Behenji : A political biography of Mayawathi

మొదటగా, అసలీ పుస్తకం పేరు చూశాక కూడా దీన్ని చదవలానిపించడం చూస్తే మీరు నా గురించి ఏమన్నా అనుకోవచ్చు గాక. అయినా, పుస్తకాన్ని మొదట్నుంచీ, చివరిదాకా చదివి విజయవంతంగా పూర్తిచేసాను 🙂 అసలు విషయానికొస్తే, ఈ పుస్తకం పైన చెప్పినట్లు, ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ జీవిత చరిత్ర. 2007 యూపీ ఎలెక్షన్ల వరకూ ఉంది కథ ఇందులో. నిజం చెప్పాలంటే, మొదట పుస్తకం చూడగానే – “అంటే, మాయావతి గురించి పుస్తకం రాసేంత గొప్ప మనిషా?” అనుకున్నాను. పైగా, రాజకీయ చరిత్రా? పత్రికల్లో వాటిలో యూపీ రాజకీయాల గురించి చదువుతూ ఉన్న వారెవరికైనా అక్కడి నాయకుల గురించి ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుంది. తొంభై శాతం కేసుల్లో (బహుశా ఇంకా ఎక్కువ ఏమో) అది సదభిప్రాయం కాదు. వారిలోనే నేనూ ఉన్నాను. మాయావతి అంటే కూడా నాకు ప్రత్యేకమైన సదభిప్రాయమేమీ లేదు. ఈ పుస్తకం చదివాక కూడా నాకేమీ “వావ్! మాయావతి!” అన్న భావన కలగలేదు కానీ, మాయావతి ప్రజాజీవితాన్ని మరో కోణంలో ఎలా చూడవచ్చో అర్థమైంది.

పుస్తకం ప్రధానంగా రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం మాయావతి ఎదిగిన క్రమం. మొదట ఓ సాధారణ దిగువ మధ్య తరగతి దళిత కుటుంబంలో తొమ్మిది మంది సంతానంలో ఒకదానిగా ఉన్న రోజుల నుండి, క్రమంగా, చదువుకుని, స్కూల్ టీచర్ గా పనిచేస్తూ, ఐఏఎస్ రాద్దామని చదువు మొదలుపెట్టడం, అదే సమయంలో కాన్షీరాం ప్రభావంలో రాజకీయాలవైపు మొగ్గు చూపడం, బహుజన సమాజ్ పార్టీ లో పాలు పంచుకుని, పార్టీ స్థాపించిన కాన్షీరాం నే మించేంతగా ఎదగడం, యూపీ లో ఆ పార్టీ ని ఎదిగేలా చేయడం, 2007 లో నాలుగోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం – ఇదంతా జరిగిన క్రమం వివరిస్తుంది ఈ భాగం. రెండో భాగం మాయావతి అన్న రాజకీయవేత్త లోని వివిధ కోణాలనూ, ఆమె రాజకీయ బుద్ధిని గురించి చేసిన కొన్ని పరిశీలనలు.

ఈ పుస్తకం చదివితే, దాదాపు ఓ ఇరవై సంవత్సరాల యూపీ రాజకీయాల రౌండప్ లాగా ఉంటుంది. నాకైతే డెబ్భైల కాలపు సినిమాల్లో చూపించే రాజకీయ కుట్రలు, అవినీతి – ఆ దృశ్యాలన్నీ కళ్ళముందు కదలాడాయి. ఈ కుట్రలు, అధికారుల బదిలీలు, కులాల తగువులు, మతతత్వ ఈక్వేషన్లు, ఒక్కో పార్టికి ఉండే పరిధులు, వారిలో వారికి ఉండే అంతర్గత తగాదాలు, ఒక పార్టీలోని తగాదాలని ఇంకో పార్టీ ఉపయోగించుకునే తీరు – అబ్బో! థ్రిల్లర్ నవల లా అనిపించింది. మొత్తానికి పుస్తకం ఏకబిగిన చదివించేలా ఉంది. దానికి కారణం కేవలం రాజకీయాల్లో, అందునా యూపీ రాజకీయాల్లో ఉండే నాటకీయత మాత్రమే కాదు. రచయిత అజయ్ బోస్ దీన్ని రాసిన తీరు.

ఈ పుస్తకం మాయావతి పై అభిమానం కాస్తైనా లేకపోతే రాయడం అసాధ్యం. అలాగని చూస్తూ చూస్తూ ఆమెని గ్లోరిఫై చేసే వీలా లేదు. పైకి కనిపిస్తున్న కేసులూ గట్రా చూస్తూ ఉంటే. కనుక, ఉన్నంతలో, ఆమె చేసిన మంచినంతా మన ముందుంచడమూ, చెడు ఏదన్నా ఉంటే, వీలైనంత వరకు – “ఇది చెడేడే కానీ, మిగితావాళ్ళు ఇంతకంటే చెడ్డపనులు చేశారు” అని దాన్ని గురించి సమాధానపరచడమూ- ఈ తరహాలో సాగుతుంది. మొత్తానికి, ప్రతి మనిషికీ ఓ కథ ఉంటుందనీ, ఓ నేపథ్యం ఉంటుందనీ, ఆ కథ, ఆ నేపథ్యం – ఈ కోణాల్లో చూస్తే, వారు చేసిన ప్రతి పనినీ సమర్థించవచ్చని మళ్ళీ ఈ పుస్తకం చదివాక రుజువైంది. ఏదేమైనా, ఈ పుస్తకం చదవకముందు మాయావతి అంటే పూర్తి దురభిప్రాయం ఉండేది. చదివాక మరీ అంత లెవెల్లో లేదు. ఒక కోణంలో చూస్తే, భలే ఎదిగిపోయిందే, అని కూడా అనిపించింది.

తప్పక చదవాల్సిన పుస్తకమేమీ కాదు. కానీ, చదవడం మొదలుపెడితే, ఆసక్తికరంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఎటొచ్చీ, 350 రూపాయలు పెట్టి, కొని మరీ చదవాలా అంటే, మీ ఇష్టం. ఇంతకంటే……. ఉన్న పుస్తకాలు కూడా ఇంతకంటే ఖర్చు పెట్టి కొనేవారిని చూసున్నాను. అలాగని మీరు కొనేసేయమని కాదు. 🙂 మాయావతి గురించి ఎంతోకొంత కుతూహలం కలిగితే, ఇంతకంటే ఉత్తమమైన పుస్తకం లేదు వివరాలు తెలుసుకోడానికి. ఇక మీ ఇష్టం.

పుస్తకం వివరాలు:
Behenji : A political biography of Mayawathi
Author: Ajoy Bose
Penguin books, India, 2008
ISBN: 9780143066323
Cost: 350/-

You Might Also Like

One Comment

  1. కె.మహేష్ కుమార్

    భారత రాజకీయాల్లో మండలైజేషన్ తరువాత లాలూ-ములాయం-పాశ్వాన్ల శకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మాయావతి బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సుకుంది. ఉత్తరభారతదేశంలో కాంగ్రెస్-బీజేపీ-లెఫ్ట్- యాదవ్ రాజకీయాల మధ్యన దళితరాజకీయం ఒక నూతన ఒరవడి. ఒక అత్ముఖ్యమైన రాజకీయపరిణామం. ఆ పరిణామక్రమాన్ని మాయావతి జీవితం ద్వారా అర్థంచేసుకోవచ్చు. ఈ పుస్తకం ఆ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. What ever might be your political and social ideologies, but this is a political reality every Indian should know of.

Leave a Reply