వ్యాఖ్యావళి – నండూరి రామమోహనరావు

కొన్నాళ్ళ క్రితం ఇంకేదో వెదుకుతూ ఉంటే అనుకోకుండా, డీ.ఎల్.ఐ. సైటులో నండూరి రామమోహనరావు గారి మరో సంపాదకీయాల సంకలనం “వ్యాఖ్యావళి” కనబడ్డది. వెంటనే మారు ఆలోచించకుండా దిగుమతి చేసుకుని చదివాను. నాకు ఆసక్తికరంగా అనిపించాయి వ్యాసాలు. అటు పిమ్మట, ఇటువంటి పుస్తకం గురించి ఒక పరిచయం ఎలా రాయాలో నాకు తోచక కొన్ని నెలలుగా రాయకుండా వాయిదా వేస్తూ వచ్చాను. చివరకి ఆన్లైన్ చదువుకి కూడా ఉచితంగా దొరుకుతున్న ఈ పుస్తకం గురించి ఎలాగైనా పదుగురికీ చెప్పాలన్న బులబాటం కొద్దీ, నాకు చేతనైనంతలో…(బులబులాగ్గానైనా) ఈ పుస్తకం గురించి చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఈ “వ్యాఖ్యావళి” సంకలనం ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ చాలా మట్టుకు ఎనభైలలో, తొంభైలలో రాసినవి. ఏ కాలానివి అయినా కూడా, నండూరి వారికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో, సులభంగా అర్థమయ్యేలా రాయబడినవి. సంపాదకీయాలు, అందునా పలు అంశాల గురించి విశేష పరిజ్ఞానం ఉన్న నండూరి వంటి వారి కలం నుండి అవ్వడం మూలాన, విషయ వైవిధ్యం చాలా ఉంది. శాస్త్ర సాంకేతికాంశాలు, సమకాలీన రాజకీయాలు, సామాజికాంశాలు, సినిమా, సాహిత్యం, “సంతాపకీయాలు” ఇలా భిన్నాంశాలపై ఇందులో వ్యాసాలు ఉన్నాయి.

ముందుమాటలో –
“అయితే తెలుగు పత్రికల సంపాదకీయాలను చాలా తక్కువమంది మాత్రమే చదువుతారని ప్రథ ఉన్నది. ఎంత తక్కువమంది చదువుతారన్నది ప్రశ్నిస్తే, రకరకాల అభిప్రాయాలు వినవస్తాయి. నూటికి ముగ్గురు నలుగురికంటే ఎక్కువమంది చదవరని ఒక సర్వేలో తేలిందట. అయితే, ప్రతి పత్రిక, ముఖ్యంగా ప్రతి పత్రికా సంపాదకుడు తమ సంపాదకీయాలను మాత్రం నూటికి పది,పదిహేను మంది వరకు విధిగా చదువుతారని, పైగా లొట్టలేసుకుంటూ చదువుతారని, నూటికి ముగ్గురో, నలుగురో చదివేది ఇతర పత్రికల సంపాదకీయాలను మాత్రమేనని సగర్వంగా చెప్పుకోవడం కూడా వింటూ ఉంటాము”.
-అని రాసారు. కొన్ని సంపాదకీయాలకి ఏళ్ళు గడిచినా వన్నె తగ్గదని చెప్పడానికి ఈ సంపాదకీయాలు కూడా ఉదాహరణలే.

జరిగిపోయిన సంఘటనల గురించి, అవి జరగబోయే ముందు నాటి విషయాలు చదువుతున్నప్పుడు వేసిన అంచనాలను చదువుతూ ఉంటే కలిగే ఒక రకమైన పులకింత, ఇదిగో, మానవుడు చంద్రుడి పైకి వెళ్ళడం గురించి నీల్ ఆర్మస్త్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు పెట్టడానికి దాదాపు సంవత్సరం ముందు రాసిన సంపాదకీయంలో ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు కలిగింది –
“చంద్రగోళానికి మానవుడు చేరడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది మరి రెండు మూడేళ్ళ లోనే సాధ్యం కావొచ్చు కూడా” – ౧౯౬౮ (1968) సంపాదకీయం.

అలాగే ఈ వాక్యాలు కూడా:
“ఏడు లక్షల ఏళ్ళ నాడు మానవుడు దాదాపుగా జంతుప్రాయుడు. ఏడువేల ఏళ్ళ నాడు అతడు అప్పుడప్పుడే నాగరిక జీవనపథంలో తప్పటడుగులు ప్రారంభించిన పాంథుడు. ఏడు వందల ఏళ్ళ నాడు భూమి గురుత్వాకర్షణ శక్తిని తాను అధిగమించగలగడం అతని ఊహకైనా అందని విషయం. ఏడు దశాబ్దాలనాడు చంద్రమండల యాత్ర, గ్రహాంతరయానం అతనికి ఊహావీథులలోనే సాధ్యమైన విషయాలు”
– ఇవి కాక, గ్రహణాల గురించి, మూఢ విశ్వాసాల గురించీ, అంగారక గ్రహం పై జరుగుతున్న పరిశోధనల గురించి, జీన్ల గురించి, ఇతర శాస్త్రీయ అంశాల గురించి చాలా చక్కగా, సూటిగా, క్లుప్తంగా రాసారు. సంపాదకీయలన్నాక అన్ని అంశాల గురించీ రాయడం పెద్ద విశేషం కాదు అని అనవచ్చు కానీ, అందరు సంపాదకులు ఇలాగ తేలిక భాషలో రాయరు. ఏదేమైనా, ఇలా భిన్నాంశాల గురించి కోతికొమ్మచ్చులాడుతూ చదవడం మాత్రం ఒక మంచి పఠనానుభవం.

దివిసీమ ఉప్పెన గురించి నా ముందు తరం పెద్దలు చెప్పగా వినడమే కానీ, ఆట్టే వివరాలు తెలియవు. గతంలో చదివిన మరో సంపాదకీయ సంకలనంలో గాంధీ గారి గురించి ఎంత తరుచుగా ప్రస్తావన వచ్చిందో, ఇందులో దివిసీమ ఉప్పెన గురించి అలా వచ్చినట్లు ఉంది. నండూరి గారిని ఈ ఉప్పెన బాగా కదిలించింది అని ఈ వ్యాసాలను బట్టి అనిపించింది. నేను చదివినంతలో మామూలుగా “ఇదీ విషయం” అని వీలైనంత మానసిక సమతౌల్యంతో చెప్పినట్లు ఉండే ఆయన సంపాదకీయ వ్యాసాలు ఇప్పటి దాకా రెండు విషయాల లోనే కొంచెం వేరుగా, బాగా చలించిన మనిషి రాసినట్లు గా అనిపించాయి. ఆ రెండు విషయాలూ – దివిసీమ ఉప్పెనా, గతంలో మరో సంకలనంలో చదివిన గాంధీ మరణం కాలం నాటివీనూ.

ఇక రాజకీయాల విషయం – నేనింకా ఇలాగ రాజకీయ నాయకులూ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవడం అంతా ఈమధ్య వచ్చిన వెర్రి అనుకున్నా. చూడబోతే మొదట్నుంచీ ఉన్నట్లే ఉంది. టీడీపీ, కాంగ్రెస్ నాయకులూ ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవడం గురించి నండూరి వారి చురకలు – ఒక విధంగా కాలాతీతమైనవి అనిపిస్తుంది…ఎందుకంటే ఇప్పటికీ అలాగే ఉన్నట్లు తోస్తోంది పరిస్థితి. ఇక టీడీపీ, ఎన్టీయార్ లపై వ్యాఖ్యానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సామాన్య పరిజ్ఞానానికి పనికొచ్చే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి – పరువు నష్టం దావా ౧౯౮౮లో అమలు చేయడం మొదలుపెట్టారు అని నాకు ముందు తెలియదు. ఈ వ్యాసాలు చదువుతూ, ఇక్కడ దాని అమలు సమయంలో జరిగిన చర్చలు/వాదనల గురించి చదివాకే తెలిసింది. ఇంకా, ఉరిశిక్షలపై, భారత రత్న అవార్డులపై – ఇలా ఆనాడు జనం నోళ్ళలో నానిన అన్ని విషయాల గురించీ తెలుస్తుంది ఈ సంపాదకీయాలు చదివితే. అలాగే, ప్రముఖుల మరణాల సందర్భంగా రాసిన “సంతాపకీయాలు” కూడా నాకు చాలా నచ్చాయి. ముఖ్యంగా సత్యజిత్ రాయ్ మరణ సందర్భంలో రాసిన వ్యాసంలో ఆయన గురించి అన్ని కోణాలని మితిమీరి పొగడకుండా తలచుకున్నట్లు అనిపించింది.

నండూరి గారివి అని కాకపోయినా, పాత సంపాదకీయాలు చదివితే మామూలుగా అప్పటి కాలం గురించి బోలెడు కబుర్లు తెలుస్తాయి (పాతకాలం నాటి కథలు, ఆత్మకథలూ చదివినప్పటి లాగానే). అందువల్ల, ఈ పుస్తకం చదవదగ్గది అని నా అభిప్రాయం. నండూరి రామమోహనరావు గారి ఇతర సంపాదకీయ సంకలనాలు చిరంజీవులు, అనుపల్లవి కూడా డీ.ఎల్.ఐ. లో లభ్యం. వాటి గురించి గతంలో రాసిన పరిచయం ఇక్కడ. ఈ పుస్తకంలోనిదే “బాలసాహిత్యం” అన్న వ్యాసం ఇదివరలో పుస్తకం.నెట్ లో పునర్ముద్రితం. లంకె ఇక్కడ.

పుస్తకం వివరాలు:
వ్యాఖ్యావళి (Vyakhyavali – A Collection of Editorials by Nanduri Ramamohanarao)
ఆంధ్రజ్యోతి నుంచి ఎంచి సంకలించిన సంపాదకీయాలు (౧౯౬౩-౧౯౯౪)
లిఖిత ప్రచురణలు, విజయవాడ.
ముద్రణ: నవంబర్ ౧౯౯౭
వెల : అరవై రూపాయలు
ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్, ఏలూరు రోడ్డు, విజయవాడ.
డీ.ఎల్.ఐ. లంకె

You Might Also Like

6 Comments

  1. nagasuri venugopal

    well done soumya….you did good thing by writing about this book……….craft of sentence of nanduri worth study……….nagasuri

  2. అసాధారణ రచయిత – చలం గురించి నండూరి | పుస్తకం

    […] గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. చలం మరణించినపుడు వచ్చిన […]

  3. G K S Raja

    Sowmya Garu! Thanks for giving DLI link. As usual your review is good but not in depth.
    Raja.

  4. రామ

    ” బులబులాగ్గా” అనే పదప్రయోగం బాగా చేసారు. “వదులుగా” (కుదపక ముందు బస్తాలో వేసిన వస్తువులు ఎలా ఉంటాయో అలా) కదా? బాగుంది :).

    1. సౌమ్య

      రామ గారికి: పూర్తిగా, లోతుగా కాకపోయినా కనీసం పైపైన అన్నా పరిచయం చేయాలి అన్న ఉద్దేశ్యంలో వాడాను. ఆంధ్రభారతిలో చూశానిప్పుడే – “అసంపూర్ణంగా” అని ఉంది అర్థం 🙂

Leave a Reply to రామ Cancel