అనుభవాలూ-జ్ఞాపకాలూనూ : కొందరు ప్రముఖుల అభిప్రాయాలు-3

(ఈ అభిప్రాయాలు శ్రీపాద వారి ఆత్మకథ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ ౧౯౯౯ ముద్రణలో వచ్చినవి. ఇవి ఇక్కడ ప్రచురించడం కాపీరైట్ ఉల్లంఘన అయిన పక్షంలో editor at pustakam.net కు ఈమెయిల్ పంపగలరు – పుస్తకం.నెట్)
******************

పురిపండా అప్పలస్వామి:

చాలా పల్లెలు సంచారం చేసి నిన్ననే ఇక్కడికి చేరుకున్నాను. ప్రయాణం వొకచోట స్థాయిలేక వచ్చిన ఉత్తరాలన్నీ యిక్కడే పడి ఉన్నాయి. రాగానే చూతునూ, వాటిల్లో మీ పాకెట్టుంది. ముందు అదే విప్పాను. ‘భారతమా’అనుకున్నాను. సైజు కాదంటూనే వుంది. విప్పి చూతునూ మీ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’. క్షణంలో ఈ ౨౩ దినాల ప్రయాణబడలిక యావత్తూ ఎగిరిపోయింది. ఆ ఆనందం చెప్పలేను. ముఖవికాసం చూసి ఏమిటేమిటి అంటుంది మా ఆవిడ. మీరు దగ్గిరే వున్నట్టు భావించి అమాంతంగా మిమ్మల్ని కౌగలించుకుని మీ చేతులు ముద్దాడాలనిపించింది నాకు.

నమ్మండి, నాకు ఈ రచనమీద అపరిమితమయిన అభిమానం. వెంటనే చదవడం ప్రారంభించాను. నిన్ననే పూర్తిచేసాను. ఈమధ్య ఏ పుస్తకమూ ఇంత వేగంగా చదవలేదు. అక్కడక్కడా ఘట్టాలు మా వాళ్ళకీ వినిపించాను. మీరు రాతప్రతి చదవగా వినే వున్నా, మళ్ళీ మీరు దగ్గిరవుండి మాట్లాడుతూ ఉన్నట్టే ఫీలయాను అనేకచోట్ల. ఉపక్రమనిక మాంచి పకడ్బందీగా ఉంది, పరిణతి పొందిన మీ వ్యక్తిత్వం ద్యోతకం చేస్తూనూ. ప్రతి ఆంధ్రుడూ తెల్లవారితే మననం చేసుకోతగ్గ ఆదర్శవాక్యాలు ఎన్నో ఉన్నాయి, గ్రంథం నిండా.

సాహిత్య తపస్సిద్ధి పొందిన మహారచయితలు మీరు, ఈనాటి సాహిత్య సాధకులకే కాదు; రాబోయే తరంవారికి కూడా మీ ‘అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ’ ఎంతో ఒరవడిపెడుతుంది.

ఇది సాహిత్యచరిత్రలోనే అపురూపం. భారతీయ భాషల్లో నేను ఎరిగినంతవరకూ ఈరకం గ్రంథం లేదు. బంగాళీలో రవీంద్రుడు రాసిన చిన్న గ్రంథం వుంది. అది యింగ్లీషులో కూడా అనువాదమయింది. అయితే, రవీంద్రుడి గ్రంథం వేరు, మనది వేరున్నూ. మనది అద్భుతం, అనన్యసామాన్యం. ఇది రాసి మీరు నేటి రచయితలలో వొక హిమాలయపర్వతం అయిపోయారు. అన్నిటికంటే అజరామరమైన కీర్తి తెస్తుంది మీకీ గ్రంథం. దీన్ని చదివిన ప్రతీవ్యక్తీ ఈ రోజుల్లో వచ్చిన గొప్ప గ్రంథం అని అంగీకరిస్తాడు.

*********************
దీక్షిత దాసు:

పూజ్యపాదులు బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రివారి ‘చిన్నకథలు’ ‘నాటకాలు’ ఇటీవల వెల్వడిన వారి ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ క్షుణ్ణంగా చదివాను. ఇతరుల గ్రంథాలూ చూచాను కాని శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి కూర్పులో ఒక క్రొత్తదనం ఒక జాతీయతా, ఒక ప్రత్యేకతా, ఒక విశిష్టతా అడుగడుక్కీ గోచరిస్తాయి. వారి రచనల్లో ఉపయోగింపబడే మధురమంజుల మనోజ్ఞ పదజాలం తెచ్చిపెట్టుకొన్నట్టు కాక సహజంగా సన్నివేశ సందర్భాల కనుకూలంగా సాగిపోతుంది. వారి కావ్యసృష్టితో పాత్రలు సజీవంగా ప్రత్యక్షమౌతాయి. మోతాదు తప్పని రాసోత్పత్తితో పాఠకలోకాన్ని పరవశుల్ని చేస్తాయి. ప్రతి పాత్రలోనూ కవియొక్క తాదాత్మ్యం స్ఫోరకమౌతుంది.

‘పద్యంలోనే పసందు ఉం’దని అనుకునే ప్రాతకాలపు నమ్మకాలు శ్రీ శాస్త్రి గారి వచనరచనా సమీక్షలో సంస్కారం పొంది ‘గద్యమే హృద్య’మని ఘంటాపథంగా చాటి చెప్పుతారు. వారి ఉపజ్ఞా, ప్రతిభా, సారస్వతరంగానికి సమీచీన సందేశాలందిస్తాయి.’

శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు సనాతన ధర్మాన్ని అధునాతన లోకానికి ఆదర్శప్రాయంగా అందజేయగల అభ్యుదయ కవితా సంప్రదాయ సంపన్నులు. వ్యుత్పన్నులు. వారి క్రాంతిదర్శిత్వం విజ్ఞాన సంస్కృతులూ మానవ సమాజాన్ని తీర్చిదిద్దే మహత్తర సాధనాలు. వారినిగన్న తెనుగుతల్లి వీరమాత. వారికి సమకాలికులమై పుట్టుట మనకొక గర్వకారణం.

సర్వజ్ఞమూర్తియైన భగవానుడు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి యింకొక షష్టిపూర్తి మహోత్సవం జరిగించుకోటానికి సదవకాశం దయచేస్తాడని నా సంపూర్ణ విశ్వాసం.

You Might Also Like

Leave a Reply