“అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” : గొర్రెపాటి గారి అభిప్రాయం

(శ్రీపాద వారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం గురించి గొర్రెపాటి వేంకటసుబ్బయ్య గారి అభిప్రాయం ఇది. దీన్ని ఇక్కడ ప్రచురించడం వల్ల ఎవరికైనా కాపీరైట్ సమస్యలు ఉన్న పక్షంలో మమ్మల్ని editor@pustakam.net కి ఈమెయిల్ పంపడం ద్వారా సంప్రదించగలరు – పుస్తకం.నెట్)
*******************
మన వీరేశలింగంతో ఆరంభమైన స్వీయచరిత్రలు- మీదానితో-నాకు తెలిసినంతవరకు 14 మాత్రమే. డాక్టర్ కేసరి గారు ‘నా చిన్ననాటి ముచ్చట్లూ అని పేరు పెట్టారు. అందుకణుగుణంగానే ఉన్నవి. మీ అనుభవాలూ జ్ఞాపకాలూ కూడా సార్థకనామము వహించినవి. నేను వీటనిటినీ సమీక్షిస్తూ ఆంధ్రప్రభలో ఒక వ్యాసం వ్రాసితిని.

మీ అనుభవాలూ జ్ఞాపకాలూ ఒక నూతనఫక్కీని నడిచినవి. అవి ఆంధ్రజాతికుత్తేజకరాలూ, ఉద్బొధకరాలూనూ. ఈనాడు భాష నానా సంకరమై నశించిపోతున్నది. ఇటువంటి సమయంలో మీ రచన భాషకు మహోపకారకం కాగలదని నా అభిప్రాయం.

మీ భాషలో జాతీయమైన పలుకుబటి పూర్తిగా ఉన్నదనుట సర్వజనులు అంగీకరించేదే. అది యెలా అలవడిందీ మీరు స్పష్టంగా చెప్పియున్నారు. నిజంగా, తెనుగు నుడికారమూ, శ్లేషా, వ్యంగ్య వైభవమూ, సామెతలూ స్త్రీలలోనే కలవు. వారితర భాషలు నేర్వకపోవట మిందుకు కారణము. మన ముసలమ్మల నోటనుండి వచ్చే భాష ఎంతో ఎంతో సజాతీయమైనదీ, ఎంతో సజీవమైనదీని. ఈ సంగతి నాకున్ను అనుభవమే.

ప్రయోగ విజ్ఞానం స్త్రీల వల్లనే అలవడిందని మీరు స్పష్టపరిచారు. మర్యాదగల భాష మీరు రాజబంధువుల ద్వారా అలవర్చుకున్నట్లు విశదం చేశారు. రాజరాజు చదివితే ఈ సంగతి బాగా తెలియగలదు.

ఆత్మాభిమానమూ, ఆత్మగౌరవమూ, ఆత్మమర్యాదా మీ దగ్గిర బాల్యం నుంచీ చూచాను. ‘యాదృశం పురుషస్యాత్మా తాదృశం సంత్రభాషతే’. ‘యథా భాష స్తథా భాషా’ భాషించువారిని బట్టి భాష ఉండును గద! ధీరోదాత్తమైన భాష మీది. వల్లభభాయి పటేలు మాదిరి మీరు దాపరికమన్నది ఏమీ లేకుండా కుండపగలకొట్టినట్లు చెప్పడమే మీ స్వభావము. అందుచేతనే మీకు ప్రాణమిత్రులూ బలవద్విరోధులూ కూడా ఉన్నారు.

మీదంతా కొత్తచూపు. ఈ కొత్తచూపే మీరు కౌరవపక్షం అంటే అభిమానం చూపించడానికీ, రాణీ సంయుక్త పృథివీరాజును పరిణయమాడరాదని చెప్పడానికీ కారణాలైనవి. అలాగే ఇంకా పెక్కు.

మీ యీ రచన సాహిత్యప్రియులకు అధికంగా ప్రయోజనకారి కాగలదు. మీరు సాహిత్య సంబంధమైన పెక్కు మర్యాదలు తెలిపారు. మళ్ళీ మళ్ళీ చదివి తెలుసుకోవాలనుకుంటున్నాను. చదువుతాను కూడా. మీది తిలక్కుగారి పద్ధతి. ‘శఠం ప్రతిశాఠ్యం’ కాంగ్రెస్సుకు సంబంధించినంతవరకూ మినహాయిస్తే అన్నిటా నేను మీతో ఏకీభవిస్తాను.

మీ అనుభవాల వల్ల, మీకు ఆంధ్రభాష యెడల అభిమానం అధికం అన్నట్లు కనిపిస్తున్నది. ఆంధ్రులకు మీరు శిరోధార్యులు. అయితే, ఆంధ్రులెందుకు మిమ్ములను పూజించడంలేదంటే వారు అథఃపతితులయ్యారు. వారికి దూరదృష్టి ఏనాడూ లేదు. ఆవేశం తప్ప ఆలోచన తక్కువ. ఆంధ్రుడు ఆంధ్రుణ్ణి ఆదరించడు. ఇది కొంతవరకూ భారతీయ లక్షణం కూడా. ఇది బానిసజాతి లక్షణం అనవచ్చు.

మీవంటి వారి ప్రభావం వల్ల జాతి చైతన్యం పొందగలదనే ఆశిస్తున్నాను. మళ్ళీ మిమ్ము ఒకసారి దర్శించాలనుకుంటున్నాను. మీ అనుభవాలూ జ్ఞాపకాలూ తక్కిన సంపుటాలున్నూ అందుకుని చదివే భాగ్యం త్వరలోనే కలుగునని ఆశిస్తున్నాను.

You Might Also Like

One Comment

  1. శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU

    “…మీ అనుభవాలూ జ్ఞాపకాలూ తక్కిన సంపుటాలున్నూ అందుకుని చదివే భాగ్యం త్వరలోనే కలుగునని ఆశిస్తున్నాను….”

    ఈ మాట గొర్రెపాటి వారు దశాబ్దాల క్రితం అని ఉంటారు. ఈ రోజున శ్రీపాద వారి రచనలు విడివిడిగా దొరుకుతున్నప్పటికీ వారి సాహితీ సర్వస్వం ఒక వరుస క్రమంలో వెలువడలేదు.

    అతి త్వరలో శ్రీపాద వారి సాహితీ సర్వస్వం ప్రచురించబడబోతున్నది, ప్రస్తుతానికి వారి రచనలన్నీ సేకరింపు జరుగుతున్నది అని వార్త.

Leave a Reply to శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU Cancel