సాహిత్యంలో ముందుమాటలు

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
(ఈ వ్యాసం మొదట “తెలుగు సాహితీ సమాఖ్య” అన్న సాహిత్యసంస్థ వారు 40వ వార్షికోత్సవం సందర్భంగా వేసిన “మధుమంజరి-వార్షిక సాహిత్య సంచిక”లో ప్రచురించబడింది. సంచిక అక్టోబరు 2012 లో విడుదలైంది. – పుస్తకం.నెట్)
****************
ముందుమాటల విలువను అర్థం చేసుకోవాలంటే భారతరాజ్యాంగ ప్రవేశికకున్న విలువను గుర్తుచేసుకుంటే సరి. ప్రవేశిక ఒక విధంగా పీఠికే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగానికి నిడివిలో అతి చిన్నదైన ప్రవేశిక సారాంశంగా భాసిస్తోంది. దానిలో ఒక్కొక్క పదానికీ దేశచరిత్రకున్నంత లోతూ, దేశభవిష్యత్తుకున్నంత శక్తీ ఉన్నాయి. అలానే సాహిత్యంలో పీఠికదీ పెద్దపీటే… వ్రాసేవారి సత్తాను బట్టి.

తెలుగుసాహిత్యంలో గతశతాబ్దిలో వచ్చిన రచనల్లో ముందు చెప్పుకోదగ్గ మహాప్రస్థానానికి.. పీఠికల్లో ముందు చెప్పుకోదగ్గదైన “యోగ్యతాపత్రం” పీఠికగా అమరింది. అందులో “సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి ఇవ్వరాదా అని చెలం కోర్కె. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు, కవులూ చెయ్యరు-ఎంకీ, శ్రీశ్రీ తప్ప” అంటారు చెలం శ్రీశ్రీ కవితల్లోని ఎకానమీ ఆఫ్ వర్డ్స్ గురించి చెప్తూ. “తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వమంటాడు చెలం” అని, “నెత్తురూ, కన్నీళ్లూ కలిపి కొత్తటానిక్ తయారుచేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధప్రపంచానికి” అని ఆ కవిత్వగాఢత పదాల్లో చెప్పజూస్తాడు. చివర్లో “రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండఘోషం, ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి” అని హెచ్చరిక చేసిముగిస్తారు. అంత వడిగా, జడిగా వున్నందునే పిచ్చేశ్వర్రావు అనే పాఠకుడు,”చెలం యోగ్యతాపత్రం చదివాకా మహాప్రస్థానం పద్యాలు చదవక్కర్లేదంటాను. మీరేమంటారు?” అని శ్రీశ్రీ నిర్వహిస్తున్న ప్రజ(ప్రశ్నలు-జవాబులు) శీర్షికకు ఉత్తరం వ్రాశారు. శ్రీశ్రీ క్లుప్తంగా “మీరు సార్థకనామధేయులంటాను” అని జవాబిచ్చి ఊర్కున్నారు. పిచ్చేశ్వర్రావు సార్థకనామధేయులో కాదో మనకు తెలియదు కానీ ముందుమాట ప్రాముఖ్యత తెలుపడానికి ఇంతకుమించి గొప్ప ఉదాహరణలేదు. ఇది పరాకాష్ట.

“దర్గామిట్ట కథలు” పుస్తకానికి ముళ్లపూడి వెంకటరమణ “ముబారక్” శీర్షికతో ముందుమాట వ్రాస్తూ “అచ్చుతప్పులూ, అవకతవకలూ అయోమయాలూ సందేశాలూ సమస్యల పరిష్కారాలూ ఉన్న కథల గురించి రాయడం బలే జిల్లయినపని. “వర్థమాన” రచయిత తలనిమిరి వెన్నుతట్టి ఎంకరేజి చేసి షయినయిపోవచ్చు. కానీ- ఆ “వర్థమానుడు” అయిదడుగులు కాకుండా జైనవిగ్రహంలా మరీ అరవై అడుగుల ఎత్తున నిశ్చలంగా నిర్మలంగా చిరునవ్వుతో నిలబడి ఉంటే రాసేదేముంది? చేసేదేముంది? చేతులు జోడించి నమస్కరించడం తప్ప” అంటారు. నిజానికి “దర్గామిట్ట కథల”కి ముందు ఖదీర్ బాబు అంత పేరున్న రచయిత కాదు. కాని దర్గామిట్ట కథలతో నామినికి “మిట్టూరోడి కథల” నాటికి వచ్చినంత పేరు వచ్చింది. ఆ రావడంలో ఖదీర్ ప్రతిభతో పాటూ ముళ్ళపూడి ముందుమాటకీ వాటా ఉంది. అంతటి వాడే అంత గొప్పగా వ్రాసాడంటే ఎం ఉందో అని చూస్తారు కదా కనీసం ఒక్కసారి. ఆ అవకాశం చాలు ఆ కథలకి కట్టిపడెయ్యడానికి. ఆ కోవలోకే వస్తుంది మరో ముందుమాట. వల్లూరి విజయహనుమంతరావు తెలుగు సినీ గీతాల సాహిత్యాన్ని విమర్శిస్తూ వ్యాసాలూ, సినిమాపాటని సంపన్నం చేసిన కవి, గాయక, సంగీతదర్శకుల గురించి వ్రాసిన కవితలనూ, మరికొందరు సినీగీతరచయితల అభిప్రాయాల్నీ కలిపి సంకలనం చేసి “తెలుగు చిత్ర సరస్వతి” పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ముందుమాట వేటూరి సుందరరామమూర్తిని వ్రాయమంటే ఆయన అందులో రచయితతో తనకున్న పరిచయాన్ని, ఆయన ప్రతిభనూ ప్రస్తావించి “ఈ కవితాకుండలిని స్పందించి సహస్ర కవితా ఫణాలను విప్పార్చిననాడు అస్మదాదులనేకులు ఆ నీడలో తలదాచుకోవలసివస్తే ఆశ్చర్యం లేదు. అంతకన్నా ఆనందమూ ఉండదు” అంటారు. ఆశీర్వాదాలు వ్రాస్తారనుకుంటే “బాలసరస్వతీ స్తుతి”(ముందుమాటకి శీర్షిక) చేసారు. వర్తమాన రచయిత ఎంతటివాడైనా వున్నది ఉన్నట్టుగా రాయాలనేం లేదు కదా. ఇవి వామనుడిలో త్రివిక్రముడిని గుర్తించగల శక్తి ఉన్న వినమ్రులు, పెద్దలు, నిర్మలహృదయులూ ఐనవారు మాత్రమే వ్రాయగల పీఠికలు.

ముందుమాటలకి శీర్షికలు పెట్టడంలోనూ ప్రత్యేకత చూపేవారున్నారు. తిరుమల రామచంద్ర తన గ్రంథానికైనా, ఇతరుల గ్రంథానికైనా ముందుమాటలు వ్రాయవలసివస్తే వాటికి మనవిమాటలని శీర్షిక ఉంచేవారు. ఆ పుస్తకాన్ని గురించో, రచయితను గురించో మనవి చేసుకునే మాటలన్న అర్థంలో. ఆయన ఆత్మకథ “హంపీ నుంచి హరప్పా దాక”కు ముందుమాట వ్రాస్తూ అక్కిరాజు రమాపతిరావు ముందుమాటకి మనస్విమాటలని శీర్షిక పెట్టారు. అది కేవలం చమత్కారానికి కాదని తిరుమల రామచంద్ర మనస్వి అనీ ఆ ఆత్మకథ చదివినవారికి అవగాహనకు వస్తుంది. “అమరావతి కథల”కు ముళ్ళపూడి వెంకటరమణ ముందుమాట వ్రాస్తూ “అమరావతీ కథల-అపురూప శిల్పాలు” అని శీర్షిక పెట్టడంలో సొగసు “మా తెలుగుతల్లికి” పాడుకున్న ప్రతి తెలుగువాడికీ తెలుస్తుంది. లోటు మాత్రం కథాశిల్పానికి ప్రాధాన్యత ఇచ్చి సత్యం శంకరమంచి చెక్కిన కథలు చదివినవాడికే అందుతుంది. సహస్రావధాని కోట లక్ష్మీనరసింహం “నమశ్శతి” అన్న కావ్యం వ్రాసి వారి గురువు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారిచే ముందుమాట వ్రాయించారు. కడిమెళ్ళ వారు ముందుమాటకు పెట్టిన శీర్షిక “మా బంధం అవ్యాజం కాదు”. అదేమిటని ఆశ్చర్యపోయి చదివితే ఆ ముందుమాటలో వివరిస్తారు “వ్యాజం అంటే తాడు. అవ్యాజబంధం అంటే కట్టివుంచే తాడులాంటి విషయం ఏమీ లేకున్నా కలిసివున్న బంధం అని. కానీ మా బంధానికి వ్యాజం ఉంది. అది కవిత్వం..అవధానమూను”.

ముందుమాటల్లో రచన గురించి, కవి గురించీ నేపథ్యం గురించీ, ప్రక్రియ గురించీ ఒకటేమిటి అసందర్భం కానిది ఏదైనా పరిశీలించవచ్చు. అలాంటి పరిశీలనల లోటు, విస్తృతీ వ్రాసినవారిని బట్టి ఉంటుంది. తిలక్ “నా కవిత్వం” అన్న కవితలో “నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలూ వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని వ్రాస్తారు. “అమృతం కురిసిన రాత్రి” కవితా సంపుటి ముందుమాటలో కుందుర్తి “మొదటివాక్యం తన వస్తువు గురించి, రెండవది శైలిని గురించి అని నేనర్థం చేసుకున్నాను” అని వ్రాస్తారు. ఆ వాక్యాలు కొన్ని మినహాయింపులతో దాదాపు తిలక్ కవితలన్నిటికీ వర్తిస్తాయి. “క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ-ప్రపంచం అంతటిబాధా శ్రీశ్రీ బాధ” అన్న చెలం(మహాప్రస్థానంకి యోగ్యతాపత్రంలో) వాక్యాలు – నాటి ఆ ఇద్దరికే కాక నాటి అభ్యుదయ భావకవిత్వాల వస్తువుల మధ్య భేదాన్ని చూపిస్తాయి. నేటికీ చాలామందికి శ్రీశ్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ వాక్యాలే శరణ్యం. హంపీ నుంచి హరప్పా దాక ముందు మాటలో “ఏదైనా భాషా సాహిత్యపు అన్ని ప్రక్రియలూ కలిపి లెక్కించినా ఒక శతాబ్దంలో ఇటువంటి మహోదాత్తమైన గ్రంథాలు ఇరవై ముప్పై కన్నా ఎక్కువ పరిగణనలోకి రావు” అంటారు రమాపతిరావు. ఆ పరిశీలనా అతిశయోక్తి కాదు. సహజోక్తి.

ఇక రచయితనీ, కృతిని ఉన్నదానికి మించి విపరీతంగా పొగిడే రకం ముందుమాటలు ఉండనే ఉంటాయి. అవెలా ఉన్నా లేనివి రాయక, ఉన్నవి వదలక మితీగతీ తప్పని ముందుమాటలు కూడా ఉత్తమసాహిత్యమే. కృష్ణశాస్త్రి ఒక కవితాసంపుటికి ముందుమాట వ్రాస్తూ “జాగ్రత్తగా చదివితే ఈ పుస్తకంలో అక్కడక్కడా కవిత్వం కనిపిస్తుంది” అన్నారట. కార్టూను పుస్తకాలకి ముందుమాటలు ఎందుకు అంటారు చాలామంది. బహుశా రేఖల్లో చూసి ఆనందించాల్సినవి మాటల్లో చదివి ఏం లాభం అని కావొచ్చు. అలానే రచనలో నిగూఢంగా ఉండి ధ్వనించే అంశాలు ఉంటాయి. అవి రచయిత పదాల్లో చెప్పడు, స్ఫురింపజేస్తాడు. చాలా ముందుమాటల్లో ఆ సున్నితమైన అంశం అవగాహన చేసుకోకుండా ధ్వనించేది, స్ఫురించాల్సింది తేటతెల్లంగా చెప్పేస్తారు. “ఓ.. ఆ నవలా.. చాలా బావుంటుంది.. హీరోయే హీరోయిన్ని చంపేస్తాడు.. కానీ ఎవరు చంపారో చివరిదాకా తెలియదు.. సస్పెన్స్.. చదువు..” అన్నట్టుంటుంది వ్యవహారం. అందుకే ముందుమాట రచన చదివాకా చివర్లో చదువుకుంటే బావుంటుంది అన్నది ఈ రచయిత స్వానుభవం.

You Might Also Like

One Comment

  1. Rao G

    ఒక పుస్తకానికి ఆ రచయిత, తన ముందు మాటను తానే రాసుకుంటే, ఆ సంగతి వేరు. ఆ రచయిత చెప్పదలుచుకున్నవేవో చెప్పుకుంటాడు. అదే, ఆ ముందు మాటని వేరే వారితో రాయించుకుంటే, అది రికమెండేషను లెటర్‌తో సమానం. ఆ వేరే వాళ్ళు, “ఈ పుస్తకంలోని విషయాలు ఏమీ బాగో లేవూ, ఈ పుస్తకం చదవకండీ” అని రాయరు కదా? ఒకవేళ ఎవరైనా అలా రాసినా, ఆ రచయిత అటువంటి ముందు మాటని తన పుస్తకంలో పెట్టుకోడు కదా? ముందు మాట రాసే వాళ్ళు, కిందా మీదా పడి, మొత్తానికి పొగడ్తలే రాస్తారు. ఎక్కడైనా ఒక చిన్న విమర్శ వున్నా, అది ఒక వెయ్యి పొగడ్తల అడుగున దాగి వుంటుంది, ఎవరికీ కనబడకుండా. కాబట్టి, ముందు మాటలన్నీ ఆ పుస్తకం గురించి భట్రాజు పొగడ్తలే.
    వేరే వాళ్ళ చేత ముందు మాటలు రాయించుకునే సంస్కృతి పోయినప్పుడు, ఈ తెలుగు సాహిత్యానికి కొంత అభివృద్ధి కలుగుతుంది.

    రావు

Leave a Reply to Rao G Cancel