“అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” : కొందరు ప్రముఖుల అభిప్రాయాలు – 2

(ఈ అభిప్రాయాలు శ్రీపాద వారి ఆత్మకథ ౧౯౯౯ నాటి విశాలాంధ్ర వారి ముద్రణలోనివి. ఇవి ఇక్కడ ప్రచురించడం విషయమై ఎవరికన్నా కాపీరైట్ ఇబ్బందులు ఉన్న పక్షంలో editor at pustakam.net కు ఈమెయిల్ చేయగలరు – పుస్తకం.నెట్)

************************
చిలుకూరి పాపయ్య శాస్త్రి:

బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” ఆమూల చూడము చదివితిని. శాస్త్రి గారి రచన షష్టిపూర్తి తరువాత పరినిష్ఠస్థితికి వచ్చినది. నాకు వారి రచనలన్నిటిలోనూ వడ్లగింజల తరువాత లేక్కిమ్పదగిన రచన యిదియే యనిపించినది. ఈ గ్రంథము శ్రీ శాస్త్రి గారి జీవితముతో ననుబందిన్చియున్నాను, ఎన్నియో కథపట్టులతో నిండి, మొదటి నుండి తుది వరకు నుపాదేయముగ నొనర్చుచున్నది. శాస్త్రి గారి యనుభవములు వర్తమాన చంద్రులకు సత్పత ప్రదర్శకములు, ప్రాచీన సంస్కృతికి నిదర్శనములును. వారి జ్ఞాపకములు సత్యప్రఖ్యాపనకు తార్కాణములు.

**********
నీలంరాజు వెంకట శేషయ్య:

…నేను చదివినంత వరకూ మీ పుస్తకంలో నన్ను ఆకాశానికెత్తివేశారు. వాత్సల్యం కురిపించారు. అంత పొగడ్తకు నేను తగను. మీ పై, మీ రచనపై నాకు గల అభిమానం చేతనే మీ చేత ఆనాడు ‘నవోదయ’లో అనుభవాలూ జ్ఞాపకాలూ వ్రాయించడానికి నేను నిమిత్తమాత్రుడనైనాను, అంతకుమించి నేను చేసిన ఘనకార్యమేదీ లేదు. అయినా, మీరు తలపెట్టిన నాలుగు సంపుటాలూ వస్తే ఆ మహానందంలో నేనూ పాల్గొంటాను.
**********
చిలుకూరి లక్ష్మీపతి శాస్త్రి:

మీ అనుభవాలూ జ్ఞాపకాలూ ఆమూలాగ్రంగా చదివాను. అది అనుభవ జ్ఞానానికి నికషోపలంగా తోచింది. అందులో విద్యార్థి దశను వివరించు ఘట్టములు చాల ముచ్చటగా నున్నవి. ప్రతి చిన్న సన్నివేశము జ్ఞాపకముండో లేదా జ్ఞాపకం చేసుకోనో చిత్రించినట్లే కనిపిస్తుంది గాని కృతకంగా లేదు. భాషా పాటవము, సమ్యక్పరిశీలన, వివేచనాశక్తి సమగ్రంగా పరిస్ఫుతమగుచు పాఠకులపై ప్రసరిస్తున్నాయి. మీ రచనను గురించి యింతకన్న చాల ఎక్కువగా వ్రాయాలిసి వుంది. కాని అనవకాశకారణంగా విరమిస్తున్నాను. ఆశీర్వదించండి.
**********
మల్లాది రామకృష్ణ శాస్త్రి:

‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’ చదివి, చాలా సంతోషించినానని విన్నవించుకుంటున్నాను. తతిమ్మా భాగములు కూడా త్వరలో అచ్చువేయించండని ప్రార్థన.
*********
వేలూరి శివరామ శాస్త్రి:

మీ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ చదివాను, చదివించాను. ఆ చదివినవారూ, నేనూ గూడా ఒక్క గుక్కలోనే చదివాం. ఇంకా ఇది వేయిళ్ళ పూజారిగానే ఉంది. తెలుగుగుడి కట్టాలి, కట్టాలని పరితపించిన శ్రీ రామచంద్ర శాస్త్రి గారు గనుక బ్రతికి ఉంటె అక్షరాలతో కట్టిన ఈ తెలుగుగుడికి ఎన్ని గోపురాలు ఎన్ని సోపానాలు కట్టి ఉండేవారో కదా?

తెలుగువారిలో తెలుగుతనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది. ‘అది ఎప్పుడో ఉండేది’ అని కూడా మన తెలుగుపిల్లలెరగరు. ‘నీ తెలుగెవ్వరిపాలు చేసి తిరిగేద వాంధ్రా!’ అని నేను సుమారు నలుబదేండ్ల క్రితం ప్రశ్నించాను. తెలువుఆరే కాబోలు వీరు నవ్వి ఊరుకున్నారు. మీ ఈ పుస్తకమున్నూ శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి ఆంధ్ర పురాణమున్నూ వచినవి. చాలు – ‘కాలో హ్యయం నిరవధి ర్విపులా చ పృథ్వీ.’

ఈ సంపుటంలో అంతరంగా ఉన్న తెలుగుదనమూ దానికి చాలకమైన స్వయంకృషీ : వీనికి దేవతులు గూడా సంతోషిస్తారు. వీనికి దోహదంగా చమత్కారం కలిగించే సంఘటనలు ఎన్నో, విఘతనాలు ఎన్నో చదువరుల నాచికొంటవి. తెలుగుబిడ్డవయ్యా నీవు. ‘తెనుగుబిడ్డ లండీ మీరు’ అని వ్రాస్తే ఈ అర్థం సంపన్నమయితే ‘తెనుగుబిడ్డ లండీ మీరు’ అనే వ్రాసేనని అనుకోండి. తెలుగువారిలో తెలుగు ఉన్నదని ఈ పుస్తకం కళ్ళు తెరిపిస్తుంది. ప్రతి హైస్కూలులోనూ ప్రతి కాలేజినీ, ప్రతి తెలుగు వ్యక్తినీ ఈ పుస్తకం చదవమని అనురోధిస్తాను.

‘తెలుగుభాష ఆడవాళ్ళలో ఉందని’… వ్రాశారు. ‘కాంతా సమ్మితతయా ఉపదేశయుజే’ అని దెప్పినవాడు తెలియకుండా మీ నోట్లోంచి ఊడిపడ్డాడు. దానికీ కొంత తేడా లేకపోలేదు గాని తరచి చూస్తే ఈ రెండూ ఒకదాని అవతారాలే. భేష్! తరువాయి సంపుటాలకు ఎదురుచూస్తున్నాను.

You Might Also Like

Leave a Reply