పుస్తకం
All about booksపుస్తకభాష

May 10, 2012

మళ్ళీ బాపు కొంటె బొమ్మలు

More articles by »
Written by: Jampala Chowdary
Tags: , , ,


నా హౌస్‌సర్జెన్సీ ఐపోతున్న రోజుల్లో (సెప్టెంబరు, 1979) నవోదయా వారు కొంటె బొమ్మల బాపు అంటూ విడుదల చేసిన చిన్న పుస్తకం మా గుంపులో గొప్ప హాహాకారాల్ని (ఇవి ఇంగ్లీషు హాహాలు లెండి) రేకెత్తించింది. బుద్ధిగా బొమ్మ లేసుకుంటున్నట్టున బాపుకి సంతకంతో పొడుగు తోకని తగిల్చిన ముదురునీలపు ముందు అట్ట; వెనకవైపున సీరియస్‌గా పైపానందంలో ఉన్న బాపు ప్రొఫైల్ క్రింద, కార్టూన్లకు కొంటె బొమ్మలని అచ్చ తెలుగు పేరెట్టేసిన ఆరుద్రు డిచ్చిన మూడు లైన్ల ముచ్చటైన కితాబు. లోపల నానృషిః కురుతే కార్టూన్ అంటూ శ్రీరమణుడి సర్టిఫికేషన్. వీటన్నిటికన్నా లోపల పేజీపేజీకి నవ్వుల విందు. ఒకళ్ళ భుజాలమీంచి ఇంకోళ్ళు చూసేస్తూ, ఒకళ్ళ చేతిలోంచి ఇంకోళ్ళు లాగేసుకుంటూ, ఇది చూశావా అంటూ ఘాట్టిగా వీపు మీద చరుస్తూ, విడివిడిగానూ, గుంపంతా ఒక్కసారేనూ ఘాట్టిగా పగలబడి నవ్వేస్తూ, మాకేం పిచ్చి పుట్టిందో చూడటానికి వచ్చిన పక్కవాళ్ళక్కూడా, పాపం, మా పిచ్చి అంటించేస్తూండగా రోజు తిరక్కుండానే ఆ చిన్న పుస్తకం నలిగిపోయింది. ఇంట్లో పరిస్థితీ అంతకు తక్కువేం కాదు.

మొదటి సారిగా బాపు కార్టూన్లన్నీ ఒక్కచోట బొత్తిగా చేర్చి పెట్టటం, అప్పటికి కార్టూన్ల పుస్తకాలు బొత్తిగా అలవాటులేని ఆంధ్రప్రజానీకాన్ని అమితంగా ఆనందపరచింది. ఒక్కసారిగా రాష్ట్రమంతటా మందహాసాలూ, చిరునవ్వులూ, పకపకలూ, అట్టహాసాలూ వెల్లివిరిశాయి. ఈ పుస్తకం ఆఖరులో వేసిన భశుం కార్టూన్ ఆ తర్వాత ఎన్ని వందలచోట్ల కనిపించిందో, ఎన్ని వేలనోట్ల వినిపించిందో! తినగానే నిదరంటారు అని ఒకరు సమస్య ఇవ్వగానే లేవగానే ఆకలంటారు అంటూ ఇంకొకరు పూరించటం. షార్టా, లాంగా అనే మంగలి ప్రశ్న. టౌన్‌హాల్ నిర్మాణానికి రఘురామయ్య ఇచ్చిన చందా చూసే నవ్వాపుకోలేకపోతే, గోల్డేమో గోకి చూడు అంటూ బోనస్. (ముందు వాక్యాలు మీకు అర్థం కాకపోతే, మీ మీద బోలెడు జాలి పడాలన్న మాట).


కార్టూన్ అంటే ఒకరికొకరు చెప్పుకొనే జోకు మాత్రమే కాదనీ, కొంటె బొమ్మ కార్టూనుకు ముఖ్యమనీ ఎప్పుడూ మర్చిపోని అతి తక్కువమంది తెలుగు కార్టూనిస్టుల్లో బాపు ఒక్కడు. ఘాట్టిగా మాట్లాడితే ప్రథముడు. బాపు కార్టూన్లు కొన్నిటికి కేప్షన్ల అవసరం ఉండదు. బొమ్మ చూడకుండా కేప్షనొక్కటే చదివితే కొన్ని బాపు కార్టూన్లు నవ్వు మాటటుంచి అర్థం కూడా కావు. అడపా దడపా అర్థం అయినా, బొమ్మలో ఉన్న కొన్ని అంశాలు చూశాక కానీ మనకు ఆ కార్టూన్లు పూర్తిగా అందుబాటులోకి రావు. శ్రీరమణ తన ముందుమాటలో అన్నట్లు, “హాస్య సాధనకు బాపు అన్ని రీతులను స్పృశించారు. భావ, శబ్ద, అర్థ చేష్టాగత హాస్యాన్ని, వేళాకోళం వెక్కిరింతను మాత్రమే గాక బర్లెస్క్, పేరడీ వంటి హాస్య ప్రక్రియలను కూడా తమ కార్టూన్లలో చవి చూపించారు”.

తెలుగురాని మన పిల్లలకి తెలుగు జీవితాన్నీ, తెలుగు కార్టూన్ల రుచినీ చూపించాలని నేనూ, పిల్లలమర్రి రామకృష్ణ, రావెళ్ళ రమేష్ కలిసి ఈ కార్టూన్ కేప్షన్లను ఇంగ్లీషులో రాసేసి 94-95లో తానాపత్రికలో ధారావాహికగా ప్రచురించాం. సూపర్ హిట్! ఆ తర్వాత చికాగో 1995 తానా సమావేశాల్లో బాపు రమణల స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఇంగ్లీషు కేప్షన్లతో బాపు కార్టూన్ల పుస్తకం తెద్దామనుకున్నాం కాని, బాపుగారు ఒప్పుకోక మానేశాం.

కొంటెబొమ్మల బాపు వచ్చాక సరిగ్గా పదేళ్ళ తర్వాత 1989లో నవోదయా వారే రెండో భాగాన్ని ప్రచురించారు. గత శతాబ్దం ఆఖర్రోజుల్లో – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సంపాదకుడిగా, శ్రీరమణగారు సహాయ సంపాదకుడిగా ఉన్న రోజుల్లో – ఆంధ్రప్రభ వార పత్రికలో, బాపు తమ మనుమరాలు లాస్య పేరుతో మళ్ళీ కార్టూన్లు గీయడం మొదలుబెట్టారు. ఆ కార్టూన్లలో కొన్నిటిని మళ్ళీ నవోదయా వారే కొంటె బొమ్మల బాపు పేర 2001లో ఉంకో సంకలనం తెచ్చారు.

2002 డిశంబరు 15న బాపు 70వ జన్మదిన సందర్భంగా విశాలాంధ్ర వారు మనందరికీ గొప్ప కానుక ఇచ్చారు. బాపు కార్టూన్లు బోలెడన్నిటిని కలిపి 734 పేజీల్లో రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఈసారి ముళ్ళపూడి వెంకటరమణ గారు ముందు మాట రాశారు. 2003 జనవరి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌లో ఈ పుస్తకాలు వేడి వేడి మిరపకాయబజ్జీలకన్నా హాట్‌గా అమ్ముడు పోవటం నాకు బాగా గుర్తు. ఆర్నెల్లల్లో ఇంకో ఎడిషన్ వేయాల్సొచ్చింది. బాపు కార్టూన్ల విశ్వరూపాన్ని చూపించే ఈ సంకలనాల ప్రత్యేకత ఏమిటంటే, 1950లనుంచి 90లదాకా బాపు బొమ్మ ఎలా మారిందో తెలుస్తుంది. కొన్ని కార్టూన్లు కొత్త గీతల్లో మళ్ళీ కనిపిస్తాయి, ఒక్కోసారి కొత్త ముక్తాయింపూ ఉంటుంది (గోల్డేమో గోకి చూడు, అలా తరువాత చేరిన న్యూ అండ్ ఇంప్రోవ్డ్ వెరైటీనే). యాభై యేళ్ళ తర్వాతకూడా బాపు కొంటెతనం పెరిగిందే కాని తగ్గలేదని తెలిసిపోతూంది. ఈ పుస్తకాల ముఖచిత్రాలపై బాపుగారి సంతకాలు, బొమ్మల మధ్య తేడాలు గమనించారా!

ఈ పుస్తకాలన్నీ ఇప్పుడెందుకు గుర్తొచ్చాయీ అంటే – మొన్న జనవరిలో విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో మళ్ళీ బాపు కార్టూన్లు రెండు లావాటి వాల్యూములు కనిపించాయి. కవర్లు కొత్తగా ఉన్నాయి. విశాలాంధ్రవాళ్ళు మళ్ళీ కొత్త ఎడిషన్ కొత్త కవర్లతో సహా వేసినట్టున్నారు అనుకుంటూ పుస్తకాలు చేతిలోకి తీసుకొని చూస్తే – హాశ్చెర్యం. కవర్లు మాత్రమే కొత్త కాదు. ఈ పుస్తకాలను ప్రచురించింది విశాలాంధ్ర కాదు, ఎమెస్కో. లోపల ఉన్నవి ఇంతకు ముందు పుస్తకాల్లో వచ్చినవి కాదు, సరికొత్త కార్టూన్లు. బ్లాక్ అండ్ వైట్ కాదు, పంచరంగుల్లో. అదీ మంచి ఆర్ట్ పేపర్ మీద. కొన్నేళ్ళుగా బాపు స్వాతి వారపత్రికలో రంగుల్లో కార్టూన్లు వేస్తున్నారు కదా. వాటిలోంచి ఎంపిక చేసిన కార్టూన్లన్న మాట. ఒక్కో వాల్యూములో 250 పేజీల కార్టూన్లు. ముళ్ళపూడిగారికి అంకిత మిచ్చేరు.

“తెలుగులో ఆలోచించి, తెలుగు గీత గీసే తెలుగాయన బాపు”అని అప్పుడెప్పుడో శ్రీరమణగారన్న మాటలు ఈ బొమ్మలకీ వర్తిస్తాయి. 21వ శతాబ్దపు జీవితం, రాజకీయాలు బాపు గారి సునిశిత దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి. బాపుగారు ఎప్పుడూ తన గదిలోనే కూర్చుని, పాటలు వింటూ బొమ్మలు గీసుకొంటూనే ఉంటారు కదా, మరివన్నీ ఎప్పుడు గమనిస్తారో ఏమో గాని, టీవీగతజీవితాలూ, కార్పొరేట్ ఆస్పత్రులూ, వైయ్యస్‌గారి ఎలక్షన్ ప్రచారపు ముద్దులూ, మందుబాబుల నిషాలూ, బట్టతల బాధలూ, పురాణపురుషుల పోకిళ్ళూ, ఒకటేమిటి, సమస్తమూ – కాదేదీ కార్టూను కనర్హం అంటూ తెలుగుజీవితానికి తన గీతతో భాష్యం చెప్పేశారు బాపు గారు.

ఈ పుస్తకాన్ని నేను విశాలాంధ్ర పుస్తకంగా భ్రమ పడటానికి కారణమేమిటంటే ఎమెస్కోవారు ఈ పుస్తకాలకి వేరే పేరు పెట్టలేకపోయారు కాబోలు, సింపుల్‌గా విశాలాంధ్రవారు పెట్టిన పేరే మళ్ళీ ఈ పుస్తకాలకి కూడా పెట్టేశారు. కనీసం వాల్యూం నంబర్లన్నా మార్చలేదు. ఈ పుస్తకాలు 2011 మేలో ప్రచురింపబడ్డాయట. ఎంచేతోకానీ, ఈ పుస్తకాలకు అంతగా ప్రచారం లభించినట్లు లేదు.

హాయిగా, ఘాట్టిగా, ఫడీ, ఫడీ నవ్వుకొనే పుస్తకాలు. కన్నుల పండుగ్గా, నవ్వుల జల్లుల్లా ఉన్నాయి. ఆర్ట్‌పేపర్ కావటంతో కొద్దిగా బరువుగా ఉన్నాయి. అచ్చుతప్పులు అసల్లేవు; నిఝం.

బాపు గారు ఇంకా పదికాలాల పాటు ఇలాగే మనల్ని మనకు చూపిస్తూ, నవ్విస్తూ, నవ్వుకుంటూ హాయిగా, ఆరోగ్యంగా ఉండాలనీ, ఇలాంటి పుస్తకాలు మరిన్ని కొత్తగా రావాలనీ కోరుకుంటున్నాను.

***

బాపు కార్టూన్లు – రెండు సంపుటాలు
2011
ఎమెస్కో బుక్స్
1-2-7, భానూ కాలనీ
గగనమహల్ రోడ్, దోమలగూడ
హైదరబాద్ 500 029
www.emescobooks.com
emescobooks@yahoo.com
ఫోన్: 040-2326 4028
ఒక్కో సంపుటం: 250 పే, 300 రూ.About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.4 Comments


 1. Raghuram

  Maaku suparichutulani chesi, mammalanu kooda ee aananda karamaina bhagam lo paalgonetattu chesinanduku … danyavadamulu.


 2. సౌమ్య

  చివర్లో ఉన్న కార్టూను నాకు విపరీతంగా నచ్చింది 🙂
  పంచుకున్నందుకు ధన్యవాదాలు.


  • అవునండి.. ఆ ఒక్క కార్టూనుతో మొత్తం పుస్తకం చూసినట్టు అనిపించింది. ధన్యవాదాలు.


  • అలా అని వదలకూడదండీ ఆ పుస్తకం కొని నవ్వుకుని తీరుదాం  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

బాపుతో మేము

వ్యాసకర్త: శంకర్ (సత్తిరాజు శంకరనారాయణ) (డిసెంబర్ 15, బాపు గారి పుట్టినరోజు సందర్భంగా, ...
by అతిథి
0

 
 

బాపు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు

వ్యాసకర్త: భానుమతి ****** నమస్తే. నా పేరు భానుమతి. బాపు గారి అమ్మాయిని. నాకు మీ అందరితో కొన...
by అతిథి
44

 
 

ఓ బాపు బొమ్మ కథ

  గతవారం బాపుగారి మరణానంతరం ఫేస్‌బుక్‌లో చాలామంది స్నేహితులు బాపు గారి ఫొటోలు, బొమ...
by Jampala Chowdary
13

 

 

శ్రీ బాపు గారికి విశ్వనాథ అభినందన – ఒక పేరడీ

రాసిన వారు: శ్రీరమణ (ఈ వ్యాసం 1982 నాటి ఒక ఆంధ్రజ్యోతి వార పత్రిక సంచిక లోనిది. బాపు గారి...
by పుస్తకం.నెట్
14

 
 

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. త...
by అతిథి
0

 
 

సరసి కార్టూన్లు-2

వ్రాసినవారు: సూరంపూడి పవన్ సంతోష్ ************************* “ఏకం స్వాదు న భుంజీత” అన్నది ఆర్యోక్త...
by అతిథి
1