పుస్తకం
All about booksపుస్తకాలు

April 23, 2012

చిలుక తెచ్చిన చీటీలలో చిరుగాలి సితారా సంగీతం – శివసాగర్ కవిత్వం

More articles by »
Written by: Jampala Chowdary
Tags:

1970ల్లో గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో, అన్యాయమైన పరిస్థితులపట్ల అసహనంతో ఆవేదనతో ఆందోళనతో ఆశలతో ఆశయాలతో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో గోడలపైన ఎర్ర అక్షరాలతో నినాదాలు,  మినీ కవితలు కనిపిస్తుండేవి, ఆకర్షిస్తూ ఉండేవి. ఎర్రెర్రని దారులు చూపిస్తుండేవి. నేను మెడికల్ కాలేజీలో చేరటానికి ముందు సంవత్సరమే గుంటూర్లో భారీ ఎత్తున విప్లవ రచయితల సమావేశాలు జరిగాయి. అప్పటికే ప్రచారంలో ఉన్న పాట ఒక్కటి అప్పుడు గోడల మీదెక్కింది.

బర్రెంక సెట్టు కింద నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తివయ్య నరుడో! భాస్కరుడా!

ఆ పంక్తుల గురించి మాట్లాడటం మా సీనియర్లు కొంతమందికి కన్నీళ్ళు తెప్పించేది. తర్వాత, ఒక కవితా సంకలనంలో (లే అనుకుంటా ఆ సంకలనం పేరు, సరిగ్గా గుర్తులేదు; మార్చ్ ఐనా కావచ్చు) ఆ కవిత పూర్తిగా చదివినప్పుడు ఒక ఉద్విగ్న స్థితి:

 

నర్రెంగ సెట్టు కింద నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేస్తివయ్యా నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేసి నీవు నరుడో! భాస్కరుడా!
కదనాన దూకితివా నరుడో! భాస్కరుడా!

బర్రెంక సెట్టు కింద నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తివయ్య నరుడో! భాస్కరుడా!
బందూకు సేతబట్టి నరుడో! భాస్కరుడా!
బంధాలు తెంచ్తివయ్య నరుడో! భాస్కరుడా!

అంటూ మొదలై


శింగేరి గట్టుకింద నరుడో! భాస్కరుడా!
నీ శిరసు తీస్తిరయ్య నరుడో! భాస్కరుడా!
నీ శిరసు తీసి వారు నరుడో! భాస్కరుడా!
సిందులే వేస్తిరయ్యా నరుడో! భాస్కరుడా!

సిందీన నెత్తురంత నరుడో! భాస్కరుడా!
సీసాల కెత్తిరయ్యా నరుడో! భాస్కరుడా!
సీసల్లో ఏమిటన్న నరుడో! భాస్కరుడా!
సారాని సెప్పిరయ్యా నరుడో! భాస్కరుడా!

కారీన నెత్తురంత నరుడో! భాస్కరుడా!
కడవల్ల కెత్తిరయ్య నరుడో! భాస్కరుడా!
కడవల్ల ఏమిటన్న నరుడో! భాస్కరుడా!
కల్లన్ని సెప్పిరయ్యా నరుడో! భాస్కరుడా!

అని సాగి


నిను సంపి మము సంపి నరుడో! భాస్కరుడా!
మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
కుట్రలే పన్నారో నరుడో! భాస్కరుడా!

నీవు సూపిన బాట నరుడో! భాస్కరుడా!
మా దొడ్డ బాటయ్య నరుడో! భాస్కరుడా!
నీ బాటనే మేము నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తాము నరుడో! భాస్కరుడా!

బర్రెంక సెట్టు కింద నరుడో! భాస్కరుడా!
బందూకు పట్టాము నరుడో! భాస్కరుడా!
బందూకు సేతబట్టి నరుడో! భాస్కరుడా!
బంధాలు తెంచాము నరుడో! భాస్కరుడా!

అంటూ ముగుస్తుంది
బందూకు పట్టిన భాస్కరుడు డాక్టర్ చాగంటి భాస్కరరావు, మా కాలేజీలో చదువుకున్న వాడే. తెలుగునాటి తొలితరం నక్సలైటు నాయకుడు. శ్రీకాకుళం పోరాటంలో పోలీసుకాల్పుల్లో మరణించాడు.

ఈ పాట రాసింది శివసాగర్ ఉరఫ్ శివుడు ఉరఫ్ రెంజిం ఉరఫ్ రవి ఉరఫ్ కామ్రేడ్ కె.జి. (కంభం జ్ఞాన) సత్యమూర్తి. నిబద్ధతే కాదు నిమగ్నత కూడా ఉన్న విప్లవరచయిత, విప్లవకారుడు. అధ్యాపకుడిగా వరంగల్‌లో ఉద్యోగపర్వం ప్రారంభించినా, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్త అయ్యారు. కొన్ని పత్రికల్లో పని చేశారు. కొండపల్లి సీతారామయ్య సహచరుడు. గుత్తికొండబిలంలో చారు మజుందార్‌ని కలుసుకుని ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైటు ఉద్యమానికి తెరదీసిన బృందానికి  నాయకుడు.  ఐదేళ్ళు పార్వతీపురం కుట్రకేసులో జైల్లో ఉన్నారు. పీపుల్స్‌వార్ పార్టీకి చాలాకాలం జాతీయ ప్రధాన కార్యదర్శి. తర్వాత పార్టీ నాయకత్వంతో వచ్చిన విభేదాల వల్ల పార్టీనుంచి బయటకు వచ్చారు. తరువాత దశలో దళితబహుజనోద్యమ కార్యకర్త. ఆరు రోజులక్రితం (ఏప్రిల్ 17న) 84 వ యేట మరణించారు. తెలుగులో విప్లవరచయితలుగా చెప్పబడేవారు చాలామంది ఉన్నా, వారిలో అగ్రస్థానం “ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవి” అంటూ  1970లో విరసం తొలిరోజుల్లో విప్లవకవిత్వానికి నిర్వచనం ఇచ్చిన శివసాగర్‌దే అని నా అభిప్రాయం.

మైక్రోస్కోపిక్ అనే ఆ కవిత ఆఖరు చరణం ఆ రోజుల్లో గోడల మీద తరచు కనిపించేది. ఆ పంక్తులు ఇప్పుడూ తారసపడుతుంటాయి.

కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో
నరకగల్గినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుకాసి
ట్రిగ్గర్ నొక్కగల్గినవాడే ద్రష్ట
ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవి

 
ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక తాత్విక దృక్పథంతో కవితలు రాసినా, ఆ చట్రాలు కవిగా శివసాగర్‌ను బంధించలేదు. అడవుల్లో రహస్య జీవితం గడుపుతూ రాసినా, జైల్లో నిర్బంధం మాటున రాసినా, అనువాదాలు చేసినా ఆయన కవితల్లోంచి కవిత్వం మాయమవలేదు. జానపద బాణీల్లో రాసినా, అధివాస్తవిక ధోరణిలో రాసినా, పారడీలు రాసినా శివసాగర్‌కి ఒక స్పష్టమైన, తనదైన భాష, భావన, భావుకత (diction, imagery and sensitivity) ఉన్నాయి. ఆయన వివిధ సందర్భాల్లో చెప్పినదానిబట్టి – ఆయన కవిత్వాన్ని విచ్చలవిడిగానో, లేదా సంఘటనలకు తక్షణ ప్రతిస్పందనగానో రాయలేదు. తనను కదిలించిన సంఘటనలను అనుభవించి, అంతర్లీనం చేసుకొని మధనపడి కవిత్వాన్ని సృష్టించారు శివసాగర్.

నరుడో భాస్కరుడా గేయాన్ని ఆయన భాస్కర్రావు మరణించిన వెంటనే రాయలేదు. అప్పుడు మెదక్ జిల్లాలో రహస్యజీవితంలో ఉంటున్న శివసాగర్ అక్కడ పీర్లపండగ నాడు గ్రామీణులు ధూలా అనే సామూహిక నృత్యం చేస్తూ వాళ్ళు పాడుతున్న నరుడో నారపరెడ్డీ అన్న పాట విని ఆ లయను పట్టుకొన్నారు. ఆ తర్వాత అడవుల్లో ఉండగా ఇంకో మిత్రుడు అక్కడి చెట్ల పేర్లు చెప్పాడట. వాటన్నిటినీ కలుపుకొని – విప్లవకవిత్వం ఎట్లా ఉండాలి అన్నప్రశ్నకు సమాధానంగా ఈ కవిత వ్రాశారట. విరసం మొదటి కవితాప్రచురణ ఝంఝలో (దాదాపు వెంటనే నిషేధింపబడింది; శ్రీశ్రీ నిన్నటి జట్కావాలా కూడా ఈ సంకలనంలో ఉన్నదని గుర్తు) ఈ కవిత వచ్చింది; అనేక ప్రశంసలు, విశేష ప్రచారం పొందింది.

కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలుకొండ సివారు శంకరంపాడులో 1928లో ఒక పేద దళితకుటుంబంలో జన్మించిన శివసాగర్ బాగా చదువుకొన్నారు (డబల్ ఎమ్మే; ఒకటి రాజకీయ శాస్త్రంలో –ఆంధ్రా యూనివర్సిటీ; రెండవది ఇంగ్లీషు కావచ్చు). తెలుగు సాహిత్యమూ, ప్రపంచ సాహిత్యమూ రెండూ బాగా తెలిసినవారు. గురజాడ, శ్రీశ్రీ అభిమానకవులు. శివసాగర్ మొదటి దశ కవిత్వంలో చాలాచోట్ల నాకు శ్రీశ్రీ, ఆరుద్రల ప్రభావం కనిపిస్తుంది. తరువాతిరోజుల్లో అంతగా అనిపించలేదు.

విప్లవకవిత్వమంటే ఉద్యమ నినాదాలూ, బెదిరింపులూ అన్న అభిప్రాయం బలంగా ఉన్న రోజుల్లో విప్లవభావాల చిరుగాలి సితారా సంగీతాన్ని సముద్రపుటలల మధ్య స్పష్టంగా వినిపించగల్గిన కవి శివసాగర్ (అలలు, 1971)

అలలపైన నిఘా!
అలలు కనే కలలపైన నిఘా!
అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!

అలలపై కదిలే
పడవలపై నిఘా!
పడవల తెరచాపలపై నిఘా!
పడవల తెరచాపల తెల్లదనంపై నిఘా!

అలల నెవ్వరడ్డగలరు?
కడలి నెవ్వడాపగలడు?
సముద్రం పురుటినెప్పులుగా అలలు
దరిద్రం రేపటి కోసం కన్న కలలు
అలలు సముద్రం చేతి కత్తి
అలలు సముద్రం చేతి కలం
ఉదయం నిండా అలలు
అలలు అలలు అలలు
నీలో నాలో
అలలు

70ల్లోనే దర్శకనిర్మాత కె.బి. తిలక్ (అనుపమ ఫిలింస్) నిర్మించిన భూమి కోసం చిత్రం ఒక సంచలనం. అప్పటికే ప్రసిద్ధి పొందిన, రెంజిం రాసిన చెల్లీ చెంద్రమ్మ కథ (1971) ఆ చిత్రంలో  అంతర్భాగంగా వస్తుంది (ప్రముఖ నటి జయప్రద మొదటిసారి తెరపై కనిపించింది చెల్లి చంద్రమ్మగానే; అందుకని ఆమె అంటే – ఆరేసుకోబోయి పారేసుకునేవరకు – అభిమానం ఉండేది). రెంజిం అంటే శివసాగరే. భూమికోసం చిత్రాన్ని తిలక్ తన సోదరుడు, పోలీసు కాల్పుల్లో చచ్చిపోయిన నక్సలైటు నాయకుడు కొల్లిపర రామనరసింహారావుకు అంకితమిచ్చాడు. చెల్లీ చెంద్రమ్మ పాట ఉన్న తన గెరిల్లా గీతాలు పుస్తకాన్ని కూడా తన మిత్రుడు కొల్లిపర రామనరసింహారావుకే శివసాగర్ అంకితమిచ్చాడు. అదిలాబాద్ జిల్లాలో రహస్య జీవితంలో ఉన్నప్పుడు ఒక దళితబాలిక పాడిన జానపదగీత బాణీలో రాసిన ఈ పాట

చెల్లేలా! చెల్లేలా! ఆహా! చెల్లేలా!
ఓహో! చెల్లెలా!, ఓహోహో చెల్లేలా!
నా చెల్లే చెంద్రమ్మా! ఓ పల్లే చెంద్రమ్మా!
రేపల్లే చెంద్రమ్మా!

అంటూ మొదలై ఒక జానపదకథలా సాగుతుంది (ఇక్కఢ నాకు త్వమేవాహంలో ఆరుద్ర కవిత ఒకటి గుర్తొస్తుంది).

కొండకు ఆవల కారడవి ఉన్నాది
కొండకు ఈవల ఊరొకటి ఉన్నాది
ఏరుకు పక్కన పల్లొకటి ఉన్నాది
ఆ పల్లెలో ఉన్నాది చెల్లీ చెంద్రమ్మా!

అల్లీపువ్వువంటి చెల్లీ నా చెంద్రమ్మా
మొగిలిపువ్వంటి మరిదీరా మొగిలన్న
చూడ చక్కని జోడు! బెమ్మాదేవుని తోడు!
మంచి గోరింటాకు! చిగురు చింతాకు!

ఆ పల్లెలో వెలిశాడు వింత కాసిరెడ్డి
కాసిరెడ్డికి కలవు నూర్ల ఎకరాలు
కాసిరెడ్డికి కలవు  బార్ల మేడల్లు
కాసిరెడ్డికి కలవు వేనూర్ల గోవుల్లు

కోరమీసము వాడు! కోడెనాగు వాడు!
రాగిమీసము వాడు! రాకాసి వాడు!
బట్టేబాజి వాడు! బట్టతల వాడు!
గొగ్గిపళ్ళ వాడు! గుడ్డెలుగూ వాడు!

వాడు ఉసిరిగ నీడల్లో పసిరిగ పామై
చెంద్రీ మొగిలిల బతుకు పాడు చేశాడ!
వాడు అంకారి బింకారి ఇంకారి తేలై
పల్లె పల్లెనంతా పోట్లు పొడిచాడ!

(కాసిరెడ్డి దౌర్జన్యానికి మొగిలి బలయ్యాడు)

అడుగులూ తడబడుతు గూడుచేరె మొగిలి
నెత్తుర్లూ కారంగ గూడుచేరె మొగిలి
నెత్తుర్లూ కక్కుతూ గూడుచేరె మొగిలి
చావు వెంటరాగ  గూడుచేరె మొగిలి

చెంద్రీ చెయిలోన చెయివేసి శెలవు అన్నాడు
చెంద్రీ ఒడిలోన తలవుంచి తనువు చాలించాడు
చెంద్రీ కన్నుల్లో కనులుంచి కన్ను మూశాడు
చుక్కపొద్దువేళ చుక్కల్లో కలిశాడు

నా చెల్లీ శోకమ్ము ఏరులై పారిందా!
నా చెల్లీ శోకమ్ము వరదలై పొంగిందా!
నా చెల్లీ శోకమ్ము సంద్రమై లేచిందా!
నా చెల్లీ శోకమ్ము ఆకసము తాకిందా!

వగచి వగచి వగచి వొరిగిపోయింది
కనలి కనలి కనలి కుమిలిపోయింది
మల్లె జిల్లేడాయె! తల్లడిల్లిన బతుకు!
వల్లకాడు మనసు! వల్లమాలిన దినుసు!

ఎంతకాలం ఏడ్చు! ఎంతని నిట్టూర్చు!
వగచి వగచి వగచి  పగబట్టి లేచింది!
కనలి కనలి కనలి  కసిపట్టి లేచింది!
నీలి కన్నులనుండి కార్చిచ్చు లేచింది!

(చెంద్రి గుండె భుగభుగలాడ బాస చేసింది – కాసిరెడ్డీ నీకు భువిలో నూకలు చెల్లె అని. ఆదివారము నాడు, గోదారినాడు, పొద్దు గుంకినవేళ, సద్దుమణిగిన వేళ  పొలమో స్థలమో చూచి తిరిగివచ్చే దొరను)

ఎత్తిన కత్తి కుత్తికలో దిగగుచ్చె
చెంద్రి కత్తి ఎత్తి వొత్తి పొత్తికడుపులో గుచ్చె

ఊరికి  పులికాని గొడ్డలికి పులికాదు
దోపిడికి దొరకాని కత్తికి దొరకాదు
కత్తిపోటుకు రెడ్డి నెత్తుర్లు చిమ్మంగ
కత్తివేటుకు రెడ్డి నెత్తుర్లో దొర్లంగ
చిందీన నెత్తుర్లు చేతుల్లో తీసికొని
నుదుట బొట్టు పెట్టుకుందా చెంద్రమ్మా
బొట్టు పెట్టుకొనీ చెల్లీ చెంద్రమ్మా
చిటికలో చీకటిలో కలిసిపోయింద
చీమచిటుకనగ  చీకటిలో కరిగిపోయింద

ఏటి పాట కొండ సిగను చేరింది
అడవిలో అన్నల్ల చెల్లి చేరింది.

ఈ పాట తాను ముందు పాటగా రాయలేదట; ఎప్పటికప్పుడు పాదాల్ని కట్టుకుని పాడుకుంటూ లయ సరిగా ఉన్నదా లేదా అని చూసుకుంటూ ఉండేవాడట. అప్పుడు శివసాగర్ ఒక లంబాడీతండాలో ఉండేవాడట. తనతో తిరుగుతున్న ఇద్దరు లంబాడీలకు, తాను కట్టిన పాటను వినిపిస్తూ వారి కళ్ళకేసి చూస్తుండేవాడట. ఆ కళ్ళలో కనిపించిన ఆమోద తిరస్కారాలబట్టి పాదాలు ఉంచాలో మార్చాలో నిర్ణయించుకునేవాడట. ఇలా పాడటం పూర్తయ్యాకే రాతలో రికార్డు అయిందట చెల్లీ చెంద్రమ్మ కథ.

ఇలాగే తయారైన మరో పాట ఓ విలుకాడ (1973).

తోటరాముని తొడకు కాటా తగిలిందాని
చిలుక చీటి తెచ్చెరా! ఓ విలుకాడ!
మైనా మతలబు చేసెరా! ఓ చెలికాడ!
మైనా మతలబు చేసెరా!

ఒద్దీపూ దారీలో సద్దు మణిగిందంట
సండ్రాపూ దారీలో గాండ్రించి దూకిందంట
సంజ మాటున దాగీ పంజా విసిరిందంట
తోటరాముని తొడకు కాటా తగిలిందంటా
కంజూ కన్నీ రెట్టెరా! ఓ విలుకాడ!
నెమలీ నాట్యము మానెరా! ఓ చెలికాడ!
నెమలీ నాట్యము మానెరా!

ఈ పాటలో ఇంకా జింకా లేడీ కుమిలి కుమిలి ఏడుస్తాయి, కాడు బర్రె వచ్చి బావురంటుంది. నల్లపిట్టలు, అల్లుపిట్టలు, గోగురిచ్చ, పైడికంటి సేవలు చేస్తే తోటరాముడు నవ్వీ లేచి నిలవగా, పల్లె విల్లంబవుతుంది. చిలుక చీటీ తేవడమనే మాటను శివసాగర్ ఆదిలాబాద్ కొండల్లో పరధాను అనే తెగకు చెందిన ఒక గిరిజనుడి నోట – కబురు వచ్చింది – అన్న అర్థంలో అనగా మొదట విన్నాడట. వెంపటాపు సత్యం చనిపోయినప్పుడు ఒక రైతు కామ్రేడ్ కాటా (తుపాకీ గుండు) తగిలింది తొడకేకానీ గుండెకు కాదు అన్నాడట. జైల్లో పక్కగదిలో ఉన్న నక్సలైటు నాయకుడు, ఆదిలాబాద్ జిల్లా రైతు కిస్టగౌడ్ (తర్వాత ఉరితీయబడ్డాడు)  అడవుల్లో ఉండే పిట్టలపేర్లు, చెట్టుల పేర్లు చెప్పాడట. తోటి విప్లవకారుల మరణాలు చావుదెబ్బలు కావు, తాత్కాలిక గాయాలేననీ, దెబ్బతిన్న గెరిల్లాలు అడవిబిడ్డల సహాయంతో కోలుకొని, బలపడి, తిరిగి పోరాటానికి సిద్ధపడతారనీ ప్రతీకాత్మకంగా చెప్పే ఈ పాటకి అవసరమైన సామాగ్రి అంతా అడవిబిడ్డలనుంచే తెచ్చుకున్నాడు ఈ కవి.

అలాగే బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది అన్న పాట వింటూండగా పుట్టిందట కీచకవధ (1972) కవిత

కొమ్మల్లో కోయిలమ్మ ఏమిటన్నది?
నెత్తురొలుకు పాటలనే పాడమన్నది

రెమ్మల్లో  రేగిపండు ఏమిటన్నది?
వీరుడొచ్చి పిలచువరకు పలుకనన్నది

మబ్బుల్లో చందమామ ఏమిటన్నది?
వెన్నెలంతా ఏటిపాలు చేయనన్నది

(వెన్నెలంతా ఏటిపాలు చేయకపోవడం నండూరివారి ఎంకి పాటను తిరగరాయడం.)

సూర్యోదయం కుట్ర కాదు
సూర్యుడు కుట్రదారుడు కాడు

అంటూ గోడల మీద ఒకప్పుడు తరచుగా కనిపించిన పంక్తులు గుర్తున్నాయా? ఆ పంక్తులు పార్వతీపురం కుట్రకేసులో కుట్రదారు వాజ్ఞ్మూలం (1973) పేర కవితారూపంలో శివసాగర్ కోర్టులో ఇచ్చిన  వాజ్ఞ్మూలంలోనివి.

 
 


About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.7 Comments


 1. Sivasaagar gaari kavitvam meeda vachina arudaina vyaasam. Chaala baagundi. Gadachina rojulu marokasaari gurtukochaayi.


 2. కవిత్వం లాంటి జీవితం – కార్తీక్ నవయాన్

  Rate This

  This is my article on K.G.Sathyamurthy (Shivasagar) appeared in Andhra Jyothi Telugu Daily News paper on 27th April 2012

  -B. Karthik Navayan

  సత్యమూర్తిని నిజాయితీగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవిగా అర్థం అవుతాడు; విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడుగా అర్థం అవుతాడు. పేదలకు అతనొక మహా పేదవాడుగా అర్థం అవుతాడు. తత్వవేత్తలకు అతనొక గొప్ప తాత్వికుడు. ఒక రచయితను అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సత్యమూర్తిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలతో పాటు అతని బ్రతుకును కూడా అర్థం చేసుకోవాలి.

  సాంప్రదాయ అగ్రకుల మధ్యతరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు సత్యమూర్తి దూరంగా ఉన్నాడు. అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు. అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు. సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మధ్య Contradiction లేదు. విప్లకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలంలో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు, తను వదిలి వెళ్ళిన పిల్లల దగ్గర గడిపాడు.

  2009 వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో ఒకరితో తిరుగుతూనే ఉన్నాడు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చి తన కూతురుతో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరువేరుగా చూడలేము. అతను ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఏ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజల మధ్య, అదే పేదల మధ్య బ్రతికాడు. అదే ఇతర కవులకు, సత్యమూర్తికి ఉన్న తేడా.

  సత్యమూర్తితో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే దృష్టి చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తికి చాలా స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంభీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు. సత్యమూర్తి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా రూమ్‌లో ఉండేవాడు. ఒకసారి నాకు కావాల్సిన భార్య మా కోసం సీతాఫల పండ్లు తీసుకొచ్చింది. సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. విజయ తీసుకొచ్చిందని చెప్పాను. విజయ తీసుకొస్తే సీతా ఫలములు అంటావేమిటి బాబు అవి విజయ ఫలాలు అన్నాడు.

  సత్యమూర్తి తన 75 సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాత జీవితం అంటే హైదరాబాద్‌లోనో బెంగుళూరులోనో కాదు. ఖమ్మం, వరంగల్ జిల్లా అడవుల్లో 2000-2002 సంవత్సరాల మధ్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది. అది కేవలం సత్యమూర్తికే సాధ్యం.

  ఒకసారి ఖమ్మం అడవి నుంచి సత్యమూర్తితో కలిసి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అప్పుడు నా దగ్గర పదివేల రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను. ‘సర్ ఒక వేళ పోలీసులు మనల్ని పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను నా దగ్గర గుర్తింపు కార్డు ఉంది, వారు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకెళ్తున్నానని చెబుతాను. మరి మీరేమి చెపుతారు?’. అపుడు సత్యమూర్తి ‘ఒకవేళ పోలీసులు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను’ వారికి కావాలంటే యిచ్చేస్తానని అన్నాడు.

  సత్యమూర్తిని లెక్క కట్టేసారు, అతను శ్రీశ్రీ తర్వాత అని లెక్కేసారు. దానికి కొలమానము ఏమిటో? నిజానికి సత్యమూర్తికి ఎవరితో పోలిక సరికాదు. అతను ఎవరి తరువాత కాదు. అతనికి అతనే సాటి. యిక్కడి విప్లవ కవులు అందరూ సత్యమూర్తి ద్వారా స్ఫూర్తి పొందినవారే. సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామాజిక విప్లవ నాయకుడు.

  అతను కవిత్వం మాత్రమే రాయలేదు. కవిత్వం సత్యమూర్తికి తన విప్లవ ఆచరణలో భాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తిని ఏ మాత్రం ఆచరణ లేని ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చూడండి. అందుకని పోలికలు వద్దు. సత్యమూర్తి విప్లవ కవిత్వమైనా, దళిత కవిత్వమైనా, విప్లవోద్యమమైనా, దళితోద్యమమైనా అగ్రశ్రేణిలో ఉంటాడు. అది సైద్ధాంతికమైనా ఆచరణ రీత్యానైనా సత్యమూర్తి సత్యమూర్తే.

  దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగా సత్యమూర్తిని నిర్లక్ష్యం చేసాయి. విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన… ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైనా సరే మౌనంగానే ఉన్నారు. ఈ పరిధుల నుంచి విప్లవోద్యమం, దళితోద్యమం బయటపడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి సత్యమూర్తి తన జీవితాన్ని అంకితం చేశాడు. పేదలు, దళితులు, పీడితులు, అణచబడిన జన గణాలు సత్యమూర్తి ఆలియాస్ శివసాగర్‌ని అనునిత్యం తలచుకుంటారు.

  – కార్తీక్ నవయాన్


 3. Kiran

  Chala bagundi.


 4. Jampala Chowdary

  శివసాగర్‌పై సతీష్ చందర్ సూర్య దినపత్రికలో వ్రాసిన వ్యాసం, నెలవంక కత్తి దూసింది, ఆయన బ్లాగులో చదవవచ్చు.
  http://satishchandar.com/?p=886


 5. Jampala Chowdary

  ఈరోజు ఆంధ్రజ్యోతి – వివిధ లో వరవరరావు వ్యాసంలో శివసాగర్ కవిత్వం గురించి మరిన్ని వివరాలు http://www.andhrajyothy.com/i/2012/apr/23-4-12vividha.pdf


 6. Kumar N

  Hmm!! Very Very Interesting!  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పుట్టపర్తి నారాయణచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
0

 
 

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య ...
by అతిథి
0

 
 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 

 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
2

 
 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2