తెలుగువారి చరిత్ర – వేర్పాటువాదం

వ్యాసం రాసినవారు: కోడూరి గోపాలకృష్ణ 

***
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలకు నాయకులకు సంబంధిత రాష్ట్ర చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఇలాంటి విషయాలు లోతుగా తెలుసుకోవాలంటే ఎన్నో గ్రంథాలు చదవాలి (ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషణలు), దానికి చాలా సమయం వెచ్చించాలి. రచయిత స్వతహాగా రాజకీయ వేత్త కావడం వల్ల, ఆయన దృష్టిలో సమయాభావం మరింత ప్రాముఖ్యత సంతరించుకుందనుకుంటాను. రచయిత ప్రకారం ఈ పుస్తక ముఖ్యోద్దేశ్యం ఇప్పుడు ప్రబలుతున్న వేర్పాటువాదన, సమైక్యవాదనలకు దారితీసిన చారిత్రక విషయాలు పాఠకులకు సాధ్యమైనంత క్లుప్తంగా తెలియజెప్పడం.

పుస్తక మొదటి 1-17 అధ్యాయాల్లో శాతవాహనుల కాలం నుంచి ఆంగ్లేయుల పాలన దాకా తెలుగువారు ఉన్న భూభాగం ఎలా విభజించబడిందో చెప్పబడింది. ఈ అధ్యాయాల్లో ఏ రాజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాలించాడు అన్న విషయం మినహా పెద్దగా ఏమీ లేదు. ప్రజల జీవన శైలి – అలవాట్లు, ఆర్థిక స్థితిగతులు – ముఖ్య వ్యాపారాలు, సంగీతం – సాహిత్యాది కళలు గురించి చెప్పి ఉంటే ఆయా ప్రాంతాల అభివృద్ది, వాటి సహజ వనరుల వినియోగం గురించి తెలుసుకోవడానికి ఇంకా బావుండేది.

18-23 అధ్యాయాల్లో‌ మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడివడటం, ఆ తర్వాత హైదరాబాద్ రాష్టంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడటం చర్చించారు. ఈ అధ్యాయాల్లో, ఆయా ప్రాంతాల్లో జరిగిన పరిణామాల కంటే వ్యక్తులకి ప్రాధ్యాన్యత ఇవ్వబడింది. ఎంతోమంది పేర్లు ఉన్నపళాన చర్చకు వచ్చేస్తుంటాయి. రాష్ట్రం గురించి చూచాయగా తెలిసిన వ్యక్తులకైనా అన్ని పేర్లు తెలిసి ఉండటం జరగదు, చదివేటప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకుని రచయితని అనుసరిస్తూ చదవడం కూడా కష్టమనిపిస్తుంది.

24-39 అధ్యాయాల్లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వేరు వేరు ముఖ్యమంత్రుల హయాంలో నెలకొన్న పరిస్థితులని చర్చించారు. ఇక్కడ కూడా పరిణామాల కంటే, వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తారు. బహుశా రాజకీయ వర్గాల్లో గతం గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యమైన వ్యక్తుల ఆధారంగా పరిణామాలని గుర్తుచేసుకోవడం పరిపాటేమో, రచయిత వృత్తిరీత్యా చరిత్రకారుడు కాదు కాబట్టి తను దైనందిన జీవితంలో ఉండే చర్చల పంథాలోనే పుస్తకం కూడా రాసినట్టుగా అనిపించింది. ఈ అధ్యాయాల్లోని చాలా విషయాలు గత రెండు మూడు సంవత్సరాలుగా వేర్పాటువాదం మీద మీడియాలో జరుగుతున్న హడావిడిని గమనిస్తే తెలిసేవే.  ప్రత్యేక తెలంగాణ వాదం అసలు మొదటిసారిగా ఎప్పుడు, ఎందుకు తెర మీదకి వచ్చింది, తర్వాత ఎందుకు సద్దుమణిగింది, ఇన్నాళ్ళకు మళ్ళీ ఎందుకు రాజుకుంది అన్న విషయాలు కనిపిస్తాయి. ఇవన్నీ క్లుప్తంగా చెప్పినా ప్రాథమిక కారణాలైతే అర్థమవుతాయి. అయితే రాజకీయవేత్తగా రచయిత తెలుసుకోగలిగిన కొన్ని తెరచాటు వ్యవహారాల గురించి కూడా ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకి, కేసీఆర్ ఆమరణదీక్ష సమయంలో హాస్పిటల్ వర్గాల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందంటూ ఒక వార్త వచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వం నెరపిన ఎత్తు అని దాని గురించి చర్చిస్తారు రచయిత. 34వ అధ్యాయంలో రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత తెలంగాణా, సీమాంధ్ర  ప్రాంతల్లో జరిగిన అభివృద్ధి తాలూకూ ఎన్నో గణాంకాలు సేకరించి ప్రచురించారు. పాఠకులకు ఆయా ప్రాంతాల అభివృద్ధి గురించిన సమగ్రమైన అవగాహనకి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి, ముఖ్యంగా ప్రాంతాలవారీగా పెట్టుబడి, ఎదుగుదలల పాలు, నిష్పత్తి తెలుస్తాయి.

సమయం ఉంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపై విడిగా ఉండే పుస్తకాలు చదవడం మంచిది. ఒకవేళ వేర్పాటువాదం గురించి తక్కువ సమయంలోనే తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పక చదవచ్చు.

పుస్తకం వివరాలు:
తెలుగువారి చరిత్ర – వేర్పాటువాదం (క్రీ. పూ. 300 – క్రీ. శ. 2010),
డా.॥ దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నివేదిత పబ్లికేషన్స్,
ఇక్కడ ఆన్‌లైన్‌లో ఉచితంగా లభ్యమౌతుంది (లీగల్ యే!).
ముదణా ప్రతులకు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లను సంప్రదించగలరు.
వెల: 200/-

You Might Also Like

7 Comments

  1. varaprasad

    దగ్గుబాటి చాలా మంచి వ్యక్తీ,,,,రాజకీయ కారణాలతో గత 20 సంవత్చరాల్లో చాలా మారారు,అయితే అయన నిజంగా,మనస్పూర్తిగా,మనస్సాక్షిగా,ఇవన్ని చెప్తుంటే సంతోషం.

  2. J T Bandagi

    దేశం నుంచి విడిపోవాలని చేసే ప్రయత్నాన్ని మాత్రమె వేర్పాటు వాదం అనాలి
    మద్రాస్ నుంచి ఆంద్ర విడిపోవాలనుకోవడం ఎలాగైతే వేర్పాటు వాదం కాదో ….
    అలాగే “ఆంద్ర ” నుంచి తెలంగాణా విడిపోవాలనుకోవడం కూడా వేర్పాటు వాదం కాదు.

    1. pavan santhosh surampudi

      దేశానికి, రాష్ట్రానికి మౌలికమైన భేదమేంటి? సార్వభౌమత్వం మాత్రమే కదా? సాంస్కృతికమైన విభజనగా గుర్తించనంత వరకూ దేశవిభజనైనా, రాష్ట్ర విభజనైనా అట్లాసులో గీతలు మార్చుకోవడమే అవుతుంది. దేశం నుంచి విడిపోవడాన్ని కూడా వేర్పాటువాదం అని ఎందుకు అనాలి. శ్రీలంక తమిళులు తమది న్యాయమైన డిమాండ్ అనే అంటారు. సింహళీలు మాత్రం వేర్పాటువాదం అంటారు. అలానే రాష్ట్ర విభజన అంశం వస్తే తెలంగాణాలో కొన్ని వర్గాలు న్యాయమైన డిమాండ్ అంటూంటే, కోస్తాలో కొన్ని వర్గాలు వేర్పాటు వాదం అంటారు. పదానికి గల అర్థం కూడా రాష్ట్రానికి, దేశానికి విచక్షణేమీ చూపించడం లేదు.

  3. Krishna

    Hi
    Thanks for the post
    But the link goes to Dr.Rao’s other book Oka Charithra Konni Nijaalu.
    Pls check

  4. pavan santhosh surampudi

    దాదాపు ఇదే అంశంపై, ఇదే నేపథ్యంలో వచ్చిన మరో పుస్తకం ఎం.వి.ఆర్.శాస్త్రి “ఆంధ్రుల కథ” దీనికన్నా మంచి ఎంపిక.

    1. గోపాలకృష్ణ కోడూరి

      పుస్తకం గురించి చెప్పినందుకు నెనర్లు! చదవడానికి ప్రయత్నిస్తాను.

Leave a Reply to varaprasad Cancel