A Poem at the Right Moment

పరిచయం చేసిన వారు: కె.వి.యస్. రామారావు
**************
A Poem at the Right Moment
by Velcheru Narayana Rao and David Shulman

(నారాయణ రావు గారి పరిచయం “తెలుగులో విప్లవాల స్వరూపం” సందర్భంలో ఇచ్చాను. ఇప్పుడు ఆయన సహ రచయిత డేవిడ్ షుల్మన్ గారి గురించి క్లుప్తంగా: డేవిడ్ డీన్ షుల్మన్ అమెరికాలో 1949లో జన్మించారు. ఇజ్రాయిల్ లోని హెబ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వివిధ రంగాల్లో చాలాకాలంగా పనిచేస్తున్నారు. ఈ బహుముఖప్రజ్ఞాశాలి అనేక భారతీయ భాషల్లో నిపుణుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సంస్కృత, తమిళ భాషల మీద మంచి పట్టు వున్న ఈ పరిశోధకుడు స్వయంగానూ ఇతరుల సాహచర్యంతోనూ భారతీయ సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. గత పదిహేనేళ్ళుగా నారాయణ రావు గారితో కలిసి ఏడు పుస్తకాలు రాశారు, ఇంకా ఎన్నో రాస్తున్నారు.)

పాశ్చాత్యులకి “రచన, దాని ప్రచారం” గురించి కొన్ని నిర్దిష్టమైన భావాలు గత నాలుగైదు వందల ఏళ్లుగా బలపడ్డాయి. ముఖ్యంగా, (అ) ఒక రచన వుంటే దాన్ని ఒకరు, లేదా కలిసి పనిచేసిన కొందరు, రచయితలు రాసి వుండాలి. (ఆ) ఒకే వస్తువు గురించిన రెండు భిన్న రచనలు వుంటే వాటిలో ఒకటి మాతృక, రెండవది దాని పుత్రిక ఐవుండాలి. (ఇ) కాలం ఏకముఖం, సరళం కనుక ప్రతి రచనకీ అది మొదలైన లేదా పూర్తయిన సంవత్సరం, వీలైతే తేదీ కూడ నిర్ణయించొచ్చు. (ఈ) ఒకసారి గ్రంధస్థమైన రచన స్థిరం, దానికి ఆ తర్వాత మార్పుండదు.

అలాగే, విక్టోరియన్ భావాలుగా ఇంగ్లండ్ లో మొదలై ప్రపంచ దేశాలకి పాకిన వాటిలో ముఖ్యమైంది శృంగారం ఏహ్యమని, నాగరిక సంఘంలో రచనలు “అమలిన” (అంటే “ప్రేమ” కేంద్రితమైన) రొమాన్స్ ని వర్ణించాలే తప్ప “మలిన” (అంటే “కామ” కేంద్రితమైన) శృంగారాన్ని తాకరాదనేది.

మిగిలిన వాళ్లలాగే గత నూరూ నూట యాభై ఏళ్లలో భారతీయ “విద్యావంతులు” ఈ భావాల్ని దిట్టంగా వంటపట్టించుకున్నారు. దాంతో ఒక రచన కనిపించిందంటే చాలు – దీన్ని ఎవరు రాశారు? వాళ్లు ఎక్కడ, ఎప్పుడు పుట్టారు, చనిపోయారు? ఈ రచన ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? వాళ్ల సమకాలికులెవరు? వాళ్ల పుట్టుపూర్వోత్తరాలేమిటి? వాళ్లు ఇంకా ఏం రాశారు? ఎలా బతికారు? ఎలా మరణించారు? ఈ రచనని వాళ్లు సొంతంగానే రాశారా లేక మరొకరిది కొట్టేసి సొంతపేరు కింద పెట్టేసుకున్నారా? – ఇలా అనేకానేక వ్యక్తినిష్టమైన ప్రశ్నలు వెయ్యటం మొదలు పెట్టారు. మన సాహిత్యం గురించి కుతూహలం కలిగిన పాశ్చాత్యులు ఇదే చేశారు, వాళ్లని అనుసరించి అనుకరించిన భారతీయులూ ఇదే పనిని రెట్టింపు ఉత్సాహంతో చేశారు. తెలుగుకు సంబంధించి కట్టమంచి రామలింగారెడ్డి గారి “కవిత్వ తత్వ విచారం” ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన తెలుగు సాహిత్యం మీద కక్షతో ఈ పని చేశారని కాదు, ఆయన పెరిగిన, తిరిగిన అప్పటి ఆలోచనా సంవిధాన వాతావరణం అలాటిది; ఆయన కేవలం ఒక ముఖ్యమైన ఉదాహరణ మాత్రమే. తెలుగు సాహిత్య విమర్శకులుగా పేరుమోసిన వాళ్లు దాదాపుగా అందరూ ఈ పాఠాలు వల్లెవేసిన వాళ్లే. ఈ భావాల ప్రభావాన మనం సంప్రదాయ తెలుగు సాహిత్యంలో తొంభై తొమ్మిది శాతాన్ని కట్టకట్టి కాలవలో పారేశాం, ఐతే అది వేరే సంగతి.

ఈ భావపరంపర పూర్వరంగంగా ఉన్న సందర్భంలో సి.పి.బ్రౌన్ తొలిసారిగా “చాటు పద్యాల్ని” సంకలించారు. ఐతే అవి ఆయన్నే కాదు, ఆ తర్వాత సంకలనాలు తయారు చేసిన వాళ్లందర్నీ ఎంతగానో తికమకపెట్టాయి. ఎందుకంటే, పైన చెప్పిన అభిప్రాయాల పరంగా ఒక రచనలో ఉండవలసిన లక్షణాలేవీ చాటుసాహిత్యం విషయంలో కనిపించవు. అంతేకాదు, చాటువులు ఆ పాశ్చాత్యభావనాసౌధాన్ని నేలమట్టం చేస్తాయి.

అది ఎలానో చూసే ముందుగా చాటుపద్యాల గురించి రెండుముక్కలు :

రెండు మూడు తరాల క్రితం వరకు తెలుగు ఉమ్మడికుటుంబ వ్యవస్థలో చిన్నపిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఎవరో ఒకరు పెద్దవారు పద్యాలు నేర్పించటం, ఆ పద్యాల గురించిన ఆసక్తికరమైన కథలు చెప్పటం ఆనవాయితీగా వుండేది. ఈ పద్యాలు చాలాభాగం పుస్తకాల్లోవి కావు, పరంపరాగతంగా ఎప్పట్నుంచో వస్తూ వున్నవి. వీటిలో కొన్ని “చాటు పద్యాలు”. ఇలాటి చాటువులు కొన్ని వందల పైగా ప్రచారంలో వుండేవి. చాలా మామూలుగా నిరక్షరాస్యులుగా కనిపించే వాళ్లు కూడ సంభాషణల్లో వీటిని అవలీలగా చొప్పించి మాట్లాడేవాళ్లు.

సహజంగానే ఈ చాటుపద్యాలు పాశ్చాత్యుల భావప్రపంచంలో ఇమడలేదు. వీటి రచయితలెవరో స్పష్టంగా తెలియదు. ఒకవేళ తెలిసినట్టనిపించినా ఆ రచయిత గురించి మనకు అదివరకే తెలిసిన విషయాలకీ ఈ పద్యాలు, వాటి వెనక కథలకీ పొంతన కనిపించదు. చాటుపద్యాల్లో కనిపించే వ్యక్తులే వాళ్లపేరిట చెలామణీ ఔతున్న పుస్తకాలు కూడ రాశారంటే నమ్మటం కష్టంగా వుంటుంది. దానికి తోడు చారిత్రకంగా ఒకేకాలంలో లేని పాత్రలు చాటుపద్యాల్లో ఒకచోట ఒకేకాలంలో ఉండటమే కాదు, వాదించుకోవటం, చమత్కారసంభాషణలు చేసుకోవటం చూస్తాం. పులి మీద పుట్ర లాగా చాటువుల్లో బోలెడన్ని బూతు పద్యాలు! చాటు కథల ప్రకారం ఆ పద్యాల్ని చెప్పినవాళ్లు, గొప్ప పుస్తకాలు “రాసిన” చాలా పెద్దవాళ్లు!! పైగా చాటుపద్యం స్థిరం కాదు. ఒక పద్యాన్ని తీసుకుని సందర్భాన్ని తగ్గట్టు దాన్ని మార్చి వాడుకోవటం కూడ మామూలే. ఇలా ఒక రచనకి ఉండవలసిన కనీస లక్షణాలు కూడ కనిపించని చాటువుల్ని ఏమనాలో ఎలా రచనానిర్వచన చట్రంలో ఇమిడించాలో తెలియక సాహితీదిగ్దంతులు తలలు పట్టుకున్నారు.

ఉదాహరణకి కాళిదాసు, దండి, భవభూతి ఒక కాలం వారు కారు. కాని చాటువుల్లో వీళ్లు ముగ్గురూ ఒకేకాలంలో ఒకేచోట వుంటారు, ఒకరి రచనల గురించి మరొకరు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదెలా సాధ్యం? అలాగే, మనకు తెనాలి రామలింగడున్నాడు. ఇతనూ, పాండురంగ మహాత్యం రాసిన తెనాలి రామకృష్ణుడూ ఒకరేనా? చారిత్రకంగా రామకృష్ణుడు కృష్ణదేవరాయలు బతికుండగా పుట్టలేదు. కాని చాటు కథల ప్రకారం రామలింగడు కృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఒకడు. అసలు “నిజంగా” అష్టదిగ్గజాలు ఉన్నారా లేరా? ఉంటే వాళ్లెవరు? వాళ్లలో రామకృష్ణుడో రామలింగడో ఉన్నాడా లేడా? మరొకటి – చారిత్రకంగా శ్రీనాథుడు పోతనకి ముందువాడు. వాళ్లిద్దరూ బావామరదులు అయే అవకాశమే లేదు. మరైతే వాళ్ల గురించిన చాటుపద్యాల సంగతేమిటి? ఇక వేములవాడ భీమకవి – ఎప్పటివాడో తెలియదు, ఏం చేశాడో ఏం రాశాడో తెలియదు. అతని గురించిన అద్భుతమైన కథలు మాత్రం చాటుస్రవంతిలో వున్నాయి. అవెలా వచ్చాయి? వాటిని ఎవరు రాశారు?

రచనల గురించిన పాశ్చాత్య భావాలు ఆమూలాగ్రంగా నిస్సంశయంగా భారతీయ సాహిత్యం అంతటికీ సమంగా వర్తిస్తాయనే నమ్మకమే ఈ అనర్థాలన్నిటికీ మూలకారణమన్నది ఈ A poem at the Right Moment అన్న గ్రంథం వెలువరించే ఒక ముఖ్యమైన సిద్ధాంతం. భారతీయ సాహిత్య ప్రపంచం, అందునా దక్షిణభారతీయ సాహిత్యప్రపంచం స్వనియమ చోదితం. అంటే, దాని నియమాలు దానివి, వాటి ప్రకారం అది నడుస్తుంది. దాని సూత్రాలు దానికున్నాయి కాని అవి పాశ్చాత్యులు నిర్ణయించినవి కావు, చాలా పార్శ్వాల్లో వాటికి విముఖాలు. అలాగే, ఈ సాహిత్యం అంతా ఏకసూత్ర బద్ధమైంది కాదు. సాహిత్యంలో ఎన్నో రకాలున్నాయి, ఒక్కో రకానికి వేరే సూత్రాలున్నాయి. స్థూలంగా చూస్తే పుస్తకరూపంలో వున్న సాహిత్యానికి, మౌఖికప్రచారంలో వున్న సాహిత్యానికి చాలా మౌలికమైన భేదాలున్నాయి. మౌఖికసాహిత్యంలో ఒకభాగమైన చాటుసాహిత్యానిది మిగిలిన భాగాల్తో భిన్నమైన ఒకమార్గం. చాటుసాహిత్యానికి ఒక వ్యవస్థ వుంది. ఆ వ్యవస్థకి ఒక నిర్మాణం వుంది. ముందుగా ఇది గుర్తించటం అవసరం. గుర్తించి ఆ నిర్మాణదృష్టితో చూస్తే పైపైకి సమస్యాల్లా కనిపించేవన్నీ మాయమౌతాయి. చాటుసాహిత్యపు అంతరంగ విన్యాసం సుందరం, సుమధురంగా దర్శనమిస్తుంది.

సాహిత్య స్వరూప స్వభావాల గురించి ఇంత లోతైన అవగాహన పునాదిగా నిర్మితమైంది ఈ గ్రంథం. తెలుగు, సంస్కృత, తమిళ చాటుసంప్రదాయాల్ని కలబోసి, నిశితంగా పరిశీలించి, విశ్లేషించి చాటుసాహిత్యప్రపంచపు నిర్మాణ, సంచాలన రహస్యాల్ని ఆకళించుకుని వాటిని సరళంగా స్పష్టంగా సోదాహరణంగా వివరిస్తుంది. చాటుసాహిత్య వ్యవస్థ తనదైన ఒక బహిరంగస్థలం (public space)లో విహరిస్తుందని, దీన్ని నిర్మించి, పెంచి, పోషించిన వారు సాహితీపిపాసులు రసికులైన ఔత్సాహికులు, రాజాస్థానాల నుంచి దూరంగా ఉన్న సమర్థులైన కవులై వుంటారని ప్రతిపాదిస్తుంది. వాళ్లు ఈ చాటువ్యవస్థను సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విమర్శకి పదునైన ఆయుధంగా వాడారని చూపిస్తుంది. ఈ వ్యవస్థ ముఖ్యంగా మధ్యయుగంలో బాగా వూపందుకున్నదని నిరూపిస్తుంది. అలా, ఈ గ్రంథం సాహిత్య విమర్శలో ఒక కొత్త కోణాన్ని చూపుతుంది. ఒక కొత్త మార్గానికి దారి తెరుస్తుంది. పాఠకులకి ఒక కొత్తచూపు నిస్తుంది.

నారాయణ రావు, షుల్మన్ లు ప్రతిపాదిస్తున్న ఈ కొత్త దృక్పథం ఒక్కసారిగా చాటుపద్యవ్యవస్థ మీదే కాదు, భారతీయ సాహిత్యప్రపంచం మొత్తం మీదా కొత్తవెలుగుని ప్రసరిస్తుంది. పాశ్చాత్య భావాల్లో ఏవి భారతీయ సాహిత్యంలోని ఏ భాగాలకు వర్తిస్తాయి, వేటికి వర్తించవు? వర్తించని సందర్భాల్లో అవసరమైన కొత్తభావాలు ఏమిటి? వాటిని పసిగట్టటం కనిపెట్టటం ఎలా? మూసపోత వల్ల గుట్టుమట్టులు తెలియవు, ఏ రంగమూ homogeneous కాదు, ప్రతి దాన్లోనూ ఎన్నో విశిష్టమైన, విభిన్నమైన, ప్రత్యేకమైన భాగాలుంటాయి. “చేతిలో సుత్తి వుంటే ఎదురుగా అన్నీ సీలల్లానే కనిపిస్తాయి” అన్న అమెరికన్ సామెత లాగా అన్నిటికీ ముందూ వెనకా చూడకుండా ఒకటే విశ్లేషణా పద్ధతి ఉపయోగించటం సోమరుల మార్గం. లోతుకు వెళ్తేనే రహస్యాలు తెలుస్తాయి. ఏ పనికి ఏ పనిముట్టు వాడాలో దాన్నే వాడాలి. తెలుగు సంప్రదాయ సాహిత్యం అంతా ఒకే మూసలోంచి వచ్చింది కాదు. దాన్ని ఒక మూసలో ఒదిగించటానికి ప్రయత్నించకూడదు. ఇదీ ఈ పుస్తకం చేసే ప్రధాన ప్రతిపాదన.

ఈ పుస్తకంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి. (అ) ముందుమాట, (ఆ) కొన్ని చాటు పద్యాల మూలాలు, వాటికి ఆంగ్లానువాదాలు, (ఇ) చివరిమాట. ముందుమాట చాటుపద్యాలని పరిచయం చేస్తుంది, పుస్తకం ప్రతిపాదించే చాటుపద్యవ్యవస్థని స్థూలంగా వివరిస్తుంది. మధ్యభాగం కొన్ని ఎంచి కూర్చిన చాటుపద్యాల్ని, వాటి ఆంగ్లానువాదాల్ని, ప్రతి పద్యానికి అనుసంధానమైన కథని ఇస్తుంది. ఈ పుస్తకానికి నిజమైన వెన్నెముక మూడవ భాగం. చాటుపద్యవ్యవస్థని నిర్మాణాత్మకంగా ప్రతిపాదిస్తూ దాన్లోని అనేక పార్శ్వాల్ని సోదాహరణంగా, విపులంగా, భిన్నకోణాల్నుంచి విశ్లేషిస్తుంది. సంస్కృత, తెలుగు, తమిళ చాటు వ్యవస్థలు మౌలికంగా ఒకేరకమైనవని నిరూపిస్తుంది. ఈ వ్యవస్థల్లో పాత్రలు, వాటి జీవనరేఖలు, జీవితవిశేషాలు, చాటు పద్యాలు చాటే సంఘటనలు ఎంత సమతుల్యాలో చూపిస్తుంది. ఉదాహరణకు, సంస్కృతంలో కాళిదాసు, తెలుగులో భీమకవి, తమిళంలో కాలమేకర్ – చాటుసంప్రదాయం ప్రకారం వీళ్లెవరూ స్వతహాగా కవులు కారు. ముగ్గురూ మూడు విధాలుగా దైవకృప (కాళిదాసుకు కాళిక, భీమకవికి భీమేశ్వరుడు, కాలమేకర్ కి పార్వతీదేవి) వల్ల కవులౌతారు. వశ్యవాక్కులౌతారు. వాక్కుతో భౌతికప్రపంచాన్ని శాశించగలిగే వాళ్లౌతారు. సంస్కృతానికి భోజరాజూ అతని ఆస్థానంలో నవరత్నాలూ వుంటే తెలుగుకి కృష్ణదేవరాయలూ అతని అష్టదిగ్గజాలూ ఉన్నారు.

చాటు సంప్రదాయంలో కవులు రవి కాంచనివి కాంచగలిగేవారు. వీళ్లకీ లిఖితసంప్రదాయం లోని కవులకీ ఒకే పేర్లు వుండొచ్చు కాని భౌతికంగా ఒకటి కారు. పురాణాలన్నిటికి వ్యాస కర్తృత్వం ఇచ్చేసినట్టు, పురాణకథల ఆధునిక రూపాల్లో ఎక్కడ ఏ రెండు పాత్రలకి మధ్య ఘర్షణ కావలసి వచ్చినా నారదుడిని ప్రవేశపెట్టినట్టు, చాటుపద్యాల పాత్రలు కేవలం ప్రతీకలు (caricatures). ఆ వ్యవస్థకి సంబంధించినంత వరకు వాళ్ల గురించిన కథలు నిజాలే. అవి చారిత్రక సత్యాలు కావాలని కోరటం అలా కోరేవాళ్ల అజ్ఞానం ఔతుందే తప్ప చాటువ్యవస్థలో లోపం కాదు. ఇంకా సూటిగా చెప్పాలంటే చాటువుల్లో శ్రీనాథుడు శృంగారనైషథ కర్త కాడు. నవరత్నాలూ, అష్టదిగ్గజాలూ భౌతికప్రపంచం వారు కారు. దీని అర్థం మనకు దొరికే చాటువుల్లో కొన్నిటిని చారిత్రక శ్రీనాథుడు చెప్పి వుంటాడని కాదు, చెప్పి వుండడనీ కాదు; ఏది చెప్పటానికీ తగిన ఆధారాలు మనకు దొరకవని మాత్రమే. చాటుప్రపంచంలో వున్న కథల్ని చారిత్రక సత్యాలు నిర్ణయించటానికి వాడకూడదు. అలాగే చారిత్రక సత్యాలు చాటుప్రపంచంలో సత్యాలు కానక్కర్లేదు. ఈ రెండూ వేరు వేరు వ్యవస్థలు. దేని గుణాలు, నియమాలు, ధర్మాలు దానివి.

ఎంతో పనితనంతో రాసిన ఈ పుస్తకాన్ని పాఠకులు ఎవరికి వారే చదివి, ఆస్వాదించి ఆనందించాలి. మీకు ఆంగ్లం అంతగా రాకపోయినా, చాలా పదాలకు అర్థాలు తెలియకపోయినా వెనకాడవలసిన పనిలేదు. తాత్పర్యం సర్వం చక్కగానే బోధపడుతుంది.

ఇంత అద్భుతమైన గ్రంథాన్ని చేతబట్టి కొందరు కుహనావిమర్శకుల్లాగా “ఫలానా పద్యాన్ని ఆంగ్లంలోకి ఎలా తర్జుమా చేశారు? తెలుగులో ఈ పదానికి ఆంగ్లంలో ఆ పదం సమానార్థకం ఎలా ఐంది? తెలుగులో నాలుగు పాదాల పద్యం ఆంగ్లంలో ఆరుపాదాల్లో ఎలా వుంది?” లాటి అర్థరహితమైన ప్రశ్నలు వేసుకుని సమయం వృథా చేసుకోకండి. భారతీయసాహిత్య ప్రపంచాన్ని కొత్తచూపుతో చూడటానికి అనువు కలిగించే ఇంత మౌలికమైన సిద్ధాంత సంవేచన ఇప్పుడు “పుస్తకం” పాఠకులకు తేలిగ్గా అందివస్తున్నది – 1998లో యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బర్క్ లీ వారు ప్రచురించిన ఈ పుస్తకం అదృష్టవశాత్తు ఇప్పుడు ఇంటర్నెట్ మీద ఉచితంగా చదువుకోవటానికి లభిస్తున్నది. ఆ లంకె ఇక్కడ ఇస్తున్నాను. అది అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు కనుక వీలైనంత త్వరగా వెళ్లి చదవమని నా సలహా. ఒకటికి రెండు సార్లు చదవండి. చాటుప్రపంచ తత్వం గురించి ఈ ప్రపంచప్రఖ్యాత విమర్శకులు ఎలాటి వింతలూ విడ్డూరాలూ వండి వడ్డిస్తున్నారో ఆరగించండి ఆస్వాదించండి అరిగించుకోండి. ఆ తర్వాత సాహిత్యం కొత్తగా కనిపిస్తుంది. అందులో కొత్త సంగీతం వినిపిస్తుంది.

****
(ఈ పుస్తకం గురించి ఇదివరలో సాయి బ్రహ్మానందం గొర్తి గారు రాసిన పరిచయం ఇక్కడ చదవండి. అలాగే, ఈమాట.కాం పత్రికలో వేలూరి వెంకటేశ్వర రావు గారి పరిచయ వ్యాసం ఇక్కడ చదవండి.)

పుస్తకం వివరాలు:
A Poem at the Right Moment: Remembered Verses from Premodern South India (Voices from Asia)
Velcheru Narayana Rao and David Shulman
Paperback: 195 pages
Publisher: University of California Press; 1 edition (May 15, 1998)
Language: English
ISBN-10: 0520208498
ISBN-13: 978-0520208490
Amazon link here.

You Might Also Like

3 Comments

  1. ఈమాట » వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం

    […] పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో లభ్యం. ఈ పుస్తకం […]

  2. The Sound of the Kiss, or The Story That Must Never Be Told | పుస్తకం

    […] ప్రతిపాదించబడ్డ ఈ అతిలౌకికశక్తిని A poem for the right moment సందర్భంలో నారాయణ రావు గారు […]

  3. The Poet Who Made Gods and Kings | పుస్తకం

    […] A Poem for the Right Moment సందర్భంలో చెప్పినట్టు మనకు ఇద్దరు శ్రీనాథులున్నారు – శృంగార నైషథం మొదలైన గ్రంథాలు రాసిన “పుస్తక శ్రీనాథుడు” ఒకరైతే చాటు పద్యాలలో కనిపించే “చాటు శ్రీనాథుడు” మరొకరు. శ్రీనాథ సాహిత్యం మీద పరిశోధనలు చేసిన చాలా మంది పెద్దలు ఈ రెండు రూపాల్నీ కలగలిపేసి, వారిద్దరూ ఒకరే అని భ్రమించటంతో శ్రీనాథుడి మీద జరిగిన చాలా పరిశోధనలు ఈ రెండు పార్శ్వాల్ని సమన్వయం చేయటానికి చేసిన వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. “చాటు శ్రీనాథుడి” ప్రసక్తి కొంత చివర్లో వచ్చినా ఈ గ్రంథం “పుస్తక శ్రీనాథుడి” గురించి, గ్రంథస్థమైన ఆయన ప్రతిభాపాటవాల గురించి. దీనివల్ల ముందుగా శ్రీనాథుడి గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తొలిగిపోతాయి. ఉదాహరణకి, శ్రీనాథుడి చివరిదశ చాలా దయనీయంగా గడిచిందనేది. చాటు సంప్రదాయపు శ్రీనాథుడు చివరిదశలో వ్యవసాయం చెయ్యబోయి అన్నీ పోగొట్టుకుని దుర్భరజీవితాన్ని భరిస్తూ “అమరకవివరు గుండియల్ దిగ్గురనగ” అమరపురికి ప్రయాణించాడు. కాని భౌతికశ్రీనాథుడి అనుభవం ఇందుకు చాలా భిన్నంగా వుండివుండాలని ఈ పరిశోధకుల అభిప్రాయం. ఎందుకంటే ఆయన గ్రంథాల ఆధారంగా చూస్తే వయసు పైబడిన నాటి శ్రీనాథుడు కవిగా గుర్తింపు పొందటంలో మంచి ఉచ్ఛస్థితికి చేరుకున్నాడు – ఒక్కొక్క కొత్త గ్రంథరచనతో ఒక్కొక్క మెట్టే పైకెక్కుతూ చివరి గ్రంథం కాశీఖండంతో ఒక నిఖార్సైన రాజుగారి ప్రాభవాన్ని సంపాదించాడు. ఆ సందర్భానికి కొంచెం ముందుగానే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో డిండిమభట్టుని ఓడించాడు, అతని కంచుఢక్కని పగలగొట్టించాడు, కనకస్నానం చేయించుకున్నాడు, “కవిసార్వభౌముడి”గా తన్ను తను చెప్పుకోగలిగాడు. అంతకుముందు ఆయన గ్రంథాల్ని అంకితమిచ్చిన వాళ్లందరూ చాలా చిన్నవాళ్లు – ఊరి కరణాల నుంచి చిన్న సంస్థానాధీశుడి దగ్గర వుండే మంత్రుల వరకు మాత్రమే. కాని రానురాను తెలుగు దేశం మొత్తం తిరిగి ఎక్కడెక్కడి పండితకవుల్నీ సాహిత్యవాదాల్లో జయించి, తెలుగు భూములన్నిటా తనే అగ్రేసర కవినని చాటిచెప్పుకున్నాడు. అంతేకాదు, (నారాయణ రావు గారు ఇదివరకే ప్రకటించినట్టు) అప్పటివరకు లేని ఒక తెలుగు రాజ్యం సరిహద్దుల్ని తన సాహితీవిజయపరంపరల్తో భౌగోళికంగా కూడ చూపించాడు. ఇది ముందుముందు కృష్ణదేవరాయలికి ఒక నమూనాగా పనికొచ్చింది. […]

Leave a Reply