కథావార్షిక 2011

వ్యాసం రాసిన వారు: అరి సీతారామయ్య
*****

ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం‌లో వచ్చిన ఉత్తమ కథలను ఎంపిక చేసి కథావార్షికగా ప్రచురిస్తున్నారు మథురాంతకం నరేంద్ర గారు. కథావార్షిక 2010 చదివినప్పుడు చాలా నిరుత్సాహం కలిగింది. అందులో దాదాపు సగం “కథలు” విసుగెత్తించాయి. వ్యాసాల్లాగా ఉన్నాయనిపించింది. దాంతో పొలిస్తే కథావార్షిక 2011 చాలా మెరుగు. ఇందులోకూడా కథలన్నీ బాగున్నాయని కాదు, కాని 2010 కంటే చాలా మెరుగు. ఒక్క సంవత్సరంలో కథలు రాసేవాళ్ళలో పెద్దమార్పులు రావటం అసంభవం. కాబట్టి కథావార్షిక 2010 కీ 2011 కీ మధ్య ఉన్న తేడాకు కారణం కథలు ఎంపిక చేయటంలోనే ఉంది అనుకోవాలి. ఈసారి కథలు ఎంపిక చేసిన వారు శ్రీ అఫ్సర్ గారు.

కథావార్షిక 2011లో నాకు బాగా నచ్చిన కథలు, నిజానికి తెలుగు కథ ఆరోగ్యంగా హాయిగా ఉంది అనిపించిన కథలు, రెండు: విమల గారి “నల్ల పిల్ల నవ్వు”, బెజ్జారపు రవీందర్‌గారి “మూడు తొవ్వలు”. మొదటిది ఒక రైలు ప్రయాణం‌లో పరిచయం అయిన అమ్మాయి గురించి, రెండవది ఒక బస్సు ప్రయాణం‌లో మనకు పరిచయం అయ్యే వ్యక్తుల గురించి.

స్కైబాబా గారి “కబూతర్”, సతీష్ చందర్ గారి “దేశమంటే మెతుకులోయ్” బాగున్నాయి. రెండూ పేదతనం గురించి రాసిన కథలే. రెండిట్లోనూ సందేశం ఉంది, కాని బాహాటంగా కాదు.

మూడవ స్థాయి కథలు రెండున్నాయి: సి. రామచంద్రరావు గారి “సామి కుంబుడు”, గొర్తి బ్రహ్మానందం గారి “సరిహద్దు”. ఇవి బోధించే (నీతి) కథలు కావు. సమాచారం అందించే కథలు అని చెప్పొచ్చు. కథనం బాగుంది. కాని మనసును తాకే కథలు కాదు.

ఇక నాలుగవ స్థాయి కథలు రెండున్నాయి: పెద్దింటి అశోక్ కుమార్ గారి “మా ఎడ్ల కొట్టం 2011”, డా. వి. చంద్రశేఖర్ గారి “ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సత్యప్రకాశం”. ఇవి ఉద్యమాల గతులు ఇలా ఎందుకు మారాయి అన్న విషయం మీద కథలు రాయవలసిందిగా వచ్చిన పిలుపుకు స్పందించి రాసిన “కథ”ల్లాగున్నాయి.

మరో కథ స్వామి గారి “ఐకాంతిక”. ఇది చదివించే కథ కాదు. మెదడుతో రాసిన కథ. నాలాంటి సామాన్య పాఠకుడికి చదవాలనిపించే కథ కాదు.

కథావార్షిక 2011 తప్పకుండా చదవదగిన పుస్తకం. “నల్లపిల్ల నవ్వు” లాంటి కథ సంవత్సరానికి ఒక్కటే వచ్చినా తెలుగు కథ ఆరోగ్యంగానే ఉంది అనుకోవచ్చు.

***
(పుస్తకం ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ)

You Might Also Like

One Comment

  1. పూడూరి రాజిరెడ్డి

    సర్,
    ఈ సంకలనంలో నాకు బాగా నచ్చిన కథలు రెండు: ‘ఐకాంతిక’. ‘మూడు తొవ్వలు’.

    **
    (-ఈ వ్యాఖ్య వ్యాఖ్యాత అభ్యర్థన వలన ఎడిట్ చేయబడినది – అడ్మిన్)

Leave a Reply