24వ విజయవాడ పుస్తక మహోత్సవం

ఈ సంవత్సరం కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ సందర్శించే అవకాశం వచ్చింది. జనవరి 1 నుంచి 11 వరకg జరిగిన ఈ ప్రదర్శనలో ఆరురోజులపాటు రోజూ సాయంత్రం పుస్తకాలు చూడటానికి, మిత్రుల్ని కలవడానికి, ప్రధాన వేదికనుంచి ప్రసంగాలు వినడానికీ అవకాశం దొరికింది.

నండూరి రామమోహనరావుగారి స్మారకసభలో, శ్రీరమణగారు, నండూరి పార్థసారథి గారు రామమోహనరావుగారి బహుముఖ ప్రజ్ఞను పరిచయం చేశారు. ఇంకో స్మారకసభలో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వెలగా వెంకటప్పయ్య గార్లు బాలబంధు బి.వి.నరసింహారావుగారి జ్ఙాపకాలను పంచుకొన్నారు. ఒక రోజు డొక్కా మాణిక్యవరప్రసాద్ అనే మంత్రిగారు పుస్తకపఠనం ఆవశ్యకత గురించి చక్కగా మాట్లాడారు. ఇంకో రోజు చాగంటి తులసిగారు మరికొందరు తెలుగు – ఒరియాలలోకి పరస్పరం అనువదించటంలో ఉన్న సమస్యలగురించి మాట్లాడారు. ఇంకో పూట మా తానా ప్రచురణల కథ నేపథ్యం పుస్తకాన్ని నవోదయా రామ్మోహనరావు గారు ఆవిష్కరించారు. రచయితలు పి.సత్యవతి, శ్రీరమణ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య గార్లు తమ కథలనేపథ్యాల గురించి మాట్లాడారు.

ఈసారి పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకంగా అనిపించిన కొన్ని విషయాలు-

అందుబాటులో ఉన్న తెలుగు పుస్తకాల సంఖ్య బాగా పెరిగింది. 1960,70లలో ప్రాచుర్యంలో ఉన్న రచయితల పుస్తకాలు చాలా పునర్ముద్రణ పొందాయి. యద్దనపూడి సులోచనారాణి, ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి, మాలతీ చందూర్, కొమ్మూరి వేణుగోపాలరావు వంటి వారి పుస్తకాలన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివు యుగంధర్ పుస్తకాలు చాలా, కొవ్వలి పుస్తకాలు కొన్ని కూడా దొరుకుతున్నాయి. ఎమెస్కో ప్రచురణలవారు రోజుకో పుస్తకాన్ని ప్రచురిద్దామనుకుంటున్నారనీ, ఈ-బుక్స్ రంగంలోకి కూడా దిగుదామనుకుంటున్నారనీ వార్త వినవచ్చింది.

వ్యక్తిత్వ వికాసం, అమ్మకాలు పెంచుకోవడం, మానేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్, ఆధ్యాత్మిక సంతృప్తి, పర్సనల్ ఫైనాన్స్ వంటి విషయాలపై సెల్ఫ్‌హెల్ప్ పుస్తకాలు ఇప్పుడు తెలుగులో విపరీతంగా దొరుకుతున్నాయి. ఐతే యండమూరి వీరేంద్రనాథ్, బి.వి.పరశురాంలు వ్రాసిన పుస్తకాలతో పాటు ఆంగ్లం లోంచి తెలుగులోకి తర్జుమా ఐన పుస్తకాలు చాలా దొరుకుతున్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రచురణ సంస్థలు ఇంగ్లీషులో బాగా అమ్ముడౌతున్న పుస్తకాలని (రాబిన్ శర్మ, స్టీవెన్ కవీ, డేల్ కార్నిజీ వగైరాలు వ్రాసినవి) తెలుగులోకి అనువదించి మంచి పేపరుమీద చక్కగా అచ్చు వేసి అమ్ముతున్నారు. మామూలు తెలుగు పుస్తకాలలో ముప్పాతిక వంతు పుస్తకాలకన్నా ఈ పుస్తకాల ప్రచురణల నాణ్యత మెరుగ్గా ఉంది. శాంతకుమారి, మృణాళిని వంటి ప్రసిద్ధులతో ఈ పుస్తకాలని అనువదింపజేస్తున్నారు. నేను లెక్కపెడితే మార్కెట్లో ఈ పుస్తకాలు నలభై పైచిలుకే ఉన్నాయి. బాగా అమ్ముడుపోతున్నవట.

ఎప్పట్లానే పిల్లల పుస్తకాల షాపులు – మంచిపుస్తకం, కొత్తపల్లి పక్కపక్కనే ఉన్నాయి. ఎప్పుడు చూసినా రెండు షాపులూ బిజీగానే ఉన్నాయి. అమ్మకాలు బాగున్నాయని చెప్పారు. మంచిపుస్తకం సురేష్, భాగ్యలక్ష్మి గార్లతో ముచ్చటించే అవకాశాలు చాలానే దొరికాయి. ఇంత దీక్షగా ఉద్యమంలాగా పిల్లల పుస్తకాలను ప్రచురిస్తున్న వీరిని చూస్తుంటే, పిల్లల తెలుగు సాహిత్యంపై నాకు చాలాకాలంగా ఉంటున్న బెంగ కొంత తగ్గుతూంది. మీరు ఎప్పుడు ఏ పిల్లలకోసం గిఫ్టులు కొనాలనుకొన్నా, వారి వయసుకు తగ్గ పుస్తకాలు, అందంగా ఆకర్షణీయంగా ఉన్న పుస్తకాలు, చదవటానికి సరదాగా ఉండే పుస్తకాలు, చౌకగా దొరుకుతున్నాయి, కొని గిఫ్టులుగా ఇవ్వండి. పిల్లలలో తెలుగుపట్ల ఆసక్తి పెంచటానికి అవసరమైన పనుల్లో ముఖ్యమైనవాటిలో ఇదొకటని నా నమ్మకం.

రచయిత పరవస్తు లోకేశ్వర్‌ గారు తన పుస్తకాలతో ప్రత్యేకంగా స్టాలు పెట్టుకొన్నారు. సాదరంగా మాట్లాడారు. ఇంకోసారి తీరిగ్గా వెళ్లి చూద్దామనుకొన్నాను; కాని వెళ్ళలేకపోయాను.

కినిగె స్టాలు ఎప్పుడూ బిజీగానే ఉన్నట్టు అనిపించింది. సురవర కీబోర్డులు బాగా అమ్ముడయ్యాయని భోగట్టా.

మిథునం ఒకేఒక్క మిథునంగానూ, కథల సంపుటిగానూ ఇంకా బాగానే అమ్ముడౌతుంది. కొద్దిగానే వచ్చిన కథ నేపథ్యం పుస్తకాలు ఐదో రోజుకు అమ్ముడైపోయాయి.

ఇంతకు ముందుతో పోలిస్తే జనం తక్కువగా ఉన్నారు అనిపించింది నాకు. ఆదివారం బాగా రద్దీగా ఉందన్నారు కానీ నేను ఆ రోజు వెళ్ళలేదు.

రచయితలు, మిత్రులు చాలామంది కనిపించారు.

28కిలోల పుస్తకాలు పోగయ్యాయి. వీటిని మాఇంటికి తెచ్చుకోవడమెలాగో? ఎప్పుడో?

You Might Also Like

4 Comments

  1. కొత్తపాళీ

    బాగుంది. పైన హేమాద్రిగారి వ్యాఖ్య మరీ బాగుంది

  2. Madhu

    The meeting on Baalala sahityam has given me idea to bring all the books of Baalababdhu Shri B V Narasimha Rao in one are two volumes. I was able to contact Dr Velaga Venkatappiah, Shri Bhat Ex AIR and 20 others, who agreed to contribute articles on Baalabandhu. We have already collected 21 books of Baalabandhu and DTP work is going on. We yet to collect 11 books of him. If any body has books of Baalabandhu, please share a xerox copy to include in this compilation. If anybody is interested, I can can give the list of books not available for us.

    Baalabandhu is poet with simple songs, dancer and lady character artist. He supposed have thought ANR and Late Shri Vedantam Satyanarayana Sarma how to do lady roles and excel in that roles.

    I am sure many people like the compilation of Baalabandhu

    Review of book festival by Dr Chowdary V Jampala is good and informative for the people, who could not vist and also to the people who visited. I wish Dr Chowdary visit Vijayawada Book Exhibition every year.

  3. Koppula Hemadri

    జంపాలగారి విజయవాడ పుస్తక ప్రదర్శనా విశేషాలు బాగున్నాయి. బోలెడన్ని పుస్తకాలు కొనుక్కోవడం సంగతటుంచితే, ఈసారి నాకు అనేక కొత్త మిత్రులు పరిచయమయ్యారు. ముఖ్యంగా ‘జంపాల, శ్రీరమణ, పప్పు అరుణ! వీరిని పరిచయం చేసినవారు దేవినేని మధుసూదనరావుగారు. ఈయనో పుస్తక ప్రియుడు! వీరి శ్రీమతి జయశ్రీ కూడ. వీరిద్దరూ తమకు నచ్చిన పుస్తకాలను కొని, తెలిసినవారికి ఉదారంగా పంచి, చదివించి… అప్పుడుగాని నిద్రపోరు! ఈ అలవాటు వైరస్‌లా అందరికీ అంటుకుంటే, అలాంటి వైరస్‌ను నేను ఆహ్వానిస్తా. ఇప్పటికే నాకూ కాస్త అంటుకున్న సూచనలు కనిపిస్తున్నాయి! – హేమాద్రి

Leave a Reply