My Son’s Story – ఒక మంచి సౌత్ఆఫ్రికన్ నవల

“ఆ వ్యవహారం విషయం నాకెలా తెలిసింది?
నేను ఆయన్ని మోసం చేస్తుండగా.”
అంటూ మొదలెడతాడు తన కథని చెప్పడం విల్ అనే పదిహేనేళ్ళ నల్ల సౌత్ఆఫ్రికన్ పిల్లవాడు, నోబెల్ ప్రైజు గ్రహీత నెడీన్ గార్డిమర్ (Nadine Gordimer) నవల My Son’s Storyలో.

బడి ఎగ్గొట్టి , ఊరికి అవతల పక్కన ఉన్న సినిమాహాలుకి వెళ్ళిన విల్‌కి, లాబీలో, అప్పుడే అయిపోయిన సినిమానుంచి బయటకి వస్తున్న అతని తండ్రి కనిపిస్తాడు. ఆయన పక్కన ఒక తెల్ల, బ్లాండ్ వనిత. విల్‌ను చూసిన తండ్రి ఏమీ జరగనట్టుగానే మామూలుగానే పలకరించాడు. ఏం సినిమా చూడాలో సలహా ఇచ్చాడు, ఆ తర్వాత అక్కడనుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. విల్ సినిమా చూడకుండానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తన తండ్రి తల్లికి అన్యాయం చేస్తున్నాడన్న విషయం అతన్ని తినేస్తుంది. ఆ విషయం తల్లికి చెప్పి ఆమె మనసుకు కష్టం కలిగించలేడు. ఇంట్లోనూ, తనతోనూ తండ్రి మామూలుగా ప్రవర్తించడం, తండ్రి తల్లికి చేస్తున్న అన్యాయంలో తనను భాగస్వామిని చేయటమే. ఐనా నోరెత్తి తండ్రిని ప్రశ్నించలేడు. తండ్రి పక్కన ఉన్న తెల్లావిడను విల్ ఇంతకు ముందు కలిశాడు – ఆమె హానా; తండ్రిని కుట్రకేసులో జైలులో పెట్టినప్పుడు సాయం చేయడానికి వచ్చిన మానవ హక్కుల కార్యకర్త.

విల్ తండ్రి సన్నీ వాళ్ళ కుటుంబంలో మొదటగా బడికి వెళ్ళినవాడు. అదే స్కూల్లో తరువాత టీచర్‌గా చేరాడు. సాహిత్యం అంటే ప్రాణం. వర్ణవివక్ష వల్ల ఊళ్ళో గ్రంథాలయానికి వెళ్ళలేకపోయినా స్వయంగా పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాడు. షేక్‌స్పియర్‌ని కూలంకషంగా చదివాడు. ఐలాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు – విల్, బేబీ. ఐలా చాలా పద్ధతిగా ఉండే మనిషి. ఎక్కువ మాట్లాడదు. ఉన్నంతలో ఇంటినీ, తన కుటుంబాన్నీ శుభ్రంగా, పద్ధతిగా ఉంచుతుంది. సన్నీకి ఐలా అంటే ప్రేమ; కూతురు బేబీ అంటే ప్రాణం. కొడుకు విల్ తెలివితేటలంటే మురిపెం; కొడుకు రచయిత అవుతాడని అందరితో చెప్తుంటాడు.

స్కూల్లో పాఠాలు చెప్పుకొనే సన్నీ నెమ్మదిగా నల్లవాళ్ళ విమోచన ఉద్యమాలలో పాలు పంచుకోవడం మొదలుబెట్టాడు. ఆ కాలంలోనే నల్లవారు ‘సమానత్వం’ అన్న నినాదాన్ని వదిలేసి ‘స్వేచ్ఛ’ కోసం పోరాటం మొదలుబెట్టారు. ఉద్యమానికి మద్దతు ఇస్తున్న కారణంగా సన్నీ ఉద్యోగం పోయింది. వేరే ఊళ్ళో చిన్న ఉద్యోగం చేసుకొంటూనే ఉద్యమంలో ఇంకా ఎక్కువగా పాల్గొన్నాడు. మంచి వక్త, మనసా వాచా ఉద్యమానికి అంకితమైనవాడు కావటంతో ఉద్యమంలో ఎదగటం మొదలుబెట్టాడు. సన్నీ కుటుంబం అప్పటివరకూ ఉంటున్న చిన్నవూరు విడిచి, రాజధాని జోహాన్నెస్‌బర్గ్ వెళ్ళాలని ఉద్యమ కమిటీ నిర్ణయించింది. తెల్లవాళ్ళు ఉండే ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకొని, నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా అక్కడ ఉండి చట్టధిక్కారం చెయ్యాలని ఆదేశం. సన్నీకి ఎదురు చెప్పకుండా ఐలా పిల్లలతో పాటు అనుసరించింది.

ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, వివిధ సంఘాలమధ్య ఐక్యత కుదర్చాలని ప్రయత్నిస్తూ యపార్ట్‌హీడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సన్నీని ప్రభుత్వం కుట్రకేసులో జైలులో పెట్టింది. జైల్లో అతని బాగోగులు చూడడానికి వచ్చిన మానవ హక్కుల కార్యకర్త హానాతో అతనికి పరిచయమయ్యింది. ఆ తర్వాత వారిద్దరిమధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు సాగాయి. వారి మధ్య పెరిగిన మానసిక సాన్నిహిత్యం అతను జైలునుంచి బయటకు వచ్చాక శారీరక సంబంధంగా కూడా మారింది. హానా ఇంట్లో ఆమెను అతను రోజూ కలుస్తున్నాడు. ఇంట్లో ఐలాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు; అలాగే పార్టీలో సహచరులకు కూడా. చాలాకాలం ఈ విషయం రహస్యంగానే ఉంచినా, అప్పుడప్పుడూ హానాతో కలసి బయటకు వెళ్ళటం మొదలుబెట్టాడు. అలా ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడే విల్ కంటబడ్డాడు.

సన్నీ కూతురు బేబీ టీనేజ్‌కి వచ్చేసరికి, షోకుగా డ్రస్ చేసుకోవడం, మగపిల్లలతో తిరగడం వంటివి ఎక్కువయ్యాయి. మాదకద్రవ్యాల వాడకమూ మొదలయ్యింది. ఒకరోజు మణికట్లు కోసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఆ రోజున సన్నీ ఊళ్ళో లేడు. హానాతో కలసి వేరే వూరు వారాంతపు విహారయాత్రకి వెళ్ళాడు. విల్‌కు తండ్రి మీద ఉన్న కోపాన్ని ఇది మరింత పెంచింది.

విల్ కాలేజ్‌లో చేరాడు. విమోచన ఉద్యమానికి దూరంగా ఉంటున్నాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకొంటున్నాడు. బాగా చదువుకుంటున్నాడు. సాహిత్యం బదులు కామర్స్‌ని సబ్జెక్టుగా ఎంచుకొన్నాడు.

ఉన్నట్టుండి బేబీ ఇల్లు విడచి మాయమయ్యింది. తర్వాత తెలిసిందేమిటంటే చాలాకాలంగా రహస్యంగా బేబీ తీవ్రవాదులతొ కలసి పనిచేస్తుందని. దేశం బయట నడుస్తున్న తీవ్రవాద శిక్షణ క్యాంపుల్లో పనిచేయటానికి వెళ్ళిపోయింది. అక్కడే ఒక సహచరుణ్ణి పెళ్ళి చేసుకుంది. ఆమె గర్భవతి అయిందని తెలిసిన తర్వాత, ఐలా పాస్పోర్టు సంపాదించుకొని, దేశం బయటకు ప్రయాణాలు చేస్తూ బేబీని రహస్యంగా కలుసుకొంటూ ఉంది. ఒకసారి బేబీ మాట విని తన ఒత్తైన, నిడుపాటి జుట్టును పొట్టిగా కత్తిరించుకోవటం విల్‌కి నచ్చలేదు. తన తల్లి ఎప్పటిలా లేకపోవడం అతనికి బాగాలేదు.

ఒక రోజు సన్నీ ఇంట్లో లేని సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి ఐలాను అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఇంటిని సోదా చేసినప్పుడు, పోలీసులకు గరాజ్‌లో పాత సామానులమధ్య కొన్ని బాంబులు దొరికాయి. దేశం బయటా, జొహాన్నెస్‌బర్గ్‌లలో ఉన్న తీవ్రవాదుల మధ్య కొరియర్‌గా పని చేస్తుందని ఐలాపై అభియోగం. ఈ విషయం విన్న తండ్రీ కొడుకులు దిగ్భ్రాంతులౌతారు. గరాజ్‌లో బాంబులే కాక ఇతర మారణాయుధాలు కూడా దొరికాయని ఇంకో అభియోగం. గరాజ్‌ను వెదికినప్పుడు తాను అక్కడే ఉన్నానని, పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని తాను సాక్ష్యం చెపుతానని విల్ అంటే, ఐలా అతను సాక్ష్యం చెప్పటానికి ఒప్పుకోలేదు. భెయిల్‌మీద బయటకు వచ్చిన ఐలా ఉన్నట్లుండి ఒకరోజున మాయం అయింది. బేబీలాగే ఐలా కూడా దేశం విడిచిపోయింది.

యునెస్కో కాందిశీకుల పునరావాస శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా ఉద్యోగం వచ్చిన హానా సౌత్ ఆఫ్రికా విడచి వెళ్ళిపోయింది. సన్నీ ఇంటిని తెల్ల తీవ్రవాదులు తగలపెట్టేశారు. ఇప్పుడు మిగిలిందల్లా సన్నీ, విల్ ఒకరికొకరు. సన్నీ మళ్ళీ జైలుకు వెళ్ళాడు.

“ నా తండ్రి చేసిన పని – నన్ను రచయితగా చేయడం. దీనికి నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలా? నేను ఇంకోటేమీ ఎందుకు కాలేకపోయాను? నేను రచయితను. ఇది నా మొదటి పుస్తకం, నేను దీన్ని ఎప్పటికీ ప్రచురించలేను” అన్న విల్ మాటలతో పుస్తకం ముగుస్తుంది.

నెడీన్ గార్డిమర్ యూదు కుటుంబంలో పుట్టిన శ్వేత సౌత్ ఆఫ్రికా మహిళ. దక్షిణ ఆఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తన గొంతును సాయమిచ్చింది. నిషేధించబడ్డ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో సభ్యురాలు. యపార్ట్‌హీడ్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, దక్షిణాఫ్రికా నిజ పరిస్థితులను చిత్రించే పుస్తకాలు చాలా వ్రాసింది. ఆమె పుస్తకాలు చాలావాటిని సౌత్ఆఫ్రికా ప్రభుత్వం నిషేధించినా, నెడీన్ గార్డిమర్ అంతర్జాతీయంగా చాలా గుర్తింపు పొందింది. బుకర్ ‌ప్రైజుతో సహా అనేక సత్కారాలు పొందింది. 1991లో నోబుల్ సాహిత్య బహుమతి ఆమెని వరించింది. సౌత్ఆఫ్రికా విమోచనం తర్వాత, ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం పోరాటం మొదలుబెట్టింది.

ఈ పుస్తకంలో ప్రధాన విషయం విల్, సన్నీ, హానాల అంతర్గత సంఘర్షణ. కానీ అంతకన్నా ముఖ్యంగా పుస్తకమంతా పరచుకొని కళ్ళకు ఎదురుగా స్పష్టంగా కనిపించేది సౌత్ఆఫ్రికాలో అప్పటి రాజ్యపు వర్ణ వివక్ష, దమన కాండ, అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఉద్యమకారుల దృఢ చిత్తం, ధైర్య సాహసాలు. ఈ రెండు విషయాలనూ రచయిత్రి అద్భుతంగా మేళవించింది.

ఈ పుస్తకంలో కథ రెండు గొంతులలో వినిపిస్తుంది. ఒకటి విల్ గొంతు – అతని ప్రేమ, ద్వేషం, తిరస్కారం, అయోమయం, అస్పష్టత అతని కౌమారప్రాయపు గొంతులోంచి సహజంగా వినిపిస్తాయి. రెండవ, కథతో సంబంధం లేని మూడోపక్షపు (రచయిత) గొంతు – సన్నీ, హానాల కథలను చెబుతుంది. ఈ రెండు గొంతుల మధ్య మనకు పూర్తి కథ తెలుస్తూ ఉంటుంది. ఈ టెక్నిక్‌ని రచయిత్రి చక్కగా ఊపయోగించుకొంది. కథనమూ సూటిగా సాగదు; ముందు వెనుకలకు జరుగుతూ ఉంటుంది. నవల మొదట్లో కొద్దిగా పక్కగా, అప్రధానమైన పాత్రగా అనిపించిన ఐలా పాత్ర అకస్మాత్తుగా మిగతాపాత్రలను ఆశ్చర్యపరచినట్లే మనల్నీ ఆశ్చర్యపరుస్తుంది. రచయిత్రి వచనమే వ్రాస్తున్నా కొన్నిచోట్ల కవిత్వం జాలువారుతుంది. పుస్తకం ఆద్యంతమూ ఉత్కంఠ కలిగిస్తూ చదివిస్తుంది.

ఈ పుస్తకం ప్రారంభం నాకు పద్మరాజుగారి రామరాజ్యానికి రహదారిలో ఒక సంఘటనను గుర్తుకు తెచ్చింది.
చక్కటి మానసిక విశ్లేషణ, చారిత్రక చిత్రణ ఉన్న పుస్తకం.

My Son’s Story
Nadine Gordimer
1990
Picador edition April 2012
256 pages

You Might Also Like

One Comment

  1. varaprasad

    wondefull,manava sambandalu gurinchi inta chakkaga rasinandku ela abinandinchalo ardam kaledu.really great/

Leave a Reply