అభౌతిక స్వరం

వ్రాసిన వారు: బి.అజయ్ ప్రసాద్
**********
పేపర్లలో వార్తలు చదవడం మానేసిన నేను చాలారోజుల క్రితం సినిమా బొమ్మలకోసమో, ఆసక్తికరమైన వార్తల కోసమో సాక్షి న్యూస్ పేపరు యధాలాపంగా తిరగేస్తూ ఉంటే ఉన్నట్లుండి “నేను” అనే శీర్షిక ఆకర్షించింది. “మాస్కోలో నన్నెవరో పిలుస్తున్నారు” అని లెనిన్ పలవరింత. మాసోలియంలో శాశ్వతనిద్రలో ఉన్న లెనిన్ లేచి వర్తమానంతో సంభాషించడం ఏమిటి?

నేను వెంటనే అటకమీద నుంచి పాత పేపర్లన్నీ దులిపి “నేను” అని కనిపించిన శీర్షికలన్నీ ఏకబిగిన చదివేశాను. మరుసటిరోజు నుంచి మళ్ళీ ఆ శీర్షిక ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసాను. చదివిన ప్రతిసారీ మాటలకందని ఒక మౌనమో, ఒక ఉద్వేగమో, ఒక సంతోషమో కలిగేవి. ఆ నేనులన్నీ కలిపి ఇప్పుడు “అభౌతిక స్వరం” అన్న పుస్తకంగా వచ్చిందని తెలిసి సంతోషం కలిగింది. మనకు ఇష్టమైనదో, మనకు కావలసిందో మనం ఎదురుచూడకుండానే యాధృచ్చికంగా మన చేతిలో పడటంలో ఉన్న గొప్ప ఆనందం ఇంక దేనిలో ఉంటుంది?

ఈ పుస్తకం నిండా తమ పుట్టుక – మరణం మధ్య అనేక అద్భుతాలను చూపించిన సృష్టికర్తలు, సృజనకారులు మనతో సంభాషిస్తారు. కొందరు జీవితాన్ని ఎలా జీవించాలో చూపిస్తే మనుషులకోసం జీవించడం ఎలానో చూపిన వారు కొందరు. గాంధి, మావో, సూర్యసేన్, రామచంద్రన్ వంటి నాయకులు, బీథోవెన్, మైకెలేంజిలో, ఎం.ఎఫ్.హుస్సేన్ లాంటి కళాకారులు – ఒక్కొక్కరూ వచ్చి మన చేతులలో చేతులు కలిపి మన కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? చరిత్రలు సృష్టించినవారు గతంలో నిలబడి వర్తమానాన్ని కూడా వ్యాఖ్యానిస్తూ ఉంటే ఎలా ఉంటుంది?

మరణించిన మనిషిని లేపి నీ గురించి నువ్వు చెప్పుకోడానికి నీకు పది నిముషాలు గడువిస్తున్నాను – అని చెప్తే అతడి ఆత్మ ఏమని ఘోషిస్తుంది? మౌనంగా మనసుతో చెప్పుకునే మాటలు, పలవరింతలు, ఎన్నో పెనుగులాటలు, పొలికేకలు అన్నీ కలిపి చివరికి ఏమీ చెప్పలేక ఆత్మ మూగపోతుంది. కేవలం మనతో మాట్లాడే సంభాషణే కాదు భావోద్వేగాలను కూడ శరీరభాషలో అనువదించి చెప్పడానికి ఒక దుబాసి అవసరం. మాధవ్ ఆ పనిని అద్భుతంగా నిర్వహించాడని ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది. అతడు ఆత్మను నిద్రలేపుతాడు. రంగూ, రుచీ, రక్తమాంసాలూ అద్దుతాడు. చివరిగా అతడి ఆత్మకి కంఠం పెట్టి ఒక స్వరాన్నిస్తాడు. ఇక ఆత్మ తన భావోద్వేగాల పలవరింతలో గతం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి గతంలోకి తిరుగుతూ మనతో సంభాషిస్తుంటుంది.

శాశ్వతనిద్రలో ఉన్న లెనిన్ మాసోలియం నుంచి లేచి కూర్చుని మనతో మాట్లాడతాడు. జావో జియాంగ్ తియనాన్మెన్ స్క్వేర్ లో నుంచుని చైనా అతివాద కమ్యూనిష్టుల గురించీ, విద్యార్థుల ప్రజాస్వామ్య ఉద్యమం గురించీ మనతో సంభాషణ చేస్తాడు. ఇంకా ఈ పుస్తకంలో చిలీ అధ్యక్షపదవీ, నోబెల్ ప్రైజ్ కీ మధ్య నుంచుని “ప్రేమించడనికైనా పీడించడానికైనా జీవితమే మనిషిని ఎంచుకుంటుంది” అనే నెరూడా, “నన్ను సంతోషపెట్టాలని ప్రయత్నించే అభిమానులంటే నాకు భయం. అందుకు వారు నన్ను క్షమించగలగాలి”, “నేను ఇష్టపడే వ్యక్తులపై మొహమెత్తి జబ్బున పడ్డాను. నేను గౌరవించగలిగిన వ్యక్తిని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను” అనే సాలింజర్, “రేపటి స్థిమితమైన జీవితాలకోసం ఇవాళ కొంత అశాంతికి లోనైనా తప్పులేదనే” మావో జెడాంగ్, “నాచేత ఒక్క మాటైనా మాట్లాడించనివారి మధ్య నేను సౌకర్యంగా ఉంటాను” అనే చాప్లిన్ కనిపిస్తారు.

యుగాల నాటి ఇంఫర్మేషన్ ను క్షణాల్లో వేళ్ళ మీదకు తెచ్చుకోగలిగే ఈ ఆధునిక యుగంలో ఈ స్వగతస్వరాల పుస్తకం ప్రత్యేకత ఏమిటి? అని మనం అనుకోవచ్చు. ఇందులోని వ్యక్తుల జీవితవివరాలన్నీ ఏ వికీపీడియాలోనో, గూగుల్లోనో వెతికి చదువుకోవచ్చు. కాని వాళ్ళ స్వరాలను వినలేం. వాళ్ళ ఆత్మతో కరచాలనం చేయలేం కదా!

నా స్నేహితుడొకరు ఈతరం పిల్లల గురించి చెప్తూ “అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్న ఇప్పటి ఐదవతరగతి చదివే పిల్లలు పరిసరాల పరిజ్ఞానంలో, వేషభాషలలో, విషయగ్రాహ్యతలో మన కాలపు పదవతరగతి పిల్లలతో సమానం” అన్నాడు. స్పీడుయుగంలో పెరిగే పిల్లలు అలా ఉండటంలో ఆశ్చర్యంలేదు కాని నాకు మాత్రం ‘ఏదీ అందుబాటులోలేని మా ముందుతరం పి.యు.సి. చదువు ఈ కాలపు పి.హెచ్.డి. కి సమానం’ అనిపిస్తుంది. ఎక్కడుంది తేడా? నేననుకునేదేమంటే ఫీలింగ్స్. స్పీడు పెరిగే కొద్దీ ఫీలింగ్స్ తగ్గుతూ వస్తున్నాయి. వికీపీడియాలోనో, గూగుల్లోనో ఒట్టి సమాచారమైతే దొరుకుతుంది. Instant life లో టీవీ సీరియళ్ళలో, ఈతరం సినిమాల్లో రెడీమేడ్ ఫీలింగ్స్ కి కొదవలేదు. “మానవానుభూతులను తిరిగి మళ్ళీమళ్ళీ కొత్తగా చెప్పుకోవడమే సాహిత్యం” అని ఎవరో అన్నట్లు మన సంస్కృతి గురించి, మన చరిత్ర గురించి ఈ భూమి సృష్టించిన మనం మళ్ళీమళ్ళీ సరికొత్త శరీరభాషలో స్మరించుకోవాలి. వేళ్ళచివరనే సమాచారమంతా అందుబాటులో ఉన్నా గుండెలను కదిలించడానికి గుప్పెడు సరికొత్త సంభాషణలు కావాలి. అవి మోడు వారుతున్న మానవ జీవితంలో పొరుగువాడి మీద కొంత concern నైనా సృష్టిస్తాయి. మనిషికి మనిషి చెడే కాదు, కొంత మంచి కూడా చేసాడని తెలియజేస్తాయి.

ఇక ఈపుస్తకంలోవన్నీ కేవలం సంభాషణలే కాదు. భౌతికంగా మనమధ్యలేని వారి స్వగత స్వరాలు. అలాగని వాళ్ళంతా తాము సాధించిన విజయాల గురించో, తమ విజ్ఞాన ఆవిష్కరణల గురించో ఏకరువు పెట్టరు. అభౌతిక స్వరం అంటే రచయిత “తగ్గు స్వరం” (మృదుస్వరం) అన్నాడేమోకాని ఇందులో స్వరాలన్నీ ఒకే టోన్ లో ఉన్నాయి. జీవితానుభవాలతో రాటుతేలిన మనిషి మాట భౌతికంగా మెత్తబడినా అభౌతికంగా అది పదునుతేలిన మృదుభాషణ అంటాడు రచయిత. నేనైతే రచయిత పదునైన వచనమనే అంటాను. ఇందులో ఇతరుల జీవితాలలోకి జొరబడి కృత్రిమంగా తయారుచేసిన స్వకల్పితాలేం లేవు. అతిశయోక్తులు అంతకన్నా లేవు. చదవడం పూర్తయ్యాక ఇదంతా very true but not wise or smart అని రచయితతో పాటు మనమూ అనుకుంటాం.

ఈ పుస్తకానికి అభౌతిక స్వరం అని మాధవ్ వేరే అర్థంలో (తగ్గుస్వరం) పెట్టినా నేను దీన్నొక మెటాఫిజికల్ టోన్ లానే భావించాను. ఇది పరకాయప్రవేశం కాదు. ఇదొక పరాత్మ ప్రవేశం. ఎన్ని ఉలుల దెబ్బలు తింటే ఇన్ని నేనులు తయారు కాగలరు? అలా రాయగలగడానికి ఒక శరీరానికి ఎన్ని ఆత్మలు ఉండాలి? ఒక ఆత్మ అనేక ఆత్మలుగా పలకడానికి ఎన్ని మూర్ఛనలు పోవాలి?

అనేక నేనుల అతడి నేను ఏమి చెప్తుందో అనే కుతూహలం ఎవరికి మాత్రం ఉండదు? నేనూ ప్రయత్నించి అతడి గురించి నా కోసం రాసుకున్న రెండు మాటలివి –

ఇన్ని నేనుల చేత స్వగతసంభాషణ చేయించిన యితడు ఇతడు అంత తేలికగా మనుషులలో కలవలేడు. ఇన్ని ఆత్మలతో పరకాయప్రవేశం చేసిన ఇతడు మన చేతిలో చేయి కలిపి మనకళ్ళలోకి చూస్తూ కనీసం ఒక్క వాక్యమైనా పలుకలేడు. అనుక్షణం కృత్రిమత్వాన్నించి పారిపోవాలనే ఆరాటం అతడిని మరింత ఒంటరివాడిని చేస్తూ ఉంది.

అలవాటైన మాటలతో అపస్వరాలు పలకరించాల్సి వస్తుందేమోననే భయం. హృదయానికి తగలని స్పర్శలు, ఈ పొడిమాటలు మనుషులని దూరం చేస్తాయేమోననే భయం. భావాలకీ, మాటలకీ, శరీరానికి అనుసంధానం కుదరక ఒక పరిచయం అపస్వరం అవుతుందేమోననే భయం.

ఇతడి అన్వేషణ ఏ కృత్రిమలూ లేక హృదయంలోంచి పెల్లుబికే ఒక స్వచ్చమైన మాటకోసం. అత్యంత సహజమైన మనసారా తడిమే ఒక్క వాక్యం కోసం. అదే అతడి జీవధార.
*****
పుస్తకం వివరాలు:
అభౌతిక స్వరం – Autobiographical Vignettes of great men and women
మాధవ్ శింగరాజు
ప్రచురణ: 2012
పేజీలు: 300
ఆన్లైన్ కొనుగోలుకి ఏ.వీ.కే.ఎఫ్ లంకె ఇక్కడ.
ఈ పుస్తకంపై “సండే ఇండియన్” పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

You Might Also Like

6 Comments

  1. కాకుమాని

    అజయ్ ప్రసాద్ అభౌతిక పారవశ్యంతో పలికిన సం’గతులు ‘ విని మాధవార్ణవంలో పడిపోయాం. ఒక రచయిత మరొక రచయితకు రాసిన ప్రేమలేఖలా సాగిన రివ్యూ చదివాక ఈ పుస్తకంపై మేమూ ప్రేమలో పడ్డాం.

  2. sasikala.v

    అసలు నేను చదువుతుంటే యెంత సంతోషం వేసిందో.
    ఇలాగ ఎలా వ్రాయగలరు అని.స్వెత్లాన,అన్గాసాన్ సూకి
    ఇలాగా …ఆశ్చర్య పోయాను.ఇలాగా ఆడవాళ్ళు మనసులు
    ఎలా వ్రాయగాలారా అని.
    తప్పకుండ కొని ఉంచుకో దగ్గ మంచి పుస్తకం.

    1. jagadeeshwar reddy gorusu

      ఆడ ఆత్మలు మగవాళ్ళ లోకి మగ ఆత్మలు ఆడవాళ్ళ లోకి పరకాయ ప్రవేశం చేయగల వెసులుబాటు దేవుడు వరం గా ఇచ్చాడు కనుకే మాధవ్ ఆడవాళ్ళ అంతరంగాలను ఆవిష్కరించాడని అనుకుంటున్నా.
      – Gorusu

  3. R.Vijayalakshmi

    చరిత్ర అంటే గతం కాదు.వర్తమానానికి అర్థం చెప్పే డిక్షనరీ”అన్న మాటను అక్షరసత్యం చేసిన “అభౌతికస్వరం” అన్న ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభూతి.”నేను” కథనాలను చదివిన వారికి ఒకే చోట యాభై కథనాలను చదవగలగడం నిజంగా ఒక వరం. స్వగత కథనాలతో మన మనస్సులను ఏకోన్ముఖం చేసే అభౌతికస్వరం పుస్తకాన్ని గూర్చి అజయ్ ప్రసాద్ గారు చేసిన పరిచయం చాలా బావుంది.
    రాయదుర్గం విజయలక్ష్మి

  4. ఎం. ఎస్. నాయుడు

    “అభౌతిక స్వరం”పై అజయ్ ప్రసాద్ అభిప్రాయం, అభినందనలు బాగున్నాయ్.
    “భావాలకీ, మాటలకీ, శరీరానికి అనుసంధానం కుదరక ఒక పరిచయం అపస్వరం” అవ్వటం వారి చదువరితనంపై ఆధారపడుతుంది కదా.
    sotto voce కి బదులు sotto voice అని వాడారు. సబబేనా?

  5. jagadeeshwar reddy gorusu

    ‘అభౌతిక స్వరం’ ఒక అనిర్వచనీయ, అనుభూతి పఠనం.
    ఇందులోని 50 ఆత్మలూ భూత, వర్తమనా, భవిష్యత్‌ కాలాల్లో ఇష్టం వచ్చినట్టు యథాస్వేచ్ఛగా స్వైర విహారం చేస్తూ … తమ ‘మానరిజాల్ని’ ప్రపంచం అవలోకించడానికి ఒక మానవుడిని ఎన్నుకోవాలి గనక – పాతాళభైరవిలో నేపాళమాంత్రికుడు దుర్భిని వేసి, ధైర్య సాహసాలతో కోట ప్రాకారం ఎగబాకుతూ కనిపించిన ఉజ్జయినీ తోటరాముడుని ఎంచుకున్నట్టు … మాధవ్‌ని ఎంచుకున్నాయేమో! ఈయనైతే తమని సరిగ్గా ఆవిష్కరిస్తాడని ఈ ఆత్మలకూ తెలిసిపోయినట్టుంది (బాగా ఎంక్వయిరీ చేసినట్టున్నాయి).
    ఆత్మలన్నీ వారానికి ఒకటి చొప్పున వంతుల వారీగా మాధవ్‌ని ఆవహించాయేమో గానీ, ఈ మాధవ్‌ మాత్రం ‘అభౌతిక స్వరం’ పుస్తకం వేసి 50 ఆత్మలనూ ఒకేసారి మనపైకి ఉసిగొల్పుతున్నాడు. మనకు మనం భూత వైద్యులం ఐతే తప్పించి వీటినుండి విముక్తి పొందలేం. లేదంటే ఈ ఆత్మలన్నీ మనల్ని ఎక్కడికో … ఎక్కడెక్కడికో … తీసుకుపోతాయి… తస్మాత్‌ జాగ్రత్త!
    అజయ్‌ సమీక్ష సమగ్రంగా, సముచితంగా ఉంది.
    – గొరుసు

Leave a Reply