దేశవిభజన గాయాలు: సియా హాషియే

లాంగ్ వీకెండ్‍గా కలిసొస్తే తప్ప ఆగష్టు పదిహేనును గురించి ప్రత్యేకంగా ఆలోచించటం మానేసిన నేను, ఈ ఏడాదిన ఏదో కొంత దేశం గురించి చింతన చేశాను. దేశం పేరిట ఒక కన్నీటి బొట్టు రాల్చాను. అయితే ఆ కన్నీటి వెనుక కారణం “జర ఆంఖ్ మెన్ భర్‍లో పానీ.. జొ షహీద్ హువె హై ఉన్‍కె జర యాద్ కరొ కుర్‍బానీ” అని పాడుతున్న లతా గొంతు కాదు. స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు బలిచ్చారని చిన్నప్పటి నుండి వింటున్న / చదువుతున్న విషయమే కానీ, తొట్టతొలిసారిగా స్వాతంత్ర్యం వల్ల ఎన్ని వేల మంది, ఎంత దారుణాతి దారుణంగా తమ ప్రాణాలు కోల్పోయారో తెల్సుకునే అవకాశం కలిగింది, సాదత్ హసన్ మంటో రాసిన “సియా హాషియే” అధారంగా తీసిన నాటకం చూశాక.

నాటకం చూడ్డానికి ముందు మాంటో పేరు తప్ప ఏమీ తెలీదు. పార్టిషన్ గురించి ఈ మధ్య కొంచెం ఆసక్తి కలిగింది కాబట్టి ఈ నాటక ప్రదర్శనకు వెళ్ళాను. మంటో ఉర్దూ రచయిత, విభజన తర్వాత పాకిస్థాన్‍కు వెళ్ళిపోయారు. విభజన సమయంలో జరిగిన అల్లర్లు నేపథ్యంగా “సియా హాషియే” (అంటే “నల్లటి సరిహద్దులు” అని అర్థం) పేరిట 32 స్కెచ్‍స్ రాశారు. ఇది అప్పటిలో వివాదస్పదమైంది. మంటో ఇతర రచనలూ వివాదస్పదమై, సమకాలీనులలో ఆయనపై సదభిప్రాయం లేకపోయినా, వాటిన్నింటిలోకి “సియా హాషియే”ను ఎక్కువగా విమర్శించారట. అయినా అవ్వన్నీ బేఖాతరు చేస్తూ తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పటంలో మంటో కూడా తక్కువేమీ కాదు.

నాటకం మొత్తం ఉర్దూలో ఉంటుందని తెల్సినా ఎంత అర్థమైతే అంత అని ధైర్యం చేసి వెళ్ళాను. కథలను తీసుకొని నాటకానికి అనుగుణంగా మార్చి అభినయిస్తారనుకున్నాను. కానీ స్టేజి మీద ఉన్న ముగ్గురు మనుషులు, అప్పుడే కథను మనకు చెప్తూ, అప్పుడే అందులో పాత్రలగా అభినయిస్తూ మొత్తం ముప్ఫై రెండు కథలూ చెప్తూ అభినయించారు. దీని వల్ల నాకు ఓ రచనను చదువుతున్న అనుభూతే కలిగింది. కొన్ని కీలక పదాలు అర్థం తెలీక దిక్కులు చూశాను కానీ, ప్రతి స్కెచ్ లోని భావం మాత్రం నన్ను బాగా తాకింది. మూలరచనలో కథల క్రమం ఎలాగుందో తెలీదు (ఈ పుస్తకం దుర్లభం అని చదివాను.) కానీ వీళ్ళు మాత్రం గాంధీ హత్యను గురించి రాసిన ఒక స్కెచ్ తో మొదలెట్టి, మెల్లిమెల్లిగా అప్పటి వాతావరణాన్ని సృష్టించటంలో సఫలమైయ్యారు.

ఒకటి రెండు లైన్ల నుండి మహా అయితే ఒకటిన్నర పేజీ ఉండే ఈ స్కెచులలో విభజన సమయంలో సామాన్యప్రజల మధ్య జరిగిన సంఘటనలు, సంభాషణలను పొందుపరిచారు. ఇందులో చాలావరకూ తన స్వానుభవంలోనివే అని రచయిత చెప్పుకున్నారట అప్పట్లో. వీలైనంత తక్కువ పదాల్లో, పట్టలేనంత అనుభవాన్ని అందించటం రచయిత ప్రతిభకు తార్కాణమనుకుంటే, మాంటో పేరును విశిష్ట రచయితల్లో ఎంచటం పొరబాటు కాబోదు. ఆయన రచనాపాటవమో, లేక అప్పటి పరిస్థితులలో ఉన్న బలమోగానీ, ఈ కథలు పరస్పరవిరుద్ధ స్పందనలు ఏకకాలంలో కలిగించటంలో సఫలమైయ్యాయి. కొన్ని మామూలుగా అనిపిస్తూనే ఒళ్ళు జలదరించేలా చేస్తే, మరికొన్ని నవ్వు తెప్పించీ తెప్పించగానే నిట్టూర్పు విడిచేలా చేస్తాయి. చదవటానికి కొన్ని క్షణాలు సరిపోయినా, మింగుడుపడ్డానికి చాలా సమయం తీసుకుంటాయి మరికొన్ని. వీటిని గూర్చి ఏ మాత్రం ఆలోచనలును ఖర్చు చేసినా, ఇంకేం ఆలోచించాలో తెలీక మెదడు బ్లాంక్ అయిపోతుంది. గంటలో నాటకం పూర్తయినా చాన్నాళ్ళ దాకా గుర్తుండడం ఖాయం అనిపించింది.

ఆ తర్వాత ఈ పుస్తకం కోసం వెతకటం, వెతికించటం మొదలెట్టాను. ఎట్టకేలకు ఒక స్నేహితురాలి పుణ్యమా అని ఈ రచనకు ఖాలిద్ హసన్ చేసిన ఆంగ్లానువాదం “Partition: Sketches and Short stories” దొరికింది. ఆ రోజు, నాటకప్రదర్శను అర్థం కానివి కొన్ని అర్థమవ్వటానికి ఈ అనువాదం ఉపయోగపడింది.

చదవటమే అనువాదం చదివితే చాలా బాగా అనిపించొచ్చేమోగానీ, నేను మొదట ఉర్దూలో రాసి ఉన్నవి విని ఉండడం వల్ల, నాకు అనువాదం పెద్దగా నచ్చలేదు. మంటో స్కెచులలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, దేశవిభజనకు మూల కారణం “మతం” కాబట్టి, అప్పటి అల్లర్లకు మూలకారణం కూడా మతవిద్వేషాలే. అప్పటివరకూ సాటి మనిషిగా మెలిగినవాడు, పరాయిమతస్థుడైతే, అప్పటికప్పుడు అతడిని హతమార్చాల్సిందే! ఇలాంటి కథలను రాస్తూ కూడా మంటో ఎక్కడా, ఏ మతం పేరు వాడలేదు. ఆయన దృష్టిలో అందరూ అందరే! హిందు, ముస్లిమ్, సిఖ్ ల ఆచారవ్యవహారాలు తెలీకపోతే ఈ కథలను అర్థం చేసుకోవడం కష్టం కూడా! అదే కారణం చూపుతూ, ఆంగ్లానువాదానికి ఈ నేపథ్యం తెలీని పాఠకులుంటారని, రచయిత మతం పేరు వాడకున్నా, అనువాదకుడు రాశారు. ఇలా చేయడం వల్ల మూలకథకు, ఆ రచయితకు ఎనలేని అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. ఫుట్‍నోట్ల ద్వారానో, విపులంగా వివరించే వ్యాసాల ద్వారానో పాఠకులను “ఎడ్యుకేట్” చేస్తే సరిపోతుందిగా, మూలకథలో కీలకమైన, నాజూకైన అంశాలను మార్చటం కంటే?!

బతికున్ననాళ్ళూ విమర్శలతోనూ, వివాదాలతోనూ సరిపెట్టుకున్న మాంటో, మరణాంతర ఖ్యాతిని తెగనాడారు. “May God protect me from posthumous recognition which will eat like a mould through my dry bones in the grave.” అని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మశాంతి గురించేమోగానీ, ఆయన రచనలు, ముఖ్యంగా ప్రస్తుత రచన, చదవటం చాలా అవసరం. “దేశవిభజన సమయంలో చెలరేగిన అల్లర్లు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో క్షతగాత్రులుగా మిగిలారు.” అన్న వాక్యం వెనుక ఎంతటి కఠోర జీవనచిత్రాలున్నాయో ఇలాంటి సాహిత్యం వల్లే తెలుస్తుంది. స్వర్గం-నరకం భూమికి పైన ఉన్నాయో లేవో తెలీదుగానీ, మనిషిని మనిషి ఆదరించినప్పుడు ఇక్కడే స్వర్గం. మనిషికి మనిషే ప్రాణాంతకమైనప్పుడు ఇదే నరకం.

(ఇంతకీ నేను చూసిన నాటకం వివరాలు: హైదరాబా‍ద్ కు చెందిన “సూత్రధార్” సంస్థవారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నటీనటులంతా బాగా చేశారు. వీరివి అప్పుడప్పుడూ నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అవకాశముంటే తప్పక వెళ్ళండి. ఆదరించండి.)

You Might Also Like

5 Comments

  1. మంటో సమగ్ర సాహిత్యం – మొదటి భాగం | పుస్తకం

    […] మంటోతో నా పరిచయం ఎలా జరిగిందో “సియా హాషియే”ను పరిచయం చేసేటప్పుడు చెప్పాను. ఆ రచన చదివాక, […]

  2. 2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం

    […] *Partition – Sketches and Stories – Saadat Hasan Manto: సియా హాషియేకు ఆంగ్లానువాదం. కూడికూడి హింది చదువుకోగలిగే వీలున్నా, అనువాదం వదిలి ఎంచక్కా మూలమే చదువుకోవడం మేలు. […]

  3. jwaala

    poornima garu, manto rasina oka story anuvadam sakshi lo vacchindi,appude anukunna eeyana chala goppa write ani, book parichayam chesinanduku thanks

  4. surampudi pavan santhosh

    ఆ ప్రాంతం వాణ్ణి కాకున్నా, ఆ కాలంవాణ్ణి కాకున్నా స్వాతంత్ర దినోత్సవం నాడు దేశవిభజనను గుర్తుకుతెచ్చుకుని బాధపడేవాణ్ణి నేను. తిలక్ జిన్నా గురించి వ్రాసిన కథ, దో గజ్ జమీన్ అన్న ఉరుదూ నవల తెలుగు అనువాదం వంటివి చదివినప్పుడల్లా తెలియని ఆర్ధ్రతతో హృదయం కరిగిపోతుంది. అటువంటి మరో పుస్తకం పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు.

  5. Srinivas Vuruputuri

    “మనిషిని మనిషి ఆదరించినప్పుడు ఇక్కడే స్వర్గం. మనిషికి మనిషే ప్రాణాంతకమైనప్పుడు ఇదే నరకం.”

    ఎంత బాగా చెప్పారు!

Leave a Reply to 2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం Cancel