అమేయ చైతన్యస్వరూపి శంకరన్

వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి

******
అంతరించిపోతున్న అరుదయినమానవత్వ జీవనశైలికి నిలువెత్తునిదర్శనంగా బ్రదికిన మానవతావాది. జీ.వో., లకే పరిమితమయిన సంక్షేమాన్ని పేదల జీవితాలకు అన్వయింపజేసిన సంక్షేమశీలి, అతిసమున్నతంగా భావించే ఐ.ఏ.ఎస్., అధికారపదవిని సంక్షేమ వాహినిగా మలుచుకొని, అట్టడుగు వర్గాల జీవితాలను వెలిగింపజేసిన సేవాతత్పరతతో ఉన్నత శిఖరాలనధిరోహించిన ఐదడుగుల ఆజానుబాహువు ఎస్.ఆర్.శంకరన్ (1934-2010) ఐ.ఏ.ఎస్., గారు, కరుణకు ప్రతీకగా మనమధ్యే జీవించినవారు.

దళితుల,గిరిజనుల సంక్షేమంకోసం, సమాజంలో మానవీయ సమతుల్యతా సాధనకోసం, తన ఆఖరి శ్వాస వరకు శ్రమించిన మహమనీషి వీరు. తెలంగాణాలో వెట్టిచాకిరీ, జోగినీవ్యవస్థల నిర్మూలన, స్టూవర్టుపురం మాజీ నేరస్థుల పునరావాసం, చెంచు యానాదుల జీవితాలను వెలిగించిన తీరు, ఆయన సాధించిన మానవీయ విలువలలో మచ్చుకు కొన్ని మాత్రమే! ఆదివాసీ తండాలను, అస్పృశ్యుల వాడలను నాగరికతకు దూరంగా బ్రదుకుతున్న గిరిజనులున్న కారడవులనూ కాలినడకన చుట్తివస్తూ, వారి సంక్షేమానికి కృషి చేసిన ఆచరణశీలి! అనాయాసంగా వలచివచ్చిన అత్యున్నత కీర్తి పతాకం పద్మ భూషణ”ను సున్నితంగా తిరస్కరించిన మేరునగధీరుడు! తమిళనాడులో జన్మించి, 1955లో ఐ.ఏ.ఎస్., గా ఎంపికై. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించబడిన రోజునుండి దళిత బహుజనుల జీవనభారాన్ని తుత్తునియలు చేసి, సామాజిక సమ న్యాయాన్ని దర్శించాలని ఆరాటపడిన సమదర్శి యీ మహోన్నతమానవుడు.

వెట్టిచాకిరీ నిర్మూలనకు అడ్డుతగులుతున్న ఫ్యూడల్ శక్తులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ విధానలతో రాజీ పడలేక, ధీర్ఘ కాలిక సెలవుపై వెళ్ళిన శంకరన్ గారు, త్రిపుర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు అడిషనల్ చీఫ్ సెక్రటరీగా, సెక్రటరీగా పదవీ భాధ్యతలను స్వీకరించి, త్రిపుర ప్రజల జీవితాల్లో ఎన్నో సంక్షేమాలను భాగస్వామ్యం చేసిన ఆధునిక వరదాత!

దేశరాజధాని ఢిల్లీలో పనిచేస్తున్నపుడు, ఇక్కడినుండి వెళ్ళి పరీక్షలు వ్రాసుకునే పేద విద్యార్థులకు తన గదిలో వసతినివ్వడమే గాక, వారికి దుప్పట్లను, రజాయీలను సమకూర్చిన శంకరన్, ఎప్పుడూ ప్రయాణించేది మాత్రం మామూలు స్లీపర్ కోచ్ లోనే! సునిశితమైన హాస్యం తొంగిచూసే, మర్యాదపూర్వక సంభాషణ ఆయన సొత్తు! పసిపిల్లలతో కలిసి, వారిలో ఒకరిగా మారిపోయి ఆడుకునే పసిమనసుతో, కొంచెం సిగ్గరితనంతో కూడిన చిరునవ్వుతో, సమసమాజం- అన్న ఆలోచనలను ఆచరణబద్దం చేసేందుకే జీవితంతం కృషి చేసిన తనదయిన జీవన శైలితో ఎందరికో ఆదర్శంగా నిలిచిన శంకరన్ అత్యంత నిరడంబరంగా జీవించిన ప్రత్యేక వ్యక్తి! కన్నతల్లి మరణించినపుడు, తానే స్వయంగా కారు నడుపుకుంటూ తమిళనాడు లోని తన సొంత ఊరికి తీసికెళ్ళి అంత్యక్రియలను నిర్వహించిన ఆజన్మ బ్రహ్మచారి శంకరన్ కలెక్టరుగా ఉన్నపుడు కూడా తన పనులన్నీ తానే చేసుకునే వారు, వంట, ఇంటి పనులతో సహా!

వ్యక్తిగత భవితవ్యం మీద ధ్యాస లేని ఆయన తన మరణానికి 10 నిముషాల ముందు కూడా స్నేహితుని ఫోనుకు బదులు పలికిన ధ్యాని. మహా సౌమ్యుడు, వినయశీలి, చెదరని లక్ష్యశుద్ధి, అంకితభావం తో కూడిన కార్యశీలతతో నిబద్ధ జీవితాన్ని గడిపిన వాడు కనుకనే, సుప్రీం కోర్టు, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు, పేదవర్గాల సంక్షేమానికి సంబంధించిన అధికారిగానో, సలహాదారు గానో వారి సేవలనందుకున్నాయి.

“నేనేశంకరన్ ని” అని చెప్పే తనను, అపనమ్మకంతో, ఆశ్చర్యంతో చూసేవారినే కాదు, తనను కాలవాలని వచ్చే ఆర్తులైన నిరుపేదలకు కూడ సులభ దర్శనాన్ని అనుగ్రహించిన ఆయన ఆఫీసు గది తలుపులెప్పుడూ తీసేవుండేవట! గోదావరి జిల్లా గుర్తేడు వద్ద శంకరన్ గారితో బాటు కొంతమంది ఐ.ఏ.ఎస్., అధికారులను కూడా కిడ్నాప్ చేసిన నక్సలైట్లు శంకరన్ గారిని చూచి, అందరినీ ఒదిలి పెట్టారన్న నమ్మలేని నిజం, ఆయన ప్రజాసేవకు లభించిన అరుదయిన అవార్డు!

ఎంత చెప్పినా, ఇంకా ఎంతో చెప్పవలసినది మిగిలిపోతూ, అఖండ సూర్యజ్యోతి ముందు ఒక చిన్న దీపకళికను వెలిగించినట్లే అనిపించడం ఆయన వ్యక్తిత్వ ప్రకాశానికి ఒక మచు తునుక మాత్రమే! దాదాపు 700 పుటలతో ఇటీవల వలువడిన “శంకరన్” అన్న గ్రంథం ఆ మహోన్నత మానవునికి మనం అందించే చిన్న నీరాజనం మాత్రమే! చదవగానే, అనితరసాధ్యమయిన అలౌకికానందాన్ని అందించే, నూట నలభైకి పైగా వ్యాసాలున్న ఈ గ్రంధానికి, శంకరన్ గారి విలువైన స్వీయ రచనలు ఊపిరులద్దుతుండగా, దాదాపు ఎనభై మంది కళా సాహిత్య సామాజిక నిర్మాతల స్మృతులు కూడ, శంకరన్ గారి స్మృతులతో బాటు మనలను పలుకరిస్తూ మానవత్వానికి కొత్త నిర్వచనాలనిస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల గిరిజనుల కంటి కొలకుల ఆనందవిషాదాలను అక్షరబద్ధం చేసిన సాహిత్య పుష్పం భూపేన్ హజారికా (పు.260), తుపాకీ మోతలు వినబడని, విధ్వంశ దృశాలు కనబడని ప్రశాంత జీవనాన్ని స్వప్నించిన ఇందిరా గోస్వామి (పు.269), ప్రకృతి పరిరక్షణ కోసం 4.7 కోట్ల మొక్కలనునాటించిన పర్యవరణ వేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగరి ముత మాథై (పు.240), బలహీనులతో బందూకులు పట్టించి గడీలను గడ గడలాడించిన చాకలి ఐలమ్మ (పు.263), రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే రైత్వారీ పద్ధతికి ఆద్యుడు సర్ థామస్ మన్రో (పు.136), తన సామాన్య లక్షణాలను పోగొట్టుకోకుండా అసామాన్య జీవితాన్ని గడిపిన కన్నభిరాన్ (పు.259), గోదావరి జిల్లా ప్రజల జీవితాలను సుసంపన్నం చేసిన ధవళేశ్వరం ఆనకట్టనిర్మాత, హైడ్రాలిక్ ఇంజనీరు (ఆర్థ కాటన్ (పు.316), ఏం చేస్తే ప్రతి విస్తరి మెతుకులతో నిండుతుందో పర్భుత్వాలకు చెప్పిన ఆర్థిక మానవతా వాది అమర్త్య సేన్ (పు.406), కాకినాడలో అన్న దానం, విద్యాదానాలకు తగిన ఏర్పాట్లు చేసిన వితరణశీలి, మహదాత మల్లడి సత్యలింగ నాయకరు (పు.438), దుఃఖ సంద్రాలైన దేవదాసీల దుఃఖాన్ని తొలగించాలని జీతాంతం తాపత్రయ పడిన నటరాజ రామకృష్ణ (పు.363), రాజస్థాని సంచార తెగ కొల్ హాటీల అవమానకరమైన ఆచారాలనుండి బయట పడాలన్న ఆవేదనతో రచనలు చేసిన డా:కిశోర్ శాంతాబాయి కాళే (పు.322), భారత దేశపు మరువబడిన మానవుల వివరాలు (పుటలు.193-202), గోండ్వానా భీష్ముడు భీం రావ్ (పు.92), ఆధునిక రంతి దేవుడు చిత్రూ (పు.89), చిప్కో ఉద్యమ రూపశిల్పి సుందరలాల్ బహుగుణ (పు,376), దళిత సూర్యుడు అంబేడ్కర్ (పు.510), మానవహక్కుల ఉద్యమశీలి డా: కె. బాలగోపాల్ (పు.488), ఆధునిక తత్వవేత్త అరవిందులు (పు.555), శంకరన్ దారిలోనే గమించిన ఐ.ఏ.ఎస్., అదికారులు ఏ.వి.ఎస్. రెడ్డీ (పు.115), డా:సి.సుబ్రహ్మణ్యం(పు.145), ఆర్.ఎస్.మలయప్పన్ (పు.418), మున్నగు వారి గూర్చినవి… ఒకరా ఇద్దరా… ఇలా మానవీయ మూర్తుల జీవన వ్యాఖ్యానాలు, కళల గురించి, ఆంధ్ర రాష్ ట్రం నుండి రష్యా దేశం దాకా వెలసిన చారిత్రిక వివరాల నమోదు, ఐ.ఏ.ఎస్ అధికారులు పెక్కుమంది వ్రాసిన ఇతర వ్యాసాలూ..ఇవన్నీ శంకరన్ గారి మానవత్వాని, కరుణాంతరంగాన్ని మరింతగా ప్రదీపింప చేస్తుండటం గమనార్హం!

వెట్టిచాకిరీ నిర్మూలన, సాంఘిక సమానత్వ స్థాపన, మానవ హక్కుల నిరూపణ, భూసంస్కరణలు మున్నగు అంశాల పట్ల రాజీ లేని అభిప్రాయాలతో భారత రాజ్యాంగానికి ఆభరణాలుగా భాసించే శంకరన్ గారి వ్యాసాలతో బాటు,శంకరన్ గారి చాయా చిత్రాలు పుస్తకం విలువను మరింత ఇనుమడింప చేస్తుండగా, ఆంధ్రాంగ్లభాషలలో వెలువడిన ద్విభాషా పుస్తకం “శంకరన్”ను చదవడం ఒక గొప్ప అనుభూతి.

విజయవాడ “సాహితీ మిత్రులు”, “సొసైటి పర్ సోషియల్ చేంజ్ “, కావలి వారు సం యుక్తంగా ప్రచురించిన ఈ పుస్తకం, పరిపూర్ణ మనవతారాగాలను దర్శించాలనుకున్న వారందరూ తప్పక చదవదగిన, సొంత గ్రంధాలయంలో భద్రపరుచుకోదగిన పుస్తకం!

***
శంకరన్ గారి పై హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ, ప్రంట్ లైన్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ.

ఆయన గురించిన రెండు వెబ్సైట్లు – ఇక్కడ, ఇక్కడ.

You Might Also Like

4 Comments

  1. Srinivas Vuruputuri

    “ఐదడుగుల ఆజానుబాహువు” – ఇన్నేసి విశేషణాల, ప్రశంసా వాక్యాల, మంచి మాటల నడుమ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది.

  2. Rajesh Devabhaktuni

    ఈ పుస్తకం ఇక్కడ వ్రాసినందుకు మొదటగా విజయలక్ష్మి గారికి కృతఙ్ఞతలు. ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులను ఇటువంటి పుస్తకం, శంకరన్ గారి లాంటి గొప్ప వ్యక్తుల ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది.

    ఈ ముందుమాట చదువుతున్నప్పుడు, ఈ పుస్తకం నా లాప్ టాప్ కిందనే ఉంది, చదవడం మొదలుపెట్టాలి.

    1. విఘ్నేశ్వరరావు

      దయచేసి మీ దగ్గర శంకరన్ పుస్తకం ఉంటే అందించగలరు. జిరాక్స్ తీసుకుని ఇస్తాను. మార్కెట్లో అందుబాటులో లేదు. వీలైతే ఎక్కడ లభిస్తుందో తెలియజేయగలరు. నేను అన్ని విధాలా ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

  3. బి.అజయ్ ప్రసాద్

    కాస్తంత కఠినమైన పదాలున్నా మీ పరిచయ వ్యాసం బాగుంది.

Leave a Reply