The wind from the sun

windfrom-thesun“The Wind from the sun” Arthur Clarke కథల సంకలనం. మొత్తం 18 కథలున్నాయి. ఆర్థర్ క్లార్క్ అనగానే, అవి సై-ఫై కథలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆర్థర్ క్లార్క్ కథలు/నవలలు/వ్యాసాలు – ఏవీ నేను ఎప్పుడూ చదవలేదు కానీ, ఆయనంటే నాకు అభిమానం ఉంది. నేనెళ్ళే ప్రాంతాల్లో ఆయన పుస్తకాలు ఎప్పుడూ కనబడలేదు నాకు. అలాంటిది ఆ మధ్య సెంట్రల్ బుక్ స్టోర్స్ (క్లాక్ టవర్) లో ఇది కనిపించేసరికి మారాలోచించకుండా తీసుకున్నాను. చదివాక ఏమాత్రం నిరాశపడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడుపడితే అప్పుడు ఈ పుస్తకం అలా తెరిచి, ఇంట్లో పనులుచేస్తూ మధ్య మధ్య విరామాల్లో ఒక్కో కథా చదివాను. చదివిన ప్రతిసారీ ఏకబిగిన ఆ కథ ముగించడమే. ఈ పుస్తకం గురించి ఓ సంక్షిప్త పరిచయం –

“Food of the gods” – ఆహారాన్ని కృత్రిమంగా తయారుచేస్తూనే వాటిలోని సహజ విలువల వల్ల వచ్చే రుచిని కలిగించే వ్యాపారం గురించిన కథ. నాకు కథ నచ్చింది కానీ, “వావ్!” అనిపించలేదు. ఇందులోని ఇమాజినేషన్ నాకు చాలలేదనుకుంటాను. “The secret” – చంద్రుడిపై జీవితం, భూమిపై ఉండేవరితో పోలిస్తే, అక్కడి వారికి ఆయువు ఎక్కువుండాలి అన్న వాదనా – రెండూ నాకు ఆసక్తి కరంగా అనిపించాయి కానీ, మళ్ళీ నాకు ఆ “వావ్!” భావన కలగలేదు. “Dial F for Frankestein” కథ మాత్రం నన్ను పూర్తిగా కట్టిపడేసింది. ఊహిస్తూ ఉంటే ఒళ్ళు జలదరింపు… చదివేకొద్దీ పెరుగుతున్న ఉత్కంఠ, ముగింపులో సరైన పంచ్ – నాకీ కథ విపరీతంగా నచ్చింది. కథకి మూలమైన ఊహకు, కథని నడిపించిన విధానానికి క్లార్క్ కు జోహార్!

“Reunion” అన్నది నిజానికి కథ కాదు. ఓ చిన్న వ్యాసం లాంటిది. ఆసక్తికరంగానే ఉంటూ, కాస్తంత ఆలోచన రేకెత్తించింది. “Playback” – నాకీ కథ కంటే కూడా, దాన్ని నడిపిన తీరు నచ్చింది. I liked the experience of reading it. మళ్ళీ మళ్ళీ కూడా చదువుతానేమో. కథ కోసం కాదు. ఆ కథనం కోసం. “Light of Darkness” – ఈ కథలోని సృజనాత్మకత నాకు చాలా నచ్చింది కానీ, కథ మాత్రం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు కథ మొదలైన చోటినుండీ ఇంత మంచి ఊహాశక్తిని ఈ కథ మీద వృథా చేసారేమిటనే అనిపిస్తూ ఉండింది. “Longest sci-fi story ever told” – Recursively funny! ఎటొచ్చీ, నాకు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాలేదు. “Herbert George Morley Wells Esq.” అన్న కథ-వ్యాసం బాగుంది. ఇందులోని కొన్ని ముగింపు వాక్యాలని ఒక్కసారి ఊహించుకుంటే, ఆ ఊహే భయంకరంగా ఉంది నాకు ఇప్పటికీ. “Love that universe” కథ చాలా ఆసక్తికరంగా ఉంది. మళ్ళీ నేను “వావ్!” అనుకున్న కథ – “The cruel sky”. కథ చదువుతూ ఉంటే, ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే, అద్భుతం! అనిపించింది. ఈ కథ చదువుతున్నప్పుడే సత్యజిత్ రాయ్ సై-ఫై పాత్ర ప్రొఫెసర్ శొంకు హిమాలయాల్లోనే చేసిన అడ్వెంచర్ ఒకటి గుర్తొచ్చింది.

“The wind from the sun” – టైటిల్ స్టోరీ కదా, నేనో రేంగ్ లో ఉంటుందనుకున్నా. వస్తువు పరంగా నిజంగానే ఓ రేంజ్ లో ఉంది. నాకు కథ నచ్చింది. కానీ, అద్భుతం! అనిపించలేదు. అప్పుడే అనుమానం కలిగింది, కథా సంకలనాల్లో ఆ సంకలనం పేరుకి ఓ కథ పేరు ఎంచుకుంటారు కదా – అది ఎలా ఎంచుకుంటారు అని. ఎవరన్నా తెలిస్తే ఇక్కడో వ్యాఖ్య వదలండి 🙂 “Maelstrom-II” కథ చదువుతూ ఉంటే ఎందుకో కల్పనా చావ్లా, ఆమెతో పాటు గగన సమాధైన ఆ జట్టూ గుర్తువచ్చారు. “The Shining Ones” – కథ చాలా ఆసక్తికరమైన థ్రిల్లర్ కథ. నాకు ఈ సంకలనంలో బాగా నచ్చిన కథల్లో ఇదొకటి.

అసలైన, అన్నింటికంటే పెద్ద కథ గురించి నేను ఇందులో రాయలేదు, రాయను కూడా 🙂 మొత్తానికి చదివి అనుభవించాల్సిన పుస్తకం. క్లార్క్ అభిమానులకైతే చెప్పనక్కర్లేదు. కానివాళ్ళకి చదివితే పోయేదేమీలేదు.

You Might Also Like

One Comment

  1. bondalapati

    ఇది పుస్తక పరిచయం కాదు..పుస్తకం చదువుతున్నప్పుదు మీ లొ కలిగిన భావాల పరిచయం…:)

Leave a Reply