ఆర్య చాణక్యుడు – వేదుల సూర్యనారాయణ శర్మ

dsc00045ఇదే పేరుతో చారిత్రక నవల మరొకటి (ప్రసాద్) గారిది వచ్చింది. అయితే ఈ నవల కేవలం చారిత్రకం కాదు.

చాణక్యుడు అంటేనే నవనందులను నాశనం చేసేంతవరకు జుట్టు ముడి వెయ్యనని శపథం చేసి, అన్నంతపనీ చేసిన బ్రాహ్మణ ముఖ్యుని కథ అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే ఈ మహానుభావుడు కేవలం ప్రతీకార వాది కాడు. అతి గొప్ప ఆలోచనాపరుడూ, చతుర్విధోపాయాల్లో భేదోపాయాన్ని అత్యద్భుతంగా కార్యాచరణకు వినియోగించిన వాడు, తద్వారా అఖండ భారత సామ్రాజ్యాన్ని నిర్మించి, యవనులను తరిమి కొట్టిన వాడూనూ. చాణక్యుడు లేకపోతే భారతదేశం వేల యేళ్ళ నాటికి ముందే విచ్చిన్నమయి ఉండేది. ఇటువంటి వ్యక్తి భారతదేశంలో ఇంకొకడు పుట్టబోడు.

ఈ నవల మొదట్లోనే కొన్ని విచిత్రమైన విషయాలు తెలుస్తాయి. మొదటగా  చాణక్యుడికి గల వివిధ నామాలు.

విష్ణుగుప్తుడు
చాణక్యుడు (చణకుల వారి పుత్రుడు గావున)
కౌటల్యుడు (కౌటల గోత్రోద్భవుడు)
కౌటిల్యుడు (గురువు కల్యాణస్వామి పిలిచిన పేరు)
పక్షిల స్వామి (పక్షులను మచ్చిక చేసి, వాటితో రహస్య భేదనము, లేఖలు పంపడము వంటి కృత్యములలో  నేర్పరి గావున)

మల్లనాగుడు (సాంస్కారిక నామము)
వాత్సాయనుడు (శ్రీవత్స గోత్రం గావున. మరి ఇందాక కౌటల గోత్రమో? అది పితృ గోత్రమట. ఈయన మాతామహులకు పుత్రసంతానము లేకపోవుటచే, ఈయనే శాస్త్రోక్తముగా ఉద్ధారకుడగును.అందుకే ఈ గోత్రము)

చివరి పేరు విని ఉలిక్కి పడ్డారా? నేనూ ఈ పుస్తకం చదివేప్పుడలానే అనుకున్నాను. ద్వితీయ, తృతీయ పురుషార్థాలను గురించి విశదపర్చటం ఈయన ఒకానొక ధ్యేయమట. అందుకే అర్థశాస్త్రాన్ని, కామసూత్రాలను రెంటినీ వ్రాశాడట.

ఇంకొక విషయం. చాణక్యుడు అక్షరాలా తెలుగువాడు. నాగులు అంటే తెలుగు వారు. మల్లనాగుడు అన్న పేరు కూడా అందుకే. చాణక్యుడి కాలంలో ఆంధ్ర రాజ్య ప్రభువు సత్యశ్రీ శాతకర్ణి అని రచయిత చెబుతారు.

చాణక్యుని కథ కర్ణాకర్ణిగా విన్నవారికి ఈయన నందవంశ నాశనానికి ఒడిగట్టిన ఓ ప్రతీకార వాది అనిపిస్తుంది. అయితే చాణక్యుని ఆలోచన అది కాదు. భారతదేశాన్ని జయించడానికి వచ్చిన యవనులు, ఇక్కడి యువతులను వివాహమాడి, లేదా లోబర్చుకుని, వారి ద్వారా సంతానాన్ని వృద్ధి చేసి, తద్వారా సాంస్కృతిక మూల నాశనానికి పూనుకుంటారు. యవనుల ప్రభావాన్ని, యవనులు భారతంలో చేస్తున్న బీజారోపాలను అడ్డుకోవడానికి, ప్రజా సమూహాన్ని చైతన్య పర్చి, ఓ మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే ఈయన ధ్యేయం. దీనికి ఎంచుకున్న ఉపాయం భేదోపాయం. ఈయన తక్షశిల విశ్వవిద్యాలయంలో అనేకమంది శిష్యులను ఏర్పరుచుకుని, వారిని వివిధ రాజ్యాలకు పంపి,వారి ద్వారా యవనులపై తిరుగుబాటు చేయిస్తాడు. ఈ కథాకథనం అంతా ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో సాగుతుంది.

ఆ తర్వాత కథలో నంద వృత్తాంతము, మౌర్య వృత్తాంతము చెబుతారు రచయిత. శిశునాగ మహానందుడికి మురాదేవి, సునందాదేవి అని ఇద్దరు భార్యలు. మురాదేవి పుత్రుడు కుమార గుప్తుడు. మురా దేవి తండ్రి పిప్పల వన ప్రభువు. సుక్షత్రియుడయినప్పటికీ, ఆయన బౌద్ధం స్వీకరించి, ఆ తర్వాత తిరిగి హిందూ మతానికి మరలడంతో ప్రజలీయనను శూద్రుడని దూషించారు. అందువల్ల మౌర్యులు శూద్రులని జనాలకు అపోహ ఏర్పడింది. ఇక సునందాదేవికి ఇద్దరు పుత్రులు.శిశునాగ మహానందుడికి ఉగ్రసేనుడనే ఒక క్షురక మిత్రుడు. ఆ క్షురక మిత్రుడు సైన్యాధిపతి అయి, ఆ తర్వాత మహానందుని, ఇద్దరు పుత్రులను చంపి, సింహాసనమాక్రమిస్తాడు. సునందా దేవి ఈతనిపై మోజుతో ఇతణ్ణి వరిస్తుంది. ఉగ్రసేనుడే మహాపద్మనందుడు. ఇతనికి సునందా దేవి వలన ఎనమండుగురు పుత్రులు. వారు, మహాపద్మనందుడితో కలిపి నవనందులు. వీరిని శకటాలుడనే మంత్రి ప్రతిఘటిస్తే, ఆయనను చంపేస్తారు. కాలక్రమేణా మహాపద్మనందుడు రాజ్యం ముగించి, పెద్దవాడైన సుకల్ప నందుని రాజును చేస్తాడు. ఈ సుకల్పనందుడు భోగలాలసుడు. అయితే నంద రాజ్యానికి రాక్షస మంత్రి ఆయువుపట్టు. నంద రాజ్యం తిరుగుబాట్లు లేకుండా ఉండడానికి కారణం కేవలం ఈ రాక్షస మంత్రి అనబడే సుభూతి వర్మ.ఈ సుకల్పనందుడు ఒకనాడు మౌర్యులను విందుకాహ్వానించి, ఆ భవన ద్వారాలను మూసి వేయిస్తాడు. లోపల మౌర్య్లులు కర్తవ్యం ఆలోచిస్తారు. అందరూ భుజిస్తే భోజన పదార్థాలు అయిపోయి అందరూ చచ్చిపోతారు. బదులుగా అందరూ పస్తులు ఉండి, తమలో చిన్నవాడొక్కడూ కొంచెం కొంచెం భుజిస్తే, తను ప్రాణాలు దక్కించుకుంటాడు. ఆ ప్రాణాలు దక్కించుకున్నవాడు తర్వాత ప్రతీకారం నెరవేర్చాలి. ఇలా ఆలోచించి, అందరూ ఆకలితో మరణిస్తారు. చిన్నవాడైన చంద్రగుప్తుడు బతికి బట్టకడతాడు.

ఈ తర్వాత నవనందుల నాశనానికి చాణక్య ప్రతిజ్ఞ, చంద్రగుప్తుడిని చేరదీయటం జరుగుతాయి. ఆ తర్వాత రాక్షస మంత్రికి, ఆర్య చాణక్యునికి మధ్య ఎత్తులు పైఎత్తులు ఊహించనలవి కానంత అద్భుతంగా ఉంటాయి.

ఈ ఆటలో ప్రధానమైన పావు జీవసిద్ధి. ఈ జీవ సిద్ధి చాణక్యుడి నమ్మిన బంటు. అయితే, సుకల్పనందుడి పంచన చేరుతాడు. కాలక్రమేణా రాక్షస మంత్రికంటే ఎక్కువ ప్రాపకం సంపాదిస్తాడు.

ఈ ఎత్తులు పైఎత్తులు నందుడు చనిపోయిన తర్వాత, చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయిన తర్వాత కూడా కొనసాగుతాయి. చివరికి రాక్షస మంత్రిని చంద్రగుప్తుడికి మంత్రిగా చేసి చాణక్యుడు వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు.

చివరి అధ్యాయాలలో అర్థశాస్త్ర పరిచయం చేస్తారు రచయిత.

ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్
నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియంహితమ్

ప్రజల సుఖమే తన సుఖము, ప్రజాహితమే తన హితము.తనకు, ప్రజకు వేరు హితము లేదు.

పరిపాలనా విధానం చెబుతూ, రాజ్యమంతటికీ కేంద్ర కార్య నిర్వాహకులు (central executive body) , రాష్ట్ర కార్య నిర్వాహకులు (provincial executive body), గ్రామ కార్య నిర్వాహకులు ఒకరికింద ఒకరు ఉండాలి. ఒక్కొక్క నిర్వాహక గణం లో 18 మంది. అందులో ఒకరు సమాహర్త (collector general). ఈ ఉద్యోగము మిక్కిలి బాధ్యత గలది. అలాగే వివిధ అధికారులు, వారి అధికారాలు, పన్ను, సుంకాల గురించి, సైన్యం గురించి, ఇతరత్రా అనేక ఆర్థిక విషయాల గురించి వివరించారు.

ఇక సామాజిక విషయాలపై చాణక్యుని భావాలు అప్పటి కాలానికే ఎంత అభ్యుదయ భావాలతో ఉండేవో మచ్చుకు కొన్నిటిని చూడండి.

వివాహ వ్యవహార యోగ్యత స్త్రీకి 12, పురుషుడికి 16. నీచుడు, పరదేశ గతుడు, ఘాతుకం తలపెట్ట యత్నము చేసెడి వాడు, పతితుడు, నపుంసకుడు అయిన పతిని విడచి, స్త్రీ పునర్వివాహము చేసుకొనవచ్చును. కన్యకు శుల్కమునిచ్చి పురుషుడు వివాహము చేసుకొనవలెను.భర్తను ద్వేషించు భార్య తనయనుజ్ఞ లేక విడువరాదు. అలానే భర్త కూడానూ. ఇద్దరూ, ఒకరినొకరు ద్వేషిస్తే, అంగీకారముతో విడిచిపుచ్చవచ్చును.

************************************************

విస్తృత పరిశీలన తర్వాత 1953 లో వెలువరింప బడిన ౩౦౦ పేజీల పైచిలుకు ఈ నవల, 1956 లో పునర్ముద్రింపబడింది. నావద్ద ఉన్నది అక్టోబరు 2005 లో ముద్రించారు. ఈ నవల 1954 – 1958  మధ్యలో ఆంధ్ర, మద్రాసు యూనివర్సిటీ వారు B.A, B.Com, B.Sc లకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారుట.

రచయిత డా. వేదుల సూర్యనారాయణ శర్మ గారు బహుముఖ పండితులు, కళాప్రపూర్ణ, సరస్వతీ కంఠాభరణులు. ఈ పుస్తకం గంగాధర పబ్లికేషన్ విజయవాడ వారిది. ఇప్పుడు విశాలాంధ్రలో దొరుకుతున్నది.

చరిత్రపైన తెలుగుపుస్తకాలు చాలా అరుదు. అలాంటి ఓ అరుదయిన పుస్తకం ఇది.

ఈ పుస్తక ప్రచురణ కర్తలు:

గంగాధర పబ్లికేషన్స్,

రామమందిరం వీధి,

విజయవాడ – 520 002.

వారి ఫోను : 2433261.

You Might Also Like

16 Comments

  1. సారధి మోటమఱ్ఱి

    ప్రసాద్, విజయ మాసపత్రికలో ధారావాహికంగా చాలా చారిత్రక నవలలు అందించారు, అందు ‘ఆర్య చాణక్య’, ‘విజయనగర పతనం’, ‘రోషనార’ మొదలుగా (1970s). నేను మరొక నవల చదివాను, అందు మీరు అన్నట్లు చాణక్యుడు తెలుగువాడు అని చదివినట్లు గుర్తు. బహుశ అది మీరు చెప్తున్న ఈ పుస్తకం కావచ్చు. పోయిన విలువైన వాటిల్లో ఇదే ఇంకోటి.

  2. Venkat Nanda

    ee book lo unna matter 10000% wrong information.. asalu rasindi evaru..

  3. kanista

    నిజంగా అద్భుతమైన పుస్తకం. మిత్రులు చెప్పిన విధంగా ఈ పుస్త‌కం గంగాధర పబ్లికేషన్స్ పేరు మీదే ప్ర‌చురిత‌మైంది. కానీ ఆపేరుతో ప‌భ్లిష‌ర్ సంస్థ ఏదీ ప్ర‌స్తుతం న‌డ‌వ‌టం లేదు. బ‌హుశా అది క్వాలిటీ ప‌బ్లిష‌ర్స్ వారి అనుబంధ సంస్థ అయ్యి ఉంటుంది. ప్ర‌స్తుతం దీనిని పున‌ర్ముద్రిత సంచిక‌ల‌ను క్వాలిటీ ప‌బ్లిష‌ర్స్ విక్ర‌యిస్తోంది. పుస్త‌కం వెల రూ.150 ఉంటే రూ. 130కి వారు విక్ర‌యిస్తున్నారు. వారి చిరునామా రామ‌మందిరం వీధి, కోట‌య్య హోట‌ల్ నుంచి మూడో ఇల్లు,ఏలూరు రోడ్, విజ‌య‌వాడ. ఫోన్ః 08662433261 మొబైల్ నంబ‌రు 09848415560. పుస్త‌కం అందుబాటులో లేని మిత్రులు వారి మొబైల్ నంబ‌రుకు ఫోన్ చేస్తే స‌హాయం దొర‌కొచ్చు.

  4. MVRAMARAO

    ఆర్య చాణక్య,అప్పాజీ,విజయ నగర సామ్రాజ్య పతనం,చారిత్రిక నవలా సామ్రాట్ శ్రీ ప్రసాద్ గురించి వివరాలు – .మీ దగ్గర ఉన్నాయా ?.

    1. Anil అట్లూరి

      ప్రసాద్ గారు, ఆంధ్రప్రభ – హైద్రాబాదులో ఉన్నారని ఇటీవలి సభలో ఎవరో అన్నారు.

  5. మణి వడ్లమాని

    ఎంతమంది రాసిన,ఎన్ని సార్లు చదివినా తనివితీరని మన ఘనమైన గత చరిత్ర, ‘ఆర్య చాణక్య ‘నేటికి,భావితరాలకి కూడా మార్గదర్శకాలే

  6. n dakshina murty

    పురాణ వైరి గ్రంధమాల పుస్తకం ప్రతి ఎక్కడ దొరకుతుంది ?

  7. murthy

    విశ్వనాధ వారి మౌర్య చంద్రగుప్తుడు కుడా చదవండి. (పురాణ వైరి గ్రంధమాలలో ఒకటి) పుస్తకం అయ్యిపోయిన తరువాతే మీరు లేస్తారు దేనికైనా 🙂

  8. sriramakrishna

    chalabagudi nakunachidi chanukde

  9. sriveena

    chala chala dhanyavadamulu..enno rojulanundi chadavalanukunnanu…mee vivarana dwara chala vishayalu thelsuko galiganu.

    eevishayalanni panchukunnanduku dhanyavadalu ravi garu.

  10. VASU

    THIS IS VERY GOOD INFORMATION FOR KNOWING ABOUT KOUTILYA !!

  11. gopinath naidu

    very thanks to u sir for giving this information and one small requsti whant to read this story in on line for that if any site will avilabale plz tell me..

  12. maitreyi

    Thanks for providing this review.
    Is it proved that Chanakya is from Andhra?
    It is also a news for me that Mouryas and Nanda’s are related.

  13. రవి

    రాజమహేశ్వర్ గారు,

    ఈ పుస్తక ప్రచురణ కర్తలు గంగాధర పబ్లికేషన్స్, రామమందిరం వీధి, విజయవాడ – 520 002. వారి ఫోను : 2433261. ఈ పుస్తకం నేను ఈ మధ్యనే విశాలాంధ్రలో కొన్నాను.

  14. Sowmya

    Interesting book.
    Viswanatha Satyanarayana’s “purana vaira granthamala” series has two parts related to the Nanda kings and Maurya, Chanakya story. I was reminded of that when I read a part of this review 🙂
    Nice review…
    (Cant type in Telugu here) 🙁

  15. రాజ మల్లేశ్వర్ కొల్లి

    నేను ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకం ఇది. కొంత మంది పెద్దలద్వార చాల కాలం క్రితం ఈ పుస్తకం గురించి విన్నా. కానీ ఆ పుస్తకం ఎక్కడా దొరకలేదు (1995 ఆ ప్రాంతంలో). 2005 లో పునఃముద్రణ జరిగిందన్నారు…, ఎక్కడ దొరుకుతుందో, పబ్లిషర్స్ ఎవరో తెలియజేస్తే నా బోటివాళ్ళకు మరింత ఉపయుక్తం గా ఉంటుంది. ఈ పుస్తకం గురించి తెలియపర్చినందుకు ధన్యవాదములు.

Leave a Reply