అడవిదారిలో గాలిపాట

వ్యాసం రాసినవారు:  మూలా సుబ్రహ్మణ్యం

పాలపర్తి ఇంద్రాణి రెండో పుస్తకం “అడవి దారిలో గాలి పాట” పై ఒక సమీక్ష.

తెల్ల ఈక ఒకటి
కొన్ని పిట్టలు
నేనూదే సబ్బు బుడగలు
ఆకాశం వైపు ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని

అదిగో సరిగ్గా అక్కడే ఉంది ఇంద్రాణి కవిత్వం. ఈమె కవితలన్నీ అలాంటి సబ్బు బుడగలే! పైకి తేలిగ్గా పారదర్శకంగా కనిపిస్తునే లోపల ఎన్నెన్నో రంగుల ప్రపంచాలని చూపిస్తాయి.

“విసనకర్ర చెప్పినట్టల్లా
తలలాడిస్తాయి మంటలు
తమ బూడిద రెప్పలు విప్పి
ఎర్రని కళ్ళు తెరుస్తాయి నిప్పులు”

పల్లెటూళ్ళలో మనం రోజూ చూసే దృశ్యమే ఎంత అందంగా వ్యక్తీకరించబడింది!

“ఎర్ర కలువలు కనకాంబరాలు
కాశీరత్నాలు కోపం కక్కుతూ

రెల్లు పూలు గడ్డి పూలు
గన్నేరు మొగ్గలు అల్లల్లాడుతూ

అడుగులేని బావిలో ఒదిగి ఉన్నాయి
చేదిన ప్రతిసారీ ఏవో పూలు
తేలుతూ వస్తాయి బొక్కెనలో”

చేదిన ప్రతిసారీ బావిలోంచి రకరకాల పువ్వులు తేలి వచ్చినట్టే కవయిత్రి మనసులోంచి కవితలు! అలాంటి మరొక అద్భుతమైన కవిత పుప్పొడి..

మాటలెప్పుడో ఆగిపోయాయి
నక్షత్రాలు తళతళలాడాయి
ఒక్కసారి తాకగానే-
వెయ్యి పువ్వులు విచ్చుకున్నాయి
ఎన్ని ధవళ రాత్రులు వచ్చి వెళ్ళినా
నా చేతి వేళ్ళకింకా అదే పుప్పొడి

ఇరవై తొమ్మిది కవితలున్న ఈ సంకలనంలో “చందవరం , ప్రకాశం జిల్లా”, “ఇంట్లో తూనీగ”, “మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి”, “చెట్టుకింది మనుషులు”, “తిరణాల” మొదలైన కవితల్లో చూసిన దృశ్యాన్ని చూసినట్టుగా పాఠకుడికి అందించే ప్రయత్నం కనిపిస్తుంది. తన మొదటి సంకలనం “వానకు తడిసిన పువ్వొకటి” నుంచీ ఇంద్రాణి ఇదే శైలిలో రాస్తున్నా, ఈ సంకలనంలో అది ఇంకా ప్రస్ఫుటంగా కనిపించింది. ఉదాహరణకి మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి కవితలో..

“బొరుగుల మిఠాయి నములుతూ
అరిగిపోయిన జోళ్ళు ఈడ్చుకుంటూ
మేకలు తోలుకుపోతోంది ఓ పిల్ల

గుడ్డ మూట తలకింద పెట్టుకుని
పాడుబడ్డ మండపంలో బరివిగడ్డం సన్యాసి
తత్వమొకటి ఎత్తుకుంటున్నాడు”

అంటూ దృశ్యాన్ని కళ్ళకు కడుతుంది. కొంతమంది కవిత్వాన్ని మంచి నీటితో పోలుస్తారు. చక్కెరతో సహా అందులో ఏది కలిసినా దాన్ని కలుషితం చేస్తుంది తప్పితే మెరుగుపరచదు అని వీళ్ళు తీవ్రంగా నమ్ముతారు. అందుకని కవిత్వంలో తాత్వికతతో సైతం ఏ రకమైన భావజాలాన్నీ వీళ్ళు అంగీకరించరు. వీళ్ళ కవిత్వంలో వ్యాఖ్యానాలు కనిపించవు. కల్పన కూడా చాలా తక్కువ ఉంటుంది. దృశ్యాన్ని కళ్ళముందుంచి కవి తప్పుకుంటాడు. అయితే ఈ రకమైన కవిత్వం రాయడంలో ఇబ్బంది లేకపోలేదు. కవి జాగ్రత్త పడకపోతే కవిత పేలవమైన వర్ణనగా తేలిపోయే ప్రమాదం ఉంది. ఈ పుస్తకంలో కూడా అక్కడక్కడా నాకా లోపం కనిపించింది.

అయితే ఇంద్రాణి కవిత్వంలో తెచ్చిపెట్టుకున్న కవి సమయాలు లేవు. డౌన్లోడ్ చేసుకున్న దుఃఖం లేదు. పదాడంబరం లేదు. నిర్మాణ జటిలత లేదు. తను అనుభవించిన జీవితాన్ని సూటిగా కళ్ళముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ కాలపు కవుల్లో ఇది ఖచ్చితంగా అరుదైన విషయం. పదచిత్రాలు పట్టుకోవడంలో ఈమె చూపించే నేర్పు కూడా ఎన్నదగినది. ఐతే ఒక శైలిలో డెబ్బై, ఎనభై కవితలు రాసాక, అందులోంచి బయటకి వచ్చి కొత్తశైలిని పట్టుకునే ప్రయత్నం చేస్తే బావుంటుంది.

“బుడగల అలల్లో
నింపాదిగా మరుగుతోన్న టీని
కప్పుల్లోకి ఒంపుతున్న చప్పుడు” తో తేనీటి సమయపు నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలంటే పుస్తకం తెరవండి.

ప్రతులకు
http://kinige.com/kbook.php?id=1335&name=Adavi+Daariloo+Gaali+Paata

You Might Also Like

One Comment

  1. k.M.Sarma

    ఇంద్రాణి మొదటి పుస్తకం “వానకు తడిసిన పువ్వొకటి” చూసాను. సుమారు ఏడేళ్ళ తరువాత వచ్చిన ఈ పుస్తకం “అడవి దారిలో గాలి పాట” ను చూసాను.

    ఇంద్రాణి కవిత్వ శైలి విభిన్నం.
    ప్రతి కవిత నిర్మాణంలోను,వస్తువు ఎంపికలోను అత్యుత్తమ స్థాయిలో ఉంది.
    ఒక్క అనవసరమైన పదం లేదు.
    ప్రతి కవిత అద్భుతమైన ఊహాశక్తి తో, బిగువుతో అందంగా రాయబడింది.

    కవిత్వ ప్రేమికులందరూ కొని చదివి దాచుకోదగ్గ పుస్తకం అని నా అభిప్రాయం.

    ఈ పుస్తకాన్ని చదివిన ఇంకెవరైనా దీన్ని గురించి వ్యాఖ్యానిస్తే బావుంటుంది.

    K.M. Sarma.

Leave a Reply to k.M.Sarma Cancel