పుస్తకం
All about booksపుస్తకభాష

October 8, 2012

“తెలుగువెలుగు” తొలి సంచిక

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
**********
తెలుగు యజ్ఞం అంటూ, తెలుగు భాషోద్యమానికి దన్నుగా, తెలుగు భాష పునర్వైభవం పొందాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో వెలువడింది “తెలుగువెలుగు” తొలి సంచిక. తెలుగు భాష వైభవాన్ని కాంక్షించే ప్రముఖుల ముఖాముఖీలు, తెలుగువారి సంస్కృతిని చూపించే వ్యాసాలు, ఇటీవల స్వర్గస్థులైన తెలుగుపెద్దలు, తెలుగు ఆటలు, తెలుగు సాహిత్యం, జానపదగేయాలు, తెలుగు పత్రికలు, తెలుగు కవితలూ, పద్యాలూ, తెలుగు భాష గురించి దాని పునర్వైభవానికి ఏం చెయ్యాలో చెప్పే వ్యాసాలూ.. ఇలా అంతా తెలుగుమయం. అలా అని మరీ ఒకే అంశంపై వచ్చినట్టుగా విసుగేమీ కలగలేదు.

నాకు నచ్చిన వ్యాసాలు, కథలు, కవితలు మొదట ప్రస్తావిస్తాను. తెలుగు వెలుగు పత్రికకు కానుకగా తెలుగువారి ఆట ‘వైకుంఠపాళి’ పంచరంగుల్లో, సంప్రదాయ సిద్ధమైన రూపంలో అనుబంధంగా ఇచ్చారు. ఆ “వైకుంఠపాళి” లేదా పరమపద సోపానపటం గురించిన వివరాలు, దానిలోని తాత్త్వికత చెబుతూ సుప్రసిద్ధ సహస్రావధాని గరికపాటి నరసింహారావు “తెలుగుతోటలో పండిన విక్రమకేళి వైకుంఠపాళి” అంటూ ఓ వ్యాసం వ్రాశారు. అందులోనే –

తెలుగు ఆటయె చూపించు వెలుగుబాట
తెలుగు మాటయె చెవినించు తేటిపాట
తెలుగు పాటయె రుచిమించు తేనెఊట
తెలుగు పద్యమ్మె గెలిపించు తెలుగుబాల

అంటూ ఓ చక్కని పద్యం కూడా ఉంది. జీవితంలో అందునా ఆధ్యాత్మిక పథంలో పథగామికి ఈ వైకుంఠపాళి చెప్పే లోతైన సందేశం వ్రాశారాయన. డా.సంగనభట్ల నరసయ్య “శ్రీనాథుని ప్రేమలేఖ” అంటూ శ్రీనాథ కవిసార్వభౌముడు తన భార్యకు వ్రాసుకున్న ప్రేమలేఖాపద్యాన్ని గురించి తెలుగు అంతంతమాత్రమైన వారు కూడా ఆస్వాదించేలా వ్రాశారు. పోటీపరీక్షల్లో తెలుగును ఎదుర్కోవడాన్ని గురించి ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసిన డా.ద్వ.నా.శాస్త్రి “పోటీకి రాని తెలుగు” అన్న వ్యాసంలో పోటీపరీక్షల్లో తెలుగు స్థితి గురించి వ్రాశారు. “ఏ ఉపాధికైనా భాషానైపుణ్యం తోడ్పడుతుంది. పక్క రాష్ట్రాల్లో ప్రయివేటు రంగాల్నీ భాష విషయంలో నిర్దేశిస్తోంటే… మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుపరిస్థితి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. ఉపాధి కల్పించకపోతే భాష బతికేదెలా?” అంటారు రచయిత ఆవేదనతో. తెలుగు పండితులు, అధ్యాపకులు, టెట్, ఎస్.ఐ. ఆఫ్ పోలీసు అర్హతపరీక్షల్లో తప్పనిసరి అంశంగా, సివిల్స్ లో ఐఛ్ఛికాంశంగానూ తెలుగు ఉంది. ఎ.పి.పి.ఎస్.సి. నిర్వహించే గ్రూప్ I, గ్రూప్ II వంటి పరీక్షల్లో నామమాత్రమైపోయిందంటారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లోనే ప్రాంతీయభాషలకు ప్రాముఖ్యతనిస్తోండగా, రాష్ట్రప్రభుత్వం పక్కనపెట్టడం ఏమిటనీ, గ్రూప్-I మరియు గ్రూప్-IIల్లో తెలుగు ఐఛ్ఛికాంశంగా ఉండేదనీ, దాని ప్రాముఖ్యత పూర్తిగా తొలగించి తూతూమంత్రం చేయడం ఏంటని ప్రశ్నిస్తారు. తెలుగు ఉద్యోగపరీక్షల్లో రోజువారీ విధినిర్వహణకు ఉపయోగపడేలా సిలబస్ ఉండాలి కాని తెలుగు సాహిత్యపు లోతులు సిలబస్ గా పెడితే ప్రాథమిక ప్రయోజనం దెబ్బతింటుందన్న ఆయన వాదన ఆలోచింపజేస్తుంది. చివరగా ఏవి జరగాల్సి ఉందో కూడా వ్రాశారు.

“తెలుగువాడా కళ్లు తెరు” అంటూ సూటిగా, క్లుప్తంగా ఔచిత్యం మేరకున్న వ్యాసం వేటూరితో చివరి ముఖాముఖి. తెలుగుభాషని ప్రాచీనభాష చేయాలని ఉద్యమించి కేంద్రప్రభుత్వం గతంలో ఇచ్చిన జాతీయ అవార్డు తిరిగి ఇచ్చేసిన ఆ ఉద్యమకారుడి మాటల్లో ఉండే ఆవేదన, సూచనల్లో ఉండే నిబద్ధత సహజంగానే ఉంది.

ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ చాలామందికి ప్రతిభావంతుడైన పరభాషానటుడు, సినీపిపాసిగానే తెలిసిఉండొచ్చు. ఆయన తెలుగుభాషని ఎందరో తెలుగువారికన్నా చక్కగా ఉచ్చరించగలగడం వెనుక లోతుగా తెలుగుసాహిత్యాన్నీ, మాండలికాల సొగసునూ అధ్యయనం చేసిన భాషాప్రేమికుడు ఉన్నారు. ఆ కోణంలో ఆయన వ్రాసిన వ్యాసం “అమ్మభాష కాదు కానీ… అన్నం పెట్టిన భాష”. తెలుగు నేర్చుకునే క్రమంలో ఆయన చదివిన సాహిత్యం, అందుకు సహకరించిన కవిపండితులైన మిత్రులు, ఆయన చూసిన తెలుగు నేల, తెలుగుభాష స్థితి ఇలా ఎన్నో అంశాలు తడిమారాయన. గోదావరి వంటి సస్యశ్యామల ప్రదేశంలో “నీ పాపం పండినరోజు పడిపోతావురా” అంటారు. అదే రాయలసీమ వంటి దుర్భిక్ష ప్రాంతాల్లో అయితే “పాపంతో నీ పొట్ట పగిలిపోతుందిరా” అంటారు. అంటూ ఆయన వ్రాసిన పరిశీలన ఆకర్షిస్తుంది.

“పారిస్ నుంచి తందానతాన”
అన్నది మరో ఆసక్తికర వ్యాసం. ఫ్రాన్సుదేశం నుంచి ఆంధ్రదేశం వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో బుర్రకథ గురించి పరిశోధన చేస్తున్న డేనియల్ నెజర్స్ తో ముఖాముఖి అది. సంస్కృతి, కళ వంటి కోణాల్లో ఆ కళారూపాన్ని ఎంతగానో అధ్యయనం చేసిన ఆయన తెలుగు గురించి, ఈ నేలతో అనుబంధం గురించి, బుర్రకథని గురించీ ఎన్నో ఆసక్తికరమైన కబుర్లు చెప్పారు.

పాపినేని శివశంకర్ “కాకా-కూకూ” అనే వ్యాసంలో సంకుసాల నరసింహకవి వ్రాసిన

కాకేమి తన్ను దిట్టెనె
కోకిల తనకేమి ధనము కోకొమ్మనెనే?
లోకము పగయగు బరుసని
వాకున జుట్టమగు మధుర వాక్యము వలనన్

అన్న రసవంతమైన పద్యాన్ని వివరించారు. పలుకుల్లో ఉండాల్సిన మాధుర్యం గురించి రమ్యంగా వ్రాసిన పద్యం అది. దానితో పాటుగా ఆ కవి వ్రాసిన మరో శృంగార రస ప్రధాన పద్యాన్ని వ్రాసి ముచ్చటైన వివరణ ఇచ్చారు.

“అరవైనాలుగు కళల్లో దొంగతనం కూడా ఒకటి” అనడం తప్ప “అరవైనాలుగు కళలూ ఏమిటో చెప్పు” అంటే కళ్లుతేలవేసేవారే అంతా. ఆ చతుష్షష్టి కళలూ ఇచ్చారు ఈ పుస్తకంలో. వాణిజ్యం, పశుపాల్యం, చోరకర్మ, మారణం, మోహనం కూడా వాటిలో ఉన్నాయి. అలానే మరోచోట “మన సంఖ్యామానం” అంటూ ఒకటి నుంచి ఒకటి తర్వాత ముప్పై ఐదు సున్నాల(మహాభూరి) వరకూ సంఖ్యామానం ఇచ్చారు. మన కాలమానం అని మరోచోట సెకను కన్నా చాలా చిన్న కాలమానాన్ని ఏమంటారో మొదలుకొని యుగాల వరకూ వేశారు.

“నెల్లూరి మందళ్లు” అంటూ యద్దల లలిత నెల్లూరి మాండలీకంలోని అందచందాలూ, “రాయలసీమ పలుకే రత్నం” అని వేంపల్లి గంగాధర్ రాయలసీమ మాండలీకాల్లోని మాధుర్యాలు వ్రాశారు. ఇంతకీ నెల్లూరి మందళ్లులో మందళ్లు అంటే ఏంటో తెలుసా?(తెలియకుంటే పుస్తకంలో చదివి తెలుసుకోవచ్చు).

దుర్గం రవీందర్ “బోనాలు.. మన సంస్కృతికి ప్రాణాలు” అంటూ జంటనగరాల్లో బోనాల సంస్కృతిని వివరించారు. వ్యాసం సవిస్తరంగా ఉంది. బోనాలు ఎలా మొదలై, నేడు ఏ రూపంలో ఉన్నాయో సవివరంగా వ్రాశారు రవీందర్. దరెగోని శ్రీనివాస్ అమ్మకడుపులోనే మాతృభాష అలవడుతుందంటూ “ఉమ్మనీరులో.. అమ్మభాష” వ్యాసంలో సశాస్త్రీయంగా వ్రాశారు. బిడ్డ తొలి ఏడుపు మాతృభాషలోనే ఉందంటూ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల పరిశోధనలు వింతగా ఉన్నా ఆకట్టుకుంటాయి. వ్యాసమంతా శాస్త్రీయపరిశోధనలు విడమర్చి చెప్తూ వ్రాశారు.

పానుగంటి వారి “సాక్షి” వ్యాసాల్లోని “స్వభాష“ను వాడుకభాషలోకి తెస్తూ సంక్షిప్తరూపంలో ప్రచురించారు. ఆ వ్యాసానికి నా బోటివాడి పరిచయం అనవసరం. “ప్రవాసభారతి” అనే ప్రవాసభారతీయుల పత్రిక గురించి, కర్ణాటకలో కన్నడభాష వైభవం గురించి, తెలుగువారి సంప్రదాయ సిద్ధమైన లెక్కల గురించి వ్యాసాలున్నాయి. “తులాభారం” పేరిట పుస్తకసమీక్షలున్నాయి. కథల్లో ముఖ్యంగా “వెనక్కి వెళ్లే రైలు” కథ చాలా బాగుంది. ఇతివృత్తం చాలా కొత్తగా ఉంది. శైలి కూడా బావుంది. వ్రాసినవారు మెహర్ అనే బ్లాగర్. కథ మొదటి నుంచే కథ పాఠకుల్ని తనవైపుకు లాక్కుంటుంది.

పుస్తక పఠనాసక్తి, సాహిత్యాభిలాష పెంచకుంటే భాషాభివృద్ధికి చేసే ప్రయత్నాలు అసంపూర్ణమే. అందుకే “పుస్తకమే మస్తకం” పేరిట ఆర్.వి.రామారావు వ్రాసిన -పుస్తకం చదివి, సమగ్రంగా ఎలా అవగాహన చేసుకోవాలి? అన్న అంశంపై చక్కని వ్యాసం ఉంది. అదేకాక “తెలుగువెలుగు”లోకి వెళ్తే మరిన్ని మంచి పుస్తకాల్లోకి దారితీస్తుంది. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించిన వ్యాసం ఆయన పలుకుబడిలోని సొగసునూ, సరళతనూ గూర్చి చెప్తూనే భ్రష్టయోగి మొదలుకొని రామాయణ కల్పవృక్షం వరకూ ఎన్నో పుస్తకాల్లో కవితలు, పద్యాలు ఉదహరిస్తూ వాటిపై ఆసక్తి కలిగిస్తుంది. పెన్నా శివరామకృష్ణ వ్రాసిన వ్యాసం “సంగీత సాహిత్య సమభూషితుడు సామల సదాశివ” కూడా ఆ కోవలోదే. ఈ వ్యాసం చదివిన వారికి సదాశివ రచనలు “ఉర్దూ కవుల కవితాసామగ్రి”, “పారసీ కవుల ప్రసక్తి”, “మీర్జా గాలిబు”, “ఉర్దూ భాషా కవిత్వసౌందర్యం”, “ఉర్దూ సాహిత్యం” వంటి సాహిత్యగ్రంథాలతో పాటు “మలయమారుతాలు”, “సంగీతశిఖరాలు”, “స్వరలయలు” వంటి సంగీత సంబంధ గ్రంథాలపైనా ఆసక్తి మొదలవుతుంది. ఆయన ఆత్మకథ “యాది” అయితే ఎప్పుడెప్పుడు చదువుతామా అన్నట్టు అనిపిస్తుంది.

వాసిరెడ్డి నవీన్ వ్రాసిన “బండెనక బండికట్టి” వ్యాసం తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం సాహిత్యంపై చూపిన ప్రభావం గురించి వివరిస్తుంది. పాటలు, నాటికలు, కథలు, నవలలు, ఆత్మకథలు వంటి ప్రక్రియల్లో ఆ ప్రజాపోరాటం చిత్రీకరింపబడ్డది. తెలంగాణా సాయుధపోరాటంలో పాల్గొన్న పార్టీల కార్యకర్తలు, నాయకులూ కూడా కవులు, రచయతలూ అవుతుంటే అప్పటికే కవులుగా, రచయితలుగా పేరొందినవారూ ఉద్యమానికి సాహిత్యపరంగా తోడ్పాటు అందించారు. ఇవన్నీ సవిస్తరంగా వ్రాసిన ఆ వ్యాసం చదివి వాసిరెడ్డి నవీన్ ఏర్చికూర్చి సంపాదకత్వం వహించిన “తెలంగాణా సాయుధ పోరాట కథలు” సంపుటి కొని చదివాను. చదవాల్సినవాటిలో ఎన్నో గొప్పనవలలు, కవితా సంపుటులూ వచ్చిచేరాయి.

ఉర్దూసాహిత్యంపై కృషిచేసిన పెన్నా శివరామకృష్ణ సదాశివపై, తెలంగాణా సాయుధపోరాట నేపథ్యంలో వచ్చిన సాహిత్యంపై పరిశోధించిన వాసిరెడ్డి నవీన్ ఆ పోరాట నేపథ్యంలోని సాహిత్యంపైనా వ్రాయడంతో వ్యాసాలకు సమగ్రత వచ్చింది.

మిగిలిన కొన్ని వ్యాసాలు, కథలు ఓ మాదిరిగా అనిపించాయి నాకు. అయినా డెబ్భైశాతం పైబడి నాకు నచ్చినవే ఉన్నాయి. తెలుగుభాషాభివృద్ధికి పూనుకున్న పత్రిక ఇంత సమగ్రంగా రావడం శుభపరిణామం. రామోజీ ఫౌండేషన్ వారు ఆశించిన మార్పుకు ఈ పత్రిక పునాది కాగలదనిపిస్తోంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.8 Comments


 1. ఏల్చూరి మురళీధరరావు

  శ్రీ సూరంపూడి వారి సహృద్విమర్శ చాలా బాగున్నది.


 2. Anil

  Call me old fashioned, but I prefer reading hardcopies 🙂 So if you can tell me how to subscribe to the ‘real thing’, I’d much appreciate it.


  • ఓ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి మీకు. నేను కూడా హార్డ్ కాపీలనే ఇష్టపడే ఓల్డ్ ఫ్యాషన్డ్ ఫెలోని. ఇదిగోండి ఈ నంబరుకు ప్రయత్నించండి. ఇది సంచికలో సంప్రదించమని ఇచ్చిన నెంబరు.
   phone: +91 8415 246 999
   fax: +91 8415 305 018


 3. pl correct the name as RVRamarav from ramanarao in PUSTAKAMEY MASTAKAM article, erratum in it.
  I expectted something more in this review, anyway glad to read it.
  pl do the same on 2nd issue. its more focused to satisfy Telugu lovers.


 4. Anil

  How do NRIs subscribe to this book?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

భార్యని వర్ణించిన కవులున్నారు

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ************* కవులేల తమ భార్యను వర్ణించరని ఎల్లేపెద్ది వెంక...
by అతిథి
5

 
 

పుస్తకాలకు, పాఠకులకు మధ్య అనుసంధానమైనది

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********** ఆరువేల పుస్తకాలు.. ఆరేడు నెలలు.. వెయ్యి వికీ వ్యాస...
by అతిథి
4

 
 

విశ్వనాథ వారు ఎలా చెప్పారు?

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ******** విశ్వనాథ సత్యనారాయణ గారు నవలలు ఎలా చెప్పారు? అన్...
by అతిథి
17

 

 

సప్తవర్ణాల కరచాలనం

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ****** తెలుగువారిలో ఏ లలిత కళలోనైనా మంచి కళాకారులకులోటు...
by అతిథి
2

 
 

పోలీస్ సాక్షిగా

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************* సాధారణంగా నూటికి ఎనభైమందికి పోలీస్ స్టేషన్ ...
by అతిథి
2

 
 

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. త...
by అతిథి
0