సరసి కార్టూన్లు-2

వ్రాసినవారు: సూరంపూడి పవన్ సంతోష్
*************************
“ఏకం స్వాదు న భుంజీత” అన్నది ఆర్యోక్తి. అంటే రుచికరమైన పదార్థం పదిమందితో పంచుకుతినాలే కాని ఒక్కడే నంచుకుతిన కూడదన్నది ఆంతర్యం. మరి ఏ పుస్తకం సంగతైనా ఏమో కాని ఇది కార్టూన్ల పుస్తకానికి వర్తించి తీరే సూక్తి ఇది. ఎంతటి పిసినారైనా ఒంటరిగా పదిమందిలో కార్టూన్ల పుస్తకం మాత్రం సొంతంగా చదువుకుని సంతోషించడానికి వీలుండదు. పాపపుణ్యాల సంగతైతే ఏమో గాని అయ్యోపాపం అనుకునేలా ఐపోతాం. చుట్టూ ఉన్న వాళ్లు మనం నవ్వే నవ్వులకి పిచ్చాళ్లు కాబోలు అనుకుంటారు. ఆ భ్రమ వారికి కల్పించకుండా, వారికీ ఓ రెండు కార్టూన్లు చూపించాలి. జోకులుగా చెప్పగలిగినవైతే మరో రెండు వినిపించాలి హాయిగా నవ్వుకుంటారు. అలానే ఏ కార్టూను పుస్తకమైనా మేం ఇంటిల్లిపాదీ చదువుకుంటాం. ఎవరైనా చూడ్డానికి వస్తే వాళ్లకీ వినిపించి నవ్విస్తాం. అదో సామూహిక హాస్య సంస్కృతి.

అదలా ఉంచండి. తెలుగుకార్టూనిస్టుల్లో సరసి అనబడే సరస్వతుల రామనరసింహం గారిది ఓ ప్రముఖస్థానం. దానికి ఆట్టే పోటీ లేదు. ఎందుకంటే-చూసినంతలో మన కార్టూనిస్టులు చాలామంది లైనుకు ఇష్టులు. అంటే-బొమ్మ, రేఖ, కనుముక్కు తీరు, పరిసరాలు ఆ అందచందాలు ఇలా ఉంటుంది వారి దృష్టి అంతా. వారి ఇంప్రూవ్ మెంట్ కూడా దానిమీదనే కేంద్రీకరించి ఉంటుంది ఏ కొందరో తప్ప. ఆ కొందరూ మాత్రం రేకలతో పాటు కార్టూనుకు ప్రాణంలాంటి హాస్యాన్ని, కాన్సెప్టునూ ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంటారు. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే-సరసి గారు ఆ రెండో రకం. బొమ్మలో మూతులు కాస్త వంకరైనా, కాళ్లు బాగా పొడవైనా ఆట్టే పట్టింపు ఉన్నట్టు కనపడదు. కాని, ఏ రేఖవల్ల కార్టూనులో హాస్యం పండుతుందో, ఏ ముఖకవళిక వల్ల సీరియెస్ నెస్ భళుక్కున నవ్వుతుకంటుందో అంతవరకూ మాత్రం చాలా నిక్కచ్చిగా, పక్కాగా వేస్తారు. ఇక వారి కార్టూనుల్లోని హాస్యస్ఫోరకత విషయంలో మాతరం నేరుగా బాపు గారికే వారసులు వారు. అంతమాట నేనంటున్న అతిశయోక్తి కాదు. బాపుగారే ఏనాడో నొక్కివక్కాణించిన స్వభావోక్తి.

ఓ మూడేళ్ల క్రితం సరసి కార్టూన్లు-2 అన్న పుస్తకం వచ్చినప్పుడు మా కుటుంబానికి ఆప్తులైన ఆయన సోదరులు శ్రీ సరస్వతుల హనుమంతరావు గారు తెచ్చి సభక్తికంగా మా నాన్నగారికి ఇచ్చారు. అంతే అందరం కలిసి ఆ పుస్తకాన్ని హాయిగా చదువుకున్నాం. ఇప్పటికీ ఆ పుస్తకం ఎప్పుడు తిరగేసినా ఆ పుస్తకం నన్ను తిరగేస్తుంది. అమ్మా నాన్నా చెల్లెళ్లూ అమ్మమ్మా కూర్చొని ఉండగా అక్కడికేదో ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వర రావు గారిలా పుస్తకం ఎదర పెట్టుకుని వినిపించి నవ్విస్తూంటాను.

ఇక ఈ పుస్తకంలో మా కుటుంబానికి ప్రత్యేకంగా అర్థమయ్యే కొన్ని గీతా రహస్యాలున్నాయి. గుంభనంగా అర్థం చేసుకుని నవ్వుకునేవి ఆ సంగతులు. అవి కార్టూనిస్టు కుటుంబానికే నేరుగా పరిచయాలుండటంతో మాకు తెలిసే వివరాలు. ఉదాహరణకు ఆయన తమ్ముడు శ్రీ హనుమంతరావు గారు ప్రఖ్యాత ఘటవాద్యకారులు, మృదంగ విద్వాంసులూనూ. దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ లెక్కకు మిక్కిలి సన్మానాలు పొందారు. ప్రస్తుతం కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు కూడాను.మరి ఈ పుస్తకంలోని సంగీతకచేరీలు, హరికథలకు సంబంధించిన కార్టూన్లన్నీ హనుమంతరావుగారు చెప్పే కబుర్లలోంచి పుట్టేవేనని మా ఉమ్మడినమ్మకం. పేజీ నెంబరు 14, 18, 27, 48, 77, 113, 120, 126ల్లో ఘటవిద్వామసులకూ, మృదంగవిద్వాంసులకూ మాత్రమే తెలిసే సంగతులతో కార్టూన్లున్నాయి. అలానే కార్టూనిస్టు చిత్రకారులకు సంబంధించిన జోకులూ వేశారు 25, 116;ఒ/వయ్హ. అసెంబ్లీలో మీడియా వ్యవహారాలు చూసే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారీ కార్టూనిస్టు. ఆ అనుభవంతోనే రాజకీయనాయకుల గురించి(పొలిటికల్ కార్టూన్లు కాదండోయ్) పొలిటికల్ కార్టూనిస్టులకీ అందని లోతులు స్పృశిస్తూ కార్టూన్లు వేయగలిగారేమో. పేజీ నెం.3, 12, 23, 46, 64, 77, 80, 97, మొదలుపెట్టి ఎన్నో పేజిల్లో ఆ కార్టూన్లు పరుచుకున్నాయి. ఇక కార్టూనిస్టు ప్రత్యేక నిశితదృష్టీ మాత్రం ఎంతో విచిత్రమైన అమరిక ఉండే రైలు, ఎతో వింత సంఘటనల మయమైన పెళ్లి విషయాల మీద ఉంది. ఆ రెండూ కూడా ఈ కార్టూనిస్టుకు తరగని గని.

ఇక సబ్జెక్టులోంచి హాస్యాన్ని పిండి తీయడంలో నిపుణుడు సరసి. పెళ్ళికూతురు తలంబ్రాలు పోయబోతే జోలెపట్టే పెళ్ళికొడుకు, సినీ నటి దేవతావస్త్ర, పది రన్స్ చేసినందుకు ఓ కళాభిమాని పదిరూపాయలు చదివించారు, వారిని ఆ సర్వేస్వరుడు సదా కాపాడు గాక! అనే క్రికెటర్ ఇలా చెప్తూపోతే కార్టూన్లన్నీ అయిపోతాయి. విస్తరిముందు కూచోబెట్టి వడ్డించడం మాని వర్ణిస్తూ భోజనమంతా లాగించేసిన పాపాత్ముణ్ణి అయిపోతాను. హాస్యం చిమ్మని కార్టూన్ లేదంటే నమ్మాలి మీరు. “సిరికింజెప్పడు శంఖుచక్ర యుగముం” పద్యానికి కూడా ఓ కార్టూన్ వేసి నవ్వించగల దిట్ట. క్యాటరింగ్ వాళ్లు చేసే ఓవరాక్షన్ చూపించేలా శోభనం గదిలో కూడా పాలగ్లాస్ పట్టుకుని శోభనపు పెళ్లికూతురితో పాటుగా తయారయ్యే క్యాటరర్ కార్టూన్ వేసి చురకంటిస్తారు. ఇంక చెప్పను. సారీ మీరే కొని చదువుకుందురు గాని.

సబ్జెక్టు గురించి వదిలి రేకల్లో పడితే ముందే అనుకున్నట్టుగా ఆయన రేకల్లో దృష్టంతా హాస్యం పండిచాల్సిన మూతివిరుపు మీదో, శరీరభాషమీదో ఉంటుంది. మిగిలిందంతా మాదిరిగా ఉంటుంది. కాని చాలా కార్టూన్లలో వ్యాఖ్య మాత్రమే చెప్పి కార్టూన్ చూపించకపోతే(వివరించకపోతే) నవ్వు రాదు సరికదా అసలేం అర్థం కాదు. కార్టూనులో బొమ్మంతా కళాఖండంలా వేసి ప్రాణంలాంటి ఆ విరుపు, ఆ మెరుపు ఊహించి వేయలేక చతికిలబడే కార్టూనిస్టుల కన్నా ఇలాంటివారే పండించగలరు కార్టూన్ ని.

ఎంచుకున్నదంతా నేటి మధ్యతరగతి జీవితమే, కొన్ని మాత్రం నిన్నటితరం మధ్యతరగతివాళ్లవీ లేకపోలేదు. మధ్యతరగతి మానవుల పెళ్లిళ్లు, కాపురాలు, భోజనాలు, రైలుప్రయాణాలు, కచేరీలు, హరికథలు ఇవే ఎక్కువ కార్టూన్లలో కనపడతాయి. ఇక రెండో ప్రాధాన్యత తెలిసీ తెలియక హాస్యం పుట్టీంచేసే రాజకీయనాయకులకి, ఆ తర్వాతే ఎవరైనా.

ఇవన్నీ చెప్పడమే కాని వివరించడం అవదు. ఎవరో సంస్కృతకవి చెప్పినట్టు తియ్యగా ఉందని చెప్పగలం గాని జిలేబీ తియ్యదనానికీ, పూతరేకుల తీపికి ఉన్న తేడా ఎంతటివాడైనా చెప్పలేడు. అలానే ఈ కార్టూన్లని విడమర్చి చెప్పడం అవదు. కాబట్టి ఈ పుస్తకం కొనాలి. చుట్టూ ఇంట్లోవాళ్లుండగా చదివి అవసరమైతే వివరించి చూపించి నవ్వుకోవాలి. ఇంతాజేసి రెండుపేజీలకొకటి మనమీదే వేశాడ్రా అనిపించే కార్టూనొకటి తగులుతుంది. ఏం పర్లేదు నవ్వుకోవడం ఆరోగ్యానికి మంచిది. మనల్స్ని చూసి మనమే నవ్వుకోగలగడం మానసికారోగ్యానికి మంచిది.

******

సరసి కార్టూన్లు-2(కార్టూన్స్) బై ఎస్.రామనరసింహం
మొదటి ప్రచురణ: జనవరి, 2009
వెల: రూ.75
పేజీలు: 144
ప్రచురణ: కృష్ణచైతన్య పబ్లికేషన్స్
సరసి మొబైల్ నెంబర్: 09440542950
ఈమెయిల్: sarasi_cartoonist@yahoo.coom
ప్రతులకు:
1.విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-500001
2.సాహిత్యనికేతన్, గవర్నరుపేట, విజయవాడ-520002. ఫోన్: 0866-6667421
3.గుప్తా బ్రదర్స్ బుక్స్, డైమండ్ పార్క్ రోడ్, ద్వారకానగర్, విశాఖపట్నం-530016, ఫోన్:0891-2754454

You Might Also Like

One Comment

  1. sarasi

    ధన్యవాదాలు పవన్ . నేను హాస్య రసాస్వాదన లేని వాడిని గా ఉంది ఉంటె ఎప్పుడో ఆత్మా హత్య చేసుకుని ఉండే వాడిని అని గాంధీ మహాత్ముడు అన్నారు . హాస్యానికి అంత ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికి చెప్పనది . నీ భావ ప్రకటనా చాతుర్యం అద్భుతం . — సరసి

Leave a Reply