పుస్తకం
All about booksఅనువాదాలు

September 7, 2012

విషకన్య

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
***************
ఙ్ఞానపీఠ్, సాహిత్య అకాడెమీ అవార్డు వంటి పురస్కారాలు పొంది, మలయాళ సాహితీరంగంలో సుప్రసిద్ధులైన శ్రీ ఎస్.కె.పొట్టెక్కాట్ రచించిన నవల “విషకన్య”.

స్వాతంత్ర్యానికి పూర్వం కేరళ మూడు భాగాలుగా ఉండేది. తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాధీశుల అధీనంలో ఉండగా, మలబారు ప్రాంతం బ్రిటీష్ ఇండియాలో భాగం. భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి దాదాపు దశాబ్దం ముందు తిరువాన్కూరుకు చెందిన పేద క్రైస్తవులు అక్కడి కొద్దిపాటి తోటలు, కయ్యలు అమ్ముకుని వలసవెళ్లి మలబారులోని వయనాడు కొండలోయల్లోని అడవుల్లో వందలాది ఎకరాలు కొన్నారు. అడవులు కొట్టి సారవంతమైన మట్టితో బంగారం పండిద్దామనుకున్నారు. కానీ, మలేరియాజ్వరాలూ, అడవిజంతువులూ, ఇంకా ఎన్నో ప్రకృతి కల్పించిన అడ్డంకులు వారికి శతృవులయ్యాయి. ఆ తొలితరం సాహసుల పోరాటమే ఈ నవల ఇతివృత్తం.

సాధారణంగా చాలామందికి కొన్నికొన్ని విషయాలపై మధురమైన ఊహలుంటాయి. కానీ, వాస్తవాలు అంత మధురంగా ఉండవు. నిజానికవి చేదుగా ఉంటాయి. అలా అడవులు ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టుగా మాత్రమే చాలామంది మనసుల్లో ముద్రించుకుపోయి ఉంటుంది. సాహిత్యంలో కూడా చాలావరకూ అడవుల మార్మికసౌందర్యమే ఎక్కువగా వ్యక్తం అవుతూంటుంది. కానీ, విషకన్య నవలలో రచయిత అరణ్యంలోని ఆకర్షణతో పాటు దాని క్రౌర్యాన్నీ కళ్లకు కడతారు. ఆశల్ని రేపుతూనే, ఆశలతోపాటు ఆయువునూ ఆర్పేసే అడవి ఇక్కడ కనిపిస్తుంది. మరోవంక స్వావలంబన కోసం తెలిసో తెలియకో పోరాటం మొదలుపెట్టి సమిధలైపోయిన తొలితరాన్ని చిత్రిస్తాడు. ప్రకృతిని జయించి నాగరికత నిర్మించడంతో మనిషి తొలి అడుగునూ ఆకర్షించి తన విషపుకౌగిలిలో బిగించే ప్రకృతిదీ ఈ కథ.

ఒకేసారి తిరువాన్కూరు నుండి వలసవెళ్లిన చాలామంది క్రైస్తవుల కథలు పూలలా ఏరి మాలకట్టిన రచయిత దారంగా ఆంథోనీ-మాధవిల కథను వాడుకున్నారు. చాలా కవితాత్మకంగా మాధవిని ప్రకృతికీ, ఆంతోనీని మనిషికీ సంకేతంగా ఎంచుకుని నవల సారాంశాన్ని ఈ కథలో చెప్పకనే చెబుతారాయన.

ఇంత గంభీరమైన అంశం, కథలు కథలుగా ఉండే ఇతివృత్తం, స్తరాలు స్తరాలుగా సాగే తాత్త్వికత పాఠకుడికి భారంకాలేదంటే ఆ గొప్పదనం పొట్టెక్కాట్ శైలిదే. అలతి అలతి పదాలతో గద్యాన్ని కూడా కవితలా వ్రాసే ఆయన శైలి పాఠకుణ్ణి కట్టిపడేస్తుంది. ఒకసారి చదివి మరోసారి తెరవగానే అరణ్యం మార్మికమైన నవ్వుతో.. లోగొంతుకతో రహస్యాలు చెప్తున్న భావన.. చుట్టూ విషకన్యలాంటి అడవి చిక్కగా అల్లుకున్న అనుభూతి కలుగుతుంది.. నిజం..

****

విషకన్య
(మలయాళ నవల విషకన్యకకు అనువాదం)
రచన: ఎస్.కె.పొట్టెక్కాట్
అనువాదం: పి.వి.నరసారెడ్డి
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా.
ధర: రూ.60.00
పేజీలు: 165About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


 1. Radhika

  ఈ పుస్తకం చదివి చాలా రోజులయింది. అప్పుడు నేను వ్రాసుకున్న అభిప్రాయం – “చదువుతుంటే బాగానే అనిపించినా, పూర్తయ్యాక వైరుధ్యాలు, లోపాలు కనిపించాయి. ‘ప్రకృతి సౌందర్యం అంతా ఓ పెద్ద మోసం, దగా’ అని తీర్మానించడం ఒప్పుకునేలా అనిపించలేదు.”
  (ఒప్పుకునేలా అనిపించకపోవడం, నా అభిప్రాయం ప్రకారం కాదు… నవల ఆధారంగా పరిశిలిస్తేనే )
  ఎందుకంటే, ఓసేపు, మార్టిన్, చెరియన్, పాల్ – అందరిలోనూ దుర్మార్గమో, చాతకానితనమో ఏదో ఒకటో, రెండూనో వున్నట్లు చూపి, వారు పాడయిపోవడానికి కారణాలు కూడా అవేనన్నట్లుగా చెప్పి … చివరికి మాత్రం భూమి వల్ల, వ్యవసాయం వల్ల దగా అయినట్లు తీర్మానించడం సరిగాలేదని అనుకున్నట్లు గుర్తు.
  మంచివాడూ, తెలివైనవాడూ అయిన మరో పాత్ర తరాముట్టిల్ చాకో బాగుపడతాడు. స్థానికుడయిన కుంజికృష్ణన్ నంబియార్ తో స్నేహమూ దొరుకుతుంది. కాబట్టి ముగింపులోని తీర్మానానికీ, నవలలోని విషయాలకీ పొసగలేదని అనిపించిందని గుర్తు.


  • మీరన్నది కూడా ఆలోచించదగ్గ అంశమే కాని నవల పూర్తి అవుతూండగా ఆంథోనీ-మాధవిల కథ పూర్తిగా నన్ను లాగేసుకుంది.
   ఆ కథలో కూడా ఏకపక్షమైన ముగింపులేదని నాకూ అనిపించింది.ఒకవిధంగా మాధవి ఆంథోనీ కలయిక సహజం. ఆంథోనీ దృష్టి అసహజం. ఆ విషయం రచయిత చెప్పదలుచుకున్నాడో లేదో మనకి తెలియదు. అలానే మీరన్నట్టుగా //మంచివాడూ, తెలివైనవాడూ అయిన మరో పాత్ర తరాముట్టిల్ చాకో బాగుపడతాడు. స్థానికుడయిన కుంజికృష్ణన్ నంబియార్ తో స్నేహమూ దొరుకుతుంది.//
   కానీ, తీర్మానంతో తప్పేమీ కనిపించలేదు. నష్టపోవడానికి వారి బద్ధకమో, మోసమో, అమాయకత్వమో కారణమైనా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోవడంలో వాళ్ల తప్పేం ఉంటుంది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

భార్యని వర్ణించిన కవులున్నారు

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ************* కవులేల తమ భార్యను వర్ణించరని ఎల్లేపెద్ది వెంక...
by అతిథి
5

 
 

పుస్తకాలకు, పాఠకులకు మధ్య అనుసంధానమైనది

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********** ఆరువేల పుస్తకాలు.. ఆరేడు నెలలు.. వెయ్యి వికీ వ్యాస...
by అతిథి
4

 
 

విశ్వనాథ వారు ఎలా చెప్పారు?

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ******** విశ్వనాథ సత్యనారాయణ గారు నవలలు ఎలా చెప్పారు? అన్...
by అతిథి
17

 

 

సప్తవర్ణాల కరచాలనం

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ****** తెలుగువారిలో ఏ లలిత కళలోనైనా మంచి కళాకారులకులోటు...
by అతిథి
2

 
 

పోలీస్ సాక్షిగా

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************* సాధారణంగా నూటికి ఎనభైమందికి పోలీస్ స్టేషన్ ...
by అతిథి
2

 
 

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. త...
by అతిథి
0