పుస్తకం
All about booksపుస్తకాలు

January 2, 2009

గుంటూరు శేషేంద్ర శర్మ

More articles by »
Written by: chavakiran
Tags:

రాసిన వారు: చావాకిరణ్
*************

ఈ పుస్తకం గురించి నేను చెప్పబోయే ముందు, పుస్తకం అట్టపై వెనక వ్రాసిన విషయం చదవడం బాగుంటుంది.

seshemdhra_cover1“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు. “ప్రసిద్ద దాక్షిణాత్య ఆధునిక కవులు” ప్రచురణమాలికలో మూడవదిగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని వెలువరుస్తుంది.

సుప్రసిద్ద విమర్శకులు కడియాల రామమోహన రాయ్ ఈ గ్రంథాన్ని కూర్చటమే కాక విలువైన సంపాదకీయాన్ని కూడా సంతరించారు. ఆధునిక కవిత్వాన్ని క్రమం తప్పకుండా అనుశీలిస్తూ ఎప్పటికప్పుడూ కవిత్వంలో వచ్చే మార్పులను వివిధ ధోరణులను, ఉద్యమాలను నిశితంగా పరిశీలిస్తూ కవిత్వాన్ని అంచనా కట్టే అరుదైన విమర్శకులుగా పేరు పొందారు. శేషేంద్రశర్మగారి కావ్యాలలోని ముఖ్యభాగాలను వీలైనంత సంక్షిప్తంగా, సమగ్రంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ కూర్పుకు ఓ నిండుతనాన్ని తెచ్చింది.”

నేను ఈ పుస్తకాన్ని మొన్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ద్రావిడ వివి(విశ్వవిద్యాలయం) స్టాలులో కొన్నాను. మొదటిసారిగా శేషేంద్ర శర్మ గారి గురించి సాలభంజికల్లో చదివాను. శర్మ గారి ఏకైక సినిమా పాట “నిదురించే తోటలోకి ” గురించి వారు వివరించారు. అప్పటినుండి శేషేంద్ర గారి కవితలు చదవాలనుకుంటున్నాను. కాకపోతే చదవాల్సిన పుస్తకాలు చాలా ఉండటంతో ఏమీ కొనలేదు. ఈ మద్యలో రెండు మూడూ సార్లు విశాలాంధ్రకు వెళ్లినా ఇతని కవితల పుస్తకాలు చూసిన జ్ఞాపకం లేదు. ద్రవిడ  వివి స్టాలులో ఈ పుస్తకం చూడగానే, వెల 50/- చూడగానే సరే చదువుదాం అని కొన్నాను.

మీరు కవిత్వం చదివే వారయితే, ఇంతవరకూ శేషేంద్ర కవిత్వాన్ని రుచి చూడని వారయితే మీరు కూడా ట్రై చెయ్యవచ్చు. ఈ కవిత్వంలో ఘాడత ఉంది. ఒక్కొక్క కవిత సులభంగా ఉంది, చదివిన ప్రతిసారీ కొత్త అందాలు కనిపిస్తున్నాయి. మన వాళ్లు అమెరికాలో ఆకురాలే కాలాన్ని రంగురంగుల ఫోటోల్లో చూపినట్టు ఈ కవిత్వంలో అన్ని రంగులు ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని పదాలు అర్ధాలు తెలీనివి తేలియాడుతున్నాయి. ఓపిక చేసుకొని నిఘంటువులో వాటి అర్థాలు వెతికి తరువాత కవితను చదివితే మధురం.  ఉదాహరణకు :
శాద్వలలు – పచ్చిక బయళ్లు
శక్రచాపం – ఇంద్ర ధనస్సు
ఇతని కవిత ఎంత హాయిగా ఉంటుందో మచ్చుకు ఈ కవిత చూడండి
మయూర పర్వం
ఎందుకు వస్తున్నాయి ఈ అందమైన భావాలు
నిశ్బబ్ద బంధురమైన నామందిరంలోకి
ఈ అందాల అతిథ్యులకు ఏ ఆతిథ్యం ఇవ్వగలను?
వెన్నెల బాటలు విడిచివచ్చిన
అప్సరసల గుంపుల్లా వస్తున్నాయి
ద్వారాల్లేని ద్వార బంధాల్లేని ఈమందిరంలోకి
ఆకాశపు నిర్మల నీలోదకాల తీరాలనుంచి
దిగివచ్చేలేయెండల్లా
వస్తున్నాయి.

*******************
గుంటూరు శేషేంద్ర శర్మ (Gunturu Seshendra Sharma)
కూర్పు : కడియాల రామమోహన రాయ్ (Kadiyala Ramamohan Roy)
ద్రావిడ విశ్వవిద్యాలయం
శ్రీవివాసవనం, కుప్పం – 517425
ప్రచురణ సంఖ్య 124
వెల 50 రూపాయలు
ప్రచురణ : ప్రసారాంగ
ద్రావిడ విశ్వవిద్యాలయం
ప్రతులకు:  రిజిస్టార్
ద్రావిడ విశ్వవిద్యాలయం
శ్రీనివాసవనం, కుప్పుం – 517425

ముద్రణ: విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి

–  ఈ వ్యాస రచయిత: ఒరెమునా.About the Author(s)

chavakiran

చావాకిరణ్ కినిగె వ్యవస్థాపకుల్లో ఒకడు, ప్రస్తుతం కినిగె డైరెక్టర్, ప్రోగ్రాం మేనేజర్. గతంలో ఏడేళ్లు మైక్రోసాప్ట్ - హైదరాబాద్లో , అంతకు ముందు ఒక వర్షం హెచ్ పీ బెంగుళూరులోనూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. పుస్తక పఠనం, కవితలు, కథలు, నవలలు వ్రాయప్రయత్నించటం హాబీలు. - http://chavakiran.com8 Comments


 1. praveen kumar

  నేను ఈ పుస్తకం కోసం చాల ట్రై చేశా నాకు ఈ బుక్ ఎక్కడ దొరుకుంది చెప్పగలరా ప్లీజ్ . లేదంటే అడ్రస్ మెయిల్ చేయగలరు.


 2. […] తెలుసుకున్నాను. కాలరేఖ, రక్తరేఖ – గుంటూరు శేషేంద్రశర్మ : ఒక గొప్ప మేధావి, కవీ అయిన ఈయన రాసిన […]


 3. వంశీ

  ఆయన ఆధునిక మహాభారతాన్ని ఆద్యంతం పలుమార్లు పారాయణం చేసాను. అదొక మహోత్కృష్ట గ్రంథం అని నా ధృడాభిప్రాయం. దురదృష్టవశాత్తూ నా ప్రతి పోయింది. అక్కడి నుంచి విశాఖపట్నం విశాలాంధ్రకి ఎన్నిసార్లు వెల్లి అడిగినా లేదనే చెప్పారు. చివరకు మీరు అది ద్రవిడ వివి నుంచి ప్రచురణ ఐనట్లుగా చెప్పి చాలా మేలు చేసారు. కనీసం విశాలాంధ్రకి వెల్లడం వ్యర్ధం అనైనా తెలిసింది.
  ఆయన తదుపరి గ్రంధం జనవంశం అనుకుంటా, అది ఆ.మ. అంత గొప్పగా లేదని చెప్పక తప్పదు.


 4. […] holiday. On one of those Mondays I wrote a Telugu parody poem (the original being written from Guntur ShesheMdhra Sarma) The above verses are translation of that […]


 5. యోగి

  సౌమ్య గారూ –
  బహుశా నేను సరిగ్గా చూడలేదేమో! మీరు పేర్కొన్న పబ్లిషర్ల ను సంప్రదించి చూస్తాను.
  కృతజ్ఞతలు!


 6. సౌమ్య

  @Yogi: శేషేంద్ర శర్మ వి బోలెడు పుస్తకాలు ఉన్నాయి hyd book fair లో. కరెక్ట్ గా ఏ స్టాల్ లో చూశానో గుర్తు లేదు కానీ – విశాలాంధ్ర/ప్రజా శాక్తి/ఎమెస్కో మూడింటిలో ఒకదానిలో ఉన్నాయి. నేను కాస్త లోతుగా చూసిన తెలుగు స్టాళ్ళు ఇవే. వాటిలో ఎందులోనో ఈయన పుస్తకాలు చూసాను.


 7. యోగి

  ఆఁహాఁ! శేషేంద్ర గురించి ఎవరైనా రాస్తే బావుండు అనుకుంటున్నా…. అప్పుడే ఈ వ్యాసం. కృతజ్ఞతలు.
  పుస్తక ప్రదర్శన అంతా కలియదిరిగినా నాకు శేషేంద్ర గారి పుస్తకాలు కనబడలేదు 🙁

  మన తెలుగు సాహిత్య ప్రపంచపంచంలో నెగ్గుకురావాలంటే ఎన్నో రాజకీయాలు! అవార్డులకోసమూ రివార్డుల కోసమూ పైరవీలు చెయ్యకుండా ముక్కుసూటిగా తన పని తను చేసుకుపోయిన మనిషి శేషేంద్ర. ఆయన రచనలు భారతీయ భాషలతో పాటు గ్రీకు, రష్యన్, స్పానిష్ ల లోకి కూడా అనువదింపబడ్డాయి.

  సౌకుమార్యం, అందం మాత్రమే కాదు నిప్పురవ్వలూ ఉన్నాయి…

  “సముద్రం ఒకడి కళ్ళముందు కూర్చుని మొరగదు
  తుఫాను గొంతుకి “చిత్తం” అనడం తెలియదు
  నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు, కానీ
  కలమెత్తితే నాకు ఓ దేశపు జెండాకున్నంత పొగరుంది”

  “అభ్యుదయ కవిత్వం” పేరుతో అవాకులూ చెవాకులూ రాసి భుక్తి గడుపుకునే వారి ని ఉద్దేశ్యించి:

  “పగిలిన క్యాబేజీ వాడి తల. వీధి చివర కాలేజీ వాడి వల”

  ఎప్పుడో ఇంటర్మీడీట్ లో చదివాను… మళ్ళి ఎప్పుడో..


 8. పస్య

  శేషేంద్ర శర్మ గారి కవితలు – కొన్ని చదివాను. కొన్ని “ఋతు ఘోష”, “శేష జ్యోత్స్న” వంటి సంకనాలలో పద్యాలు కూడా ప్రయత్నించి చేతులెత్తేసి, ఆఖరుకి “కాలరేఖ”, “రక్తరేఖ” ఇలా వ్యాసాలు చదవడంలో ఉన్నాను ప్రస్తుతం. మీ పుస్తక పరిచయానికి ధన్యవాదాలు. ఆయనొక extra-ordinary genius. ఎందుకో మరి ఇన్ని బ్లాగులూ అవీ చూస్తున్నా కూడా ఆయన గురించి ఎక్కడా ఒకటీ అరా తప్ప కనబళ్ళేదు 🙁  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

మరువలేని మాటలు: గుంటూరు శేషేంద్ర శర్మ

ఈ ఏడు మొదలుపెట్టాలి అనుకున్న శీర్షికల్లో ఒకటి – మరువలేని మాటలు అని రెండో వార్షికో...
by అసూర్యంపశ్య
2

 
 

రక్తరేఖ – గుంటూరు శేషేంద్ర శర్మ

“రక్తరేఖ” (Rakta Rekha) అలియాస్ “The arc of blood” అన్న పుస్తకం గుంటూరు శేషేంద్ర శర్మ ఆలోచనల సమా...
by అసూర్యంపశ్య
6