మావోయిస్టుల పోరాటానికీ, ఆదివాసీల సమస్యలకు అద్దం పట్టే పుస్తకం

వ్యాసం వ్రాసిన వారు: దివ్యప్రతిమ కొల్లి
*******
మావోయిస్టుల పోరాటానికీ, ఆదివాసీల సమస్యలకు అద్దం పట్టే పుస్తకం
Broken Republic – by Arundhati Roy

ఆ మధ్య హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అరుంధతి రాయ్ వ్రాసిన Broken Republic పుస్తకం చూసాను. పేజీలు తిప్పుతూండగా ముందుగా ఆదివాసీల నృత్యాలు, మైనింగ్ కొంపనీలు, కాలుష్యం వల్ల ఎండిన ఆకుల ఫొటోలు వాటి కింద ఆ ఫొటోల గురించి వివరణ కనిపించాయి. ఆ ఫొటోలు చుసిన తర్వాత ఆ పుస్తకం కొనకుండా ఎలా ఉండగలను? మనం చూడని, చూడలేని, దూరంగా వచ్చేసి మర్చిపొయిన ప్రపంచాన్ని మళ్ళీ చూపించాయి. ఈ పుస్తకంలో మూడు వ్యాసాలున్నాయి. ఈ మూడూ ఆదివాసీల జీవితాలు, మావోయిస్టులు, వారి గురించి మీడియా వార్తల మీద వ్రాసినవే. అసలీ ఆదివాసీల గొడవలు, మావోయిస్టుల యుద్ధాలను కార్పొరేట్ మైనింగ్ సంస్థలకు లబ్ది చేకూర్చడానికే మొదలు పెట్టిందని రచయిత ఖచ్చితంగా చెప్పారు.

దక్షిణ ఒరిస్సాలో అమూల్యమైన బాక్సైటు నిల్వలు ఉన్నాయి. వాటిని కాలుష్యం పెంచకుండా అల్యూమినియంగా మార్చలేము. కాలుష్యం వల్ల ఆ కొండలలో ఉంటున్న ఆదివాసీల జీవితాలు పాడవుతున్నాయి. వారిని పట్టించుకోకుండా మన ప్రభుత్వము మైనింగ్ కంపెనీలను ప్రొత్సహిస్తోందని రచయిత వివరించారు. “కాలుష్యం ఎక్కువైతే ఊరు వదిలి వెళ్ళచ్చు కదా!” అని మనకు అనిపించడం సహజం. ఈ అనుమానం తీర్చుకోడానికీ పుస్తకం చదవాల్సిందే. ఆ అదివాసీలను కమ్యూనిజం, రాజ్యాంగం, కాపిటలిజం లాంటి భావజాలాలతో బంధించడం సబబు కాదనీ, వారు, వారి జీవనశైలి వీటన్నింటికీ అతీతమనీ అర్ధమవుతుంది. రాయ్ తనదైన శైలిలో మీడియా మీద, ప్రభుత్వం మీద అక్కడక్కడా వేసిన చురకలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు, ఉండదు కూడా. ఆదివాసీల కోసం కాలుష్యం తగ్గించడం కోసం బాక్సైటుని వెలికి తీయకుండా ఉండడం మనం జీర్ణించుకోలేము. ఈ పుస్తకంలో వేదాంత మైనింగ్ కంపెనీ ప్రస్తావన కూడా ఉంది. టెలివిజన్లో ఆదివాసీల పిల్లల్ని చదివిస్తున్నట్లు, వారి జీవితాలను ఉధ్ధరిస్తున్నట్లు వారు ఇచ్చుకున్న ప్రకటన గుర్తొస్తోంది కదూ!

డెక్కన్ ప్రాంతం లోని దండకారణ్య అనే అడవిలో మావోయిస్టులతో రచయిత కొన్నాళ్ళు గడిపారు. వారి జీవన విధానం, వారి హక్కుల పోరాటం, వారిపై ప్రభుత్వ విధానాల ప్రభావం, వారిని తీవ్రవాదులుగా చిత్రీకరించిన మీడియా మొదలైన వాటిని వివరించారు. అలా అని మావోయిస్టుల హింసాకాండని రచయిత మొదట్లో సమర్ధించినట్లు మనకు అనిపించినా, ఆఖరి వ్యాసంలో తప్పుబట్టారు. ఆ హింసను మనమూ సమర్ధించలేము, కానీ కారణాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. అయితే ఆ హింసను ఆపగలిగే పరిష్కారం పుస్తకంలో కనబడదు. మైనింగ్ ఆపెసి, మావోయిస్టులను స్వేచ్ఛగా వదిలేయడమొక్కటే పరిష్కారం అనిపిస్తుంది. కాని, ఈ పరిష్కారం ప్రభుత్వానికి, మన లాంటి నాగరికులకు నచ్చదు కాబట్టి, ఈ సమస్యను పరిష్కరించలేరు.

ఇలాంటి పుస్తకాలు మావోయిస్టులు తప్పక చదువుతారు కాబట్టి, ఒక్కోసారి, వారికి సంబంధం లేని (ethically incorrect targets) వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అన్యాయమనీ, అలా చేయడం వలన వారితో మానసిక యుద్ధం నడుపుతున్న మీడియా మరీ వ్యతిరేకిస్తున్నారని తెలియజేస్తే బాగుండేది. దీని వలన ప్రజలు (ఆదివాసీలు తప్ప) ఈ అంతర్గత యుద్ధానికి వీరి కారణాలు ఎంత బలమైనవి అయినప్పటికీ వీరికి మధ్దతు పలకలేరు. పుస్తకంలో అక్కడక్కడా అసందర్భమైన, అసమంజసమైన వ్యంగ్యం అసలు విషయాన్ని కప్పేసిందని అనిపించింది. ఉదాహరణకు, మన దేశాన్ని రైల్వేలతో అభివృద్ధిపరచిన బ్రిటీషు వారికి ప్రధాన మంత్రి కృతజ్ఞత తెలపడాన్ని చాలా వక్రీకరించినట్లు అనిపించింది. మావోయిస్టులు పోరాడుతున్న దందకారణ్యం కొంత భాగం మన రాష్ట్రంలో ఉండడం వలనో, లేక మరే ప్రాంతీయ భాష లోనూ ఎక్కువ లేని కమ్యూనిస్టు సినిమాలు తెలుగులో ఉండడం వలనో, ఈ పుస్తకాన్ని “ధ్వంసమైన స్వప్నం” గా తెలుగు లోకి అనువదించారు. మనకు తెలియని నిజాలు తెలుసుకోడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి!

******
పుస్తకం వివరాలు:
ఆంగ్ల పుస్తకం కొనుగోలు లంకె ఇక్కడ. అంతర్జాతీయ కొనుగోలుకి అమెజాన్ లంకె ఇక్కడ.
తెలుగు అనువాదం కొనుగోలు వివరాలు ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. Divya Prathima

    Another review on the same book was published in epw. http://epw.in/epw/uploads/articles/17490.pdf

  2. ravikumar

    manchi vyasalu,vyakhymnalu.

Leave a Reply