ఆకాశం సాంతం

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
*********
దంపతుల నడుమ ప్రేమ భయంకరమైన సాంసారిక కష్టాల కొలిమిలో, సానుకూలంగా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ దాన్ని దాటడానికి చేసే ప్రయత్నాల్లో శాశ్వతత్వం పొందుతుంది. ఫై వాక్యం నాదే. ఇంతా చేసి నేను బ్రహ్మచారిని. మా తల్లిదండ్రులను, మరికొందరు పెద్దలను గమనించి ఏర్పరుచుకున్న అభిప్రాయం అది. ఆ కష్టాలు ఆర్థికమూ కావచ్చు, కుటుంబపరమైనవి కావచ్చు, అనారోగ్యాలైనా కావచ్చు. ఒక్కోసారి వారి మధ్య ఏర్పడ్డ కలతలూ కావచ్చు. మొత్తానికి ఆయా సమస్యలే ప్రేమబీజాల్ని వాతావ్రుక్షాల్ని చేసే తొలకరి జల్లులు. ఈ అప్రస్తుత ప్రసంగమంతా ఎందుకు అనుకుంటారేమో.. పై భావనే ఆకాశం సాంతం(సారా ఆకాశ్ అనే హిందీ నవల)కు కేంద్రబిందువు. రచనా కాలం స్వాతంత్ర్య భారత తొలి దశాబ్ది అల్లకల్లోలంలో ఉన్న 1951 సంవత్సరం.

ఒక దిగువ మధ్యతరగతికి చెందిన ఉమ్మడి కుటుంబంలో బి.ఎ. చదువుతూ, నిరుద్యోగిగా ఉన్న సమర్ అనే యువకునికి పెళ్లి జరిగింది. అతని దాంపత్యం ప్రేమగా ఫలించే సుదీర్ఘ పయనమే ఈ నవల ఇతివృత్తం అని చెప్పుకోవచ్చు. సమర్ భార్యగా ప్రభ అత్తారింటికి వస్తుంది. ఆ దాంపత్య ప్రేమకు మొదట నాటి యువకులలో ఉండే బ్రహ్మచారిగా జీవితం గడపాలన్న ఆదర్శం అడ్డుతగులుతుంది. ఆర్.ఎస్.ఎస్. లో చురుకుగా వుండే కార్యకర్త కావడంతో సమర్ లో పునాదులు లేని భవనాల్లా దేశానికి సేవ చెయ్యాలనే భావన, అందుకు బ్రహ్మచారిగా ఉండటమే మార్గమన్న అపోహ ఏర్పడివుంటాయి. ఆపై అడ్డుగోడ అతని వదినె(అన్న గారి భార్య) నిర్మిస్తుంది. సమర భార్య ప్రభకు గర్వం అని, దాన్ని అతనే అణచాలని పురిగొల్పి సమర్ ఆమెను అకారణంగా కొట్టి హింసించేలా చేస్తుంది. ఆపై కుటుంబంలో విపరీతంగా జరిగే అవమానాలు, వంటింటి శ్రమ ప్రభను కుంగదీస్తాయి. ఇలా నిరాశాజనకంగా సాగే కథలో ఓ రాత్రి ప్రభలోని మౌనమనే హిమాలయం కరిగి సమర్ ను ఆ కన్నీళ్ళలో కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ రాత్రి ఒకటైన ఆ జంట ప్రేమ ఫలించేందుకు సమిష్టి కుటుంబం అంతూ దరీ లేని కయ్యలా అడ్డుపడుతుంది. రిటైర్ కాగా నెలకు పాతికరూపాయలు పెన్షన్ పొందే తండ్రి, తల్లి, క్లర్కుగా పనిచేస్తున్న అన్న, వదిన, వాళ్ళ పిల్లలు, భర్త వల్ల పీడితురాలైన చెల్లెలు మున్ని.. అదీ కుటుంబం. ఇందులో మున్ని తప్ప ఇంకెవరూ ఆ జంట కలిసేందుకు మనస్ఫూర్తిగా స్పందించరు. ఈ స్థితిలో వారి ప్రేమ ఎలా ఫలించింది? వారి స్వప్నాలు ఎలా నిజమైనాయి? అన్నది ఎవరికీ వారు చదువుకోవాల్సిన భాగం.

ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ వ్యాసం వ్రాస్తున్నప్పటి సాంఘిక స్థితిలో అసలు వారిది ఒక సమస్యగానే కనపడకపోవచ్చు. కాని ఈ నవలను రచించిన నిమ్న మధ్యతరగతి కుటుంబమూ, 1950ల నాటి కాలమూ దృష్టిలో పెట్టుకుంటే దానిలో సంక్లిష్టత అర్థం అవుతుంది. ఈ నవలలో ప్రేమ కథ ఒక పార్స్వ్యం కాగా భారతీయ కుటుంబ నిర్మాణంలో మౌలికంగా వచ్చిన మార్పును ఆ మార్పు వస్తూన్న కాలంలో గమనించడం మరొకటి.

భారతీయ వారసత్వ పరంపరలో వస్తూన్న ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మార్పు చెందుతున్న సంధికాలంలో వ్రాసారు ఈ నవలను. రచయిత విలక్షణత అంతా ఆ మార్పును అంగీకరించడమే కాక సమర్థించడంలో ఉంది. ఆ మార్పును అరవైల కాలం నుండీ తెలుగుసినిమాలు కూడా బాగా పట్టించుకున్నాయి. కాని వారు ఉమ్మడి కుటుంబాలకే కొమ్ముకాసారు. కుటుంబం మొత్తం అగచాట్లు పడి ఒక కొడుకును ఉన్నతోద్యోగిని చేయడం. అతను పెళ్లి చేసుకున్న పట్నం పిల్ల కోడలిగా వచ్చి కలహాలు రేపి కుటుంబాన్ని విడదీయడం. ఆపై ఇంటికి చిన్నకొడుకు అన్నగారి కళ్ళకు కమ్ముకున్న మాయపొరలు తొలగించి కుటుంబాన్ని ఏకం చేసి ఉమ్మడి కుటుంబాన్ని పునఃప్రతిష్టించే ఇతివృత్తాలవి. ఇదే కాకున్నా ఇలానే ఉమ్మడి కుటుంబానికి వ్యతిరేకులు విలన్లు, అనుకూలురు హీరోలుగా వుంటారు.

ఆకాశం సాంతం లో రచయిత దృక్పథం ముందుగా చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలకు వ్యతిరేకం. అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడుతున్న చిన్న కుటుంబాలకు అనుకూలం. ఆ ఉమ్మడి కుటుంబం అంతా ఆర్థిక సమస్యలు, దాని కారణంగా మానవీయ విలువల పతనం వంటి వాటితో నిండిపోయి ఉంటుంది. టీ కప్పులో తుఫానులు, కుట్రలు, కుహకాలతో పొద్దుపుచ్చుతూ ఉండే ఆ వాతావరణం పాఠకుడిగా నాకు విపరీతమైన వ్యతిరేకత, దానిపై అసహ్యం తీస్కువచ్చింది. ఆ దిశగా రచయిత నడిపిస్తాడు కథనాన్ని. నవలలో ప్రత్యేకమైన అంశం ఇదే.

ఆ అంశంలో రచయితా దృక్పథంతో అందరూ ఏకీభవించలేకపోవచ్చు. ఆ విషయంపై భేదాభిప్రాయం ఉన్నవారు కూడా జాతి కుటుంబ జీవనంలో, సాంఘిక వ్యవస్థలో వస్తూన్న అతిపెద్ద మార్పు మొలకలా ఉన్ననాడే గమనించి వ్రాసిన రచయిత పరిశీలనకు ఆశ్చర్యం ఆనందంతో ఆయన్ని మనసులో అభినందించుకోక మానరు. ఎవరు విభేదించినా వందలాది ఏళ్లుగా పెద్ద మార్పుల్లేని కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చి చిన్న కుటుంబాలు ఏర్పాటు అవనున్నాయని సూచిస్తారు రచయిత.

నవల తొలిగా 1951లో “ప్రేత్ బోల్తే హై”(దయ్యాలు మాట్లాడుతాయి) పేరిట రాజేంద్ర యాదవ్ వ్రాసి ప్రచురించారు. 1960లో “సారా ఆకాశ్” పేరిట పునర్ ప్రచురించారు. ఈ పేరు మీదనే విస్తృత ప్రజాదరణ పొందింది. నవల ముందుమాటలో చెప్పినదాని ప్రకారం హిందీలో సినిమాగా కూడా వచ్చింది. నిఖిలేశ్వర్ అనువదించగా అంతర భారతీయ గ్రంథమాల కింద నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు “ఆకాశం సాంతం”(రూ.65.00 , పే.233)గా ప్రచురించారు.

You Might Also Like

8 Comments

  1. Jampala Chowdary

    భారతీయ సినిమాలో సమాంతర ఉద్యమానికి తెర తీసిన చిత్రాలుగా 1969లో వచ్చిన సారా ఆకాశ్, భువన్‌షోమ్ (మృణాళ్‌సేన్) చిత్రాలను చెప్పుకుంటారు.

    1. pavan santhosh surampudi

      ఈ నవలను పరిచయం చేసిన నాకు దాని సినీప్రభావం తెలియకపోవడం దురదృష్టం. ఏదేమైనా ఏదొ సినిమా వచ్చుంటుంది. అద్భుతమైన నవల కదా సినిమా కూడా బానే ఉండుంటుంది. అనుకున్నాను కాని…!!!

  2. Purnima

    Thanks for introducing this book. Translations available under NBT are a treasure.. aren’t they?! There are some gems if you can dust off. 🙂

    If not this book, I’d at least like to get hold of the movie. By the way, if the subject of marital problems and how couples deals with them interests you, do watch Basu Bhattacharya’s “Aavishkar”. (If you’ve not already, that is.)

    1. pavan santhosh surampudi

      thank you n surely i’ll watch avishkar.
      తప్పకుండా ఆ సినిమా చూస్తాను. ఎన్.బీ.టీ. గురించి కూడా వ్రాయనున్నాను ఓ వ్యాసం. ఎంతైనా మనకు అన్ని పుస్తకాలు ఇచ్చిన సంస్థ నలుగురికీ తెలియజెప్తే చక్కగా చదూకుంటారు.

  3. Jampala Chowdary

    చెప్పటం మరిచాను; తర్వాత డివిడి కూడా కొనుక్కున్నాను.

  4. Jampala Chowdary

    పియా కా ఘర్, రజనీగంధ, చిత్‌చోర్ వంటి చిత్రాలతో ప్రఖ్యాతి గాంచిన బాసు ఛటర్జీ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం సారా ఆకాశ్. అతనికి మంచి పేరు తెచ్చింది. మధు, రాకేష్ పాండే నటించారని జ్ఞాపకం. గుంటూరు ఫిల్మ్‌క్లబ్‌లో ప్రదర్శించాము. అమెరికా వచ్చిన కొత్తలో ఒకసారి పబ్లిక్ టివిలోయాదృచ్ఛికంగా తగిలింది. నవలను పరిచయం చేసి, సినిమాను ఇంకోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    1. pavan santhosh surampudi

      బాసూచటర్జీ మిగిలిన సినిమాలు చూశాను. కాని ఈ సినిమా చూళ్లేదు. కేవలం నవల ముందుమాటలో వ్రాసుంది సినిమాగా వచ్చిందని. వివరాలు తెలిపినందుకు మీకూ ధన్యవాదాలు సార్.

Leave a Reply