిప్పే!

“అచ్చులో పేరు” వ్యామోహంతోనే ఆపేసారా? ముందుకెళ్ళారా?

కాలేజీ ఆఖరి రోజుల్లోనో ఒకటో రెండో రొమాంటిక్ కథలు ( Boy meets a Girl Type) రాసాను. అవ్వీ అచ్చయ్యాయి కాని ఇప్పుడు అవి కథలు అని ఎవడన్నా అంటే నాకే నవ్వొస్తుంది. ఒకటి ప్రజామతలో వచ్చిందని గుర్తు. బి. యస్. సీ అయిన సంవత్సరం తరువాత, సాహితీ పరంగా ప్రొడక్షన్ పెరిగింది.

1957, 58 ప్రాంతాల్లో నా దోస్తు వడ్లపట్ల దయానందం సంపాదకత్వంలో ఏలూరు వీక్లీ అనే ” రాజకీయ” వారపత్రిక నడపటం మొదలయ్యింది. వారం వారం 16 పేజీలు! టేబ్లాయిడ్ సైజు! పత్రికలో తొంభై శాతం స్థానిక రాజకీయాల చర్చే ఉండేది. మిగిలిన పది శాతం సాహిత్యం; సాహిత్య విమర్శ! ఊళ్ళో ప్రతీ రాజకీయనాయకుడినీ, తెగ విమర్శిస్తూ వ్యాసాలు రాసే వాళ్ళం. మా బారిన పడని నాయకులెవరూ లేరు. ప్రతీ నాయకుడి మీదా కేరికేచర్ లాంటివి రాసేవాళ్ళం. ఆ పత్రికలో వారం వారం నాలుగయిదు పేజీలు నేనే నింపేవాణ్ణి. మా విమర్శ ఎంత ఘాటుగా ఉండేదీ అంటే, ఎవర్నీ ఒదిలిపెట్టే వాళ్ళం కాదు. “జనసంఘం – భోజన సంఘం” అని జనసంఘాన్ని కూడా విమర్శిస్తే అప్పట్లో కాస్త అలజడి కూడా రేగింది. మా పత్రిక్కి వెల్చేరు నారాయణ రావు గారు గౌరవ సలహాదారు. అప్పట్లో ఆయన ఏలూరు కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. మేం ప్రతీ వారం 500 కాపీలు ప్రింటు చేసే వాళ్ళం. మా విమర్శలూ అవీనచ్చి జనాలు బాగానే చదివేవారు. పేపరు కిళ్ళీ కొట్లల్లో పడేసిన రెండు గంటల్లో అన్ని కాపీలూ అమ్ముడయిపోయేవి. కానీ వారం వారం యాభై రూపాయలు నష్టం వచ్చేది. ఒక నెల తరువాత వారానికి వెయ్యి కాపీలు వేసే వాళ్ళం. నష్టం రెండింతలయ్యింది. ప్రతీ రాజకీయ పార్టీని తిట్టడంవల్ల, చివరికి కూరగాయల కొట్లవాళ్ళు, బట్టలకొట్ల వాళ్ళు ఎడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం మానేశారు. మా స్నేహితుడొకడికి కిళ్ళీకొట్టు ఉండేది. వాడు ఒక్కే ఒక్క ప్రకటన ఇచ్చే వాడు; మాబాధపడలేక! ఆ ప్రకటనకూడా “నశ్యం ప్రకటన.” అది తప్ప ఇంకే ప్రకటనలూ వచ్చేవి కావు. చివరకి పత్రిక మూత పడే స్థాయికొచ్చేసింది.

ఇహ పత్రిక ఇటుపైన రాదని చెబుతూ, ఇదే ఆఖరు ప్రచురణని అంటూ ఉగాదికి ఒక ప్రత్యేక సంచిక అచ్చు వేసాము. విశేషం ఏవిటంటే అందులో ఒక్క రాజకీయ వ్యాసమూ రాయలేదు. చాలామంది స్థానిక కవుల చేత కొన్ని వ్యాసాలూ, కవిత్వమూ రాయించి అచ్చు వేసాము. ఆ సమయంలోనే జనసంఘ్ వాళ్ళు మా పత్రికని కొనుక్కుంటామని కొంటామని వచ్చారు. మేం అమ్మలేదు. అప్పట్లో మాకు ఇదొక మరపురాని జ్ఞాపకం. (దయానందం మరణించి చాలా కాలం అయ్యింది).

మీ ప్రయాణంలో గుర్తుంచుకోదగ్గ సాహితీ జ్ఞాపకాలు?

ఆ తరువాత నేను ఆంధ్రా యూనివర్శిటీలో పి.జి చెయ్యడానికి వెళ్ళి పోయాను. అక్కడ చదువుతున్నప్పుడే చాలామంది ప్రముఖులతో పరిచయాలు అయ్యాయి. ఈ పరిచయాలవ్వడానికీ ఒక ముఖ్య కారణం : కాలేజీలో చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో ప్రొగ్రసివ్ ఆలోచనా దృక్పథం ఉండేది. అదికొంత ఉపయోగపడింది. అప్పట్లో నాకేకాదు; నా యెరికలో చాలామందికి అదే దృక్పథం ఉండేది. అప్పుడే చేకూరి రామారావు, జ్యేష్ట, బం.గో.రె. లతో స్నేహం అయ్యింది. ఆ రోజుల్లో తెలుగు భాషా సమితి వారి తెలుగు ఎన్సైక్లోపీడియా ఫిలాసఫీ భాగం ఆంధ్రా యూనివర్సిటీలో తయారు చేస్తున్నారు, మేడేపల్లి వరాహ నరసింహ స్వామిగారి ఆధ్వర్యంలో. బొమ్మకంటి శ్రీనివాసా చార్యులు గారు ఆ విభాగంలో పనిచేసేవారు. వీరిద్దరితో బాగా పరిచయం ఏర్పడింది. బొమ్మకంటి శ్రీనివాసాచర్యులు గారు అప్పుడప్పుడు సాయంత్రం పూట అబ్బూరి రామకృషారావు ( అప్పటికే ఆయన రిటైర్ అయ్యారు) గారి ఇంటికి వె ళ్ళేవారు. ఆయనతో తోకలా నేనూ వెళ్ళేవాడిని. అంతే కాదు. అప్పుడప్పుడు ఆయన, నేనూ కలిసి యూనివర్సిటీనుంచి కృష్ణ నగర్ వరకూ నడుస్తూ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళే వాళ్ళం. రా వి శాస్త్రి గారు కొత్తగా రాసిన కథ ఏదన్నా ఉంటే బొమ్మకంటి వారికిచ్చేవారు. రావిశాస్త్రి గారి కథలు కొన్ని అచ్చుకాకముందే చదివిన వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. అదేదో సామెతచెప్పినట్టు, ” గోదావరి అటునించి ఇటు ఈదినవాడూ నేనూ ఒకే కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేశాం,” అన్నట్టుంది కదూ, నా వ్యవహారం! అబ్బూరి వారు తన రాజకీయ అనుభవాలు, సాహిత్యానుభవాలు చెపుతూ ఉండేవారు. ” God these guys are something!” అనిపించేది.

ఆంధ్రా యూనివర్శిటీలో చదువుతూండగా అక్కడున్న ఓపెన్ ఎయిర్ థియేటర్లో “కావ్య దహనోత్సవం” అనే ఒక ప్రక్రియ చేశాము. దీని గురించి కొంచెం వివరంగా చెప్పాలి. చెత్తకవిత్వం విపరీతంగా వచ్చేస్తున్నది. కొంత చెత్తని దహనం చేస్తే మంచిదేమో అనే ఊహని ప్రత్యక్షంగా ప్రేక్షకులకి చూపిస్తే బాగుంటుందనే ఆలోచన దీనికి మూలం. ఇది వెల్చేరు నారాయణ రావుగారి ఊహ. ఆయన ఒకసారి అబ్బూరి రామకృష్ణారావు గారిని విశాఖలో కలిసినప్పుడు చూచాయగా ఈ విషయ ప్రస్తావన తెచ్చారు. అబ్బూరిగారికి బాగా నచ్చింది. వెంటనే ” ఎవరైనా ఆపనిచేస్తే నాపుస్తకాలన్నీ ఇస్తా అన్నారట!” ఇతరులపుస్తకాలకి ” దహన” క్రియ చెయ్యటం ఎవరు ఒప్పుకుంటారు? అయినా అది బాగుండని, అందుకని, ఈ ప్రక్రియకి ఒక రకమైన నాటకీయత ఇవ్వడం జరిగింది. ఒక కవి తనకవిత్వం ఎవరూ చదవటల్లేదని తెలుసుకొని తన పుస్తకానికి దహనక్రియ చేస్తానని పబ్లిగ్గా అందరినీ ఆహ్వానించిెచి ఆపని చెయ్యటానికుపక్రమించటం. మొ ట్టమొదటిసారిగా ఈ ప్రక్రియ ఏలూరులో 1958 ఎండాకాలంలో వై. యం. యెచ్. ఏ హాల్లో చేశాం. అప్పుడు దయానందం, శంకరమంచి సత్యం, నేనూ పాత్రధారులం. అయితే అనుకున్నంత గొప్పగా ఇది జరగలేదు. రిహార్సల్ మోస్తరుగా జరిగింది.

ఈ ప్రక్రియ యూనివర్సిటీ ఓపెన్ యైర్ థియేటర్లో చేస్తే బాగుంటుందని నాకు తట్టింది. ఆవిషయం బొమ్మకంటి శ్రీనివాసాచార్యులగారితో రోజూ ప్రస్తావించే వాడిని. ఆయన నన్ను ప్రోత్సహించారు. నేను డ్రాఫ్ట్ రాయడం; ఆయనకి చదివి వినిపించడం, ఆయన దిద్దటం. చదివేటప్పుడు, అప్పుడప్పుడు జ్యేష్ట, చేకూరి రామారావు వుండేవారు. వాళ్ళు కూడా అక్కడా ఇక్కడా చిన్న చిన్న మార్పులు చెప్పేవారు. అయితే ముఖ్యమైన పనంతా నాదే!

” నేను ఒక కవిని. నేను కవిత్వంలో చెయ్యని ప్రక్రియ లేదు. కానీ నా పుస్తకాలు పకోడి పొట్లాలు కట్టుకోడానికే తెలుగు వాళ్ళు సుముఖులని నాకు ప్రత్యక్షంగా అనుభవం అయింది. అందుకని, నేను షోడశ కర్మలలో ఆఖరిదైన దహన కర్మ పుస్తకాలకి చేస్తున్నాను,” అని తెలియజెప్పి, “ఆ కర్మ కూడా పబ్లిగ్గా, స్టేజ్ మీద అందరి సమక్షంలో చెయ్యడానికి సంసిద్ధుడను.” అందుకు కావలసిన ఉపన్యాసాలన్నీ తయారు చేశాను. ఈ ప్రక్రియకి, బం.గో.రె. కృతిభర్త గాను, మేడేపల్లి వరాహ నరసింహస్వామిగారిని అధ్యక్షుడిగాను, నేను కవిగాను సభచేశాం. సభకి ఆహ్వానాలు పంపించాం. శ్రీశ్రీ గారిని కూడా ఆహ్వానించాం.

ఆయన రాలేనని చెబుతూ, “Wish the Cremation Success” అంటూ ఒక టెలిగ్రాం కూడా పంపారు. ” వీళ్ళు కొంపదీసి పబ్లిక్ స్టేజ్ మీద పుస్తకాలు తగలబెడతారా?” అన్న అనుమానం కొంతమందికి వచ్చింది. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇంకా ఊళ్ళో ప్రముఖులూ వచ్చారు. అందులో రావిశాస్త్రి కూడా ఒకరు. ఈ ప్రదర్శన గురించి “తెలుగు స్వతంత్ర” ( 1960 డిసెంబర్ అని గుర్తు!) పత్రికలో నేనొక రివ్యూ కూడా రాసాను. ఈ కావ్య దహనోత్సవం కోలాహలం ద్వారా చాలామందితో పరిచయాలు పెరిగాయి.

అప్పటిదే ఇంకో సంగతి చెప్పాలి. ఆరోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీలో “ఆంధ్ర వారోత్సవాలు” ఒక వారం పాటు జరిపేవారు. దీనికి ప్రముఖ రచయితలనీ, పండితుల్నీ, నాటక ప్రముఖులనీ ఆహ్వానించేవారు. ఆప్పుడు విశ్వనాథ సత్యనారాయణ, పీసపాటి వంటి వారు కూడా వచ్చారు. ఈ వారోత్సవాల సందర్భంగా వివిధ కాలేజీల విద్యార్థులకీ వక్తృత్వ పోటీలు నిర్వహించేవారు. ఈ డిబేట్ కాంపిటీషన్లో నాకు ప్రథమ బహుమతీ వచ్చింది. ఆ విధంగా కూడా నేను చాలా మందికి తెలిసాను.

అందరికీ తెలియడమేనా లేక పరిచయాలూ కూడానా?

ఇది జరిగాక ఆంధ్రాయూనివర్శిటీ సాంస్కృతోత్సవాలకి గోరా శాస్త్రినీ, లతనీ, తిలక్ ని పిలిచాము. ఆ సందర్భంలో తిలక్ నాతో 15 రోజుల పాటు గడిపారు. తిలక్ గారు నన్ను ” మై డియర్ స్టార్మీ పెట్రెల్ ” అని సంబోధించేవారు. ఆ రోజుల్లో ఆయన రాసిన పోస్టు కార్డులు దాచుకోనుంటే ఎంత బాగుండేదో, అని ఇప్పుడనిపిస్తుంది. అటువంటి అలవాట్లు ఆ రోజుల్లో నాస్నేహితులెవ్వరికీ ఉండేవి కావు. యూరోపియన్ కవులగురించి ఆయన చెప్పేవాడు కానీ, అవ్వేవీ నాబుర్రకి ఎక్కేవి కావు. “డిలాన్ థామస్ వంటి పాశ్చాత్య కవుల కవిత్వం మనకూ కావాలి” అంటూ తిలక్ అనేవాడు. ఆ తరువాత ఏలూరులో కూడా చాలాసార్లు తిలక్ని కలిసే వాళ్ళం.

ఏలూరులో వుండగా, మేం నలుగురు, అంటే – పి.రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు, వెల్చేరూ, నేనూ – కలిసి తిరిగే వాళ్ళం. సూర్యనారాయణ రాజు శాంతినికేతన్లో చదువుకున్నవాడు. అతనే మాకు చాలా వెస్ట్రన్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. ఒక విధంగా అతను మాకు ప్రేరణ. ఆ రోజుల్లో యూరోపియన్ సాహిత్యం చాలా చదివాము. కామూ, సాతర్, ఉనామునో, హెమ్మింగ్ వే, పిరాండల్లో ఒకడేవిటి ఒక వరుసా వాయీ లేకుండా చదివే వాళ్ళం. ఒక పద్ధతి లేదు. ఏది దిరికితే అది చదివి, ఆ మోజులో ఉండటం పరిపాటి. ఇవన్నీ మాకు రాజు గారి ప్రభావం. అవి చదివి చర్చించే వాళ్ళం కూడా. ఆ కాలంలో జాన్ పాల్ సాతర్ కి నోబుల్ ప్రైజు వచ్చింది.

“రచయితలు తామంతట తాముగా ఒక సంస్థగా మారే ప్రయత్నించకూడదు” అనంటూ అది అతను తిరస్కరించాడు. ఇది మా నలుగురికీ నచ్చీ, అతని నిర్ణయాన్ని మెచ్చుకుంటూ, సంతకాలు పెట్టి మరీ ఉత్తరం రాసాము. అతనైతే మాకు సమాధానం మాత్రం రాయలేదు. అలాగే అల్డస్ హెక్స్లీ కి కాలిఫోర్నియాలో ఇల్లు కాలి పోయిందని తెలిసీ, సంతాపం తెలుపుతూ ఉత్తరం రాస్తే, ఆయన నుండి మాకు ఉత్తరం కూడా వచ్చింది. ఇవన్నీ తలచుకుంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటాయి. ఒకటికి రెండు సార్లు తలచుకొని సరదాగా నవ్వుకొనే విషయాలు.

ఆంధ్రా యూనివర్శిటీలో ఎం.ఎస్సీ అయ్యాక కొంతకాలం కటక్ కాలేజీ లో ఫిజిక్స్ పాఠం చెప్పాను. అక్కడ కొంతమంది ఒరి యా, బెంగాలీ సాహితీ మిత్రుల పరిచయం అయ్యింది. అక్కడున్నప్పుడే కొంతకాలం ఇంగ్లీషు పొయిట్రీ రాసాను. కేరవాన్, సెంచరీపత్రికల్లో నా కవితలు అచ్చయ్యాయి. ఢిల్లీ నుంచి ప్రచురితమయ్యే సెంచరీ వారపత్రిక చాలా ప్రొగ్రెస్సివ్ పత్రిక. అందులో నేను కూచిపూడి మీద కూడా ఒక వ్యాసం కూడా రాసాను.

1968 లో అమెరికా రాబోయేముందు, నాపుస్తకాలు, నోట్ పుస్తకాలు వగైరా సూర్యనారాయణ రాజు ఇంట్లో పడేశాను. అతను ఏమనుకున్నాడో ఏమో, నా స్వదస్తూరిలో ఉన్న కావ్యదహనోత్సవం డ్రాఫ్ట్ మొత్తం — అందరికీ రాసిన ఉపన్యాసాలు — ఇన్విటేషన్ కాగితం, అన్నీ దాచిపెట్టాడు. అవి ఇప్పటికీ నాదగ్గిర ఉన్నాయి! ( 50 ఏళ్ళు దాటింది కదా!! కాలదోషం పట్టకుండా అచ్చువెయ్యాలి! ఎందుకంటే, కావ్యదహనోత్సవం గురించి రకరకాల కట్టుకథలు అచ్చులోకొచ్చేసాయి. జ్యేష్ట ఒక కథ కూడా రాసేశాడు; ఒరేయ్ ఇది నీకథే అని ఒక్క మాటకూడా చెప్పకండా! )

ఆంధ్రా నుండి అమెరికాకి?

1968లో పై చదువుల మిషతో అమెరికా వచ్చాను. అప్పట్లో అమెరికాలో తెలుగువారి సంఖ్య చాలా చాలా తక్కువుండేది. అసలు 1950 తరువాత పై చదువుల కోసం అమెరికా రావడం మొదలయ్యింది. అది 60ల తరువాత కాస్త పెరిగింది. ఇక్కడికొచ్చాక అమెరికానీ, ఇక్కడి జీవితాన్నీ చూసాక అప్పటివరకూ నాకున్న కొన్ని అభిప్రాయాలు మారాయి. కారణం మనం పెరిగిన వాతావరణమూ, కల్చరూ వేరు. ఇక్కడి సంస్కృతి వేరు. ఇప్పటిలా వేల కొద్దీ తెలుగు వారు లేరు. అసలు ఉన్న భారతీయులే తక్కువ. మా తరం వారికి అమెరికన్లతో కలిసి పనిజేయడం వల్ల వారి సంస్కృతీ, అలవాటూ, ఆచారాలూ వంటివి మెల్ల మెల్లగా తెలిసాయి. రెండు విభిన్న సంస్కృతులు కలిసినప్పుడు రెంటిలోనూ మనం ఊహించే “మంచీ, చెడ్డా ” బోధ పడతాయి. ఇక్కడొక విషయం చెప్పాలి. మూమూలుగా ఒక సగటు అమెరికన్కి ఎదుటి వారి సంస్కృతి అన్నా, జీవితమన్నా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఇందువల్ల వాళ్ళతో కలవడం సులభమే అయ్యింది. రెండు విభిన్న సంస్కృతల మధ్య సాగే పరస్పర సంబంధం, మనకి దాని అవసరం తెలిసింది.

మేం వచ్చిన సమయంలోనే వియత్నాం యుద్ధం ఆఖరి రోజులు! . ఆ సందర్భంలో వివిధ పత్రికల్లో, ముఖ్యంగా ” ప్రొగ్రెస్సివ్” పత్రికలలో వచ్చే వ్యాసాలు చదవడం మూలంగా అప్పటి వరకూ నాకు అమెరికా అంటే ఉన్న అభిప్రాయం మారడం మొదలు పెట్టింది.

అమెరికన్ ప్రభుత్వ చేసిన ప్రతీ పనినీ అమెరికన్లందరూ సమర్థించరని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిర్మొహమాటంగా విమర్శ చేయడానికీ, ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికీ వెనుకాడరని బోధపడింది. ఇండియాలో ఉన్నప్పుడు అక్కడి పత్రికలలో చదవిన విషయాలకీ, ఇక్కడి చూసిన వాటికీ చాలా తేడాలు కనిపించాయి. చుట్టపుచూపుగా అమెరికా సందర్శించి, “నా అమెరికా అనుభవాలు” అంటూ రాసిన పుస్తకాలు, ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. అనుభవాలు అంటే కేవలం ఇక్కడి తెలుగువారిని కలిసిన అనుభవాలు లేదా ఈ దేశాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతులు తప్ప, అవి అనుభవాలు కావని అనుకుంటాను. ఇక్కడి జీవితాన్ని లోతుగా చూసి, ఈ మిశ్రిత వాతావరణంలో ఒక భాగం అయినప్పుడు వచ్చే అనుభవాలు వేరు.

అమెరికా రాకపోతే నేను తెలుగులో రాసి ఉండేవాడిని కాదు. అంటే, ఇంగ్లీషులో రాసి పారేసే వాణ్ణనీ కాదు. సాహిత్యపరంగా ఏమీ చేసి ఉండేవాడిని కాదు.

70 వ దశకంలో, పెమ్మరాజు వేణుగోపాల రావుగారు అట్లాంటానుంచి తెలుగుభాషాపత్రిక నడిపేవారు. ఆ పత్రికకి సహకరించటమే కాకుండా, ఆయన ప్రోత్సాహంతో ( ప్రోత్సాహం అనడం కన్నా ముల్లుగర్రతో పొడవడం అనడం సబబు!) చాలా వ్యాసాలు రాసాను. అందులో చాలాభాగం, ఫిజిక్స్ వ్యాసాలే! అప్పుడప్పుడు, వివాదగ్రస్త వ్యాసాలు కూడా రాసాను. ఒకటో రెండో కల్పనలు ( ” మనవాళ్ళ పేర్లు,” మెటమార్పసిస్ , వగైరా ” కథలూ” ) కూడా రాసాను.

తరువాత 80ల్లో చికాగో తెలుగు సంఘానికి కార్యదర్శిగా, అధ్యక్షుడిగా తెలుగు వెలుగు పత్రిక నడపటం, ఆనవాయితీ రాయవలసిన అవసరం కలిగింది. ఇంగ్లీషులో బాగా రాయడం వచ్చనుకునే భ్రమ కూడా పూర్తిగా పోయింది; ఇక్కడి సాహిత్యం చదవడం మొదలైనతరువాత. ఇప్పుడనిపిస్తుంది, నామటుకు నాకు, ఇంగ్లీషుకన్నా కాస్తో కూస్తో తెలుగులో రాయటమే వచ్చును, అని! మనది అనే దానికి దూరమయినప్పుడే, దానిమీద మమకారం పెరుగుతుంది. ఆ మమకారమే ఇప్పటికీ నాచేత ఏదో ఒకటి రాయిస్తుందనుకుంటాను.

అనుభవాలు నింపుకున్న తెలుగు డయాస్పోరా కథ:

సుమారు పన్నెండు సంవత్సరాల క్రిందట చికాగోలో తెలుగు సదస్సు జరిపినప్పుడు, మనం “తెలుగు డయాస్పోరా” అని మన అనుభవాలు మనం తప్ప మరెవరూ చెప్పలేరనీ, రాయలేరనీ అన్నాను. అప్పటినుంచి, ఎక్కడకి వెళ్ళినా తెలుగు డయాస్పోరా గురించే మాట్లాడేవాడిని. పాతజ్ఞాపకాలు ( నాష్టాల్జియా) మాత్రమే డయాస్పోరా లక్షణాలు కావని, అది ఒక డయస్పోరాలో ఒక చిన్న భాగమేననీ, రాశాను. ఇతర డయస్పోరా లకున్న లక్షణాలతో మన లక్షణాలని పోల్చి బహుశా రెండు,మూడు వ్యాసాలు కూడా రాసాను. ఇప్పుడు, ఇక్కడనుండి వస్తున్న కొన్ని కథా సంకలనాలకి ముందుమాటల్లో ఈ డయాస్పోరా అన్న మాట ఒక ఊతపదంగా తయారయ్యిందేమో నన్న అనుమానం కూడావచ్చింది. నిజం!

నారచనావ్యాసంగానికి ఇంటర్నెట్ చాలా ఉపకరించింది. కొత్త ప్రోత్సాహం ఇచ్చింది అని చెప్పక తప్పదు. తెలుసా ( తెలుగు సాహిత్యం) అనే గ్రూప్ లో ఆధునిక కవుల పరిచయం చెయ్యడం, ముఖ్యంగా స్త్రీవాదకవుల పద్యాలు, దళితకవుల పద్యాలు, తీసుకొని వాటిగురించి ఇక్కడి తెలుగువారికి పరిచయంచెయ్యడం, వాటిపై చర్చల్లో పాల్గొనడం మొదలయ్యింది. అప్పట్లో రాసిన కొన్ని వ్యాసాలు ఇప్పటికీ వివాదగ్రస్తాలేనేమో!

కె.వి.యస్. రామారావు స్థాపించిన ఈమాట ఇంటెర్నెట్ పత్రిక మళ్ళీ నారచనావ్యాసంగానికి మరోసారి ఊపిరి పోసింది. అడపా తడపా, తెలుగునాట పత్రికల్లో కథలో కాకరకాయలో రాసినప్పటికీ, ఈ మాటలోనే నేను ఎక్కువగా రాసాను. ఆ తరువాత, ఈమాట ముఖ్య పత్రికకి సంపాదకుడినవటం ఉత్సాహాన్నిచ్చింది. మొట్టమొదటిసారిగా అందరి రచనలతోటి పాటు, సంపాదకుడినైనప్పటికీ నారచనలని కూడా, ప్రచురణకిముందు బయటి వారిచే ” రివ్యూ” చేయించడం, మార్పులు, కూర్పులు, చేర్పులు చెయ్యడం నాకు ఎంతో ఉపకరించింది.

ఇంటర్నెట్ సౌలభ్యం మనలో చాలామందిని ” రచయితలు ” గా చేసింది. ఒకరకంగా ఇది ఇక్కడితెలుగువారికి తెలుగులో రాద్దామన్న అభిలాష బాగా పెంచింది. అయితే ఇప్పటికీ తెలుగునాట లభ్ధప్రతిష్టులమనుకునే రచయితలు, పత్రికాధిపతులు, విమర్శకులూ, ఇక్కడనుంచి వస్తున్న సాహిత్యాన్ని కొంచెం తక్కువగా చూడటం, చిన్నచూపు వేయడం కొత్త ఏమీకాదు. సరిగ్గా గతశతాబ్దంలో అమెరికన్ ” కథల” ని అదే రకంగా కించపరిచేవాళ్ళు, ఇంగ్లండ్ లోను, యూరోపియన్ దేశాల్లోనూ! ఓబ్రైన్ కనక అమెరికన్ కథలను 1905లో ప్రచురించడం మొదలుపెట్టి ఉండకపోతే, బహుశా హెమింగ్వే రచయిత అయిఉండేవాడు కాదు!

అమెరికా తెలుగు కథ:

ఇంటర్నెట్ ధర్మాన అమెరికాలో చాలామంది కథకులే ఉన్నారు. గతంలో ఒకటీ, రెండూ అనుకునే సంఖ్య ఇప్పుడు సుమారు ఏభైయ్కి పైగా పెరిగింది. ఇంతకు ముందు చెప్పినట్లు డయాస్పోరా జీవితానికి సంబంధిచిన మరొక కోణంలో కథలు రాస్తున్నారు. అమెరికా జీవితం గురించీ, ఇండియా గురించీ తెలియడం వలన ఇక్కడి కథకులకి మంచి మంచి వస్తువులతో కథలు రాసే అవకాశం వుంది. కొంతమంది మంచి కథలు కూడా రాసారు. ఇక్కడున్న రచయితల్లో, నిడదవోలు మాలతి, పూడిపెద్ది శేషుశర్మ, కె.వి.ఎస్.రామారావు, మాచిరాజు సావిత్రి, ఆరి సీతారామయ్య, జె.యు.బి.వి ప్రసాదు, కె.గిరిధర రావు, వేమూరి వేంకటేశ్వర రావు, ఎస్. నారాయణ స్వామీ, చంద్రశేఖర్ కన్నెగంటి, చిట్టెన్ రాజు, అఫ్సర్, కల్పన రెంటాల, సత్యం మందపాటి, ఫణి డొక్కా, కలశపూడి శ్రీనివాసరావు, తాడికొండ శివకుమార శర్మ, ఇంకా మీరూ, ఇలా ఒక పెద్ద జాబితానే ఇవ్వగలను. ఇక్కడ అది కాదు ముఖ్యం. తెలుగుకథకి మరొక కొత్త పార్శ్వం ఇక్కడితోనే మొదలయ్యిందన్నదే నే చెప్పదల్చుకున్నది. కానీ ప్రస్తుతం వచ్చే డయాస్పోరా కథలు చాలా తక్కువ. ఇంకా నాస్టాల్జిక్ కథలే ఎక్కువగా ఉంటున్నాయి.

బాఘా నచ్చిన కథ(లు)?

నేను నలభై – యాభై ఏళ్ళ వ్యవధిలో ఒక పాతిక పైచిలుకు ” కథలు ” రాసిఉంటాను. అందులో పదిహేను ఈ మాటలోనే మొదటిసారి ప్రచురితమైనాయి. వీటిలో కొన్ని కథలు తెలుగు డయాస్పోరా కథలనే అనుకుంటాను. కొన్ని నాష్టాల్జియా కథలు. ఒకటో రెండో అమెరికన్ రాజకీయాలని హేళన చేసేవి.

మీకు బాగా నచ్చిన ఒక కథ ఏమిటీ అన్న ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పటం? మీపిల్లల్లో మీకు నచ్చిన పిల్లడెవడు అని అడిగినట్టుంటుంది, ఈ ప్రశ్న!

” నాకు బాఘా నచ్చిన కథ ఇంకారాయలేదండీ! ” అని చెప్పడం మంచిదేమో.

సరే మీ ఇష్టం : అడిగా మీరు కాబట్టి మచ్చుకి ఒక లిస్ట్ ఇస్తున్నా. మీరు ఏరు కోండి, అందులోనుంచి.

1971 లో రాసిన మెటమార్ఫొసిస్, — ఆతరువాత మొదలుపెట్టి మొన్నటివరకూ రాసినవి — తరం మారినా, రి సైకిల్, తీన్ కన్యా, పడమట సంధ్యా రాగం, గోమెజ్ ఎప్పుడొస్తాడో… ఇవన్నీ నాకు ” ఇష్టమైన” కథలే! రాజకీయం కావాలా? మహరాజవ్వాలంటే, గుర్రాలు-గుగ్గిళ్ళు , తీసుకోండి!

వీటిలో కొన్ని, పాతనాటి ఆంధ్రప్రభలోను, ఆంధ్రజ్యోతిలోను, వార్త లోను, నవ్య లోనూ ఇదివరకే వచ్చాయి.

చివరగా –

దేశం విడిచి పెట్టాకనే దేశం బాగా అర్థం అవుతుంది. దీపంకింద ఉన్నంత కాలం నీడలో తెలియదు. దీపానికి కాస్త దూరంగా ఉంటేనే దీపకాంతి మన మీద బాగా ప్రసరిస్తుంది.

తెలుగు దేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయని వాళ్ళం, గట్టిగా తెలుగు చదవని వాళ్ళం, గట్టిగా తెలుగు పత్రికలు కూడా చూడని, చదవని వాళ్ళం ఇక్కడికొచ్చాక మనకి ఇంగ్లీషుకన్నా తెలుగే బాగా వచ్చునని చాలా మంది గుర్తించాం. మనం తెలుగులో రచయితలం, కవులం అయ్యాం.

మనం మనకున్న అవకాశాన్నీ, సదుపాయాలనీ, జాగానీ వాడుకొని మన ప్రపంచాన్ని అటు తెలుగుదేశంలో తెలుగు సాహిత్య ప్రపంచంలోకీ, ఇటు ఇంగ్లీషులో తయారవుతున్న మన పిల్లల ప్రపంచంలోకీ విస్తరిస్తే అప్పుడు మన డయాస్పోరా సాహిత్య ప్రపంచం అటు తెలుగు దేశంలో ఉన్న సాహిత్యాన్నీ సంపన్నం చేస్తుంది; ఇటు ప్రపంచ భాషల సాహిత్యాన్నీ సుసంపన్నం చేస్తుంది.

ఆ పని అమెరికా తెలుగువారు, అంటే మనం, చెయ్యగలం. అందుకు మనం సమర్థులం అన్న నమ్మకం నాకు ఉంది.

000000000000000000

నచ్చినవి:

కవులూ, కథకులు: విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, చాసో, శ్రీపాద రావి శాస్త్రి

పుస్తకం: చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కథలూ, గాధలూ – రావిశాస్త్రి సారా కథలు, సారో కథలూ – కాశీమజిలీ కథలు – వెల్చేరు అనువదించిన కన్యాశుల్కం అనువాదం ( Girls for Sale )

గాయకులు: బాలమురళీకృష్ణ, భానుమతి, బాబ్ డిలన్. Beatles.

You Might Also Like

Leave a Reply