Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు
**********
by
Velcheru Narayana Rao

“కన్యాశుల్కం” గురజాడ అప్పారావు గారి అద్భుతసృష్టి. తెలుగు సాహిత్య విమర్శా రంగంలో ఈ రచనకి వెచ్చించినన్ని పేజీలు గాని, దీనిపై రాసినంత మంది కవి/విమర్శకులు గాని, దీనిమీద జరిగినంత (ఉ)పరిశోధన గాని, దీనికి కలిగినంత గుర్తింపు గాని ఇంక ఏ తెలుగు రచనకీ దక్కలేదు. కొందర్ని గిరీశం పాత్ర, ఆ పాత్ర భావాలు, భాష గిలిగింతలు పెడితే, మరికొందర్ని నాటకంలో వాడిన అచ్చమైన వాడుకభాష తబ్బిబ్బు చేసింది. కొందర్ని మధురవాణి మత్తులో పడేస్తే ఇంకొందర్ని సౌజన్యారావు పంతులు సేద తీర్చాడు. చివరికి ఒక సినిమాగా కూడ అవతరించి సినిమా విజయవంతం కావటానికి వారు చెయ్యవలసొచ్చిన రూపాంతరాల్తో ఇంకా కలగాపులగమై పోయి మరో అవతారం ఎత్తిందీ నాటకం.

ఇంతచేసీ, అసలీ “కన్యాశుల్కం” నాటకం ఏం చెప్తున్నది? దీన్లో చిత్రితమైన సమాజ స్వరూపం ఎలాటిది? ఈ నాటకం లోని భావాలు ఆ నాటి సమాజానికి, అప్పటి కన్యాశుల్క సమస్యకి పరిమితం కాకుండా ఈనాటి పరిస్థితులకి ఏమైనా వర్తిస్తాయా? లాటి మౌలికమైన ప్రశ్నలకి మాత్రం తార్కికంగా వివరించబడ్డ స్పష్టమైన సమాధానాలు దొరకవు. 1999 లో ప్రచురితమైన “కన్యాశుల్కం: నూరేళ్ల సమాలోచనం” అన్న 933 పేజీల భారీగ్రంథం చూస్తే కన్యాశుల్క నాటకాన్ని అర్థం చేసుకోవటంలో ఎంతమంది పెద్దలు ఎన్ని విధాలుగా ఎంతెంత గందరగోళానికి లోనయ్యారో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఒకవిధంగా అప్పారావు గారే ఈ గందరగోళానికి పునాది వేశారు. ఈ నాటకం తొలిముద్రణ 1897 లో, రెండవ ముద్రణ 1909 లో. ఐతే తొలి ముద్రణకీ రెండో ముద్రణకీ మధ్య పన్నెండేళ్ల కాలంలో సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి, అప్పారావు గారి భావాల్లో కూడ ఎన్నో మార్పులు వచ్చి వుండొచ్చు. కారణాలు ఏవన్నా గానీ, తొలి ముద్రణ నాటకానికీ రెండో ముద్రణ నాటకానికీ ఎంతో మౌలికమైన తేడా వుంది. అసలు ఈ రెండూ రెండు వేరువేరు కథలని అనుకునేంత ఉంది వీటి మధ్య దూరం (ఈ విషయం అప్పారావు గారే రెండవ ముద్రణ ముందుమాటలో ప్రస్తావించారు కూడ). ఐతే ఈ రెండు ముద్రణలకి రాసిన ముందుమాటల్ని కలిపి రెండో ముద్రణలో ప్రచురించారు. ఇది తొలి గందరగోళానికి దారి తీసింది – ఇలా రెండు ముందుమాటల్నీ ఒకచోట ఉంచటంలో ఉద్దేశం రెంటికీ దగ్గరి సంబంధం ఉన్నదని చెప్పటానికా? రెండూ ఒకే ఇతివృత్తం గురించి, ఒకే సమస్య గురించి అని వివరించటానికా? రెండవది మొదటి దానికి పొడిగింపే అన్న భావం తోనా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఐతే తొలి ముద్రణ ప్రతిని చదివేవారు బహుశ ఇప్పుడెవరూ లేరు; ఇప్పుడు “కన్యాశుల్కం” అంటే రెండవ ముద్రణ ప్రతే అని వాడుకై పోయింది. కనుక, రెండవ ముద్రణ కన్యాశుల్కాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి ముద్రణ ముందుమాటకి ఎలాటి స్థానం ఇవ్వాలి? అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. విషయపరంగా మొదటి ముద్రణ ముందుమాట “Social Reform” కి ప్రముఖస్థానం ఇస్తే రెండో ముద్రణ ముందుమాట ప్రధానంగా వాడుకభాష వాడకం గురించి.

ఈ విషయం మీద “నూరేళ్ల సమాలోచనం” లో చోటు చేసుకున్న రచనలు దాదాపుగా అన్నీ “రెండు ముందు మాటలూ సమానంగానే రెండవ ముద్రణ నాటకానికి వర్తిస్తాయని” భావించినట్లు కనిపిస్తాయి. ఒక్క రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) గారు మాత్రం “గురజాడ మనస్తత్వం లోని విపరీత ధోరణులు” అన్న వ్యాసం ఇలా మొదలు పెడతారు – “గురజాడ కన్యాశుల్కం గురించి చాలాకాలంగా నాకొక సందేహం వుంది – ఆ నాటకం ఆయన అలా యెందుకు రాసినాడా అని. గురజాడ ఆడపిల్లలను అమ్మే పద్ధతికి వ్యతిరేకం, బాల్యవివాహాలకి వ్యతిరేకం, వితంతు వివాహాలకి అనుకూలం. కానీ కన్యాశుల్కం లో యే సమస్యకూ సరైన పరిష్కారం లభించలేదు…” అని.

మిగిలిన వాళ్లెవరూ కనీసం ఇలాటి ప్రశ్నలైనా లేవనెత్తలేదు. ఉదాహరణకి టి. యల్. కాంతారావు గారు ఇలా అంటారు – “కన్యాశుల్కము నాటక రచనవల్ల ప్రధానంగా నాటకం ఆశించిన ప్రయోజనాలు రెండు: అందులో మొట్టమొదటిది వ్యవహారిక భాష నాటక రచనకు పనికిరాదన్న వాదాన్ని పూర్వపక్షం చెయ్యటం. రెండవది యుగాల తరబడి అంధవిశ్వాసాల్లోనూ, మూఢనమ్మకాల్లోనూ జీవిస్తున్న సమాజ సమూహంలో నవచైతన్యం ఉద్భవింపచెయ్యటం.” డాక్టర్ కాలువ మల్లయ్య గారు ఇలా అంటారు – “ఆనాటి సమాజంలో వున్న అసంబద్ధతను, రుజాకేంద్రాలను, లోపాలను, వ్యక్తిత్వ రాహిత్యాన్ని, మనిషి బలహీనతలను ఎక్స్‌రే తీసి చూపాడీ నాటకం ద్వారా గురజాడ.” ఇంకా అనేకులు కన్యాశుల్కాన్ని “సంస్కరణ సాహిత్యం”లో భాగంగా చూశారు.

నారాయణ రావు గారి Girls for sale గురజాడ రెండవ ముద్రణ కన్యాశుల్కానికి ఆంగ్లానువాదం. అనువాదంతో పాటు లోతైన పరిశీలనల్ని, ప్రపంచసాహిత్యంలో ఈ రచనకి ఉన్న ప్రత్యేకస్థానాన్ని తార్కికంగా, విపులంగా వివరిస్తూ ఒక పెద్ద వ్యాసం కూడ జతకూర్చారు. ఈ పుస్తకం 2007 లో వచ్చినప్పుడు ఇండియాలోని కొందరు సమీక్షకులు అనువాదంలో లోపాల్ని వెదకటంలో చాలా విశేషమైన కృషి చేశారు. కొందరు Girls for sale అనేది “కన్యాశుల్కం” అన్న పదానికి సరైన అనువాదం కాదన్నారు, మరికొందరు మూలంలో వున్న వాడుకభాష మెరుపులు అనువాదంలో రాలేదన్నారు. ఈ రంధ్రాన్వేషణలో తిరిగి తిరిగి అలిసిపోయి వారెవరూ ధ్యాసగా వ్యాసం చదివే ఓపిక చేసుకోలేకపోయారు, నాకు తెలిసినంతవరకు.

ఇక్కడ ఒక విషయం అప్రస్తుతం కాదు – నారాయణ రావు గారు ఈ అనువాదం చేసింది అంతర్జాతీయ పాఠకుల కోసం, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, పరిశోధకుల కోసం. కొన్ని అమెరికన్ యూనివర్సిటీల్లో ఇదో పాఠ్యగ్రంథం. వాళ్లకి ఏ “భాష”లో చెబితే మూలంలోని వాడుకభాష వాసనల్ని కొంతవరకైనా అందజెయ్యవచ్చునో ఆ భాషలో చెప్పారు. బహిరంగంగా దొరుకుతున్న సమాచారం ప్రకారం ఏ పాఠకులకి ఈ అనువాదం ఉద్దేశించబడిందో ఆ పాఠకులకి ఇది బాగా నచ్చింది (ఉదాహరణకి ఈబ్లాగు వ్యాసం చూడండి). నిజానికి ఇండియాలోని సమీక్షకుల మెప్పు పొందలేదంటేనే తన ప్రయత్నంలో ఆయన కృతకృత్యుడయాడని అర్థం. వాళ్లు మెచ్చుకుని వుంటే బహుశ ఆయన ఉద్దేశించిన పాఠకులకి ఇది నచ్చి వుండేది కాదు. ఏమైనా, అనువాదం విషయం ఎవరికి వారే చదివి చూసుకోవలసింది కనక ఇది పాఠకులకే వదిలేద్దాం.

నామట్టుకు నాకు ఈ పుస్తకానికి ఆయువుపట్టు అనువాదం తర్వాత వున్న సుదీర్ఘమైన విశ్లేషణా వ్యాసం. అప్పారావు గారి రచనల్ని లోతుగా విశ్లేషించటంలో ఎప్పటినుంచో ఎంతో అనుభవం వున్న నారాయణ రావు గారు (ఇందుకు ఒక మంచి ఉదాహరణ కోసం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” లో అప్పారావు గారి “ముత్యాల సరములు” కవితా విశ్లేషణ చూడండి) కన్యాశుల్కంలో ఇంతకాలం వెలుగు చూడని ఎన్నో విశేషాల్ని గుర్తించి వివరించారీ వ్యాసంలో. అప్పారావు గారి ఈ నాటకచిత్రణలో ముఖ్యంగా రెండు పార్శ్వాల్ని ఇక్కడ స్పృశిస్తాను. ఒకటి అప్పారావు గారి దృష్టిలో “ఆధునికత”; రెండవది అప్పటి వలస సంస్కృతిపై అప్పారావు గారి విమర్శ.

అప్పట్లో చాలామంది మేధావులు, ముఖ్యంగా ఠాగూర్, బంకిం వంటి బెంగాలీ రచయితలు, రాజా రాం మోహన్ రాయ్ వంటి సంఘసంస్కర్తల దృష్టిలో “ఆధునికత” అంటే పాశ్చాత్యభావజాల ప్రభావంతో భారతీయుల ఆలోచనల్లో, ప్రవర్తనలో కలుగుతున్న పరివర్తన. ఆనాటి కుళ్లిపోయిన సమాజాన్ని ప్రక్షాళన చేసే మార్గం. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం. కందుకూరి వీరేశలింగం గారి వంటి ఎంతోమంది తెలుగువారు కూడ ఈ బెంగాలీ మేధావుల ప్రభావంతో అవే భావాల్ని తెలుగు ప్రాంతంలో ప్రచారం చెయ్యటానికి విశేషకృషి చేశారు. దీన్ని మనం “వలససంస్కృతి ఆధునికత” అందాం.

నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం అప్పారావు గారి దృష్టి ఇందుకు భిన్నమైంది. ఆయన ఈ నాటకంలో చిత్రించిన సమాజం కుళ్లిపోయింది కాదు, చక్కగా హాయిగా వున్నది. అంతేకాదు, “ఆధునిక”మైంది కూడ. ఈ ఆధునికత వలససంస్కృతి వల్ల కలిగిన ఆధునికత కాదు, అంతకుముందు ఎప్పటినుంచో వస్తూ వున్న ఆధునికత. ఇందులో మనుషులు సంప్రదాయాల భారంతో కుంగిపోతున్నవారు కారు, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సంప్రదాయాల్ని అవసరమైన చోట్ల సవరించుకుని, తమకు ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఆచరిస్తున్న వాళ్లు. దీన్ని ” పరిణామ ఆధునికత” అందాం.

అప్పారావు గారు చిత్రించిన “కన్యాశుల్కం”లో ఈ రెండురకాల ఆధునికతల మధ్య సంఘర్షణని చూస్తాం. వలససంస్కృతి ఆధునికతకి ప్రతినిథిగా సౌజన్యారావు పంతులు నిలబడితే, పరిణామ ఆధునికతని మధురవాణిలో స్పష్టంగా చూస్తాం. అవసరాన్ని బట్టి అటూ ఇటూ దూకే గోడమీది పిల్లిగా గిరీశం నిలబడతాడు. దాదాపుగా మిగిలిన అన్ని పాత్రలు కూడ ఆ సంధికాలానికి అనుగుణంగా పరిణమిస్తున్నవే, జీవనప్రయాణం చేస్తున్నవే.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నాటకం మొత్తంలో అతిబలహీనమైన వ్యక్తి సౌజన్యారావు పంతులు కావటం. అతనికి ఏంకావాలో అతనికి తెలీదు. “యాంటి-నాచ్”, “విధవా వివాహం” లాటి అప్పటి పెద్ద మాటల్ని మాట్టాడటమే కాని వాటిని ఎలా ఆచరించాలో, ఆచరిస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో అతనికి అవగాహన లేదు. కాకపోతే లేని పెద్దరికం మీద వేసుకుని అందరికీ ఉచితసలహాలు ఇవ్వటానికి మాత్రం అతనికేం అభ్యంతరం లేదు. భగవద్గీత శ్లోకాన్ని తప్పుల్తో ఉదహరించటానికీ అతనికేమీ ఇబ్బంది కాదు. బాలవితంతు సమస్యకి అతని పరిష్కారం వాళ్లని వితంతుసమాజానికి పంపటం. వేశ్యని తాకితే తన చేతిని ఖండించుకుంటానని బీరాలు పలికేవాడు తీరా తన సంఘసంస్కరణోద్యమానికి చిన్న పరీక్ష వచ్చేసరికి నీరుగారిపోయి మధురవాణిని ముద్దుపెట్టుకోవటానికి సిద్ధమైపోతాడు. ఈ పాత్ర ద్వారా కుహనా సంస్కర్తల్ని, వారి అవగాహనా రాహిత్యాన్ని చిత్రించారు అప్పారావు గారు, నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం.

పైన ఉదహరించిన భాగంలో రా.రా. గారు అన్నట్టు ఇది పైకి సంఘసంస్కరణ రచనగా అనిపించినా దీన్లో నిజంగా సంస్కరణ లేదు. కారణం, అప్పారావు గారి దృష్టిలో ఈ నాటకపాత్రలు వాటి సమస్యల్ని అవి పరిష్కరించుకోగలవ్. వాటిని సంస్కరించటానికి ఏ సౌజన్యారావులూ అక్కర్లేదు.

ఐతే వలస సంస్కృతి సమాజాన్ని ఎలా కలుషితం చేస్తున్నదో చెప్పటానికి మాత్రం అప్పారావు గారు ఎక్కడా వెనకాడలేదు. రామప్పంతులు ఆ వలససంస్కృతికి పుట్టిన విషఫలాలకి తార్కాణం. తన పబ్బం గడుపుకోవటానికి ఇంక ఎందరి జీవితాలు నాశనం ఐనా అతనికి ఎలాటి ఇబ్బందీ కలగదు. అలాగే పోలీసులు ఎక్కడబడితే అక్కడ ప్రత్యక్షమౌతూ వుంటారు. ఎలాటి ఆధారాలూ లేకుండానే లుబ్ధావధాని మీద హత్యాభియోగం మోపటానికి ఏమాత్రం వెనకాడరు. కోర్టుల పరిస్థితి కూడ ఇలాటిదే. జనాన్నుంచి డబ్బు గుంజుకోవటం తప్ప ఈ సంస్థలేవీ జనానికి న్యాయం చెయ్యటానికి ఉన్నట్టు కనిపించవు.

వలససంస్కృతి మీద ఇలాటి ఎదురుదాడి చేసిన రచయితలు ఆ కాలంలో అప్పారావు గారు తప్ప మరొకరు లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచసాహిత్యంలో ఎక్కడా ఇలా జరగలేదని నారాయణ రావు గారి సిద్ధాంతం.

ఇలా ఎన్నో కొత్తకోణాల్ని ఆవిష్కరించి, నారాయణ రావు గారీ గ్రంథంలో కన్యాశుల్కం మీద ఆసక్తికరమైన, ఆలోచనాకారకమైన వివేచనని చేశారు.

పాఠకులకి ఒక సందేహం కలగొచ్చు – నాకూ ఇది కలిగింది: ఇంతకుముందు కన్యాశుల్కం మీద ఎంతో శ్రమ చేసిన పెద్దలు ఇలా ఎందుకు ఆలోచించలేదు? నాకు తోచిన సమాధానం – వారు “వలససంస్కృతి ఆధునికత” మార్గాన్ని బుద్ధిగా ఒప్పేసుకున్నవాళ్లు. కన్యాశుల్కం సంస్కరణ రచన అని నమ్మినవాళ్లు. అలాటి సంస్కరణ కోసం “కన్యాశుల్కం”లో వెదికిన వాళ్లు. కనుక వారికి అదే కనిపించింది. వారి దృష్టిలో సౌజన్యారావు పాత్ర ద్వారా మధురవాణి సంస్కరించబడింది. కనీసం ఒక సాంఘికసమస్యకి భగవద్గీతలో పరిష్కారం దొరికింది.

నారాయణ రావు గారి “Girls for sale” ని Indiana University Press వారు 2007 లో ప్రచురించారు. amazon.com లో చాలా కాపీలు దొరుకుతున్నాయి (భారతదేశంలో కొనుగోలుకు ఫ్లిప్కార్ట్ లంకె ఇక్కడ). “కన్యాశుల్కం” గురించి ఒక కొత్త అవగాహనకి, ఒక ప్రత్యేకమైన దృష్టికి దారి వేసే ఈ గ్రంథం అవశ్యపఠనీయం.

You Might Also Like

2 Comments

  1. SURYANARAYANA PUDIPEDDI

    Sir,

    Appaarao pantulu written this drama only to entertain mahaa rani with the comedy. Here he imitated mannerisms of dravida brahmins of krishna rayapurapu agaraharam. After it popularised in the public, criticism on drama came out.

  2. Rajesh Devabhaktuni

    రామారావు గారు, మీ విశ్లేషణ బాగుంది.

Leave a Reply