సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం-కొండను అద్దంలో చూపిన అందమైన ప్రయత్నం!

    రాసిపంపినవారు: ఓంప్రకాశ్ నారాయణ వడ్డి

  విద్వాన్ విశ్వం గురించి ఈ తరానికి పెద్దగా తెలియక పోవచ్చు. కొందరు సాహితీకారులు ఆయన రచనల్ను కొంతమేరకు చదివి ఉండొచ్చు. అయితే నిన్నటి తరం రచయితలు, పాఠకులు మాత్రం ఆయనను ఆదర్శ రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప మానవతావాదిగా కీర్తిస్తారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను పట్టించుకోకుండా సమాజానికి తన వంతు సేవ చేస్తూ, సాహితీకారుడిగా, పత్రికా రచయితగా, ప్రచురణకర్తగా, సంపాదకునిగా రాణించడం సామాన్య విషయం కాదు. ఆ పనిని విద్వాన్ విశ్వం సమర్థవంతంగా నిర్వర్తించారు, జీవిత చరమాంకం వరకూ! అయితే ఆయన రచన్లకు రావలసినంత గుర్తింపు ఎందుకు రాలేదు అన్నదే చాలామందిని కలచివేస్తున్న ప్రశ్న!

     కొందరు తమ కులం ద్వారా గుర్తింపబడతారు; మరికొందరు తమ ప్రాంతం ద్వారా గుర్తింపు పొందుతారు; మరికొందరు మిత్రుల ద్వారా ప్రచారం పొందుతారు; మరికొందరు ప్రభుత్వ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో ఉన్న పరిచయాల ద్వారా తమని తాము ప్రమోట్ చేసుకుంటారు. అయితే విద్వాన్ విశ్వం వీటన్నింటికీ దూరంగా ఉండే వ్యక్తి అనిపిస్తుంది. దూరం అనేకంటే అతీతమైన వ్యక్తి అనడం సబబుగా ఉంటుంది. లేకపోతే, రాయలసీమ వాసి అయిన ఆయన ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని తెలంగాణా రచయితల సంఘం ప్రచురించడం విడ్డూరం కాక మరేమిటి! విద్వాన్ విశ్వం గురించి దాశరథి చెబుతూ, “విశ్వంగారు ఎంతగొప్ప రచయితో, అంత గొప్ప హృదయంగల మనిషి. ప్రతిభావంతులు చాలామంది ఉంటారు లోకంలో. కాని మనసు విప్పి మాట్లాడి, సాటి రచయితలను తనవాళ్ళుగా భావించి, సాటివారి శ్రేయస్సును కోరేవారు అరుదు. ఆ సద్గుణం మేము విశ్వంగారిలో చూశాము. తెలంగాణా రచయితలకు ఆయన ఆత్మబంధువై పోయారు” అని అంటారు. అందువల్లే వారంతా కలిసి ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని ప్రచురించడానికి ముందుకొచ్చారు.

రాయలసీమలో పుట్టి పెరిగిన విద్వాన్ విశ్వం తన అనుభవ మూలాధారాలతో, ఆ సీమలోని నాటి పరిస్థితుల్ని ‘పెన్నేటి పాట’గా రాసిన వైనం ఎవరిని మాత్రం కదిలించదు! ‘ఏదీ నీరు? ఏదీ హోరు? ఏదీ నీటిజాలు? ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుకవాలు!’ అంటూ ఒట్టి ఇసుక దిబ్బలను చూపించప్పుడు గుండె చెరువు కాక ఏమవుతుంది! కన్నీటితో దాహం తీర్చుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తుంది! అందుకే ‘పెన్నేటి పాట’ కావ్యంతో ఆయన పేరు తెలుగునాట మారుమ్రోగింది. నవ్యసాహిత్యమాలకు సంపాదకులుగా, ప్రచురణకర్తగా ఆయన సేవ చెప్పుకోదగ్గది. వివిధ పత్రికలలో ఆయన రచించిన శీర్షికలు ‘తెలుపు-నలుపు’, ‘అవీ ఇవీ’, ‘ఈవేళ’, ‘టీక టిప్పణి’, ‘మాణిక్యవీణ’ తదితరాలతో పాటు ఆయన చేసిన అనువాదాలు, స్వీయ రచనలు ఎంతో ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. సమకాలీన సాహితీకారులు ఆయనలో ఓ గొప్ప రచయితనే కాదు మానవతామూర్తినీ, స్నేహపాత్రుడినీ చూశారు. అన్నింటి కంటే విద్వాన్ విశ్వంలో ఉన్న గొప్ప గుణం ఏమంటే, ‘నీవు చెప్పేది నాకు అసమ్మతం కావచ్చు, కానీ చెప్పడానికి నీకుగల హక్కును నేనెప్పుడూ సమర్థిస్తాను’ అనే సిద్ధాంతాన్ని ఆయన విశ్వసించారు, ఆచరించారు.

అటువంటి వ్యక్తిపై వచ్చిన పుస్తకం ‘సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ డాక్టరు నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ సంపాదకత్వంలో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. విద్వాన్ విశ్వం మీద ఉన్న ప్రత్యేక అభిమానం వీరితో ఈ పని చేయించి ఉండొచ్చు. సంపాదకులు పేర్కొన్నట్టు, విద్వాన్ విశ్వం రచనలపై కనీసం ఒక్క పరిశోధన కూడా వెలుగు చూడలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. సారస్వత లోకం వారిపై శీతకన్ను వేసిందని చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనిపిస్తుంది. అందుకే వేణుగోపాల్, మురళీమోహన్ తమ వంతు బాధ్యతగా విద్వాన్ విశ్వంకు సంబంధించిన వివరాలను ఈ పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం చేశారు. విద్వాన్ విశ్వం గురించి ప్రముఖ రచయితలు, ఆయన సమకాలీనులు మొత్తం 21 మంది రాసిన వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. ఇవన్నీ విద్వాన్ విశ్వం గారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవన గమనంలో ఆయన చవిచూసిన ఎత్తుపల్లాలను తెలియచేస్తాయి. వీటిని ‘విశ్వజీవి’ పీఠికన పొందుపరిచారు. ఇక విద్వాన్ విశ్వం నిర్వహించిన ‘తెలుపు-నలుపు’, ‘మాణిక్యవీణ’ శీర్షికలతో పాటు ఆయన వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలను ‘విశ్వరూపి’ పీఠికన ప్రచురించారు. అలానే కిన్నెరలో విద్వాన్ విశ్వం రాసిన వివిధ వ్యాసాలను, ఇతర పీఠికలను ‘విశ్వభావి’ పేరుతో అందించారు. చివరగా విశ్వంగారి సందేశాలు, ఇంటర్వ్యూలనూవిశ్వమేవ’ పీఠికలో ప్రచురించారు. ఒకరకంగా విద్వాన్ని విశ్వం జీవితాన్ని, రచనలను రెండువందల అరవై నాలుగు పేజీల పుస్తకంలో ‘కొండను అద్దంలో చూపించిన చందాన’ పాఠకులకు అవగతమయ్యేలా చేశారు. ఇది అభినందించదగ్గది. 2015 విద్వాన్ విశ్వం శతజయంతి సంవత్సరం. కనీసం ఆ సమయానికైనా ఇటు ప్రభుత్వమైనా, అటు విశ్వవిద్యాలయాలైనా, లేదంటే సాహిత్య సంస్థలైనా పూనుకుని విద్వాన్ విశ్వం సమగ్ర సాహిత్యాన్ని ప్రచురిస్తే బాగుంటుంది. అలా చేసే వారికి ఈ పుస్తకం స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

***

సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం

సంపాదకులు : డా.నాగసూరి వేణుగోపాల్

              కోడీహళ్లి మురళీమోహన్

వెల: 200.00రూ.లు

ప్రతులకు: కె.మురళీమోహన్, 9111, బ్లాక్ 9ఎ, జనప్రియ మహానగర్,

          మీర్ పేట్, హైదరాబాద్ 500 097

          ఫోన్: 9701371256

మరియు విశాలాంధ్ర,, నవోదయ, తెలుగు బుక్ హౌస్, కినిగె, ఎ.వి.కె.ఎఫ్.బుక్ లింక్స్

You Might Also Like

3 Comments

  1. Kinige Newsletter 12 May 2012 | కినిగె బ్లాగు

    […] సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వంసమీక్ష ‘కినిగె’పై […]

  2. Kinige Newsletter 12 May 2012 | Kinige Blog

    […] సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వంసమీక్ష ‘కినిగె’పై […]

  3. nagasuri venugopal

    Om Prakash Narayana garu…chala chala dhanyavadalu

Leave a Reply