గంగమ్మ తల్లి

సాహిత్యం అంటే ఒకప్పుడు అర్థం ఆనందానికి నెలవు అని. నేటి సాహిత్యానికి అర్థం వేరు. నేటి సాహిత్యం జీవితవాస్తవాలను ప్రతిబింబించేది, మనిషి జీవితపు సున్నితత్త్వాన్ని ఉజ్జ్వలంగా భాసింపజేసేది, సిద్ధాంతాల తెలివితేటలతో పాఠకుని మభ్యపెట్టనిదీ, కరుణకు ఆలవాలమైనది, సహజత్వానికి దగ్గరైనది, మనసును కదిలించి బుద్ధిని ప్రేరేపించేదీనూ. ఈ లక్షణాలన్నిటిని నింపుకుని గంగమ్మ తల్లి ఒడ్డున పల్లెటూళ్ళల్లో పైరగాలిలో విహరింపజేసి, సమాజపు చట్రంలో చిక్కుకున్న దుర్భాగ్యుల ఆక్రందనలను సెంటిమెంటుతో కాక, వాస్తవిక దృక్పథంతో చిత్రించిన విశిష్టమైన అనువాద రచన ఈ గంగమ్మతల్లి నవల.

ఉత్తరాది వారికి గంగ ఒక ప్రాణం లేని వస్తువు కాదు, చైతన్యంతో తొణికిసలాడే జీవనస్రవంతి. గంగానది అని కూడా వారు అనరు. వారికి ఆ నది ’గంగామయ్యా’. ఈ నవలలో ప్రధానపాత్రధారి క్షత్రియుడైన మటరూ సింహ్ కు కూడా గంగమ్మ తల్లి ప్రాణం. గంగలో ఈతకొట్టకుండా, ఆ తల్లిని పలుకరించకుండా, ఆ నీటిని త్రాగకుండా, అతడు ఉండలేడు. గంగమ్మ కు వరద వచ్చినా అతడు తన పల్లె నుండి కదలడు. భార్యాపిల్లలను అత్తవారింటికి పంపి, తను అక్కడే పొలాలను చూసుకుంటూ ఉంటాడు.

వృత్తి రీత్యా ఇతడొక రైతు. ప్రవృత్తి రీత్యా వస్తాదు. జమీందార్ల భూస్వామ్యానికి ఎదురొడ్డి, బంజరుభూములను కండ కరిగించి సాగు చేసుకున్న ధైర్యవంతుడు. తన తోటి రైతులను తనలోకి కలుపుకున్న మంచివాడు. జమీందార్లు అతని ధైర్యానికి ఎదురు నిలువలేకపోయినారు. కుత్సితమైన పన్నాగంతో జైలుకు పంపారు. అతడికి మూడేళ్ళ జైలు శిక్ష పడేలా చేశారు.

జైలులో అతనికి మరొక రాజపుత్రుడు గోపీసింహ్ పరిచయమౌతాడు. అతని కథ ఇది.

గోపీ సింహ్, మాణిక్ సింహ్ అన్నతమ్ములు. వారిద్దరూ కుస్తీపోటీలలో పేరెన్నిక గన్న వస్తాదులు. గంగ ఒడ్డున ఉన్న పల్లెటూళ్ళల్లో వారిద్దరి పేర్లూ తెలియని వారు లేరు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయినాయి. ఆనందకరమైన జీవితం. డబ్బుకూ, వంశగౌరవానికి లోటు లేదు.

జీవితం విచిత్రమైనది, గంగమ్మ లాగే ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేదు. విధి తిరగబడింది. గ్రామకక్షలలో మాణిక్ సింహ్ మరణించాడు. అతడి భార్య విధవరాలయ్యింది. కక్షలకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో గోపీసింహ్ జైలుపాలయ్యాడు. గోపీ జైలులో ఉండగా భార్య దిగులుతో మరణించింది. ఇప్పుడు అతని ముసలి తల్లి దండ్రులకు మిగిలిన ఏకైక దిక్కు గోపీ వదిన. ఆమె గుండె దిటవు పర్చుకుని అత్తమామలను చూసుకుంటూ ఉంది. పరిస్థితులు కుదుటపడుతున్నాయి. గోపీ సింహ్ తల్లిదండ్రులు – గోపీ జైలు నుండి రాగానే అతనికి రెండవ పెళ్ళి చేద్దామని ఆత్రుతతో ఉన్నారు. పెద్దకోడలి జీవితాన్ని మాత్రం కుటుంబగౌరవం కాపాడే బాధ్యతకూ, తమను సేవించుకునే ’అదృష్టా’ నికీ అంకితం చేశారు.

మటరూ, గోపీ జైల్లో ఆత్మీయులయ్యారు. మటరూ సింహ్ మూడేళ్ళ తర్వాత జైలు నుండి విడుదల అయ్యాడు. అచంచలమైన ధైర్యసాహసాలతో తన పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వ్యవసాయం ఆరంభించినాడు. గోపీ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులను పలుకరించాడు. గోపీ వదినను కూడా పలుకరిస్తాడు. ఆమె పరిస్థితి, ఆమె మనసూ అతడికి అర్థమవుతాయి.

గోపీ కూడా కాలక్రమంలో జైలు నుండి విడుదల అయినాడు. ఇంటికి వచ్చిన అతడికి పరిస్థితులు తెలుస్తాయి. తన వదినకు ఏ మాత్రం సానుభూతి చూపక తన పెళ్ళికై తొందరపెడుతున్న బంధువుల వెనుక ఉన్న సమాజపు కుత్సితపు రంగు అతడికి అర్థమవుతుంది. తన తల్లిదండ్రులకు తన మనసులో ఉన్న ఆలోచన చెబుతాడు. పెనుతుఫాను మొదలవుతుంది. మటరూ సింహ్ అప్పుడక్కడికి వస్తాడు. అదివరకే సమాజపు దుర్నీతులను, కుతంత్రాలను తట్టుకున్న మటరూసింహ్ గోపీకి సహాయం చేస్తాడు. మటరూ – విధవరాలిని తన చెల్లెలుగా స్వీకరించి, ఒకానొక వరద రోజు నదిని దాటి దంపతులయిన తన చెల్లెలిని, గోపీని ఆశీర్వదించడంతో కథ ముగింపు.

నూటఇరవై పేజీల ఈ నవలలో అనవసర వర్ణనలు లేవు సిద్ధాంతాల బరువు లేదు. ఉన్నదంతా వాస్తవిక జీవితపు చిత్రణ తప్ప.’ఏడుపు’ లేదు, పరిస్థితులను ఎదుర్కున్న తెగింపు తప్ప.సారం ఇంకిన ఒట్టి కథ లేదు, గంగమ్మ తల్లి నేపథ్యంలో ఆవిష్కృతమైన కథ తాలూకు కమ్మని అనుభూతుల మాధుర్యం తప్ప.పటాటోపమైన శైలి తాలూకు దర్పం లేదు, పైరగాలి వంటి సరళమైన వచనం తప్ప.

ఈ నవలను హిందీలో భైరవప్రసాద్ గుప్తా రచించారు. తెనుగు అనువాదం – పురాణపండ రంగనాథ్. చిన్న చిన్న లోపాలు (ఉత్తరాదికుల పండుగను సత్యనారాయణ స్వామి వ్రతమని చెప్పటం, మల్లుల్నిద్దర్ని గేదెల్లాగా ఉన్నారని, హుందాగా ఉండవలసిన చోట అనువాదంలో తొట్రుపడి నిందాసూచకంగా వ్రాయటం) ఉన్నప్పటికీ అనువాదం అద్భుతంగా ఉంది. ఫ్రెంచ్ భాషలోనికి కూడా అనువాదమైన నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ఈ పుస్తకం వెల పాతిక రూపాయలు. పుస్తకప్రదర్శనలో 50% తగ్గింపుతో పదమూడు రూపాయలు. పాఠకులకు ఈ నవల చదివేప్పుడు తెలుగులో బహుశా ’కొల్లాయి గట్టితేనేమి?”, “మాలపిల్ల” వంటి నవలలు గుర్తుకు రావచ్చు. చివరగా ఈ నవలలోని ఒక్క చిన్న పేరాను (ఈ నవల్లో కనిపించే సుదీర్ఘ వర్ణన కూడా ఇదే) మీకు పరిచయం చేస్తూ ముగిస్తున్నాను.

“ఇది లంక గాలుల పరిమళం, ఇది లంక భూముల సువాసన. ఇది గంగమ్మతల్లి వాత్సల్యపరిమళం. అతని ప్రాణాలు ఉన్మత్తాలయ్యాయి. ప్రతి రోమం ఉత్ఫుల్లం అయింది. అతని పాదాల్లో విద్యుత్ ప్రవహిస్తోంది.  అతడు తుఫానులాగా “అమ్మా ! అమ్మా !” అని అరుస్తున్నాడు. అతని పిలుపుకు పరవశించినట్లు “నాయనా !, నాయనా! వచ్చావా! ” అని కెరటాలు ప్రతిధ్వని చేస్తున్నాయి. ప్రతిస్పందనగా కదులుతున్నాయి.దశదిశలూ ప్రతిధ్వనిస్తున్నాయి.

“నాయనా! నాయనా! ” భూమి పిలుస్తోంది. “బిడ్డా! బిడ్డా!”  కోట్లమంది తల్లులూ పిల్లలూ పరస్పరం పిలుచుకుంటున్నట్లు భూమ్యాకాశాలు ప్రతిధ్వనిస్తున్నాయి.

ఆకలి వేసిన బిడ్డలా అతడు గంగమ్మతల్లి ఒడిలోకి ఉరికాడు. బిడ్డకు సర్వ ఉపచారాలు చేసే తల్లిలా గంగమ్మతల్లి అతని ఒడలంతా తడిమింది. అది కెరటాలప్రవాహాల కలకలధ్వని కాదు. బిడ్డకు తల్లి పెట్టే ముద్దుల శబ్దం. దిశలు స్తంభించాయి. గాలి గుసగుసలాడింది. మట్టి ముసిముసిగా నవ్వింది.

“మా బిడ్డ వచ్చేశాడు, మా బిడ్డ వచ్చేశాడు” అని అవన్నీ ఆనందాతిశయంతో చెప్పుకుంటున్నాయి.”

…………..
…………..

You Might Also Like

5 Comments

  1. ఏల్చూరి మురళీధరరావు

    శ్రీ రవిగారు,

    గంభీరమైన నవలలోని ఒక కోణాన్ని చక్కగా ఆవిష్కరించారు.

    ఉత్తర భారతదేశంలోని గతితార్కికభౌతికవాద రచయితలలో శ్రీ భైరవ్ ప్రసాద్ గుప్తా గారు సుప్రసిద్ధులు. “గంగా మయ్యా” నవల 1953లో వెలువడినా, ఇప్పటికీ ఫ్రెంచి, రష్యన్, పోర్చుగీసు మొదలైన వివిధభాషలలోకి అనువాదం అవుతూనే ఉన్నది. సానుకూల విమర్శల మూలాన దీని తమిళ అనువాదానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. భూస్వాముల దోపిడీని, వాళ్ళల్లో వాళ్ళ ముఠా తగాదాలను ఆపకపోగా వారికి వత్తాసుగా పోలీసు వ్యవస్థ తోడ్పడటం, వీరందరి అణచివేత ధోరణికి ప్రతిఘటనగా రైతుకూలీలు సాగించే పోరాటం నేపథ్యంలో గంగమ్మ తల్లిని సాక్షిగా నిలిపి నవలంతా ప్రతీకాత్మకంగా, భావగర్భితంగా సాగిపోయింది.

    అన్నట్లు, “సత్యనారాయణ వ్రతం” ఉత్తర భారతదేశం నుంచే మన ప్రాంతాలకు వచ్చి, ఆ తర్వాతి కాలంలో ప్రాచుర్యం వల్ల, అన్నవర క్షేత్రావిర్భావం వల్ల మనదైపోయింది. అది మన సొంతమేమీ కాదు. ఉత్తర భారతంలో దీనిని (పురోహితుల ఆర్భాటం లేకుండా శాస్త్రానుసారం) ఎవరికి వారే చేసుకొంటారు. అదేమీ అనువాదంలో విమర్శనీయ విషయం కాదు.

    అద్భుతమైన రచనను అభినందనీయంగా జ్ఞాపకానికి తెచ్చారు.

    1. రవి

      సత్యనారాయణ వ్రతం గురించి మంచి సమాచారం చెప్పారు. ఇది తెలుగు వారిపండగని ఇంతకాలమూ అనుకుంటూ వచ్చాను. బావుంది. ఈ నవల ఇదివరకే ఇంత ప్రాముఖ్యం పొందినదని మీ వంటి పెద్దలు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది. మా తరం వాళ్ళకు తెలియని ఆణిముత్యాలెన్ని ఇంకా దాక్కుని ఉన్నాయో?

  2. Kishore

    చాలా మంచి నవల. దాదాపు ఎనిమిది ఏళ్ళ క్రితం చదివాను. ఎంతగా నచ్చిందంటే, ఆ స్పూర్థి తోనే మా పెద్దమ్మాయికి జాహ్నవి అని పేరు పెట్టాను.

  3. pavan santhosh surampudi

    నేను ఈ పరిచయం పూర్తిగా చదవను. మొదటి పేరాల్లోనే నాకు పుస్తకంపై ఆసక్తి వచ్చేసింది. విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ఎన్.బి.టి. స్టాల్లో కొనేసి చదివేస్తాను.
    ఆదాన్ ప్రదాన్ శీర్షికన వచ్చే పుస్తకాలన్నీ కొనేసే నేను దీన్ని చూస్తూ చూస్తూ వదిలేసినందుకు బాధగా ఉందిప్పుడు.
    Thank you ravi ji

    1. రవి

      సమీక్షలో ఆఖరు పేరా తప్పక చదవండి.:)

Leave a Reply to Kishore Cancel