కథల పుట్టుక

(కథ నేపథ్యం-1 పుస్తకానికి రాసిన ముందుమాట.)

*****
చిన్నప్పట్నుంచీ నాకూ కథలంటే ఇష్టం. ఆ రోజుల్లో కథలంటే అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఇద్దరు భార్యలంటూ మొదలయ్యేవి. పెరుగుతున్న కొద్దీ చదువుతున్న, ఇష్టపడుతున్న కథల తత్వం మారుతూ ఉన్నా, కొన్ని ప్రశ్నలు చిన్నప్పట్నుంచీ మిగిలిపోయాయి.

కథలు ఎలా పుడతాయి? మామూలు కథల పుట్టుకకు, మంచి కథల పుట్టుకకు తేడా ఏమన్నా ఉంటుందా? కొన్ని కథలు, ముఖ్యంగా గాఢంగా ముద్ర వేసిన కథలు ఎక్కడనుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకుడిగా, మానసిక శాస్త్ర విద్యార్థిగా తరచు కలుగుతూ ఉంటుంది. రచయితలను కలసినప్పుడు, చాలమంది పాఠకుల్లాగే, నేను కూడా వారి కథల గురించి మాట్లాడుతూ, ఆ కథల మూలాల గురించి వారి ముఖతా వినేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను.

పదేళ్ళ క్రితం ఒక సాయంకాలం హైదరాబాదు ద్వారకా హోటల్లో రచయిత మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కథకుడు, మిత్రుడు గొరుసు జగదీశ్వరరెడ్డి ఇవే ప్రశ్నలు, ఇదే కుతూహలం ఇంకో రచయిత మిత్రుడు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుకూ ఉన్నాయని, ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో చాలామంది రచయితల చేత వారికథల నేపథ్యాల గురించి వ్రాయించి ప్రచురించారనీ చెప్పారు. ఆ నేపథ్యాలన్నిటినీ సేకరించి, పని గట్టుకుని జిరాక్స్ కాపీలు తీయించి, బైండు చేయించి, ఒక సంక్రాంతి ఉదయం నన్ను వెదుక్కుంటూ వచ్చి తెచ్చి ఇచ్చారు జగదీశ్వరరెడ్డి. అరుదైన ఈ ప్రయత్నం పుస్తకరూపంలో పదిమందికీ చేరితే ఔత్సాహిక రచయితలకు ఉత్ప్రేరకంలా పని చేస్తుందని ఆయన ఆకాంక్ష. ఆ నేపథ్యాలన్నిటినీ చదివిన నాకూ అలానే అనిపించింది. ఇనాళ్ళకు ఆ పనిని చేయగలిగాము.

ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథా నేపథ్యాలు మొత్తం ముప్పై నాలుగు. 17 ఆగస్టు 1997న మధురాంతకం రాజారాం గారి సర్కస్‌డేరాతో మొదలుపెట్టి, 21 జూన్ 1998న మధురాంతకం మహేంద్ర ముసలమ్మ మరణం నేపథ్యంతో అంతమయ్యింది ఆ శీర్షిక. ఈ 34 నేపథ్యాలకూ, ఇంకొందరు ప్రసిద్ధ, వర్ధమాన రచయితల కథల నేపథ్యాలు కూడా చేర్చగలిగితే ఇంకొంత ఉపయుక్తంగానూ, మరింత సమగ్రంగానూ ఉంటుందని అనిపించింది. కొంతమంది రచయితలని వారి కథల నేపథ్యాల గురించి వ్రాయమని అభ్యర్థించాము. అన్నీ కలుపుకుంటే పుస్తకం 800 పుటలు దాటటంతో, రెండు సంపుటాలుగా వెలువరించాలని నిశ్చయించుకొన్నాము. మొదటి సంపుటంలో లబ్ధప్రతిష్టులైన ముందుతరం కథకుల కథల్నీ, వాటి నేపథ్యాలనూ పరిచయం చేస్తున్నాము.

ఈ సంపుటంలో నాకు చాలాకాలంగా నచ్చిన కథలు ఎన్నో ఉన్నాయి. వస్తుపరంగా, భాషాపరంగా, శిల్పపరంగా ఈ ఉత్తమ కథలు కాలపరీక్షకు కూడా నిలబడ్డాయి. తెలుగు కథలను అభిమానించేవారందరూ చదువవలసిన కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఈ కథల పూర్వాపరాలను తెలుసుకోవటం పాఠకుల కుతూహలాన్ని కొంతవరకు తీర్చి ఆనందింపజేస్తే, కథలు వ్రాయటంలో ఆసక్తి ఉన్నవారికి విజ్ఞానదాయకంగానూ, ఉత్ప్రేరకంగాను పనిజేస్తుందని మా భావన.

ఇంతకీ కథలు ఎలా పుడతాయి? ఎలా పెరుగుతాయి? ఏ పరిణామక్రమంలో ఏ అండాలు పలుదశలు దాటి అందమైన సీతాకోకచిలుకలుగా మారి రెక్కలు విప్పుకొని మనముందు వాలతాయి? కథలు నిజాలా, కల్పనలా, లేక నిజానిజాల కలగలుపా? నగిషీలతో అలంకరించి మనముందు అందంగా నిలబెట్టిన బొమ్మ పూర్వస్వరూపమేమిటో అన్న ప్రశ్నలకు జవాబులు ఈ కథల్లో, వాటి నేపథ్యాలలో వెతుక్కోవచ్చు. ఈ నేపథ్యాలు కొత్త ప్రశ్నలకు, చర్చలకు దారి తీయనూ వచ్చు.

కథానిక అంటే మరేమీ కాదు, జీవిత శకలాలను పరిచయం చేయడమేనన్నాడు ఒక భాష్యకారుడు. జీవితం తలుపు తెరిచి ఒకసారి తొంగి చూడటమన్నాడు ఇంకో ప్రసిద్ధ రచయిత. కథానికకు నాలుగు భాగాలు తప్పనిసరి అని కొందరు నియమిస్తే, కథానికకు ఎట్టి నియమాలు, నిర్మాణ నిబంధనలు అవసరం లేదని మరికొందరి అభిప్రాయం.

ఈ సంపుటంలో ఉన్న కథల్లోనూ, వాటి నేపథ్యాలలోనూ కొంత సామాన్యత, ఎంతో వైవిధ్యత ఉన్నాయి. ఎవరి ముద్ర వారికి ఉన్నా, ఈ కథల్లో ఎక్కువభాగం సంప్రదాయ శిల్పంలో చెప్పినవే. దాదాపుగా అందరు రచయితలూ తమ స్వానుభవాలు లేక తాము విన్న, కన్న విషయాల నుంచే ఈ కథలు పుట్టాయి అని చెప్తున్నారు. ఐతే ఆ విత్తనాలను కథలుగా పెంచిన తీరులో ఎంతో వైవిధ్యం ఉంది.

కథకులు పత్రికా విలేకరులు మాత్రమే కారు. తమను ప్రేరేపించిన సంఘటనను మాత్రమే వర్ణించి వదిలివేయరు వాళ్ళు. కథకులు ఛాయచిత్రకారులూ కాదు, కెమెరా కంటికి కనిపించినమేరకు మాత్రమే వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచటానికి. ఒకోసారి కల్పనకంటే జీవితమే విభ్రాంతికరమైనా, ఫొటోగ్రాఫుల్లాంటి కథనాల్లో సత్యం ఉన్నా తరచు జీవం లోపిస్తుంది. కథల్లో కొంత నిజమూ, కొంత కల్పనా ఉండాలని రావిశాస్త్రి చెప్పారని బీనాదేవిగారు తమ కథానేపథ్యంలో పేర్కొన్నారు. ఫొటోగ్రాఫుకు ఫిల్టర్లు వాడటమూ, దృష్టికోణాలు మార్చటమూ, అసలు కెమెరా పక్కన పారేసి, కుంచె పట్టుకొని కేన్వాస్ మీద తాము చెప్పదలుచుకున్న విషయాన్ని రకరకాల రంగుల పొరల మధ్య స్పష్టంగానో, అస్పష్టంగానో ఆవిష్కరించటమూ ఈ నేపథ్యాలలో తరచు కనిపిస్తాయి.

కథ వ్రాయమని ప్రేరేపించిన విషయాలు చివరికి కథలో ఎలా చోటు చేసుకుంటాయి అనేది విచిత్రంగానే ఉంటుంది. ఒకోసారి ఆ మూల విషయానికి పూర్తయిన కథకూ సంబంధం వెంటనే కనిపించదు. ఆడెపు లక్ష్మీపతి గారి ముసల్దాని ముల్లె కథకి ఉత్ప్రేరకంగా చెప్పిన విషయం చివరికి కథలో ఒక్క వాక్యంగా మాత్రమే ఇమిడింది. రచయిత చెప్పకపోతే ఆ కథలోని విస్తృతజీవిత చిత్రణలో, ఆ వాక్యానికి ఎట్టి ప్రాముఖ్యతా ఉండేది కాదు.

అల్లం శేషగిరిరావుగారి చీకటి కథ రాత్రివేళ బాతుల వేటలో కలసిన ఇద్దరు అపరిచిత వ్యక్తుల కలయిక గురించే. ఆ ఇద్దరు వ్యక్తుల భిన్న సంస్కారాలతో పాటు రాత్రిపూట పక్షులవేట గురించి వివరంగా చిత్రిస్తారు ఆ కథలో. ఐతే ఈ కథకు మూలంగా ఆయన చెప్పిన విషయానికి, ఈ పిట్టలవేటకూ పెద్ద సంబంధమేమీ లేదు.

కొన్ని కథల్లో కొంత కల్పన ఉన్నా, రచయితలు ఒక అసాధారణ సంఘటననో, సంఘటనల సముదాయాన్నో వాస్తవికంగా చిత్రీకరించటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రచయితను ప్రేరేపించిన విషయమూ, చిత్రించిన విషయమూ దాదాపు ఒకటిగానే ఉంటాయి (ఉదాహరణకు కేతు విశ్వనాధరెడ్డి నమ్ముకున్న నేల, పి.సత్యవతి పెళ్ళిప్రయాణం, శ్రీరమణ ధనలక్ష్మి) కాని రచయిత వాస్తవ చిత్రీకరణలో పరిమితంగా నియంత్రించటమూ, ఒకోసారి విభిన్న వ్యక్తులనీ, సంఘటనలనీ కలిపి ఒక సమిష్టి చిత్రాన్ని తయారుచేయటమూ కనిపిస్తుంది.

మరికొన్ని చోట్ల, ప్రేరేపించిన విషయాన్ని కొద్దిగా విస్తరించి జీవితం పట్ల, సమాజం పట్ల తమకు ఉన్న దృక్పథాన్ని కథగా నిర్మించటమూ చూస్తాము (ఉదా: కాళీపట్నం రామారావు జీవధార). ఒకోసారి కథ అనేక విషయాల కలగలుపుగా రూపాంతరం చెందుతుంది (మునిపల్లె రాజు వారాల పిల్లాడు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య రానున్న శిశిరం). కొన్ని కథలు దృక్పథాలను, వాదనలను, వైరుధ్యాలను విపులీకరించటానికి వ్రాయబడతాయి (ఉదా: బి.ఎస్.రాములు మెరుగు). నిత్యజీవితంలో ఎదురైన సంఘటనలకు ఒక తాత్త్విక ప్రాతిపదికనో, మానసిక విశ్లేషణనో ఆపాదిస్తూ వ్రాసే కథలు మరికొన్ని (ఆర్.ఎస్. సుదర్శనం అమృతుడు, నవీన్ నిప్పురవ్వలు)

రచయితపై గాఢంగా ముద్ర వేసిన ఒక సన్నివేశం పలుదినాలు మేధలో నిద్రాణంగా ఉండి, ఆకారం పోసుకొని, ఎప్పుడో ఒకసారి- తల్లిని నరకయాతన పెట్టి పుడమిపై పడే శిశువులా బయట పడుతుందని అంటారు పెద్దిభొట్ల సుబ్బరామయ్య. అంత సుదీర్ఘమైన సమయం అవసరం లేదు, ఒక వస్తువుపై కథ రాయటాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని స్వల్ప వ్యవధిలో కథ వ్రాయవచ్చని నిరూపిస్తారు బలివాడ కాంతారావు ముంగిస కథలో.

రచనాశైలిలో వైవిధ్యాలున్నట్లే, మూల వస్తువును వినియోగించుకోవటంలోనూ, విపులీకరించటంలోనూ రచయితల రీతులు విభిన్నంగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమా, నగిషీలు చేసి ఆకారం మార్చటమా, ప్రతీకాత్మకంగానో సూచ్యంగానో వ్రాయటమా, గోప్యంగా ఉంచటమా అన్న ప్రశ్నలకు ఈ సంపుటంలో పలురకాల సమాధానాలు దొరుకుతాయి. చెప్పదల్చుకున్న వస్తువును ఆకర్షణీయమైన కథగా తయారు చెసే పరుసవేది విద్యంటూ ఏదీ లేదని అర్థమౌతుంది. ఊహాశక్తి, ఉత్సాహము, ప్రతిభ ఉన్న రచయితలు వస్తువును బహురూపాల్లో కథగా మన ముందు ఉంచగలరు. ఉత్ప్రేరక విషయం నిత్యజీవితంలో కనిపించే సామాన్య విషయమైనా, అరుదైన సంఘటనైనా దానికి విశ్వజనీనత ఆపాదించి, విశ్వసనీయంగా నిజాయితీగా పాఠకులకు అందించగలిగితే కథకు శాశ్వతత్వం కలిగే అవకాశం ఉంటుంది.

ఈ కథలూ, నేపథ్యాలూ పాఠకులకు, ఔత్సాహిక, వర్ధమాన రచయితలకు కరదీపికగా ఉపయోగిస్తాయని మా నమ్మకం, ఆకాంక్ష.

జంపాల చౌదరి
డిసెంబరు 28, 2012, తిరుపతి


కథ నేపథ్యం – 1
25 ప్రసిద్ధ తెలుగు కథకుల కథలు, వాటి నేపథ్యాలు
(సం): ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్
తానా ప్రచురణలు
2013
388 పుటలు; 195 రూ, 25 డా.
లభించు చోట్లు: తెలుగుదేశంలో: నవోదయ, విశాలాంధ్ర, ఇతర పుస్తక విక్రేతలు
అమెరికాలో: cjampala@gmail.com
మరియు kinige.com

You Might Also Like

Leave a Reply