Stupid Guy Goes to India – Yukichi Yamamatsu

కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించి చదివి, గ్రాఫిక్ నవలల పై నాకున్న ఆసక్తి వల్ల తప్పకుండా ఈ పుస్తకం చదవాలి అనుకున్నాను. మొన్నామధ్య సెలవులో ఉన్నప్పుడు బెంగళూరులో ఒక పుస్తకాల షాపులో తిరుగుతున్నప్పుడు అనుకోకుండా తారసపడడంతో కొని వెంటనే చదవడం మొదలుపెట్టాను. ఆపకుండా చివరికంటా (అదే, మామూలు పుస్తకాలు చదివే పద్ధతిలో…మొదటిదాకా!) చదివాకే పుస్తకం మూసాను. అలాగ నన్ను ఆపకుండా చదివించింది కనుక, చాలా రోజుల తరువాత, ఒక పుస్తకం గురించి పరిచయం రాస్తున్నాను.

కథ: జపాన్ నుంచి వచ్చే కామిక్స్ ని మాంగా అంటారు. అన్ని వయసుల వారికీ తగ్గ మాంగా కామిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పుస్తకం రచయిత యమమత్సు ఒక మాంగా ఆర్టిస్టు. ౨౦౦౪లొ యాభై ఆరేళ్ళ వయసులో, చేసేందుకు పని లేక, బాగా ఆలోచించిన మీదట మాంగా కామిక్స్ ఇతర దేశాల భాషల్లో అనువాదం చేసి అమ్మితే బోలెడు పేరు,డబ్బూ సంపాదించవచ్చు అని నిశ్చయించుకుంటాడు. ఇంకాస్త ఆలోచించి, భారత దేశం ఇందుకు అనువైన ప్రదేశం అని నిర్ణయించి ప్రయాణం అవుతాడు. విషయం ఏమిటంటే – ఈయనకి ఇంగ్లీషు అంతంత మాత్రం. హిందీ అసలే రాదు. మన దేశం గురించి ఏమీ తెలీదు కూడా. అతనెప్పుడూ జపాన్ దాటి బయటకి వెళ్ళిన వాడూ కాదు. అయినా కూడా తాను మాంగా ని భారతదేశంలో పరిచయం చేసి తీరతాను అని అతని నమ్మకం. ఇక ఈ లెక్కలో ఇతను ఇండియా వచ్చి ఢిల్లీలో ఎలా బ్రతికాడు? ఏం చేసాడు? ఇంతకీ వచ్చిన పని అయ్యిందా? ఇండియా/ఇండియన్స్ గురించి అతను ఏమనుకున్నాడు? … ఈ అనుభవాలను అతను బొమ్మలతోనూ, బొమ్మలతో నడిచే కథతోనూ చిత్రీకరించాడు. అదే ఈ పుస్తకం కథ.

ఆద్యంతం బాగా నవ్వుకున్నాను నేను. అక్కడక్కడా “ఎందుకు మన దేశంలో ఇలా?” అనుకున్నా కూడా. అతనికి నిజానికి భారతదేశం మీదగానీ, భారతీయుల మీద గానీ చివరి దాకా అంత సదభిప్రాయం కలిగే సంఘటనలేవీ జరిగినట్లు లేవు. కనుక, అతని అభిప్రాయాలు ఆట్టే గొప్పగా లేవు మనపై. మీరు రక్షకుడులో నాగార్జునైతే మీ శరీరంలో దావానలం ప్రవహిస్తుందేమో కానీ, ఒకసారి అది అవతలి మనిషి కోణం మాత్రమే అని అర్థం అయ్యాక ఈ అనుభవాలను ఆస్వాదించగలరు, ఆలొచించ గలరు కూడా! మనం బాగా అలవాటు పడిపోయిన పద్ధతులు కొన్ని కొత్తవారికి ఎంత చిరాకు పుట్టిస్తాయో గమనిస్తే ఆసక్తికరంగా అనిపిస్తుంది (ఉదా: చెప్పా పెట్టకుండా ఇంట్లోకొచ్చేసే పక్కింటి వాళ్ళు వంటివి).

పుస్తకంలో సొగసు ఏమిటంటే: ఎక్కడా అతను నేను మేధావిని, నేను చెప్పినది ఆబ్జెక్టివ్…ఈ తరహా ఫోజు కొట్టడు. తన ధోరణిలో తాను నిజాయితీ గా తనకి ఏమనిపించిందో మొహమాటం లేకుండా చెప్పుకు పోతూ ఉంటాడు. తాను “stupid guy” అని తనకు తానే ప్రకటించుకున్నాడు కదా పైగా! ఒక్కోసారి నిజంగానే స్టుపిడ్ గయ్ అనే అనిపిస్తాడు లెండి ఈ పుస్తకంలో! ఈ అమాయకత్వంలో అతను చెప్పిన మాటలు కూడా కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. నా విదేశీ సహోద్యోగులు తరుచుగా హిందూ సంప్రదాయాల గురించి, ప్రత్యేకం వివాహాలు-వాటి తదనంతర కట్టుబొట్ల గురించీ నాతో మాట్లాడుతున్నప్పుడు “ఓహో, ఇలా కూడా అనుకోవచ్చా?”! అనిపిస్తూ ఉంటుంది. “ఇండియన్స్ కి వెడ్డింగ్ రింగ్స్ ఉండవా?” అంటే… ఒక కొలీగ్ వెంటనే “వాళ్లకి వెరైటీగా కాళ్ళకి రింగులు ఉంటాయి” (మెట్టెలు) అన్నది. అలా ఉంటాయి రచయిత చేసిన కొన్ని వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలో.

పుస్తకంలో మరొక విశేషం ఏమిటి అంటే…పుస్తకాన్ని వెనక నుంచి ముందుకు చదవాలి. మనం ఎడమ నుంచి కుడికి చదువుతామా, ఈ పుస్తకం కుడి నుంచి ఎడమకి చదవాలి. పుస్తకం ముందు వైపు అట్టపై “Hey, turn this over! this is the back page!” అనీ, కింద బార్ కోడ్, ధర వగైరాలూ ముద్రించి ఉంటాయి. 🙂

బొమ్మలు కొన్ని చోట్ల భలే అమరాయి. బొమ్మ చూడగానే ఆ పాత్ర స్వభావం గురించి రచయిత చేసిన వర్ణనలకి తగ్గట్లు ఉంది అనిపిస్తుంది (సురేందర్ బొమ్మ నాకలా అనిపించిన వాటిలో ఒకటి). ఇక, బొమ్మల క్వాలిటీ గురించి వ్యాఖ్యానించేంత వివరం నాకు తెలీదు కానీ, నా మాట్టుకు నాకు, ఆ బొమ్మలు లేకపోతే ఈ పుస్తకం అసంపూర్ణం అనిపించింది. ముఖ్యంగా యమమత్సు ఆవేశంతో చిందులు తొక్కడం, షాక్లో దిక్కులు పిక్కటిల్లేలా అరవడం వంటివి బొమ్మల్లేకుంటే ఇంతకంటే బాగా నేను ఊహించుకోగలిగేదాన్ని అనుకోవడంలేదు.

ఇదొక గొప్ప కళా ఖండం అని గానీ, రచయిత ఎంతో విస్తృత అనుభవంతో రాసాడు అని గానీ మనం అనుకోనక్కర్లేదు కానీ, భారతదేశానికి కొత్తగా వచ్చిన ఒక విదేశీయుడు మన జీవన విధానం గురించి ఏమనుకుంటాడు? అన్నది ఒక నడి వయసు “స్టుపిడ్” జపనీయుడి కళ్ళతో ఈ పుస్తకంలో చూడవచ్చు. చివరగా నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఈ పుస్తకం ఆసక్తి కరంగా ఉంటుందనీ, ఆట్టే దేశాన్ని డిఫెండ్ చేయాలి మనం అని ప్రతి పేజీలోనూ ఆవేశపడికుండా చదివితే, మనసారా నవ్వుకోవచ్చు కూడా అనీనూ!

******
Stupid Guy Goes to India – Yukichi Yamamatsu
Translated by: Kumar Sivasubramanian
Published by Blaft Publications Pvt Ltd, 2011
ISBN: 978-93-81636-39-9
Rs 395/-
Flipkart link here.

You Might Also Like

3 Comments

  1. సౌమ్య

    ఈ పుస్తకానికి సీక్వెల్ వచ్చిందట. దాని గురించి (పుస్తకం పేరు: Stupid Guy Goes Back to India) జై అర్జున్ సింగ్ బ్లాగులో ఇక్కడ:
    http://jaiarjun.blogspot.com/2014/05/stupid-guy-goes-back-to-india-bewakoof.html

  2. 2012 – నా పుస్తక పఠనం | పుస్తకం

    […] ఇతర బొమ్మల పుస్తకాలు * Stupid Guy Goes to India – Yukichi Yamamatsu * Amul’s India: Based on 50 years of Amul’s advertising * Cecil and […]

  3. Madhu

    Good review. I would like buy and read at the earliest.

Leave a Reply to 2012 – నా పుస్తక పఠనం | పుస్తకం Cancel