“అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” : కొందరు ప్రముఖుల అభిప్రాయాలు – 1


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయానుభవాల కూర్పు “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” గురించి అప్పట్లో కొందరు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వీలువెంబడి పుస్తకం.నెట్లో టపాలుగా వేయాలని అనుకుంటున్నాము. ఇవి ఇతరుల అభిప్రాయాలే కనుక ఇది కాపీరైట్ ఉల్లంఘన కాదని భావిస్తున్నాము. ఒకవేళ ఎవరికన్నా ఇబ్బంది ఉన్న పక్షంలో editor@pustakam.net ను సంప్రదించగలరు.

********

విశ్వనాథ సత్యనారాయణ:

తమ గ్రంథము యొక్క నూతనత్వము, తమరు గ్రంథాది యందే వ్రాసియున్నారు గాన నేను వ్రాయనక్కరలేదు.
తమరి వాడుక భాషను గూర్చి క్రొత్తగా నేమి వ్రాయను? ఆధునికాంధ్రమున వాడుకభాషను నిర్మించిన కొలదిమందిలో మీరొకరు.
మరి, యీ గ్రంథము కొంత యాత్మకథ వంటిది.
మీ చిన్ననాటి తెనుగు పల్లెటూళ్ళ జీవితము, ఆచారములు, శ్రౌతుల గృహాల శోభ, ఆ సంస్కృతీ, సర్వము రమణీయముగా నున్నది.
ఆనాటి కొన్ని సంగతులు మీరు చెప్పితేగాని యీనాడు తెలియవు.
కొన్ని ప్రయోగాల శబ్దాలు మీ పూర్వగ్రంథాలలో కూడ లేవు.
సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రథమ గణనీయులు.
***********************

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి:

అనుభవాలూ జ్ఞాపకాలూ చదివాను, ఒకసారి కాదు, పలుమార్లు. అది పూర్వపు ఆత్మకథల వంటిదని కొందరనుకుంటారు. సుతరామూ కాదని తర్వాత తెలుస్తుంది. అది మీతో నడిచిన అరువదేండ్ల ఆంధ్ర సభ్యతా చరిత్ర. సజీవ సాహిత్య సంపుటం. మీ కథలకంటే ఇదే ఎక్కువ చదువుతారేమో అని భయంగా ఉంది. అంటే మీ కథలను చిన్నబుచ్చడం కాదు. దీనిచేవ అంతటిది.

**********************
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ:

మీ కుశాలపత్రికా “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” చేరినవి. నిన్ననే రాత్రి పది గంటలకు పుస్తకం సాంతంగా చదివితిని, మరి, మీ రచన చదవకుండా ఎట్లుండగలను? సన్నివేశాలూ, సందర్భాలూ, కొలతలూ వేరే కాని ప్రపంచం మన ఇద్దరిదీ ఒక జాతిదే. మరిచిపోయిన అలౌకికానుభావాలను అలౌకికంగా జ్ఞప్తికి తెచ్చి అనుభవింపజేసినారు మీరు. మీ పుస్తకం చదవకపోతే, ఈ కాలం వారికెవరికీ ఇటువంటి ప్రపంచమొకటి ఉండిందని ఊహించడానికైనా వీలులేదు. కాలపరిస్థితులంతగా మారిపోయినవి. నిజంగా మనమేనని యుగాలు దాటినామో?

రచనలో-అచ్చులో మీదే ఒక స్వచ్ఛందశయ్య. కృత్యాకృత్యాలలో మీకున్న భావోద్రేకాలన్నీ అన్నిచోట్లా ప్రతిఫలించింది మెరాయించే శక్తి మీది. దాని వేద శక్తినుంచీ తప్పించుకోగలిగిన చదువరి అరుదు.
**********************

జమదగ్ని:

శాస్త్రి గారూ,
మీ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ ఇప్పటికైదారు మాట్లయినా చదివాను. ఇంకా తనివితీరడం లేదు. మళ్ళీ మళ్ళీ చదివింపచేసే ఘట్టాలు చాలా ఉన్నాయందులో, చూద్దామంటే మరొకచోట లభించనివి. పాత వ్యవస్థకు మీ తరం చాలా సన్నిహితమైంది. అందులోనూ మీరు ఎదురుతిరిగి లక్ష్యాన్ని సాధించిన దీక్షాపరులు. అంచేత, మీకు తెలిసినంతగా ఆ వ్యవస్థ గుణదోషాలు మరొకరికి తెలియవు. లక్ష్యం మాత్రమే భేదిల్లడం చేత నిష్పాక్షికంగానూ చూడగలిగారు మీరు. మాతరం వారి కానాటి జీవితం కేవలం ఊహాప్రపంచం. ఏ వ్యవస్థా లేకుండా పోతున్న మన జాతికి మంచి తరుణంలో వచ్చిన హెచ్చరిక మీ పుస్తకం.

వాడీ, వేడీ సమృద్ధిగా ఉన్న భాష మీది. అవసరమైన చోట్ల అస్థిదఘ్నంగా అంటుకుపోయే కశాఘాతాలు తగిలించారు మీరు. చూసినవాడు దూరంగా ఉండడం సాధ్యం కాదు. తీసి చదివాడా, మీ ముద్ర పడితీరుతుంది. మీ తక్కిన పుస్తకాలన్నీ ఒక యెత్తు – ఇదొక్కటీ ఒక యెత్తు. దీన్ని గూర్చి సరిగా చెప్పాలంటే మీ మాటల్లోనే చెప్పాలి. కొత్తసంగతులు తెలిపి, కొత్త రుచులు మప్పి, కొత్త చూపు అలవర్చి, కొత్త దారులు కనపరచి, కొత్త షక్తి సంఘటించి, కొత్త ఆవేశం పురికొలిపి, కొత్త ప్రపంచంలో వురికించే కొత్త వాఙ్మయానికి పురోగామి మీ పుస్తకం. రసవంతమైన నవలలా సాగిన మీ రచనలో మంచి కథపట్టులో ఆగినట్టుంది మొదటి సంపుటం. ఎంత చెడ్డా, తెనుగుజాతి రసజ్ఞం కాబట్టి తక్కిన సంపుటాలు త్వరత్వరగా రప్పించుకుంటుందని ఆశిస్తున్నాను.
*********************

మహీధర రామమోహన్:

మీ అనుభవాలూ జ్ఞాపకాలూ చదివాను. వారాలు చేసుకుని చదువుకొన్ననాటి అనుభవాలు, విద్యార్థుల మధ్య వుండే పోటీలు, వైమనస్యాలు నా మనస్సుకు హత్తుకుపోయాయి. వైదిక కుటుంబాలలో తెలుగు భాష మీద ఉంటూ వచ్చిన నిస్సాకారం, అసహ్యం మొదలయినవి మాకు అనుభవం గాకపోయినా వాటినుంచి గతచరిత్ర తెలుసుకొనే అవకాశం ఏర్పడుతుంది. రచనను గురించి నేను చెప్పడానికేముందీ, మీరు సిద్ధహస్తులు…మీ రచనవిశిష్టత చదివేవారిని నిల్చోనివ్వదు. మిగిలిన భాగాలు కూడా తెనుగుదేశం త్వరలోనే చూడగలదని ఆశిస్తున్నాను.
*********************

You Might Also Like

4 Comments

  1. bhoom reddy narahari

    శ్రీపాద వారి అనుభవాలు-జ్ఞాపకాలూనూ 1997 లో చదివాను.అతని రచనా శైలి
    నాకెంతో నచ్చింది.భాష బహు సుందరం.చదివినా కొలది అలసట లేకుండా ఇంకా
    చదవాలనిపిస్తుంది.దీని ప్రేరణతో నా చిన్ననాటి విద్యావిషయక జ్ఞపకాలను
    “బడిచదువులు”అనే పుస్తకాన్ని రాసుకున్నాను.

  2. రవి

    Beautiful. Thanks a lot!

Leave a Reply