కవిత్వం:కొన్ని ఆలోచనలు

వ్యాసం వ్రాసిన వారు: ఇంద్రాణి పాలపర్తి
***********
పదాలు అటూ ఇటూ పరుగులు తీస్తాయి
అర్ధాలు ఎటెటో దిక్కులు చూస్తాయి
ఆలోచనలు ముందుకి వెనక్కి వూగిసలాడతాయి
చివరికి,శూన్యంలోంచి పువ్వులు రాలుతాయి

అప్పుడేం జరుగుతుంది?
ఒక కవిత పుడుతుంది.
పుట్టగానే అది పరిమళిస్తుంది.

అంత మంచి కవిత,కాల ప్రవాహానికి ఎదురీది కలకాలం గుర్తుండిపోయే కవిత రాయాలంటే కవికి ఎటువంటి మానసిక స్థితి ఉండాలి? ఎలాంటి శిక్షణ కావాలి? ఇవన్నీ కవిత్వాన్ని చదువుతూ లేక రాస్తూ ఉన్నవారికి కలగాల్సిన అనుమానాలే,సందేహం లేదు.

మొదటిది: మానసిక స్థితి

సమస్యకు స్పందనను యధాతధంగా రాసిపారేయడం కవిత్వం కాదు.నిజానికి సమస్యకు కావాలసింది పరిష్కారం,కవిత్వం కాదు. సమస్య గురించి కవి తాను ఆవేదన చెంది పాఠకుడిని చైతన్య పరచదల్చుకుంటే ఆ విషయానికి సరి అయిన కవిత్వ రూపం ఇచ్చి మనసుకు హత్తుకునేలా సున్నితంగా చెప్పగలగాలి కానీ తిట్లు, విద్వేషాలు,శాపనార్థాలూ కవిత్వం కాదు.

కేవలం ఒక వర్గానికో కులానికో మతానికో తనని తాను పరిమితం చేసుకుని ఆ వర్గం,కులం లేదా మతానికి సంబంధించిన సమస్యలపైనే కవిత్వం అల్లే సంకుచిత మానవుడు కవి ఎలా అవుతాడు? విశ్వ నరుడే కవి కాగలడు.

ఆవేశాల్లోంచీ ఆక్రోశాల్లోంచీ పుట్టేది ఒక స్థాయి కవిత్వం మాత్రమే.కేవలం దిగులుని,దుఖాన్ని “గ్లోరిఫై” చేయడం కవిత్వం కాదు.కవిత్వం పాఠకుడి మానసిక స్థాయిని పెంచాలి.కవిత్వం చదిన తరువాత మనిషి మరి కొంచెం ఉన్నతుడు కావాలి.

అన్ని బాహ్య ప్రభావాలనూ, ఆలోచనలనూ వదిలి పెట్టాలి కవి. అన్ని సామాజిక విలువల వలువలను మురికి గుడ్డలను వదిలినట్టు వదిలేయాలి కవి. ఏకాంతంలో తన్ను తాను దర్శించుకోవాలి. ఈ విశాల ప్రకృతిలో, అప్పుడే పుట్టిన పాపాయిలా స్వచ్చంగా స్పందిస్తూ ఆ అనందంలో మమేకమవ్వాలి. అప్పుడు అల్లాంటి మానసిక స్థితిలోంచి పుట్టేది గొప్ప కవిత.

రెండవది: పదాల ఎంపిక

ఎల్లాంటి పదాలను వాడాలి? సరళమైన పదాలనూ,వినసొంపైన తేట తెలుగు పదాలనూ వాడాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం పెరుతుందో కవికి తెలియాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం చెడుతుందో కూడా తెలిసిపోవాలి.పదాలను పొదుపుగా వాడడంలో నైపుణ్యం సాధించాలి. ఇంగ్లీషు,ఉర్దూ,హిందీల్లాంటి అన్య భాషల పదాలను తెలుగు పదాలతో కలిపి కాలకూట కషాయాలను కాచి పాఠకుల చేత బలవంతంగా తాగించడం భావ్యం కాదు.

తెలుగు కవిత్వం తెలుగులోనే ఉండడం సమంజసం.
ఢమఢమలాడే పదాలను తెచ్చిపోస్తే అది ఘనమైన కవిత్వం అయిపోదు.
పాఠకుడిలో సున్నితమైన భావాలను మేలుకొలిపేదే కవిత్వం.

మూడవది: కల్పనాశక్తి

కవికి ముఖ్యంగా కావలసింది భావనా బలం,కల్పనా శక్తి. అల్లాగని ఊహలోంచి ఊహ,ఊహలోంచి ఊహలోకి వెళ్ళిపోతూ పాఠకులను గందరగోళానికి గురిచేయకూడదు. సరళంగా చెప్పగలగాలి.కవితకి ఒక తుది మొదలూ ఉండాలి.ఎక్కడించి ఎక్కడికో వెళ్ళిపోయి పాఠకుడిని గజిబిజి గల్లీల్లో వదిలేసి రాకూడదు. పదచిత్రాలే కవితకు ప్రాణం.

నాలుగవది: రూపం

వచన కవిత్వం అన్నారు కదా అని తుది మొదలూ లేకుండా వాక్యాలు వాక్యాలు రాసిపారెయ్యడం పరిపాటిగా మారింది తెలుగు దేశంలో.చందోబందోబస్తులు తెంచుకుందంటే దానర్ధం ఒక రూపం,నిర్మాణం,లయ లేకపోవడం ఎంత మాత్రం కాదు. పక్క పక్కన పేర్చితే వ్యాసమయ్యే వాక్యాల సముహాన్ని,ఒకదాని కింద ఒకటి రాసి దాన్ని కవిత్వమనడం మహాపరాధం. చక్కని రూపం,లయ మంచి కవితకు కావాల్సిన ముఖ్యమైన దినుసులు.

అయిదవది:వస్తువు

తీసుకున్న వస్తువు కవి మనసుకు బాగా దగ్గరదై ఉండాలి.ఎంత చిన్న విషయమైనా కవిత్వం కావచ్చు.నిత్య జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటననుంచైనా కవిత్వం పుట్టవచ్చు.నిర్జీవ వస్తువులు కూడా కవితావస్తువులు కావచ్చు.

చివరగా,కవి ఏకాంతంలో తన కవిత్వాన్ని మెరుగులు దిద్దుకోవడం తాను పూర్తిగా సంతృప్తి చెందాకే పాఠకుల ముందు ఉంచడం చేస్తే తెలుగు పాఠకులకి పుంఖాలు పుంఖాలుగా వెలువడున్న కవితాసంకలనాల సముద్రాల్లో కొట్టుమిట్టాడే బాధ తప్పుతుంది.

పాలపర్తి ఇంద్రాణి.

You Might Also Like

13 Comments

  1. R. Karthika Raju

    కవితా రచనలో కవి పాటించవలసిన నియమాలను వివరిస్తూ చాలా మంచి వ్యాసం అందించారు. వ్యాసకర్తకు మా ధన్యవాదాలు!!

  2. Vanaja Tatineni

    విలువైన విషయాలు చక్కగా అందించారు . ధన్యవాదములు .

  3. వాహెద్

    అన్య భాషల పదాలను తెలుగు పదాలతో కలిపి కాలకూట కషాయాలను కాచి పాఠకుల చేత బలవంతంగా తాగించడం భావ్యం కాదు….ఈ సూచన చేరవలసిన వారికి చేరాలని ఆశిస్తున్నాను. తెలుగు భాషలో మమేకమై పోయిన అన్యభాషా పదాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. కాని పనిగట్టుకుని అన్యభాషా పదాలను ప్రయోగించడం నేడు కనబడుతోంది. ఈ ధోరణి నుంచి బయటపడతారని ఆశిద్దాం. నిర్దిష్టతా వాదాలు కవిత్వంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరి వాదానికి కట్టుబడి వారు కవిత్వం రాయడం, రాయాలనుకోవడం ఎక్కువైంది. ఒక నిర్దిష్టమైన సందేశాన్నివ్వాలనుకుని తీర్మానించుకున్నప్పుడు కవిత్వంలో ప్రాణం పోతుంది. కవిత్వం ముఖ్యంగా ఆవేదన ప్రధానమైనది. మాస్టారు సదాశివ గారు దీనినే దర్దీ అనేవారు. పనిగట్టుకుని రాసేది కవిత కాదు. నిర్దిష్టవాదానికి నిబద్దులై, కవితలో సందేశాలను చొప్పించి, అన్యభాషా పదాలను అనవసరంగా ఇరికించడం ద్వారా కొత్త పదచిత్రాలు సాధించాలని పనిగట్టుకుని ప్రయత్నించడం కనబడుతోంది. పనిగట్టుకుని రాసేది కవిత్వం కాదు. మీరు రాసిన మాటలు కొందరికి చురకల్లా తాకినా..నిజాలు నిప్పులాంటివి కదా..చాలా బాగా రాశారు.

  4. the tree

    మీ సూచనలు బావున్నాయ్,.ఒక పరిమితి వరకు,…ధన్యవాదాలండి,.

  5. kapilaram

    మంచి వ్యాసం అందించారు.

  6. Kranthi Srinivasarao

    Indrani Garu. Namaste

    Bavunnayu. Mi abhiprayalu dhanyavadalu

  7. rajeshwari.n

    ఇంద్రాణి గారి వ్యాసం చాలా బాగుంది. క్షమించాలి .మీరు ఆంధ్ర ప్రభలో పనిజేసిన ఇంద్రాణి గారేనా ? దయచేసి తెలుప గలరు

    1. indrani Palaparthy

      Thank you Rajeshwari garu.

      No.I never worked in Andhra Prabha or any magazine/news paper.

      Indrani Palaparthy.

  8. Makineedi Surya Bhaskar

    kavithvam gurinchi arogyakaramaina alochanalu. bagunnai.

  9. megha syama nath.m

    chelli chala baga rasavamma. keep writing.

  10. mohanramprasad

    Good work about writting poetry..

  11. తాడిగడప శ్యామలరావు

    పాలపర్తి ఇంద్రాణిగారి వ్యాసం బాగుంది. కవిని, కవిత్వాన్నీ నిర్వచించటం కష్టమైన పని. కాని ఇంద్రాణిగారి సూచనలు బాగున్నాయి. అభ్యుదయకవిలోకానికి ఉపయోగిస్తాయి.
    వారు నా శ్యామలీయం బ్లాగుని (http://syamaliyam.blogspot.in/) పరిశీలించి యేమంటారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

    1. indrani Palaparthy

      శ్యామల రావు గారు,

      నమస్కారం.మీ బ్లాగు చూసాను.చాలా బాగున్నది.

      మీవంటి తెలుగును ప్రేమించే పెద్దలు ఉన్నందునే మన నేల మీద తెలుగు ఇంకా బతికి ఉన్నది.

      మీ స్పందన వ్రాసినందుకు ధన్యవాదాలు.

      పాలపర్తి ఇంద్రాణి.

Leave a Reply