పోలీస్ సాక్షిగా

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
*************

సాధారణంగా నూటికి ఎనభైమందికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే అవసరం రాదు. పోలీసుల వృత్తిగత విశేషాలు తెలుసుకునే అవకాశమూ దొరకదు. ఐతే ఆసక్తి మాత్రం ఉంటుంది. రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారాంరావు పోలీసులకు, ఆ వ్యవస్థకు సంబంధించినవారికి, వారికి సన్నిహితంగా ఉండేవారికి మాత్రం తెలిసే విశేషాలు, తన ఉద్యోగజీవిత విజయాలుగా రాసిన పుస్తకం “పోలీస్ సాక్షిగా”. ఉద్యోగవిజయాలు అన్నది ఉపశీర్షిక.

గ్రూప్ వన్ సాధించి పోలీసు అధికారిగా డి.ఎస్.పి.నుండి డీఐజీ స్థాయి వరకూ పనిచేసిన రచయితకు దొరికిన ప్రముఖుల సాన్నిహిత్యం, వివిధ ప్రదేశాలతో పరిచయం, చారిత్రిక సంఘటనలతో సంబంధం(స్థాలీపులక న్యాయంగానైనా సరే), ఎదురైన విచిత్ర సంఘటనలు, సాధించిన జటిలమైన కేసులు ఈ పుస్తక రచనకు వస్తువులయ్యాయి.

ఆయన అనుభవాలు కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకలా చెప్పాలంటే సినిమా సన్నివేశాల్లా మాంచి రసవత్తరంగా ఉంటాయి. జై ఆంధ్రా ఉద్యమం సమయంలో కర్ఫ్యూ విధిస్తూనే, ఉద్యమాన్ని నియంత్రించడానికి అరెస్టుల పర్వం ప్రారంభమైంది. డి.ఎస్.పీ.గా పనిచేస్తున్న రచయితకు కొందరి పేర్లతో కూడిన రేడియో మెసేజి “ఈ క్రింద పేర్కొనబడ్డ వారిలో ఎవరైనా మీకు తారసపడితే నిర్భందించండి” అని అయిదారుగురు పేర్లతో లిస్టు వచ్చింది. మొదటి పేరు కర్నాటి రామ్మోహనరావు, అడ్వకేట్ విజయవాడ. అప్పుడు జరిగిన సంఘటన ఇలా చెప్తారు రచయిత.

“చదువుతూనే బూట్ల శబ్దానికి తల పైకెత్తాను. ఆశ్చర్యం. అప్పుడే రామ్మోహనరావు నవ్వుతూ ఎదురుగా వస్తున్నాడు. అతను కాలేజిలో సీనియర్. అందుకే బాగా పరిచయం. కలిసి డ్రామాలు వేశాం. కాలేజి ఎలక్షన్లలో పోటి చేశాం. “ఇటువైపు పని ఉండి వచ్చాను. విజయవాడ తిరిగి వెళ్తున్నప్పుడు నీ బోర్డు కనబడింది. చాలా రోజులయ్యిందిగా నిన్ను చూసి, అందుకే వచ్చాను. ఎలా వుంది పొలీసు ఉద్యోగం” చేతిలో చెయ్యి కలుపుతూ అడిగాడు. నాకు ఏం చెయ్యాలో ఒక్క క్షణం తోచలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో కబుర్లు విన్నాను. కాఫీ ఇచ్చాను. కుశలప్రశ్నలతో గంటసేపు కాలక్షేపం చేసిన తరవాత అతను వెళ్ళిపోతూండగా కారు నెంబరు చూశాను. వెళ్ళగానే విజయవాడ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. “ఫలానా కారులో ఫలానా వ్యక్తి వస్తున్నాడు. మెసేజి ప్రకారం అరెస్టు చేయాల్సిన వ్యక్తుల్లో అతనొకడు. అరెస్టు చేయగానే నాతొ ఫోనులో మాట్లాడించండి” అని.

రెండు గంటల తర్వాత ఫోన్ మోగింది. విజయవాడ పోలీసులు టెలిఫోన్ లో రాంమోహన్ ను మాట్లాడించారు. “సారీ రాంమోహన్ నీ అరెస్టుకు కారణమైనందుకు.నువ్వూ, నీ ఆర్డర్, రెండూ ఒకేసారి వచ్చినప్పుడు అరెస్ట్ చేయడం భావ్యం కాదనుకున్నాను. అందుకే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చాను. క్షమించు” చెప్పాను. రాంమోహన్ అర్థం చేసుకున్నాడు.

మరోసారి లక్కవరం గ్రామంలో ధనికుడైన ఒక వ్యక్తిని అర్థరాత్రి దారుణంగా చంపేసి, ఇంట్లో పూచికపుల్ల కూడా మిగల్చకుండా పెద్దఎత్తున దొంగతనం చేసిన కేసును దర్యాప్తు చేసిన పద్ధతి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారులతో అరనిమిషం మాట్లాడి వారితో ఉన్న చిరుసాన్నిహిత్యాన్ని కొందరు వాడి డబ్బుచేసుకుంటారు, అలా తనని వాడుకోబోయిన వాళ్ళని ఈయన ఎంత చమత్కారంగా దేబ్బతీసిన సందర్భం, అర్థరాత్రి బంగారపు బిస్కెట్లు అక్రమరవాణా గురించిన ఆకాశరామన్న ఫోన్ అనంతరం తంతు, తిరుపతిలో ప్రతి విజయవంతమైన దొంగతనానికి దైవదర్శనం చేసుకునే అలవాటు వల్ల దొరికిపోయిన ఓ దొంగ గురించి, ఇలా అనేకానేకమైన నేర పరిశోధనలు వేగంగా చదివిస్తాయి. ఇందులో ప్రస్తావించిన కొన్ని నేరాలు-వాటి శోధనలు గతంలో రచయిత రాసిన “ఖాకీ కలం” పుస్తకంలో కథానికలుగా వచ్చాయి. ఐతే పోలీసుగా ఎదురైనా ఆ అనుభవాలు పేరొందిన రచయితగా తనకున్న అనుభవంతో రెండు పుస్తకాల్లోనూ వేర్వేరు పద్ధతులలో దేనికదే ప్రత్యేకమనదగ్గ శైలిలో రాసుకొచ్చారు. “ఖాకీకలం” కూడా మరో వ్యాసంలో పరిచయం చేస్తాను.

అలాగే కొందరు రాజకీయ నాయకులు తన సమక్షంలో మాట్లాడిన చమత్కారపూరితమైన మాటలు కూడా తలచుకుంటారు. ముఠాకూలిగా జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రి ఐన అంజయ్య చతురోక్తులు చాలా నవ్విస్తాయి.

ఆయన(అంజయ్య) చెన్నై నుంచి తిరుపతి ఒకసారి కారులో వచ్చారట. కారులో ఎక్కగానే మద్రాసులో నిద్రకు ఉపక్రమించాదట. అదేకారులో సెక్యూరిటీ ఆఫీసర్ వామనరావు కూడా ఉన్నారు. మన ఆంధ్ర సరిహద్దుల్లోకి రాగానే రోడ్డు నిండా గుంటలు ఉండటంతో కుదుపులు మొదలయ్యాయి.

అంజయ్య కళ్ళు మూసుకునే “మన బార్డర్ వచ్చిందా” అని అడిగారట. తిరుపతి రాగానే ఆర్ అండ్ బి అధికారులను పిలిచి “తమిళనాడు రోడ్లను చూసి అయినా నేరుచుకొండయ్యా. ఆ ఆఫీసర్లకు నిద్రపుచ్చడం తెలుసు. మీకేమో నిద్రలేపడమే తెల్సు!” అని మందలించారట.

ఇక ప్రభుత్వాధికారులకు ఉద్యోగబాధ్యతలలో భాగంగా ప్రజాప్రతినిధులకు కోపం తెప్పించే పనులు చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భం కత్తిమీద సామే. రాజకీయులు కేవలం ఐదేళ్ళు అధికారంలో ఉంటారని, ఐ.పి.ఎస్. స్థాయి అధికారులు రిటైరయ్యేవారకూ ఉద్యోగంలో కొనసాగుతారని, ఐ.పీ.ఎస్.లను మహా అయితే సస్పెన్షన్ మాత్రమే చెయ్యగలరని, సర్వీస్ గ్యారెన్టీ అని వింటూంటాం. ఐతే చాలామంది ప్రజాప్రతినిధులతో ఎదురయ్యే సమస్యలు సామరస్యంగా పరిష్కరించే నేర్పు లేనివారి ఉద్యోగబాధ్యతలు దినదినగండమే. పైగా రాజ్యాంగాన్ని, సర్వీస్ నియమాల్ని అనుసరించి చూసినా “ప్రజలకు ప్రతినిధి ఐన వారిని ఎన్నో అంశాల్లో అధికారులు అనుగామించాల్సిందే కదా”. అలాంటి సందర్భాల్లో ఎలా నేర్పుగా మాట్లాడి ఇటు బాధ్యతలకు న్యాయం చేస్తూనే, అటు చిక్కుల్లో పడకండా తప్పించుకున్నారో చెప్పిన విషయాలూ బావుంటాయి.

శాంతిభద్రతల అంశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైన అంశం. వేలు, లక్షలమంది గుముగూడే సభలు, ర్యాలీలు, బందులు, ఇతర కార్యక్రమాలు భద్రత పర్యవేక్షించే వారికి పరీక్ష పెడతాయి. ఒక్కోసారి ఒక్క మాటతో ఉద్రిక్తతలు రేగి విధ్వంసానికి దారితీయోచ్చు. మాస్ హిస్టీరియా అన్ని భావోద్వేగాల్లోని బలమైనది. వాటిని ఎదుర్కొనేప్పుడు కూడా ఆయన అనుభవాలు బావుంటాయి. ఓసారి తిరుమలలో ఆలయసిబ్బందికి, పోలీసులకి మధ్య భయంకరమైన గొడవ ప్రారంభమైన సమయంలో అడిషనల్ ఎస్పీగా ఉన్న రచయిత హుటాహుటిన అక్కడకు చేరుకుంటారు. కేకలు హాహాకారాలు, సవాళ్లు ప్రతిసవాళ్ళతో ఇరుపక్షాలు ఎదురెదురుగా బాహాబాహీకు దిగడమే తరువాయి అన్నట్టుంటారు. ఆ గోలలో ఉన్నతాధికారి అయినా ఆయనకు విలువలేకుండా “మీకు తెలియదు సార్. మనల్ని చాలా అవమానించారు” అంటూ తన ఉనికే పట్టనట్టు తయారయ్యారు. అప్పుడు ఈయన “మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను. రక్షించాల్సినవారే పోట్లాడుతూంటే, నన్ను నేను శిక్షించుకుంటాను. ఈ క్షణం నుండి నేను పోలీసును కాను. ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను” అని క్యాప్, లాఠి విసిరేశారట. అంటే అందరూ సైలంట్ అయిపోయారు. “సార్ నేను కూడా వదిలేస్తున్నాను” అంటూ ఒక్కరు మొదలు పెట్టగానే అందరూ “మాకు ఈ ఉద్యోగం వద్దు. మీతో పాటే మేము కూడాను” అంటూ చొక్కాలు విప్పి చేత్తో పట్టుకున్నారట. అక్కడి నుండి చాకచక్యంగా స్టేషనుకు అందర్నీ తీసుకుపోయారు. ఆపైన వ్యక్తిగత కక్షలు తీర్చుకునేవారు మళ్ళీ ఈ సంఘటనను ఎస్సై, సి.ఐ.లను బాధ్యులుగా చూపి వారి సస్పెన్షన్ చేయించబోయారు. చీఫ్ సెక్రటరీ విషయం దర్యాప్తు చేస్తూండగా రచయిత “ఎస్సై తప్పు లేదు అనగానే డీఐజీ అగ్గిమీద గుగ్గిలమై “ఇంతవరకూ మీరు నిష్పక్షపాతంగా డూటీ చేసారనుకున్నాను. కొమ్ముకాయడం మొదలుపెట్టారు” అనగానే అందరి ఎదురుగా ఎదురుగా ఉద్వేగ పూరితుడై మాట్లాడిన తర్వాత ఆ సంఘటన ఏ మలుపు తిరిగిందో ఆయన మాటల్లోనే చదవదగ్గది. ఇవన్నీ అటుండగా పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయన అనుబంధం కూడా చదవదగినదే.

రచయిత విశాఖ డి.ఐ.జి. అయ్యాక ఇన్స్ పెక్షన్లలో గతంలోని అధికారులు రాసిన ఇన్స్పెక్షన్ నోట్ ల గురించి భలే చెప్పుకువస్తారు. మన్యం విప్లవకారుడు అల్లూరిని గురించి బ్రిటీష్ పోలిస్ అధికారి రాసిన నోట్ యధాతథ పాఠం రాస్తారు. చాలా ఆసక్తికరంగా, ఉద్వేగభరితంగా ఉంటుంది ఆ విశేషం.

ఐతే వ్యాసాలకు పెట్టిన కొన్ని శీర్షికలు బాగోలేదు. ఆ అంశాన్ని సరిగ్గా సూచిన్చేవే అయినా ఆసక్తి కలిగించేవిగా ఉండవు. ఐ.ఎ.ఎస్. అధికారిగా తన అనుభవాలు రాసిన పి.వి.ఆర్.కే.ప్రసాద్ “అసలేం జరిగింది”తో ఈ పుస్తకాన్ని పోల్చుకోవడంతో ఈ శీర్షికలు పేలవంగా అనిపించాయేమో.(అసలేం జరిగిందిలో శీర్షిక చదివితే వ్యాసం మొదలుపెట్టకుండా ఉండలేం. మొదలుపెడితే ఆపలేం). కానీ కొన్ని చోట్లమాత్రం శీర్షికలు, ప్రచురించిన పధ్ధతి కూడా రచయితా శిల్పాన్ని దెబ్బతీసాయి ఉదాహరణకు, అనంతపురంలో ట్రెయినింగు సమయంలో చాకులాంటి ఒక ఎ.ఎస్.పీ. మాకు పరిచయమయ్యాడు… అంటూ మొదలయ్యే వ్యాసంలో ఆ చిత్రమైన, హుషారైన ఎ.ఎస్.పీ ఎవరా అని మనం ఆశ్చర్యపోయేలా ఊరించి ఊరించి మధ్యలో ఎక్కడో చెప్తారు. కానీ వ్యాసం మొదలైన నాలుగో పేజిలో ఆయన పేరు చెప్పగా, మూడో పేజిలోనే ఆయన ఫోటో వేసారు ప్రచురణ కర్తలు. ఇది ప్రచురించినవారి తప్పిదం అనుకుంటే రచయిత పెట్టిన హెడ్డింగే “ఆయన ఎవరో కాదు, మన రాష్ట్ర గవర్నర్!”. హాస్యాస్పదం కదా. చక్కని ఎత్తుగడని తానే తుత్తునియలు చేసేసుకున్నారు. దానికి సరైన శీర్షిక సూచించాల్సి వస్తే “ఆయన ఎవరో కాదు…” అని చెప్తాను నేనైతే. ఇలాంటి చిన్న పొరపాట్లు మరికొన్ని ఉన్నాయి. మరోవైపు కొన్ని వ్యాసాలకు పెట్టిన పేర్లు నేరుగా విషయంలోకి లాక్కుపోతాయి. “పోలీసును కాను ఉద్యోగం వదిలేస్తున్నాను”, “దొంగతనం చేసిన ప్రతిసారీ దైవ దర్శనం”, “అటు ఎన్.టి.ఆర్. ఇటు ఇందిరాగాంధీ మధ్యలో పోలీసులు” వంటివి చూస్తూంటే చదివేయ్యాలనిపించాట్లేదా. చివర్లో ఉద్యోగాన్ని గురించి, ఉద్యోగంలోని కర్తవ్యం, ఇంకా చాలా అంశాలు రాస్తారు. ఐతే పుస్తకంలోని మిగిలిన అంశాలతో అదంతా పొసగదు. ఆ వ్యాసాలు కాస్త విసిగించే అవకాశం ఉంది. ఐతే ఇవన్నీ పుస్తకంలో చాలా చిన్న లోపాలు.

పుస్తకాన్ని పుచ్చుకుంటే పూర్తి చేసి గాని పక్కన పెట్టలేం. ఐ.పి.ఎస్. అధికారి తన ఉద్యోగ జీవితంలో విశేషాలు పక్కనే కూచుని చెప్తున్నట్టుగా ఉండే పుస్తకం అంత తేలిగ్గా పక్కన ఎలా పెట్టగలం?

***

పోలీస్ సాక్షిగా(ఉద్యోగ విజయాలు)
రచయిత: రావులపాటి సీతారాంరావు
ధర: రూ.125
ప్రచురణ: ఎమెస్కో

You Might Also Like

2 Comments

  1. varaprasad

    రావులపాటి సీతారామారావు గారు రాసే కథల గురించి ఈనాడు పేపర్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళం,అయన శైలి చాలా అద్భుతంగా ఉంటుంది,వీలయితే ఆయన రాసిన పాత కథల్ని పుస్తకం లోకి తెండి.రాజకీయాల్లో బాగానే రాణిస్తున్నారు,అయినా అపుడపుడు నాలుగు ముక్కలు రాయమని చెప్పండి.

  2. varaprasad

    r.sitaramarao,a very sensitiv writer,i read his artivals in eenadu previously,the naration and style in his writing r very simply.intakalaniki malli ayana pustala gurinchi chadavadam santoshamga undi.

Leave a Reply