గురు ప్రసాద శేషము (త్రిపుర గురించి కనక ప్రసాదు)

గురు ప్రసాద శేషము
-కనక ప్రసాదు

త్రిపుర కథలు చదివి త్రిపుర కోసం వెదుక్కున్నాను. త్రిపురే దొరికితే క్రమంగా కథల్నింక మర్చిపోయేను. త్రిపుర పుస్తకాలు ఆయన ప్రజ్ఞ లోతులకు చిన్నపాటి మచ్చు తునకల్లాగ ఉండి ‘ఇవెందుకులే త్రిపురే ఉండగా!’ అనిపిస్తాయి. ‘రామ్‌సే బడా రామ్ కా నామ్ – అంత్ మే నిక్‌లా యే పరిణామ్’ అని పాటున్నాది. నామ్‌సే బడా రామ్‌లాగయ్యింది నాకు. కథలు, కవితలంటే ఒట్టి ‘మాటలు’ కావు, వాటికంటె చాల లోతైనవి, విస్తారమైనవని, సృజనకు ఆయువుపట్టు కవి సాహితీ మూర్తిమత్వమని త్రిపురను చూసి చూసి, చదివీ, వినీ గ్రహించుకున్నాను. త్రిపుర సారస్వత మూర్తిని, సృజనాంతరంగాన్నీ దగ్గిరిసా పరిశీలించి, అవి మౌనంగా పంచిచ్చే కరుణను, స్వస్థతను, పాఠాన్నీ అనుభవంలోనికి తెచ్చుకొనే అపురూపమైన అవకాశం, అదృష్టం నాకు దక్కేయి. త్రిపుర స్మృతిని, ఆయన ప్రజ్ఞనూ ఆయనతో నా పాతికేళ్ళ అనుబంధాన్ని తీరు తీరులుగా నెమరు వేసుకోటం నాకు గొప్ప ఆనందం, తెరిపి. అందుకే రాయటానికి ఒప్పుకున్నాను. కాని దానికి చాల వ్యవధీ, జాగా కావాలి. ఎంతో విస్తారమైన వాటిని, లోతైన వాటిని మాటలతో వాక్యాలతో కాసిన్ని పేజీల్లోకి కుదించటంలోని నొప్పి సలిపే పుప్పి పంటిని ఒడుపుగా సగం సగం నొక్కుకున్నలాంటి సుఖమైన బాధ; త్రిపురనే చదివితే తెలుస్తుంది. గుండెల్లో ఎంతో ఉండీ ఎటూ ఏమీ అనలేనితనమే ఆధునిక జీవితపు భీభత్సపు మౌలికమైన లక్షణమని, దానికి ఆకృతినివ్వటమే సృజనకారుల పని అనీ Beckett అన్నారు – “To find a form that accommodates the mess, that is the task of the artist now” అని. నైరూప్యమే అసలు రూపం, జీవితానికి అమిరే రూపమని త్రిపుర. త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి. అందుకే ఈ కథలు త్రిపుర సృజనకు కేవలం ప్రవేశికలు. బెకెట్ రచనలూ ఇంతే. బెకెట్‌ని చదువుకుంటే త్రిపుర ఇంకా అర్ధమౌతారు.

Beckett తో, ఆయన సృజన తత్వంతో త్రిపురకు, ఆయన సృజన తత్వానికీ కొట్టొచ్చినట్టుండే పోలికలు తవ్వుతున్న కొద్దీ అబ్బురంగా, ఇంకా తవ్వాలని ఉత్సాహంగా ఉంటుంది. బెకెట్ చెప్పిన mess ఆధునిక జీవితపు భీభత్సానికి, అర్ధ రాహిత్యానికీ, అంతరంగ వైకల్యానికీ సూచన. ధర్మం, దైవం, కుటుంబం, సంఘం వంటి వ్యవస్థలు, వాటిమీది నమ్మకాలు అనివార్యంగా ఛిద్రమయిన ప్రపంచంలో ఒంటరి, శంకితుడైన ఆధునిక మానవుడికి ప్రశ్నగా మిగిలినది. దాన్ని అందిపుచ్చుకోడానికి, ఆవిష్కరించటానికీ అలవాటైన భాష, ఊహ చాలవు. కాని అవి తప్ప వేరే గత్యంతరమూ లేదు. ఈ వైరుధ్యం లోంచి వచ్చే మార్మికత త్రిపుర సృజనకూ అనివార్యమయ్యింది. అస్తిత్వపు అనాది ప్రశ్నల చుట్టూ చరిత్రలో తొలిసారిగా కమ్ముకున్న ఇరవయ్యవ శతాబ్దపు నిరాశను, absurdityని యధాతధంగా, సునిశితంగా అందిపుచ్చుకోడానికి సారస్వత కళకు అనువైన భాషనూ పద్ధతిని తయారు చేసినందుకు బెకెట్‌ను పాశ్చాత్య సమాజం కృతజ్ఞతతో, విస్మయంతో స్మరించుకుంటుంది. ఆయన సృజనను ఈనాటికీ అనేక కోణాల్నుండి పరిశీలించి చదువుకొనే పాఠకులు, పరిశోధకులు, అనుయాయులు, వీరాభిమానులూ ఆయన చుట్టూ ఒక cult లాగ తయారయ్యేరు. అది పట్టుబట్టి దర్శింపచేసే ‘నిజాలు’ వాళ్ళకి కావాలి. మర్మపు మాటలతో, తర్కాన్నీ హేతువునూ మర్యాదనూ కవ్వించి, బెల్లించి, అవమానించి, బుజ్జగించే ఊహా శకలాలతో ఆయన నిర్మించిన సారస్వతం చుట్టూ అంతకు వెయ్యింతలుగా Beckett Canon తయారయ్యింది. కొన్ని వందలమంది పరిశోధకులూ, వందలాదిగా పుస్తకాలూ,బెకెట్ స్టడీస్ కోసం ప్రత్యేకంగా పత్రికలూ ఇలా ఒక ప్రపంచమే తయారయ్యింది.

త్రిపుర చుట్టూ కూడా ఇలాంటి cult ఉంది. ఇది కావాలని ఆయన అనుక్కోలేదు. దాన్ని పోషించే ఏ అవకాశం ఇవ్వకుండా ఏభయ్యేళ్ళ పాటు ఒక్కళ్ళూ స్థిరంగా నిలబడ్డారు. Albert Camus మాటల్లోన He refused to play the game. అయినా ఆయన చుట్టూ త్రిపుర అభిమానుల వలయం లాగనే తయారయ్యింది. ఈ కొద్దిపాటి పాఠకులకు, అభిమానులకూ అనివార్యంగా, తప్పనిసరిగా త్రిపుర కావాలి. వాళ్ళు జీవితపు చిక్కు ప్రశ్నల్ని గురించి ఆసక్తితో, కలవరంతో అగ్గగ్గలాడుతుంటారు. ఇలాంటివాళ్ళు త్రిపురను ఒకసారి చదవటం తటస్థిస్తే ఇంక పులి నోటికి చిక్కిన లేడిపిల్లల్లాగ తప్పించుకొని పైకి రాలేక గిలగిల్లాడతారు. ఈ కొద్దిమందే త్రిపుర పాఠకులు. అదొక కిరీటం ఏమీ కాదు; కొందరి అభిరుచి, ఆసక్తి తీరు ఇలాగ. వీళ్ళు త్రిపుర సృజనను ఒకటి రెండుసార్లు చదివి పక్కన పెట్టలేరు. వాటి చుట్టూ ఏళ్ళతరబడి చక్కర్లు కొడుతూ అవి అంత నిజాన్నీ ఒకేసారి ఇవ్వకుండా నెమ్మదిగా బొట్టూ బొట్టూ స్రవించే మాదీఫల రసాయనాన్ని ఒంటబట్టించుకుంటూ ‘ఇంకా కావాలి త్రిపుర! ఇంకా … ఇంకా …’ అని పలవరిస్తారు. త్రిపుర స్వయంగా కాఫ్కా సృజనకు ఇలాగే చిక్కుకున్నారు – ఒదిలించుకోలేని అబ్సెషన్ లాగ. బెంగుళూరు నుండి కేకే రామయ్య గారు త్రిపుర సృజనకు ఇలా చిక్కుకుని గిలగిల్లాడుతున్నారు. ఆయన, ఇంకొందరు అభిమానులూ త్రిపుర కథల్ని మూడోసారి మళ్ళీ ప్రచురించాలని త్రిపురనీ అత్తలూరినీ అందర్నీ లేవగొట్టేరు మళ్ళీ. ఊరుకున్న దెయ్యాల్లారా మేలుకోండని.

త్రిపుర కథలకు యాభయ్యేళ్ళు. వాటిలో కనిపించేవి త్రిపురలోని ఎర్ర భిక్కు అనార్కిష్ట్ అబ్సర్డిష్ట్ కళ్ళు తిరుగుతుంటే జుమ్మెత్తి పడిపోకుండా సృజన చెయ్యి గట్టిగా పట్టుకుని పలవరిస్తున్న ఏభయ్యేళ్ళ క్రిందటి ప్రపంచపు దృశ్యం, అంతకంటే చాల పురాతనమైన మనిషి అస్తిత్వపు ప్రపంచమూ. దాన్లోని నాయకుడు, సూత్రధారీ ఏక కాలం లోనే తెలుగువాడు, భారతీయుడు, విశ్వ సంస్కృతిని ఒంటపట్టించుకున్న ఆధునికుడూ, అనాది మానవ జంతువూ. కథల్లోని సన్నివేశాలు మాటలూ ‘వాస్తవం’ లా ఉన్నట్టే ఉండి, ఉండుండి గజిబిజిగా అయిపోతాయి. దాదాపు అన్ని కథలూ ఇలాగే. ఇదుగో ఇది ఇది, అది అదీ అని చెప్పవుగాక చెప్పవు. అర్ధోక్తి అంటే త్రిపురకు ఇష్టం. కథలకి కావాలని నలుగురూ ఆశించే తలా తోకా లేకుండా అవి ఒక్కోసారి నాలుగేసి నడుములూ పదేసి తలలూ వేసుకుని, జీవితోత్సవపు రణ గొణ జాతరలో అగ్గి మంటలు ఊస్తూ సంచరిస్తూ రకరకాలుగా ఇక్కడ కనిపించి తటాల్న మాయమై అంతలోకే అక్కడ ఇంకో రకంగా ప్రత్యక్షమయ్యే చైనీస్ డ్రాగన్లలాగ మానవుల ఔద్వేగిక ప్రపంచపు ఆంతరంగిక అఖాతపు పార్శ్వాలన్నింట్నీ సర్రున ఒరుసుకుని రాసుకుంటూ కలయదిరుగుతుంటాయి. కథకి ఇది మొదలూ, అది చివరా మధ్యలోన ఇలాగ కదా అని తనకు నచ్చదని, అలాగ అక్కర్లేదనీ, సృజనలో కన్‌ఫెషన్ ఆశిస్తాననీ త్రిపుర చెప్పుకున్నారు. కన్‌ఫెషన్ అని త్రిపుర చెప్పింది Camus, Sartre, Dostoyevsky వంటి అస్తిత్వవాదుల సృజనల్లో ప్రబలంగా ఉంది. త్రిపుర అభిమానించే కాఫ్కా, ఇషర్‌వుడ్ సృజనను ఒక ప్రార్ధన అని, సాధన అనీ చెప్పుకున్నారు. బెకెట్ సృజనలో ఇది అంతర్లీనంగా ఉంది. కన్‌ఫెషన్ అంటే లోక వ్యవహారంలో సాధారణంగా అనుక్కునే పశ్చాత్తాపమని కాదు. కళాకారులు తమ అస్తిత్వపు మౌలికమైన అనుభవాన్ని అంతకంటె ఇంకే మెరుగులూ దిద్దకుండా ప్రకటించుకొనే అభివ్యక్తి. బెకెట్ ఇప్పటి కాలపు సారస్వత సృజనకు ఇది తప్పనిసరి అని నొక్కిచెప్పేరు. ఆయన సృజనలో స్పష్టత, నిర్వచనం, నిర్ధారణలను వ్యతిరేకించేరు. Art has nothing to do with clarity, does not dabble in the clear and does not make clear అన్నారు. సృజనకారుడంటే జీవితపు భీభత్సానికీ, విషాదానికీ ఉపశమనంగా ఉదాత్తమైన సత్యాల్నీ, జవాబుల్నీ స్పష్టంగా గుళికలు చేసిచ్చే భిషగ్వరుడేం కాడు. అందరిలాగే బతుకు బరువును తనూ మోసుకుంటూనే ఆ నిరాశను, నొప్పినే మాటల్లో అందిపుచ్చుకొని చెక్కే కళాకారుడని ఆయన చెప్పుకున్నారు. త్రిపుర ఇంతే, ఇలాగే అనుకున్నారు. ఇంతకుమించిన నిర్ధారణలు, ఉవాచలు ‘ఒద్దు వై!’ అనుకున్నారు.

త్రిపుర సృజనలు ఆసాంతం ప్రతీకాత్మకంగా, సగం చెరిగిన జాడలు, చెదిరిన గుర్తులతోను, ఒకదాన్లోంచి ఇంకొకదానికి లంకెల్లాటి ఆచూకీలతోనూ allusionల మయమై ఉంటాయి. అవి వినపడీ వినిపించకుండా చేసే చిత్రమైన ధ్వనులు, అంతర్లీనంగా ఆత్మ చరిత్రాత్మకంగా కనపడీ కనిపించకుండా చిత్రించే వర్ణాలతో మాగన్నుగా పొడచూపే నిజాలే వాటి ఆకర్షణలు. అవి మార్మికత చాటున అబద్ధాలాడవు. కేవలం కథ పాఠాన్ని పేరాలు, వాక్యాలుగా సందర్శిస్తూ, ఇతివృత్తం కోసం, సాంఘిక వాస్తవాల కోసం, సందేశం కోసం వెదుక్కునే దృష్టికి అవి బహుశ అగమ్యగోచరంగా ఉంటాయి, నిరాశ కలిగిస్తాయి. వాక్యాలు విశదం చేసే ఆలోచననూ, పదబంధాల అర్ధాల్నీ, కథ సందేశాన్నీ తర్కించి త్రిపుర సృజనను అర్థం చేసుకోలేము. అలాంటి దృష్టి ఆటంకం అవుతుంది. తప్పని కాదు; అది ఒక తోవ. ఇందుకు ఎడంగా త్రిపుర పాఠకులు ఇతివృత్తానికి, మాటకు, ఆలోచనకు పగ్గాలు పూర్తిగా చేతికిస్తే ఉండే ఇబ్బందుల్నీ, అనర్ధాన్నీ గ్రహించుకొని ఉంటారు. వాళ్ళు ఏరి కోరి ఇష్టంగా వెతుక్కుంటూ వచ్చేరు కాబట్టి అలాగే సృజన ఆవరణంలోకి ప్రవేశించి, సృజనలోని ‘అర్థం’ ఏమిటో విప్పి చెప్పమని కథను, కథకుణ్ణీ దబాయించకుండా తమకు తాముగా తమదైన అర్ధాన్ని నిర్మిచుకోగలుగుతారు. బెకెట్ మరీ అడగ్గా అడగ్గా Waiting for Godot మొదలైన తన నాటకాలను ఇలాగ ‘కథ’ను తమకు తాముగా నిర్మించుకొని ఆస్వాదించాలని సూచించేరు. త్రిపుర కథలు బెకెట్ సృజనంత సాంద్రంగాను, సంక్లిష్టంగాను ఉండవు. వాటిని అర్థం చేసుకోవాలని నిజమైన, ప్రబలమైన ఆసక్తి ఉంటే, వాటిలో అడుగడుగునా తారసపడే ప్రతీకల్నీ, జాడల్ని గురించి కథలోను, కథ బయటా వెదుక్కొని, క్రమంగా అవగతం చేసుకోవచ్చు. ఉదాహరణకు త్రిపుర సృజనావరణం నిండా Existentialism, Absurdism, Anarchism, Nihilism, Zen Buddhism ఈ ఐదింటి చాయలు కొట్టొచ్చినట్టు, సర్రియలిజం కలగలిసి కనిపిస్తాయి. ఎల్లప్పుడూ ఎంపిక నీదే అని జ్ఞాపకం పెట్టుకోవడం; ఈ ‘ముడి’ని ఎప్పటికీ విప్పలేకపోవటం; భగవంతం కోసం ఎదురుచూడ్డం; ఇది అసలు ప్రపంచం కాదు, ఒక కాపీ, నకల్, కౌంటర్‌ఫీట్ అనుకోవటం; నువ్వు, అతనూ అంటూ లేకపోతేనే నేనుకి అసలు అర్థం ఉందేమో అని సందేహమూ – ఇలా అడుగడుగునా. పగ్లా దెసాని, శేషియో, సుశీల, భగవంతం, భాస్కర్ ఇంకా గారబంద మళ్ళీ మళ్ళీ! త్రిపుర కథలతో కత్తు కలపడమంటే సృజనల ప్రహేళిక లోనికి తొలిసారిగా ప్రవేశించేక ఏళ్ళతరబడి ఇలాంటి జాడల వెంట తోవలు వెదుక్కుంటూ, కనిపించని ద్వారాల తలుపులు ఒక్కొక్కటీ తెరిచి లోనికి, ఇంకా ఇంకా లోపలికి ఈడ్చుకుపడిపోతూ, అవి చూపించే కొత్త కొత్త తోవల్ని చూసుకుంటూ చేసే సాహస యాత్ర. ఇది కావాలని, సంకల్పించి ప్రయత్నించి చేసేది, చెయ్యగలిగేదీ కాదు. త్రిపుర సృజనే ధ్యాసను తప్పనిసరిగా, అనివార్యంగా ఈడ్చుకొని పోతే మరి తప్పించుకోలేక సాగించేది. ఇలాంటి పఠనం కొన్ని సంవత్సరాల పాటు ఒక పరిశోధనలాగే జరిగినా, తరచి చూస్తున్న కొద్దీ కొత్తగా కరుగుతూ అనుభవాన్ని గహనం, విశాలం చేస్తాయి కాబట్టి ఈ కథలు బహుశ కాలానికి నిలుస్తాయి.

నాకు ఇలాగ అనుభవమైన కథలు కొత్తవాటినుండి రెండు ఉదాహరణలు – వలసపక్షుల గానం ఒకటి; గొలుసులు – చాపం – విడుదల భావం ఒకటీ. వీటిలో రెండో కథను తన కథలన్నింట్లోకీ ఎక్కువగా తనకిష్టమైన కథ అని త్రిపుర అన్నారు. ఇది చదవగానే నాకు అనుభవమయ్యింది, ఇబ్బంది లేకుండా. ఈ కథ లోని ఇతివృత్తం బెకెట్ చెప్పిన మెస్ – త్రిపుర మాటల్లో డిజార్డర్. “Artists pursue meaninglessness until they can force it to mean something. They immerse themselves in chaos to give it form.” అని Rollo Mayo అన్నారు. ఈ విషయమంటే నాకు చాల ప్రగాఢమైన ఆసక్తి, అంతే కాక ఈ కథలోని కథానాయకుని కాల్పనిక మూర్తితో నాకు బాగా పరిచయం. ఈ కథలో తాత్వికుల జిజ్ఞాసకు, అస్తిత్వపు అరాచకపు వేదనకూ,అలవాటైన వానాకాలపు బురద వీధులకూ,ఎడతెగని ఆలోచనలకూ లంకెలున్నాయి. దశాబ్దాల కిందటి ఈ కథ ఆ రోజుల్లోనే అవగతమైనా, త్రిపురవంటి వాళ్ళే ఇంకెందర్నో చదువుకుంటూ నన్ను నేను చదువుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివే ప్రతీసారీ కొత్తగా ఇంకేవో లోతుల్ని స్ఫురింపచేస్తుంది. వలసపక్షుల గానం అలాక్కాదు. అది చాల ప్రతీకాత్మకం, ఆత్మ చరిత్రాత్మకమైన కథ. ఈ కథ పూర్తయిన తరవాత రాత ప్రతిని త్రిపుర నాకిచ్చి, తీసుకెళ్ళి చదవమన్నారు. సుమారు ఇరవయ్యేళ్ళ కిందట. ఆ కథ చదివి చదివీ కూడా నేను సాంతం అర్థం చేసుకోలేక పోయేను. ఏమీ అనకుండా త్రిపురకే తిరిగిచ్చీసేను. కాని ఆ తరవాత చాలా ఏళ్ళకి మళ్ళీ చదువుకుంటే ఆ కథ నాకు ‘అర్థం’ అయ్యింది. కథ మారలేదు, త్రిపుర మారలేదు – మారింది నేను. ఏమేం మారేయంటే కుబ్బ, బాబుట్టి లాగే మాకూ పిల్లలు, ఇల్లొదిలి వలస పోయి మేమూ వలస పక్షులమయ్యేము. ఇంతే కాక త్రిపురతో కుటుంబంతో పరిచయం విస్తారమయ్యి ఇప్పుడు కథలోని కుబ్బ, బుట్టి, బాబుట్టి వీళ్ళందర్నీ వెంట వెంటనే స్ఫురణకు తెచ్చుకోగలను. కాల్పనిక సృజన నుండి నేను ఆశించేది కూడా ఉదారమయ్యి, ఈ కథలోని గారబంద, వీరబాహు, బిల్డింగ్ కంట్రాక్టర్‌గా మారిన లా ప్రొఫెసర్ వంటి అధివాస్తవిక ప్రతీకల్ని అంగీకరించగలను. ఇలా నా స్వానుభవమూ, త్రిపుర ప్రపంచంతో నా పరిచయమూ రెండూ విశాలమయ్యి ఇప్పుడు ఆ కథలోని వస్తువు, ఆవరణం, మనుషులు, అధివాస్తవిక ప్రతీకలు నాకు ఎక్కుతున్నాయి.

బెకెట్ సృజనల ప్రత్యేకతను ‘He doesn’t write about something. He writes something.’ అని ఎత్తి రాస్తారు విమర్శకులు కొందరు. ‘When he is looking at a picture, he becomes the picture.’ అనీ. త్రిపుర కథల్లో కథకుడు ఎడంగా నిలబడి ‘అది కథ, ఇది నేను, ఇది మీరు – మీకు నేను చెప్తున్నాను వినండి!’అనే సూచన అంతరాంతరాల్లో కూడా స్ఫురించదు. కథా సంభాషణలూ ఉన్నట్టుండి మర్యాద సరిహద్దుల్ని అతిక్రమించి, కథనాన్ని, సన్నివేశాల్నీ, సంభాషణనూ కనపడని చెయ్యేదో తడిగుడ్డతో అలికీసినట్లు రూపిస్తాయి. బెకెట్ పాత్రల్లాగే అవి ఒక సంశయాత్మకమైన పలవరింతల్లాగ మాట్లాడ్తాయి. అవి ఏ ‘కథ’నూ ‘చెప్పవు’. స్వయంగా బెకెట్ సంభాషణలు ఇంతేనట. ‘Beckett speaks precisely like his characters – with a pained hesitation, but also with brilliance, afraid to commit himself to words, aware that talk is just another way to stir dust.’ అన్నారు. త్రిపురతో సంభాషణలు ఇలాగే ఉంటాయి. ఈ కథల్లోని మాటలు కథను నిర్వహించటం కోసం కథకుడు ప్రణాళిక వేసుకొని మాట్లాడిస్తే అంటున్నట్టు మాట్లాడవు. ఇతివృత్తాన్ని నిర్మించి కథను ముందుకు నడిపించడం కోసం మాట్లాడవు. కథ ఆవరణం అంతా ఆంతరంగికం; కథ నడిచేది లోకంలోనే అయినా దాని అసలు వేదిక పాత్రల మనో రంగమే. ఆ ఆవరణాన్నే మాటల రంగుల దృశ్యాలుగా గోచరింపచేస్తూ తమలో తామే మాట్లాడుకుంటున్నట్టుంటాయి. అవి కథకుడు ఒక ఉన్మాదం వంటి frezyలోన అన్ని పాత్రల్లో తను తల్లీనమై పలవరించే మాటల్లాగ. ఎందుకు రాస్తారో తనంతట తనే ‘ఒక్కోసారి చాలా ఒంటరితనంగా, దుర్భరంగా ఉంటుంది అప్పుడే రాస్తాను’ అని త్రిపుర చెప్పుకున్నారు. రాస్తే తెరిపినిస్తుంది. ఇది సృజనశీలురైతే అర్థం చేసుకుంటారు. బెకెట్ చెప్పుకున్నదేమంటే Without writing, he could not have gone through the wretched mess of the daily round. He had to leave ‘a stain upon the silence’, and remind men of the eternal truths of life and death. ఇలాంటి నిశ్శబ్దపు పిలుపునే త్రిపుర వర్ణించింది – ‘నిశ్శబ్దపు పిలుపు వినగలవు నువ్వు; నిశ్శబ్దపు గర్జనను వినగలవు; ఈ ప్రపంచం కంటే లోతైన ప్రపంచాల్లోంచీ’ అని.

త్రిపురతో నా అనుబంధానికి పాతికేళ్ళు. కుష్టువాళ్ళ ఆస్పటల్ ఎదురుగా కొండ దిగుతూ చాలా ఇరుగ్గా ఒక సందుండేది. దాన్లో ఒక వంద కొళాయిగొట్టాలేనా వంపులు వంపులుగా దిగుతుండేవి. అలా దిగ్గా దిగ్గా అక్కడ శాఖా గ్రంధాలయం ఉంటుంది. అక్కడ త్రిపుర కథలుంటాయి. అవి చదివి నాకు అక్కడికక్కడే షాక్కొట్టినట్టయ్యి, అగ్గి రుంజుకున్నాది. వాళ్ళతోనీ వీళ్ళతోనీ అనగా అనగా ఒకళ్ళు ‘ఆయనిప్పుడు ఈ ఊళ్ళోనే ఉంట్నారు వై!’ అన్నారు. త్రిపుర కథల్ని చదివి త్రిపురని వెతుక్కున్నాను. అప్పటి నా ప్రపంచంలో త్రిపుర కథలు అంతలా ఎందుకు ఆకట్టుకున్నాయి? అప్పుడు నాకు పంతొమ్మిదేళ్ళు. కుటుంబాల్లో, యూనివర్శిటీలో, ఊళ్ళో వ్యాపారాల మీద, కళలు సాహిత్యం అంటే ఇష్టపడే మనుషుల మధ్యా తిరుగుతూ బతకడం ఎలాగో అర్థం చేసుకోడానికి గింజుకుంటున్నాను. నాకు అంతరంగం, ప్రకృతి, ప్రవర్తన ఇవన్నీ ఎలా పనిచేస్తాయని చాల జిజ్ఞాస. అంటే – వేలు ఎలా పనిచేస్తుంది? మనం ఒక్కోళ్ళ దెగ్గిర ఒక్కోలా ఎందుకుంటాము? ఇలాగ. జిడ్డు క్రిష్ణమూర్తి గారి పుస్తకం దొరికింది. “Most human beings are selfish. If one is aware that one is selfish, one hides it very carefully and conforms to the pattern of society which is essentially selfish. The selfish mind is very cunning. Either it is brutally and openly selfish or it takes many forms…” అంటే ‘అమ్మనీ! ఈయన కరక్టుగన్నాడు!!’ అనుకున్నాను. మా నాన్న వెర్రిబాగులాడు. ‘సరిపిల్లి శ్రీరామ్మూర్తి గుమస్తాగా జాయినయ్యి గుమస్తాగానే రిటారయ్యేడు!’ అని గదీ వంటిల్లు సంసారంతో గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు. అంతగా ఆలోచించలేని అమాయకుడు కాబట్టి అలాగ హాయిగా బతుకుతారని అనుకున్నాను. నేను మా నాన్నలాక్కాదు. నాకు బుర్రనిండా ఆలోచనలు, ఆరోపణలు, పోలికలు, ప్రణాళికలు, ప్రశ్నలు. త్రిపుర కాడికెళ్ళేను. ఆయన్నీ చూసి చూసి అనుకున్నాను – ఈయన అఖండమైన ప్రజ్ఞావంతుడు. కాని మా నాన్నలాగ, నాతో ఇగటాలాడుకుంటూ మెసిలే కూలీ నాలీ జనంలాగ, చిన్న పిల్లల్లాగ ఈయన కూడా ఉట్టి వెర్రిబాగులోళ్ళాగ ఉన్నాడు – జేకే గారు చెప్పిన ‘మోష్ట్ హ్యూమన్ బీయింగ్స్’ లాక్కాదీయను అనుకున్నాను. నాకు ఎక్కడికెళ్ళినా ఎవర్ని చూసినా ఎవరి దునియాలో వాళ్ళూ ఏదో ‘గుద్దుకున్నట్టు’ గుంటుంది. మీ దెగ్గిర అలాగ లేదు. హాయిగా ఉంటుంది అంటే ‘ఒహో? నీకలాగుంటాదివై!’ అని నవ్వేరు. కూలీ నాలీ జనం దగ్గిర హాయిగా ఉంటుంది, ఎందుకు త్రిపుర? అంటే ‘అవునువై. సింపుల్ సౌల్స్ కదా!’ అన్నారు. దా ఇలాగొచ్చీవై! అన్నారు. త్రిపురే దొరికితే క్రమంగా కథల్నింక మరిచేపోయేను.

బెకెట్‌ని గురించి విని ‘ఈయనా త్రిపురలాగున్నాడు!’ అనుకున్నాను. అభిమానులు, విమర్శకులూ బెకెట్‌ను secular monk అన్నారు. త్రిపురకి పుస్తకాల షాపుల్లో ‘యోగి’ అన్నలాంటి అభిప్రాయం పెట్టుకుని ఎగష్ట్రా డిస్కౌంట్లు ఇస్తారు. బెకెట్ త్రిపుర లాగనే సారస్వత చర్చ ఒద్దు, సాహిత్యపు సాంగత్యాలు ఒద్దని ఒక recluse లాగ బతికేరు. ఎప్పుడైనా అరుదుగా అయన్ను కలిసే అవకాశం దొరికినవాళ్ళు He is kindness itself అని అబ్బురంగా చెప్పుకున్నారు. త్రిపుర కరుణ అవ్యక్తము, అనుభవైకవేద్యమైనది. బెకెట్ సన్నిహితులు ఆయన్ను గురించి ” … – such economy marked his every move. … Talking to him privately, one could feel Beckett belonged to a different order and relish this awareness of the presence of genius – though any such suggestion would have struck him as ridiculous.” అని చెప్పుకున్నారు. త్రిపుర సమక్షంలో ఇలాగుంటుంది. త్రిపుర కొద్దిపాటి మాటలు, రాతలు, మౌనమూ ఆయన సృజనలాగనే విస్తారము, గహనమైన అనుభవానికి, లోకంతో మమేకమైన సహానుభూతికి, క్షమకూ కేవలం సంకేతప్రాయాలుగా ఉండి, అందుకోగలిగితే సహాయంగా ఉంటాయి. బెకెట్ సృజననూ త్రిపుర సృజనలాగనే శూన్యవాదమనీ, నిరాశావాదమనీ, నిష్క్రియాపరత్వమనీ అన్నారు. ఆయన్ను దగ్గిరసా పరిశీలించినవాళ్ళు, అర్థం చేసుకున్నవాళ్ళు మాత్రం “His work permeated with love for human beings and with a kind of humour that I could reconcile neither with despair nor nihilism.” అని చెప్పుకున్నారు. ఈ మాటలూ త్రిపురకు ముమ్మూర్తులా సరిపోతాయి. ఆయన సృజన సూచించే తోవ బెకెట్ కళాకారుల బాధ్యత అని హెచ్చరించిన తోవ. “There will be a new form, and this form will be of such a type that it admits the chaos and does not try to say that it is really something else.” అని బెకెట్ చెప్పుకున్న రూపం త్రిపుర సృజన రూపం. కాని మన confusion తెలుగు కన్‌ఫ్యూజను. మన బతుకు తెలుగు బతుకు. కురపాం మార్కెట్లో కూరలు కొనుక్కోని, బురద రోడ్ల మీద సైకిల్ చైన్లూడగొట్టుకుని, ఔటర్ హార్బరు బాంబింగులైతే ఊళ్ళొదిలి పారిపోయి, పొట్టచేత పట్టుకుని దేశాలంట పోయి, రహస్య జీవితాల్ని దాచుకొని డుస్కీ మాటలు చెప్తూ, వింటూ యా పద్మరాగాయితా మని రవ్వ దోశలు కరకర నములుతూనే అట్నుంచి ఏడో నెంబరు కోసం ఇట్నుంచి పదముడో నెంబరు కోసం ఎదురు చూసే అల్లడ తల్లడ. అందుకే ఈ త్రిపుర తెలుగు త్రిపుర.

త్రిపుర బాల్యం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో. హైస్కూల్, కాలేజీ చదువు విశాఖపట్నంలో. విశాఖపట్నం మీద బాంబులు పడే రోజుల్లో త్రిపురకు పదహారేళ్ళు. ప్రజలు ఊరు ఖాళీ చేసి పోయేవారు. పంతొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో మొదలైన ఆధునికవాదం కళల్లో, తత్వంలోను రియలిజం, హార్మొనీ వంటి అదివరకటి సంప్రదాయికమైన విలువల్ని ధిక్కరించింది. సర్రియలిజం, డాడాయిజం, క్యూబిజం, సింబాలిజం వంటి అధివాస్తవిక ధోరణులను కలుపుకొని ఆధునికవాదపు మొదటి దశ 1930 – 1940ల మధ్య పరాకాష్టను చేరుకుంది. దీనికి సమాంతరంగా 1917 అక్టోబర్ విప్లవం తరువాతి దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం కూడా వ్యాపించింది. 1945 తరువాతి రోజుల్లో మానవాళి క్రమంగా రెండవ ప్రపంచ యుద్ధపు విషాదాల నుండి తేరుకుంటున్న రోజుల్లో ఆధునిక వాదపు మలి దశ మొదలయ్యి 1970 ల వరకు విస్తరించింది. పోస్ట్ మోడర్నిజం అని వ్యవహరించే ఈ మలి దశలో సారస్వత సృజనకు దిశను, గొంతును, భాషను నిర్దేశించిన మహా రచయితగా బెకెట్‌ను చెప్పుకుంటారు. Theater of the Absurd అని వ్యవహరించే అరాచకవాద ప్రధానమైన నాటకరంగం, చిత్రకళలో అబ్‌ష్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిజం వేళ్ళూనుకున్నది ఈ రోజుల్లోనే. త్రిపుర కౌమారం మీద ఆధునికవాద ప్రపంచపు తొలి దశ ప్రభావం, యవ్వనం, తదుపరి జీవితం మీద దాని మలి దశకు ప్రతీక అయిన అబ్సర్డిజం ప్రభావం కనిపిస్తాయి. అప్పట్లో ఒక పుస్తకం కావాలంటే, ఏదైనా విషయం మీద వివరాలు దొరకాలంటే ఇప్పట్లా సులభం కాదు, చాల ప్రియం కూడాను. మద్రాసు లాంటి నగరాలకు పోయి, డబ్బు కూడబెట్టుకునీ ఒక్కొక్క పుస్తకం సంపాదించుకోవాలి. ఆ రోజుల్లో త్రిపుర వాళ్ళు, ఊళ్ళో ఎవరూ ఎక్కువగా చెప్పులు తొడుక్కునేవారు కారట. రెండు జతల బట్టలే ఉండేవి, మిల్లు బట్టతో కుట్టించినవి. స్కూలుకెళ్ళడానికి పొద్దున్న బట్టలు లేకపోతే ఉతికిన బట్టలు తెచ్చుకోడానికి మైళ్ళ దూరం సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి, చాకలి ఇచ్చిన తడి బట్టల్నే తొడుక్కుని ఇంటికొచ్చేసరికి అవి ఒంటి మీదే ఎండిపోయేవి. వెచ్చాల కోసం రేషన్లుండేవి. అలాంటి రోజుల్లో త్రిపుర దర్శించి, అందించిన ఈ కథల దృశ్యావరణంలో, శైలిలో, వస్తువుల్లోని కొత్తదనం, అరాచకం, టెర్రర్ అప్పటి త్రిపుర పాఠకుల్ని సహజంగానే తీవ్రంగా ప్రభావితం చేసాయి. త్రిపుర కల్ట్‌కు అలాగ పునాదులు పడిఉంటాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే త్రిపురకు మైనార్టీ తీరింది. జమిందారీ వంటి ఉన్నత మధ్యతరగతికి చెందిన ఆయన కుటుంబ నేపధ్యంలోన దివ్యజ్ఞాన సమాజపు ప్రభావం కూడా ఉండేది. విజయనగరంలో వాళ్ళ పెదనాన్నగారికి థియాసఫీలో గొప్ప ఆసక్తి, ప్రవేశం ఉండేవి. సిగ్మండ్ ఫ్రాయిడ్‌తో ఆయనకు ఉత్తరప్రత్యుత్తరాలుండేవి. వాళ్ళకు పిల్లల్లేరు. త్రిపురకు వాళ్ళింటికి రాకపోకలు బాగా ఉండేవి. త్రిపుర వాళ్ళ నాన్నగారు బ్రిటిష్ ప్రభుత్వంలో వైద్యాధికారి. ఆయన మదనపల్లెలో ఉద్యోగం చేసే రోజుల్లోను, పెదనాన్న ప్రభావం వలనా త్రిపురకు తర్వాతి రోజుల్లో జిడ్డు క్రిష్ణమూర్తి గారితో పరిచయం, శిష్యరికం కలిగేయి. బ్రిటిష్ రాజ్ సంస్కృతి చాయల్లోన టెన్నిస్ ఆడుతూ,ఇంగ్లీష్ క్లాసిక్స్ నుండి అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చిన అబ్సర్డిష్ట్ సాహిత్యం వరకు ఆయన విస్తారంగా చదువుకున్నారు. బెనారస్ విశ్వ విద్యాలయంలో చదువుకున్నప్పుడు అక్కడ జి. వి. దేసాని వంటి వారితో పరిచయాలు, వారణాసిలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాతి రోజుల్లోని నవ జాతీయ సంస్కృతి ప్రభావమూ ఆయనపై ఉన్నాయి. ఈశాన్యభారత దేశం, రంగూన్ వంటి ప్రదేశాల్లో నివాసం, సహజమైన తత్వ జిజ్ఞాస ఆయనకు జెన్ బుద్ధిజం తో ప్రత్యక్షమైన పరిచయాన్నిచ్చేయి. అబ్సర్డిజం వలన, Albert Camus, James Joyce, Samuel Beckett, Franz Kafka వంటి రచయితల వలన ఆయన చాల ప్రభావితమయ్యేరు. ఆంగ్ల సాహిత్యం మీద తీవ్రమైన ఆసక్తి, ఇంగ్లీష్‌లో అరుదైన అభినివేశం ఆయన్ను సైన్స్‌ను ఒదులుకొని, సాహిత్యం చదువుకొనేలా ప్రేరేపించేయి. ఇంగ్లీష్ సారస్వతంపై ఆయనకున్న సహజమైన ప్రతిభ,పట్టు అసాధారణమైనవి; ఆయన సృజనలన్నింటినీ విశేషంగా ప్రభావితం చేసినవి. కాని ఆయన ఏ ఒక్కనాడూ తనను ఇంగ్లీష్ రచయితగా అనుక్కోలేదు. మన సంస్కృతి, నుడికారం, ఆలోచన అన్నీ మౌలికంగా తెలుగువి అని, మనం వేరే భాషల్లో రాస్తే ఏదోలా ఉంటుందనీ అనేవారు.

అరవయ్యవ, డబ్భయ్యవ దశకాలు మృదు స్వభావులైన మనుషుల్ని మార్క్సిజం, కమ్యూనిజం తీవ్రంగా ప్రభావితం చేసిన రోజులు. దేశానికి కొత్తగా స్వాతంత్ర్యం వచ్చిన ఉత్సాహం, నవ జాతీయవాదుల ఆశావాదానికీ, చుట్టూ ఉన్న దుర్భరమైన పేదరికం, కపటం, అసమానతలకూ సమన్వయం కుదరని బుద్ధిజీవులు, కళాకారులను ఇవి బలంగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి ప్రభావంతోనే త్రిపుర స్వయంగా ఈశాన్యంలోని నక్సల్బరి ఉద్యమంతో ప్రత్యక్షం, ప్రచ్ఛన్నమైన సంబంధాలు పెట్టుకున్నారు. కాని అదే సమయంలో ఆయనలోని సత్యాన్వేషణ పైని మొగ్గు, మనుషుల స్వభావాల్లోని వైకల్యాల్నీ, వైవిధ్యాన్నీ, ఊహలు, మాటలు, చేతలకూ మధ్య వైరుధ్యాల్నీ సంభ్రమంగా పరిశీలిస్తూ వచ్చింది. వ్యక్తిగత జీవితం లోను, అంతరంగంలోనూ, ఉద్యమాల్లోను, చుట్టూ ప్రపంచపు అర్ధ రాహిత్యం, కపటం, అరాచకత్వాల్నీ అర్థం చేసుకొని, రాజీ చేసుకొనే ప్రయత్నం త్రిపుర సృజనంతా ఆవరించి కనిపిస్తుంది. సహజంగా అపురూపమైన ప్రతిభ, artistic sensiblity తో పాటు అంతరంగ ప్రపంచం అంటే తీవ్రమైన, అనివార్యమైన ఆసక్తి ఉన్న త్రిపుర పైన క్రమంగా కాఫ్కా ప్రభావం ప్రబలమయ్యింది. కాఫ్కాను A man obsessed with his own righteousness అని అంటారు; ఇలాంటి తగులాట, మీమాంస త్రిపుర కథలన్నింట్లోనూ అంతర్వాహినుల్లా వెంటవస్తూనే ఉంటాయి. దీన్ని అవగాహన చేసుకోలేని, అర్థం చేసుకోలేని సారస్వత సమాజంలో ఆయన ‘ఊరికి జోగు వెఱ్ఱి, జోగికి ఊరు వెఱ్ఱి’ అన్న చందంగా కార్యవాద, ప్రగతిశీల సామాజికులకు ఉన్మత్తునిలా, న్యూరోటిక్‌లాగ, లేకుంటే ‘ఒకానొక కాఫ్కాయెస్క్ త్రిపుర!’ అని ఒక అర్థం కాకున్నా నమస్కారం పెట్టి పోవలసిన మిష్టరీలాగా మిగిలేరు. మార్మికమైన త్రిపుర సృజనను అర్థం కావని విస్మరించటం, లేదు వీరాభిమానంతో పూజించటం రెండింటివలనా ప్రయోజనం లేదు. జటిలమైన విషయాలేవీ కూడా గురువు లేకుండా, విశేషమైన పరిశ్రమ చెయ్యకుండా అర్థం కావు, అనుభవం లోనికి రావు. ఉదాహరణకు జన్యుశాస్త్రం, గణితం వంటివి కూడా తమవైన పారిభాషికమైన పదాలకు, ఆలోచనలకూ లంకెలతో ఉంటాయి. వాటిమీద ప్రగాఢమైన ఆసక్తి ఉన్నవాళ్ళు ఓపిగ్గా ఒక్కొక్క పదాన్ని, పదబంధాన్నీ, వాక్యాన్నీ విప్పి పరిశీలించి, అవి సూచించే విషయాల్ని కూడా వెతికి చదువుకొని మననం చేసుకుంటే తప్ప అవి చెప్పే విషయాలు అవగతం కావు, అనుభవం లోనికి రావు. కాని దురదృష్టవశాత్తు బెకెట్, త్రిపుర వంటి వాళ్ళ సృజన సూచించే నిజాలు శాస్త్ర విజ్ఞానం లాగ విస్తృతమైన చర్చకు కాక, ఆంతరంగికమైన విచికిత్సకు, నిశ్శబ్దమైన శోధనకూ దారితీస్తాయి. సాధారణంగా సాహిత్యం అని వ్యవహరించే వ్యవస్థ ఇటువంటి మౌనాన్ని, సంశయాత్మకమైన స్తబ్దతను అర్థం చేసుకోలేదు, అర్థమైనా మన్నించలేదు – బహిరంగమైన చర్చ, విస్పష్టమైన ప్రకటన పునాదులుగా నిర్మించుకున్న తన ఉనికికే అవి ఎసరు పెడతాయి కాబట్టి.

త్రిపుర, బెకెట్ కాల్పనిక సృజనల సంకల్పంలో, తత్వంలో, దృక్పధాల్లోనైతే అంతర్లీనంగా చాల సామీప్యాలున్నాయి గాని, శైలిలోను,సృజన నిర్మాణంలోను ప్రత్యక్షంగా ఏమంత సారూప్యత ఉండదు. వాటి వ్యక్తీకరణ వేరు. త్రిపుర కథలు సాంప్రదాయికమైన కథ నిర్మాణ పద్ధతుల్ని ఎంతో కొంత మన్నిస్తాయి, మనకు పరిచితమైన భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా విసర్జించకుండానే, అంతరంగం, బహిరంగాల మీద అటూ ఇటూ సాము చేస్తుంటాయి. బెకెట్ Unnamable వంటి కడపటి రచనలు ఇందుకు భిన్నంగా భౌతిక ప్రపంచాన్నీ, వాక్యం, వర్ణన, సంభాషణ వంటి పరిచితమైన సారస్వత స్వరూపాల్నీ పూర్తిగా తోసిరాజని అంతరంగపు లోతుల్నే excavatory form అని వ్యవహరించే రూపంతో తవ్విపోస్తూ, అలవాటైన దృష్టికి మిక్కిలి అరాచకంగా సాగుతాయి. త్రిపుర ఈ టెక్నిక్‌ను స్వీకరించినా, ఎప్పుడో అరుదుగా వాడుకుంటారు; ఇది ఇటీవలి (కొత్త) కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉదాహరణకు: వలస పక్షుల గానంలో “గుండు చెంబు గుండు చెంబుతనం లోకీ, కర్ర చెక్క కర్ర చెక్కతనంలోకీ, మొత్తం అంతా మొత్తం తనలోకీ …” వంటివి అభౌతికము,రూపమే లేని విషయాల్ని అందిపుచ్చుకునేటప్పుడూ; కనిపించని ద్వారంలో “……. ఎవరు వీరు? సంబంధం? వీళ్ళా? ఇదా? ఇలా నేను వాళ్ళతో ఉండాలా? అలా మాట్లాడాలా? వాటన్నిట్నీ తెగ్గొట్టు. అవన్నీ అలా కాదు. అవన్నీ ఇలా.” వంటి సంశయాత్మకమైన వర్ణనలు. ఇలాంటిదే ఉదాహరణకు బెకెట్ నవల Molloy నుండి ఈ సంశయాత్మక వాక్యం: “A and C I never saw again. But perhaps I shall see them again. But shall I be able to recognize them? And am I sure I never saw them again? And what do I mean by seeing and seeing again?” Excavatory Form – the art of ‘impotence’ and ‘ignorance’ అని పేరు పడిన బెకెట్ నిర్మాణ పద్ధతులు, శైలి, వాక్య నిర్మాణాల్లో కనిపించే ప్రగాఢమైన అరాచకాన్నీ, మార్మికతను త్రిపుర సంశయాత్మకమైన, అంతరంగ ప్రధానమైన విషయాల్ని వర్ణించవలసి వచ్చినప్పుడు మాత్రమే వాడుకుంటారు. అందుకే త్రిపుర కథలు పూర్తిగా నైరూప్యాలు కాకుండా అంతరంగం – బహిరంగం, స్వరూపం – నైరూప్యం, స్పష్టత – మార్మికత, అరాచకం – ఒద్దిక, ఇలాంటి వ్యతిరిక్త లక్షణాల్ని మార్చి, మార్చి కలగలిపి చిత్రిస్తూ Van Gogh, Monet వంటి ఇంప్రెషనిస్ట్ చిత్రకారుల చిత్రాలను తలపిస్తాయి. త్రిపుర కథ ఇలాంటివి అనేక ధృవాల మధ్య సంఘర్షణను ఆవిష్కరించి, ఐక్యతను సాధించుకొనే ప్రయత్నంలో ద్వైదీభావాల అంచుల మీద లాఘవంగా అటూ ఇటూ నర్తిస్తూనే ఎటూ తూలిపడిపోకుండా చివరివరకూ నడుచుకుంటుంది. ఈ విషయంలో బెకెట్ తొలినాళ్ళ నవలికలు Murphy వంటి సృజనల్లోని నిర్మాణ పద్ధతులకు,వర్ణనల శైలికి త్రిపుర కథలు ఇంకొంత దగ్గరగా ఉంటాయి. బెకెట్ కడపటి నవలికల్లాగ అవి ఆసాంతం మార్మికంగాను,అంత సంక్లిష్టంగాను ఉండవు. ఇలాంటి సాంద్రతరమైన మార్మికత కావాలనుకుంటే త్రిపుర కథను కాకుండా, కవితను ఆశ్రయిస్తారు. అందుకే త్రిపుర కవితలు,ముఖ్యంగా కాఫ్కా కవితలు వంటి ఇటీవలివి ఆయన కథలకంటే క్లిష్టంగా ఉంటాయి. త్రిపుర కథ బెకెట్ కథ వలెనే దృగ్గోచరం, బహిరంగమైన ప్రపంచాన్నుండి దూరంగా, అంతరంగపు చీకటి లోతుల్లోకి బాగా వంగి తొంగిచూస్తుంది కాని బాహ్యప్రపంచాన్ని సాంతం తిరస్కరించదు, అసహ్యించుకోదు. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని ఒప్పుకొని, అటు లోతుల్లోకే నడిచి నడిచీ, చివరికి – అంటే ‘ముగింపు’లో ఈ లోకంలోకే తిరిగి వస్తుంది. త్రిపుర కథలు అన్నింటిలోనూ ఆఖరికి ఇంతే.

బెకెట్‌ను ఇరవయ్యవ శతాబ్దపు రచయితల్లోకెల్లా విశిష్టమైన రచయిత అని చెప్పుకుంటారు. కాని స్వయంగా ఆయన అలా పేరు ఒద్దనుకున్నారు – He felt it grotesque to receive personal attention for giving expression to what he called, in one of his characteristically pithy phrases, ‘the issueless predicament of existence’. బతుకనే కష్టాన్ని అర్థం చేసుకుని, ఆవిష్కరించటం కళాకారుని అనివార్యమైన, అసంకల్పితమైన ప్రవృత్తి అని, బాధ్యత అనీ ఆయన జీవితాంతం నమ్ముకున్నారు. సాహిత్యం పట్ల త్రిపుర వైఖరి ఇంతే. ఇప్పటి త్రిపుర ఈ కథలన్నీ మరిచేపోయేరు. ‘ఇంక కథలూ ఒద్దు ఏం ఒద్దు, అసలు లిటరెచర్ ఊసే ఒద్దువై!’ అని రద్దుచేసుకున్నారు. త్రిపురది అధ్యాపకుని వృత్తి, ప్రవృత్తి కూడా ఇంతే. కాలేజీలో ఆంగ్ల సాహిత్యం బోధించేటప్పుడు ఆయన ప్రసంగాలు అనర్గళంగా, గొప్ప వాక్చాతుర్యంతో ఉంటాయట. అక్కడి విద్యార్ధులకు ఆయన తాము ఎంతో అభిమానించే ప్రొఫెసర్. కాలేజీ బయట కూడా నాలాంటి విద్యార్ధులెందర్నో ఆయన చప్పుడుకాకుండా చేరదీసేరు. కాని ఈ ప్రైవేటు పాఠాలు ఎలాంటి బోధనలూ దిద్దుబాట్లూ లేకుండా, పొడి పొడి మాటలతో సంవత్సరాల తరబడి నడిచే మౌన వ్యాఖ్య. బెకెట్ లాగే త్రిపురకూ మాటలంటే వెర్రి ప్రేమ. ఆయన సమయమంతా చాలా వరకు క్రాస్‌వర్డ్ పజిల్స్ చేసుకుంటూ పాఠకులకొచ్చే బహుమతులు సంపాదించుకుంటూ గడుపుతున్నారు. బెకెట్ లాగనే ఆయన ఎప్పుడో తప్పనిసరైతే తప్ప సాహిత్యం గురించి మాట్లాడరు. రోజువారీ కష్టం సుఖం అన్నీ ఇష్టంగా అడుగుతుంటారు. బెకెట్ ఇంతేనట. ఆయన్ని ‘a born listener’ అని అబ్బురంగా చెప్పుకుంటారు. త్రిపుర ముమ్మూర్తులా ఇంతే. త్రిపుర కథల్లో కూడా చాల చోట్ల ‘అందరూ వాళ్ళ వ్యధలు ‘నీకు’ చెప్పుకుంటారు, నువ్వు ఏ ఆరోపణా లేకుండా, విసుక్కోకుండా అదంతా వింటావని’ అని ఒస్తుంది. త్రిపుర లోకానికి ఏకాకి. “Like most great artists, he is something of a recluse; he knows that the only route for the writer is to go further and further back into the unconscious, to the terror zone. However, to describe him as being too serious would be a travesty.” అని బెకెట్‌ని గురించి అన్నది యావత్తూ త్రిపురకు యధాతధంగా సరిపోతుంది. కొద్ది పాటి సన్నిహితులు ఆయనలోని అపురూపమైన ప్రజ్ఞను, తత్వాన్ని, కరుణను, హ్యూమర్‌ను, నైసర్గికమైన వినయాన్నీ చూడగలుగుతున్నారు. గొప్ప కళాకారులందరూ వాళ్ళ సృజనల కంటె కూడా చాల సమున్నతంగా ఉంటారట. అందుకేనేమో నాకు కథలూ త్రిపురా రెండూ పరిచయమున్నా, కథల గురించి రాయమంటే త్రిపుర గురించే వస్తున్నాది. ఇంతే మిగిలింది.
-కనక ప్రసాదు

పర్సెక్టివ్ ప్రచురణలు ప్రచురించిన త్రిపుర ప్రింట్ పుస్తకం, కినిగె ప్రచురించిన ఈపుస్తకం 20శాతం తగ్గింపు ధరకు కినిగె వద్ద లభిస్తున్నాయి. వివరాలకు ఇక్కడ చూడండి.

You Might Also Like

2 Comments

  1. సంతాపం: త్రిపుర (1928-2013) | పుస్తకం

    […] త్రిపుర కథలపై రామతీర్థ వ్యాసం సూర్య పత్రికలో ఇక్కడ. “త్రిపుర కథలు” పుస్తకంపై సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ. “గురు ప్రసాద శేషము” పేరిట ఈ పుస్తకానికి కనకప్రసాదు ముందుమాట ఇక్కడ. […]

Leave a Reply