అమెరికాలో తెలుగుపాఠకులకి గొప్ప వరం : UW-Madison, Memorial Library

రాసిన వారు: నిడదవోలు మాలతి

నేను 1980లో మొదలు పెట్టేను మాడిసన్‌లో మెమోరియల్ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు తీసుకుని చదవడం. 2001లో నేను తూలిక.నెట్ మొదలుపెట్టేక, నేను అనువాదం చేసుకోడానికి ఈలైబ్రరీ గొప్పవనరు అయింది నాకు. మరికొన్ని అనుభవాలు చివరలో మీతో పంచుకుంటాను.

అమెరికాలో తెలుగు పుస్తకాలు సేకరించడం ఎప్పుడు మొదలయిందో ఖచ్చితంగా తెలీదు కానీ 1962లో PL 480 కార్యకలాపాలలో భాగంగా అమెరికా గవర్నమెంటు చేసిన ఏర్పాటుద్వారా భారతీయభాషల్లో ప్రచురించిన పుస్తకాలు సేకరించడం విస్తృతంగా సాగింది. PL 480కింద అమెరికావారు గోధుమలు ఇచ్చి ప్రతిగా భారతదేశంలో ప్రచురించిన ప్రతి పుస్తకం కొన్ని కాపీలు పుచ్చుకోడం మొదలుపెట్టేరు. ఈసేకరణకి ప్రధానకేంద్రం Library of Congress. వారు కాపీలు అందుకుని, అమెరికాలో ఇండియన్ స్టడీస్ వున్న యూనివర్సిటీలకి సరఫరా చేస్తారు ఆ పుస్తకాలు, ఒక కాపీ తమ ఆర్కైవులలో పెట్టుకుని. అమెరికాలో, షికాగో తరవాత అత్యధికసంఖ్యలో భారతీయభాషలలో టైటిల్సు వున్న లైబ్రరీ ఇదే.

మాడిసన్, విస్కాన్సిన్, యూనివర్సిటీ లైబ్రరీలో తెలుగుపుస్తకాలు 14,440 వున్నాయి 2006 నాటికి. ఈవ్యాసానికి ప్రధానంగా ఆధారం సౌతేషియన్ బిబ్లియోగ్రఫర్, Mary Rader ప్రచురించిన South Asian Library Collections and Services (2006). ఆమెకి నా కృతజ్ఞతలు.

ఈ లైబ్రరీలో 17 భారతీయభాషలలోగల పుస్తకాలలెక్కలో మొదటిస్థానం ఉర్దూభాషకి, తెలుగుస్థానం రెండు. మొత్తం ద్రావిడభాషలలో వున్న పుస్తకాలూ, పత్రికలూ – టైటిల్సు 23,233. ఇక్కడ టైటిల్ అంటే పుస్తకం శీర్షిక అనే కానీ సంపుటాలు కాదని మేరీ రేడర్ తన మోనోగ్రాఫ్‌లో స్పష్టం చేశారు. అంటే సమగ్రాంధ్రసాహిత్యం మొదటి 13 సంపుటాలు, తరవాత ప్రచురించిన 4 సంపుటాలు ఒక టైటిలుగా గణిస్తారన్నమాట. 1901నుండీ ప్రచురింపబడిన పుస్తకాలు ఇక్కడ లైబ్రరీలో వుండడం విశేషం కాదూ!

పత్రికలలో భారతి (1964-71, 1989-91), ఆంధ్రపత్రిక (1963-1991), ఆంధ్రప్రభ (1974-2004), ఆంధ్రజ్యోతి (1974-2000, మధ్యలో కొన్ని తప్పిస్తే) సంపుటాలు వున్నాయి. దిన, వార, మాసపత్రికలు, ఆంధ్రప్రభ, జ్యోతి, కథ, స్రవంతి, స్వాతి, తెలుగుపరిశోధన కూడా వున్నాయి. మొదట్లో హార్ట్ కాపీలే తెప్పించేవారు కానీ తరవాత ఖర్చులు తగ్గించడంకోసం మైక్రోఫిల్మ్ రూపంలో సేకరిస్తున్నారు. 2005లో మేరీ రేడర్ భారతీయపత్రికలకి indexing service చేపట్టారు.

ఈ గ్రంథసేకరణ అత్యధికంగా జరిగింది 60వ దశకంలోనే. ఆదశకంలోనే తెలుగుకథ, నవల ఉచ్ఛదశ అందుకున్నందున ఆనాటికథలూ, నవలలూ నాలాటివారికి తేలిగ్గా దొరకడం జరుగుతోంది. నేను ఈలైబ్రరీ ఉపయోగించుకోడం మొదలుపెట్టినరోజుల్లో అంటే 80వ దశకంలో స్థానికతెలుగువాళ్లు ఈ బంగారుగనిని అట్టే ఉపయోగించుకున్నట్టు కనిపించదు. పాఠకులు విస్తారంగా చదవడంమూలంగా తుక్కుతుక్కు అయిపోయిన, నాకళ్లబడిన ఒకే నవల సులోచనారాణిగారి సెక్రటరీ!

ఇంతకీ PL480 ద్వారా పుస్తకసేకరణ కార్యక్రమం 1991లో ముగిసింది. Foreign Language studiesకి నిధులు తగ్గి, లైబ్రరీలు పుస్తకాలు తామే కొనుక్కోవలసిన స్థితి ఏర్పడింది. అయినా ఏడాదికి దాదాపు 3,500 కొత్త టైటిల్స్ చేర్చడం జరుగుతోందిట. Library of Cogress కొనుగోలు విభాగం ఢిల్లీలో వుంది. మనదేశంలో ప్రచురించినపుస్తకాలు వీరు కొని అమెరికాకి పంపిస్తారు. వారి చిరునామా:

Laila Mulgaokar,
Field Director
U. S. Library of Congress Office
American Center
24, Kasturba Gandhi Marg, New Delhi , India 110 001
E- mail: newdelhi@loc.gov

చివరిమాటగా మేరీ రేడర్ రిసెర్చి చేసేవారికి చాలా సహాయం చేస్తారు. మీకు ఇంకా వివరాలు కావాలంటే UW-Madison Memorial Library సైటుకి వెళ్లి, మీకు కావలసిన సమాచారం గ్రహించవచ్చు.

పిట్టకథలు లేక మెమోరియల్ లైబ్రరీతో నా అనుభవాలు.
:

సాధారణంగా మనదేశంలో మనం పుస్తకం తీసుకున్నప్పుడు లైబ్రేరీ అసిస్టెంటు పద్ధతిగా నమోదు చేసుకుంటారు. అదే పద్ధతిలో తిరిగి ఇచ్చినప్పుడు కూడా నమోదు చేస్తారు. మాడిసన్‌‌లో లైబ్రరీలో మనం తీసుకున్నప్పుడు కంప్యూటరులో ఎక్కించుకుంటారు కానీ తిరిగి ఇచ్చినప్పుడు మాత్రం అక్కడున్న ఒకడబ్బాలో మనం ఎప్పుడు పడితే అప్పుడు పడేయొచ్చు ఆ పుస్తకం. తరవాతెప్పుడో వారు అవి రిటర్న్ అయినట్టు రాసుకుంటారు. కిందటేడు నేను ఒక పుస్తకం (మహావాది వెంకటరత్నంగారి కవులకథలు. ఈపుస్తకంలోన సమాచారమే నేను మన పూర్వకవులగురించి రాసినప్పుడు వాడుకున్నాను) తిరిగి ఇవ్వలేదనీ, 80 డాలర్లు ఫైను అనీ ఓ ఈమెయిలిచ్చారు. నేను అంత మర్యాదగానూ, ఫలానారోజున అన్ని పుస్తకాలతోపాటూ అది కూడా రిటర్న్ చేసేననీ, అంచేత ఫైను కట్టవలసిన అవుసరం లేదనీ జవాబిచ్చేను. వారిదగ్గర్నుంచి మళ్లీ ఏం రాలేదు కానీ కథ సుఖాంతమే. ఇందాకా వాళ్ల కేటలాగులో చెక్ చేస్తే, షెల్ఫులో వున్నట్టే వుంది ఆపుస్తకరాజం. అయినా నాకు మాత్రం మళ్లీ లైబ్రరీకి వెళ్లాలాంటే మనసొప్పడంలేదు.

రెండో కథ. సుజాతా వాళ్లూ (మనసులో మాట) ఓక్లహామాలో వున్నప్పుడు, తను రాసిన “నిద్ర”కథగురించి నాకు చెప్పింది, ఆసందర్భంలో వివరాలకోసం సుజాతకి మెయిలిచ్చాను. ఆమె అనుమతితో నాకు వచ్చిన సమాధానం ఇక్కడ పెడుతున్నాను.

“ఆ కథ పేరు గుర్తుందా మీకింకా? అది 1999 సెప్టెంబర్ లో వేశారు ఆంధ్రజ్యోతి వీక్లీ లో! ఆ కథమీద మీ అభిప్రాయం కూడా చెప్పారు మీరు. అది చదువుదామని మీరు వెదికితే పుస్తకం దొరికింది కానీ అందులో కథ తాలూకు మూడుపేజీలు లేవు.ఎవరో చింపుకెళ్ళిపోయారు. అప్పుడు మీరు “ఇక ఆ కథ చదవక్కర్లేదు. బాగా రాశావు కాబట్టే దాన్ని ఎవరో ఇష్టంగా తీసుకెళ్ళిపోయారు” అన్నారు. ఆ కథ మీద నాకు కొన్ని ఉత్తరాలు అప్పట్లో వచ్చాయి కానీ yours was the best compliment అని ఈ మధ్య కూడా ఒక ఫ్రెండ్‌కి చెప్పాను.”

(ఇక్కడ సుజాత మాటలు యథాతథంగా పెట్టడానికి కారణం వుంది. నేనూ, కల్పనా కథావిమర్శమీద ఒక చాటు చేశాం. అది ఈసైటులోనే తరవాత వస్తుంది. మా చాటులో విమర్శని రచయితలు ఎలా స్వీకరిస్తారు అన్నదానికి ఇది మంచి వుదాహరణ అనుకుంటున్నాను. ఎందుకంటే, నేను “ఇక ఆకథ చదవక్కర్లేదు” అన్నమాటని రచయిత్రి అపార్థం చేసుకోడానికి మస్తుగా అవకాశం వుంది కానీ సుజాత అలా చెయ్యలేదు. )

పిట్టకథ మూడు. సింప్లీ ఘోరం – జానకివిముక్తి కథ ప్రచురించినపేజీల్లో నీచమయిన బొమ్మలు గీయడం. ఇలాటివి నాకు చాలా బాధ కలిగిస్తాయి. చదువు వేరూ సంస్కారం వేరూ. అనుకోడానికి ఇలాటిది ఒక్కటి చాలు.

You Might Also Like

2 Comments

  1. Nagender Rao M.

    Dear Smt. Malathi Nidadavolu,

    I felt very happy after reading your column because I am working just at the extreme end of the whole process of acquisition program of the Library of Congress. I am working as Librarian (Acquisition and Cataloging) and responsible for developing Telugu collection for Library of Congress and other North American university libraries. UW-Madison, Memorial Library is one of our participants under the SACAP program. Your column gives me a sense of satisfaction to the job what I do.

    Regards,

    Nagender Rao M.
    Librarian (Telugu Cataloger)
    U.S. Library of Congress Office
    American Centre
    24, K.G.Marg
    New Delhi – 110 001
    E-mail: mrao@loc.gov

  2. Prabhakar Mandaara

    PL 480 అనగానే ఇప్పటికీ పేద దేశాలను పీక్కుతినే రాబందు బొమ్మ, అంకుల్ శాం గుంటనక్క నవ్వు బొమ్మ గుర్తుకొస్తాయి. ఆ పథకం తో ఇంత మంచి సాహితీ సేవ జరగడం విశేషమే! మంచి సమాచారం హృద్యమైన రీతిలో అందించారు. అభినందనలు.

Leave a Reply