పుస్తకం
All about booksపుస్తకభాష

February 1, 2013

తిరగబడ్డ తెలంగాణ – ఇనుకొండ తిరుమలి

More articles by »
Written by: అసూర్యంపశ్య
Tags:

కొంతకాలం క్రితం ఆర్.నారాయణమూర్తి గారి “వీర తెలంగాణ” చిత్రం చూశాక తెలంగాణా సాయుధ పోరాటం సంఘటనలు నన్ను వెంటాడాయి. అప్పట్లో బైరంపల్లి ఘటన పై రాసిన ఒక చిరుపుస్తకమూ (ఈ పుస్తకం ఒకప్పుడు ఇక్కడ ఆన్లైన్లో ఉచితంగా చదువుకునేందుకు ఉండేది. ఇప్పుడు లేదుమరి! ఇక్కడ జరిగిన మారణహోమాన్ని జలియన్వాలాబాఘ్ ఉదంతంతో పోలుస్తారు.), ఈ సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకమూ -రెంటినీ పైపైన తిరగేసినా కూడా, ముందుకు సాగలేదు నా చదువు. ఈ నేపథ్యంలో మొన్నామధ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిని కలిసినప్పుడు ఈ పుస్తకం గురించి తెలిసింది. ఒక చరిత్ర పరిశోధకుడు రాసిన థీసిస్ అనగానే భయం వేసింది. ఇది నాకర్థం కాదులే అనుకుంటూ ఉన్నా, స్ట్రాంగ్ రికమెందేషన్ మూలాన చదవడం మొదలుపెట్టాను.

తెలంగాణ సాయుధ పోరాటంపై రచయిత రాసిన పీ.హెచ్.డీ థీసిస్ కు ఒక కొనసాగింపులా సాగిన పరిశోధనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం. నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఉద్యమం మొదలై, కొనసాగిన తీరును ఆవిష్కరించడం ఈ పుస్తకం లక్ష్యం (ఇప్పటి ఖమ్మం జిల్లా అప్పటి వరంగల్ జిల్లాలో భాగం). చారిత్రక, సామాజిక నేపథ్యాలను వివరించడంతో మొదలుపెట్టి, 1948 దాకా వచ్చి ముగుస్తుంది ఈ పుస్తకం. సాధారణంగా ఈ సాయుధ పోరాటం గురించి వివరించే రచనలన్నీ కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుండి, పార్టీని కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు (ఈ ముక్కనేను కాదు అంటున్నది. పుస్తకంలో కూడా రాసారు. ఈ విషయమై నేను ఏదన్నా తెలుసుకోజూసిన ప్రతిసారీ కమ్యూనిస్టుల రచనలే నాకు కనబడ్డాయి అన్నది వేరే విషయం!). అయితే, ఈ రచనలో 1940ల నాటి తెలంగాణా పోరాటాల్లో ప్రజల భాగాన్ని అధ్యయనం చేయడం ముఖ్య లక్ష్యమని రచయిత ఉపోద్ఘాతంలోనే స్పష్టం చేశారు. పుస్తకం కవర్ పేజీ – “మా భూమి” అన్న చిత్రం లోనిదట. వ్యక్తిగతంగా ఈ సినిమాలో అసలు కథ కన్నా కమ్యూనిస్టు ప్రాపగండా ఎక్కువని నాకు అనిపించింది ఆ మధ్య ఈ సినిమా చూసినప్పుడు. మరి ముఖచిత్రంగా దాన్ని పెట్టారేం? అనుకున్నాను.

***
పుస్తకంలో ఎనిమిది ప్రధాన అధ్యాయాలు (ముందుమాట, అనుబంధాలు కాక). వీటిలో మొదటి రెండు అధ్యాయాలు ఉద్యమానికి వెనుక చారిత్రక నేపథ్యం, ఉద్యమానికి దారితీసిన భూస్వామ్య పరిస్థితులు, “దొర” దొర గా తయారైన వైనాన్ని విశ్లేషిస్తాయి. తరువాత రెండు అధ్యాయాలు “చిల్లరోళ్ళు” అని పిలువబడే వృత్తి కులాల వారు, రైతులూ ఈ దొరలపై తిరుగుబాట్లు చేయడాన్ని గురించి విశ్లేషిస్తాయి. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రమహాసభ/కమ్యూనిస్టు పార్టీ వీళ్ళని సంఘటిత పరచడం, నిజాం/దొర లకు వ్యతిరేక సాయుధ పోరాటం, కొన్ని ప్రాంతాల్లో సంఘం రాజ్యం ఉండడం – ఈ క్రమాన్ని వివరిస్తూ, విశ్లేషిస్తూ 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని తన పరిధిలో విలీనం చేసుకోవడం దగ్గర ఆపేస్తారు రచయిత. మొదటి రెండు అధ్యాయాలు మినహాయిస్తే, తక్కినవన్నీ తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఉన్నాయి. మొదటి రెంటిలో (నా అభిప్రాయం ప్రకారం) భాషలోని పదజాలం సులభ గ్రాహ్యమే అయినా, అనువాదంలో వాక్య నిర్మాణం అంత బాగాలేదు.

వెట్టి కి కట్టుబడి ఉన్న వివిధ కులాలవారందరూ మతం మార్పిడులకి ఆకర్షితులు అవుతున్న విధానం గురించి రచయిత రాసిన కొన్ని వాక్యాలు ఆసక్తికరమైన పరిశీలనలు అనిపించాయి నాకు.

“..ఈ విధమైన పాత చరిత్రా, అనుభవమూ వెట్టి జనసమూహాలకున్నది కాబట్టి ఈ సంఘం కులం పేరిట వ్యవస్థీకరించబడి ఉండడం మూలాన దోపిడీ, ఆకలీ ఈ సంఘంలో విడదీయరాకుండా పెనవేసుకుపోయిన అంశాలని వారు తెలుసుకోగలిగారు. వారు చేపట్టిన బహిష్కరణ పోరాటాలూ, నిరసనలూ వారిని విముక్తి చేయలేకపోయాయి. ఎంతవరకైతే తాము ఫలానా కులానికి సంబంధించిన వారమనే గుర్తింపు కలిగి ఉంటారో అంతదాకా వారు గ్రామానికి సేవలు చేయాల్సి ఉంటుందని వారికి అర్థమయ్యింది. అందువల్ల, ఈ శ్రామిక కులాలు, ప్రత్యేకించి అంటరాని వాళ్ళు తాము వెట్టి చాకిరీ నుండీ తప్పించుకోగలగాలంటే ముస్లిం మతం పుచ్చుకోవడంలో అందుకు ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు. ఇత్తిహదుల్ ముస్లిమీన్ వాలంటీర్లు వారిని (ఈ కులాలవారిని) కలిసినప్పుడు తమ కులం లేదా మతంను మార్చుకోవడానికి ఇష్టపడినారు.”

(Page 63)

ఈ ఉద్యమం మూలదశ నుండీ, ఈ పుస్తకం ముగిసిన 1948 కాలం దాకా ఇందులో కమ్యూనిస్టుల పాత్ర ఎలా మారుతూ వచ్చిందో, ఆ పార్టీ వారికి వివిధ వర్గాల/కులాల ప్రజలతో, ప్రభుత్వంతో గల సంబంధాల పరిణామక్రమం ఉదహరిస్తూ చేసిన పరిశీలనలు కూడా చాలా విజ్ఞానదాయకంగా అనిపించాయి. ముందుమాటలో రాసినట్లు, ఇది నిజంగా ప్రజల పాత్రను ప్రధానంగా తీసుకుని విశ్లేషించిన పరిశోధనే!

పుస్తకం చదువుతున్నంతసేపూ – నారాయణమూర్తి సినిమాలోని దృశ్యాలు పదే పదే గుర్తు వచ్చాయి. ఆ సినిమాని నేను మళ్ళీ చూసి తట్టుకోగలనో లేదో చెప్పలేను కానీ, చారిత్రక వాస్తవాలని వీలైనంత వాస్తవికంగా ఆ సినిమాలో తెరకెక్కించారని మళ్ళీ అనుకున్నాను.

ఇకపోతే మరీ లెక్కలేనన్ని కాకపోయినా, కొన్ని టైపోలు అయితే ఉన్నాయి. విశ్లేషణ అంటే విశ్కేషణ అని రాయడం వంటివి చిరాకు పుట్టించాయి.

కొన్ని చోట్ల (ముఖ్యంగా ప్రారంభ అధ్యాయాల్లో )అనువాదం మరీ వాక్యాల్ని అయోమయంగా మార్చేసినట్లు తోచింది). ఉదా:

“జాగీర్ల తాలూకు రాయల్ కమిషన్ ఇలాగే అభిప్రాయపడింది. “నిజాం ఏలుబడిలోని జనాభాలో అత్యధికులు హిందువులు. వారు రాజ్యమంతటా దేశవాళీ రాజాల, ప్రముఖుల పాలనకింద ఉండేవారు. వారికి ఇదివరకు రాజుల నుంచి భరణం, గ్రాంటు అందుతూండేది. ఢిల్లీ చక్రవర్తులు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు … …” (పుట 18)
-మొదట ఇది చదవగానే, మామూలు జనాభాకి భరణాలు, గ్రాంటులు ఎందుకిస్తారు? అన్న సందేహం కలిగింది నాకు.. 🙂

మరొక వాక్యం:
“మొత్తంమీద 29.4 శాతం జనాభా, 34 శాతం గ్రామాలు, 35.7 శాతం స్వయంప్రతిపత్తిగల ప్రాంతాలు సంస్థానాలరూపంలో ఉండేవి” – ఈ వాక్యాన్ని రెండు మూడుసార్లు చదవాల్సి వచ్చింది సరిగ్గా అర్థం కావడానికి (నాకు మొదట్సారే అర్థమైంది – అనేవారికి: నాకర్థం కాలేదు.).. జనాభా సంస్థానాల్లో ఉంటుంది కానీ, సంస్థానాల రూపంలో ఉండదు కదా..? అని సందేహం కలగడం వల్ల వచ్చిన తంటా అది.

ఇలాంటివి కొన్ని ప్రారంభంలోని రెండు అధ్యాయాల్లో ఉన్నాయి. అయితే, తరువాతి అధ్యాయాల్లో అంతగా ఇబ్బంది పడ్డట్లు గుర్తులేదు.

చివరగా, రచయిత చివరి అధ్యాయంలో రాసిన కొన్ని మాటలు ఈ పుస్తకం వెనుక ఉన్న స్ఫూర్తిని, ఇది రాయడంలో గల ఉద్దేశాన్ని తెలియజెప్తాయని నేను అభిప్రాయపడుతున్నాను కనుక, ఆ వాక్యాలు ఇక్కడ టైపు చేస్తున్నాను –

“తెలంగాణా ఉద్యమం కార్మిక, కర్షక ప్రజానీకం స్వీయ చైతన్యంతో అన్యాయానికి వ్యతిరేకంగా సంఘటితంగా చేసిన కృషి ఫలితం. తొలుత దొరల అక్రమాలకూ అన్యాయాలకూ వ్యతిరేకంగా, తమ వ్యక్తిగత కష్టాలను, కుల అసమ్మతినీ తెలియజేస్తూ సాగే సామాజిక నిరసనల రూపంలో ఈ ఉద్యమం ప్రారంభమయింది. ఆ తరువాత ఆంధ్ర మహాసభ మేధావి వర్గం, కమ్యూనిస్టు పార్టీల సహకారంతో ప్రజారాజ్య స్థాపన లక్ష్యంతో క్రమంగా మహోన్నత సాయుధ పోరాటంగా మారింది. దొరల పెత్తనం, ప్రభుత్వ అధికారుల లంచగొండితనం, దొరలతో నిజాంకున్న అవగాహన వంటి అంశాలపై కమ్యూనిస్టుల రాజకీయ విశ్లేషణలు క్రమంగా ప్రజలలో నాటుకుని, ప్రజాభిప్రాయంగా మారి నాటి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలనే రాజకీయ లక్ష్యానికి వారిని సన్నద్ధం చేశాయి. ప్రజలలోని సామాజిక/వర్గ చైతన్యం మూలంగానే కమ్యూనిస్టుల రాజకీయ కార్యక్రమానికి, సిద్ధాంతానికి ప్రేరేపితులై దొరలనూ, నిజాంనూ సవాలు చేసే భారీ రాజకీయ పోరాటానికి సిద్ధపడ్డారు.
….
….
ఉద్యమ అభివృద్ధిలో, వ్యవసాయిక మార్పు తీసుకురావడంలో కులం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని తెలంగాణా అనుభవం స్పష్టం చేస్తోంది. ఏదియేమైనా, చిల్లరోళ్ళ ప్రాథమిక ప్రతిఘటనా చైతన్యం, మిలిటెంట్ చర్యలే కమ్యూనిస్టుల రాజకీయ ఎజెండాగా మార్పు చెంది తెలంగాణా ఉద్యమాన్ని సుసాధ్యం చేశాయి.”

– ఈ వాక్యాల గురించి నాకు అభ్యంతరాలు ఏమీ లేకపోయినా, ఇందులో ఈ “కులం” పాత్ర గురించి రచయిత అంత ఎక్కువగా దృష్టి సారించలేదు అని నాకు అనిపించింది. అలాగే, “సంఘం రాజ్య స్థాపన” అన్న చివరి అధ్యాయం కూడా నాకు సరిగా అర్థం కాలేదు – అంటే నాకు తెలుగు రాదనో, ఆ భాష బాగోలేదనో కాదు – చాలా సందేహాలు కలిగాయని మాత్రమే చెబుతున్నా.

ఇక కంచికెళ్ళిపోయేముందు::

నాకు చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం చాలా సందర్భాల్లో చేత కాదు. అది నాకు పరిజ్ఞానం లేకపోవడం వల్ల మాత్రమే కాదనీ, ఆ కారణానికి ఆ రచనా విధానం కూడా తోడైనందువల్ల నేను చదవలేకపోతున్నాను అనీ నా భావన. చరిత్ర పుస్తకమే అయినప్పటికీ, విస్తృత పరిశోధన చేసినదే అయినప్పటికీ – ఇందులో అకడమిక్ భాష ఉండదు. పైగా, ప్రభుత్వ ఆర్కైవుల్లో ఉన్న రిపోర్టులు మొదలుకుని, వివిధ చరిత్రకారుల పరిశోధనా పత్రాల దాకా అన్నింటినీ విపరీతంగా పేజి పేజీలోనూ కోట్ చేసినప్పటికీ, జన బాహుళ్యంలో ప్రచారం పొందిన ప్రజాగాయకుల పాటలని, ఆనాటి ప్రముఖ నవలలను కూడా ఎక్కడికక్కడ ఉటంకిస్తూ రాస్తూ పోయినందువల్ల అనుకుంటాను – చాలా ఆసక్తికరంగా, ఏదో కథ వింటున్నట్లుగా సాగింది రచన. దీనికి బహుశా ప్రభాకర్ మందార, సహవాసి గార్ల అనువాదం కూడా కొంత (మరీ ఎక్కువ కాదు!) దోహదం చేసిందనుకుంటాను. మొదటి అధ్యాయం ఒక్కటి తప్పిస్తే తక్కినవన్నీ ఆపకుండా చదివించేలా ఉన్నాయి. ఈ విధమైన కథనం ఈ పుస్తకానికి అన్నింటికంటే పెద్ద ప్లస్ (నా దృష్టిలో)! కనీసం చరిత్ర విద్యార్థులు, పరిశోధకులు కాని మామూలు ప్రజలు కూడా చరిత్రను చదివి అర్థం చేసుకునేందుకు ఇది మంచి కథనరీతి అని నేను అనుకుంటున్నాను. తక్కిన వారి సంగతి నాకు తెలియదు.

****

పుస్తకం వివరాలు:

తిరగబడ్డ తెలంగాణ (1939-1948) – దొరలను దించాం…నిజాం ను కూల్చాం
ఆంగ్ల మూలం: Against Dora and Nizam: People’s Movement in Telangana: 1939-1948
రచన: ఇనుకొండ తిరుమలి
అనువాదం: ప్రభాకర్ మందార, సహవాసి
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2008 (ఇది 2010 పునర్ముద్రణ)
వెల: 100 రూపాయలు
పేజీలు: 265
వివరాలకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 040-23391364

పుస్తకాన్ని గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో ఇక్కడ.About the Author(s)

అసూర్యంపశ్య4 Comments


 1. varaprasad

  jampalachowdarygari email id kavali,ikkadundi manamcheyaleni chalapanulu ayana chestunnaru.


 2. varaprasad

  telangana gurinchi,natiparistitulagurinchi dayachesi contravarsyloddu”naa telangana kotiratanala veena”,nati rachayitala goppatananiki idoka macchutunaka.neti naya telanganalo malli atuvanti rachayitalanu choodgalama.


 3. Jampala Chowdary

  బక్క చిక్కిన శరీరాలకి బాన పొట్ట ఏమిటో నాకర్థం కాలేదు!

  In certain conditions of malnutrition (e.g. kwashiorkar), protruding belly is a prominent symptom (due to liver failure and subsequent collection of fluid in the abdomen).  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0